Saturday, 30 January 2016

..................

                 స్మృతుల నిధి చాలా సుఖమే...
ఈ రోజు, పాత కలెక్షన్లూ, డైరీలూ.. అవీ సర్దుకుంటుంటే, చిన్నప్పటి ఓ అపురూపమైన నిధి కనబడిందండీ! ఆ నిధిని రొజురోజుకూ పెంచుకుంటూ వెళ్ళేందుకు యెన్ని తిప్పలు పడేదాన్నో గుర్తుకు తెచ్చిందా అపురూప జ్ఞాపకం!  యెక్కడెక్కడికో వెళ్ళి, వాళ్ళౌ యెన్ని సార్లు చెబితే అన్నిసాలు వాళ్ళింటిచుట్టూ ప్రదక్షిణలు చేసి చేసి..రెండూ మూడో దొరికితే..యెంత సంబరమో! మళ్ళీ ఇంటికి వచ్చి, యెంతో అలౌకిక పురస్కారం నాకు లభించిందని,  తెగ మురిసిపొయేదాన్ని!  ఇంతకూ, యేమిటబ్బా ఆ నిధి అంటారా! స్టాంపులండీ బాబూ! కాళ్ళరిగేలా తిరగటం అంటే నన్ను చూసి తెలుసుకునేవాళ్ళెవరైనా అప్పట్లో! కడప వంటి చిన్న టౌన్లో, యెన్ని స్టాంపులు , యెన్ని దేశాలవి దొరుకుతాయండీ అదీ '60-'65 ప్రాంతాలలో!  ఐనా, ఇవన్నీ తెలిసే వయసు కాదు కదా! అదేవచ్చింది తంటా! మా అమ్మ యెన్ని సార్ళొ చెప్పి చూసినా నా పట్టుదల నాదే! యెలాగో కష్టపది సంపాదించిన స్టాంపులను,గుడిపాటవ్వ ఇంటి అరుగులమిదే కూర్చుని, శ్రద్ధగా ఓ పుస్తకంలో అంటించేదాన్ని! కొన్ని ఇవిగో మీరేచూడండి! 
    
  ఇంట్లోకి, విశ్వేశ్వరాలయం  దగ్గరి కొళాయి నుండీ మంచి నీళ్ళు పట్టుకు రావటం వంతుల వారీగా,  మా తులజక్కయ్యా, మా అరవింద్ అన్నయ్యా, నేనూ చేసేవాళ్ళం. బట్టలు వుతకడం - సమిష్టిగా ముగ్గురూ చేసేది. అంటే   బావిలోంచీ  నీళ్ళు చేదడం, బట్టలకు సబ్బు పెట్టి వుతకడం, మిద్దె పైన ఆరేయటం- ఇవన్నీ, వయసుల వారీగా  వారి  వారి   సామర్థ్యాన్ని బట్టి, అందుకుని చేసుకోవటం అన్నమాట!

స్కూల్, సంగీతం పాఠాలూ, సాయంత్రం హిందీ క్లాసులూ- ఇవన్నీ యెటూ వుండేవి. ఇవికాక,  స్నేహితురాళ్ళు,  వత్సల (డా. వుగ్రప్పగారి కూతురు, నా క్లాస్  మేట్), ఇంక రామసుబ్బలక్ష్మీ, వీళిద్దరితోనూ ఆటలూ, పాటలూ..ఇవి చాలవని, యీ స్టాంపుల పిచ్చొకటి! మీరు నమ్మరు, పెళ్ళైన తరువత కూడా, నాకీ పిచ్చి బాగానే వుండేది.  డిల్లీ కరోల్ బాగ్ లో కొన్ని స్టాంపులు పాకెట్లలో  అమ్ముతుంటే రెండు మూడు సార్లు పట్టుకొచ్చినట్టే గుర్తు.. మా అమ్మాయికి కూడా యి అలవాటు చేయాలని  చూశా కానీ,  పెద్దగా తనకు అంటలేదు. కకపోతే, తక్షశిలా స్కూల్ లో  ఆరవ  తరగతి చదివేటప్పతి మ అమ్మాయి చేతి వ్రాత యీ స్టాంపుల కింద కనిపిస్తుంది. చిన్నప్పటి స్టాంపులన్నీ, వేరే వేరే పుస్తకాలలో అంతించేదాన్ని,  అవి చినిగిపోతుంటే! మ చిన్నప్పుడు, స్టాంపులన్నీ క్రమ బద్ధంగా అమర్చేందుకేవీ ఫలనా అని నోట్ బుక్స్ వుండేవి కావు మరి!  యేదో దొరికిన ఖాళీ బుక్ లో అంటించేయటమే! నా చిన్నప్పటినుంచీ, మ అమ్మాయి టైం వరకూ చేసిన  సేకరణలో.. ఇండియా, చెకొస్లవేకియా, ఎస్పానా, సిలోన్, డచ్, పాకిస్తాన్, ఫ్రాన్స్, కెనెడా, క్యుబా, నేపాల్, అమెరికా,  బ్రిటన్, డెన్మార్క్, మెక్సికో, యునైటెడ్ సింగపూర్, బాహ్రైన్, అర్గెంటీనా, మలేషియా, కంపూచియా, రష్యా, హాలెండ్,  జోర్డాన్, హాలెండ్, టాంజెనియా, ఆస్ట్రేలియా, ఓమన్, ఫిలిప్పీన్స్, ఇండొనీషియా, కెన్యా, చిలీ, సౌథ్ ఆఫ్రికా., చైనా, హాంగ్ కాంగ్,  ఆరబ్ యెమిరేట్స్,   హెల్వెటియా,  బాంగ్లాదేశ్ ..ఇన్ని దేశాల స్టాంపులు ఉన్నాయి తెలుసా నాదగ్గర  ఇప్పటికీ!
అసలీ స్టాంపుల్లో ఆయా దేశాల నైసర్గిక సంపదా, వివిధ రంగాలలో అక్కడి మహనియులూ, ప్రాచీన నిర్మాణాలూ, ఆధునిక కట్టడాలూ, ఆధునిక  ఆవిష్కరణలూ. ప్రభుత్వ పధకాలూ, కళలూ... అబ్బో! యెన్నో దర్శనమిస్తాయి.. కొన్ని మీకోసం ఇవిగో.... 





 ..   ఇవన్నీ  చూస్తుంటే, బాల్య నిధులెంత సుఖమో కదా! అనిపించదూ యెవరికైనా! (త్యాగరాజస్వామికి క్షమాపణలతో) ......

  ..............................

Friday, 29 January 2016










 Friendz dears...  This is my HINDI translation for 'Mahakavi, Kalaprapoorna, Padmabhooshan'  Shri Jashua's Telugu poem (smasanavatika)..printed in Sravanthi - monthly magazine of Dakshina Bharatha Hindi Prachara Sabha, in 2002 july...


















Thursday, 28 January 2016

త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం   ...షరా మమూలుగానే, నన్ను చేయి పట్టుకుని, బాల్యం బాట పట్టించింది. కడపలో, కొండప్ప సారు దగ్గర కర్నాటక సంగీతం నేర్చుకునే దాన్ని! యేడో యెనిమిదో యేళ్ళప్పటినుంచీ మొదలైన  అభ్యాసం, 14, 15 యేళ్ళదాకా కొనసాగింది. వర్ణాలో యిరవైదాకా, తరువాత కీర్తనలు యాభై  అరవై దాకా ఐన తరువాత, మనోధర్మ  సంగీతం నేర్పించటం  మొదలైంది.  అంటే రాగాలాపన స్వర కల్పనా, నెరవల్ (అంటే, చరణం లోఈని  మొదటి రెందు పాదాలనూ వివిధ స్థాయిలలో, రాగం అరోహణ, అవరోహణలననుసరించి కల్పనతో అల్లుకుంటూ పై స్థాయి దాకా వెళ్ళటం..దీనిలోనూ,  రాగాలాపన,  స్వరకల్పనల్లోనూ కళాకారుల ప్రతిభ బాగా  వ్యక్తమౌతుంది..) ఇవన్నీ కొంతవరకూ మొదట భట్టీయం వేయిస్తారు.తరువాత్త్తరువాత, కళాకరులే తమ  శక్తి, కల్పనలను బట్టి ఆయా రాగాలతో సంపూర్ణంగా  మమేకమైపోయి, ఆ  రాగారామంలో రమణీయంగా విహరించాలన్నమాట!..యీ క్రమంలో, కాస్త కాస్తగా రెక్కలు విప్పే తరుణంలో, మాతో (నేనూ,  నా పాట క్లాస్ మేట్ ముత్తులక్ష్మీ) అక్కడక్కడా కచ్చేరీలు  ఇప్పించేవారాయన!  రాధ అప్పటికిం కా బాగా చిన్న పిల్లే! అక్కయ్యలందరికీ పెళ్ళిల్లైపోయాయి. నన్ను అయ్య బాగనే ముద్దు చేసేవారు. నన్ను వుడికించటమంటే కూడా అయ్యకు మహా సరదా! మ పాట కచ్చేరీ ఫలనాచోట వుందనగానే, 'ఒహో! యెప్పుడే  నాగా నీ టపాచకేరీ? ' అని కనిపించినప్పుడ ల్లా   అడిగేవాళ్ళు. నేను  భలే వుడుక్కునే దాన్ని! కోపం వచ్చేది బాగా..అప్పటికే నేనేదో  పేద్ధ  కళాకారిణినైపోయినట్టే! ' పాటకచ్చేరీ అయ్యా..టపాచకెరీ కాదు.' .అని సవరించెదాన్ని పదే పదే!  అప్పటికేదో సర్దుకున్నట్టు నటించినా , మళ్ళీ అదే వరుస! అయ్యామాటన్నప్పుడల్లా, నాకు తెగ చిరాకు!.. .నా చిరాకు చూసి అయ్య మొహం నిండా నవ్వు!  నిజంగా బాల్యం యెంత మనోహరమో! మనకంటూ మరే ఆలోచనలూ, అభిలాషలూ వుండని స్వచ్చ సుందరమైన  రోజులు! పెరిగి పెద్దయేకొద్దీ,  మనకంటూ కొన్ని అభిరుచులూ, సొంత నిర్ణయాలూ, వయసు పొగరూ (మా అమ్మ తరచూ వాడుతుండేదీమాట) అబ్బబ్బబ్బా!!! ఇవన్నీ ముసురుకుని మన మనసు అద్దాన్ని, మసకబరుస్తాయేమోననిపిస్తుంది! కానీ, పుట్టిన తరువాత, యెప్పుడూ బాల్యంలోనే వుండిపోలేరుకదా యెవరైనా! జననం నుంచీ మరణం దాకా , మనసు అద్దం యెన్నిసార్లు మసక బారుతుందో, అసలది మరకేనని  తెలుసుకునే ఇంగితం వుండకపోవటం, సరే అది మసకేనని తెలిసినా శుభ్రపరచుకునే వీలు లేనంతగా జీవితంలో కూరుకుపోవటం, అ తరువాత యెన్నిసార్లు శుభ్రపరచుకున్నా, ఆ మరక పోకపోవటం,...ఒకవేళ అదృష్టం బాగుండి ఆ మరకలను తుడిచేసుకున్న  వారికి  - చరమావస్థలో కాస్త మనశ్శంతి! లేదూ - అపరాధ భావంతో చివరి దశకోసం నిరీక్షణ!  'దుడుకూ గల నన్నే దొర కొడుకూ బ్రోచు రా' ..అని   గౌళ  రాగంలోని త్యాగయ్య పంచరత్న కీర్తన ఆయనెందుకు  వ్రాశాడో   కానీ, ఇప్పటి  సమాజంలో వున్నంతటి దుర్మార్గం ఆయనలో లేదు. కానీ, అలాంటి  స్వచ్చమైన మనసుగల  పరిణతాత్మే  తన్ను తాను దుడుకువానిగా పొరబడి, దేవునిముందు, ఇంత దీనంగా మొరపెట్టుకుంటే, ఇక ఇప్పటి సమాజంలొని దుర్మార్గ చరాధముల   సంగ తేంటో మరి!   కవులలాగే, త్యాగయ్యా మనలాంటివారందరి తరఫునా రాముని - తన వినయాను సంధానంతో, మన్నించమని కోరుకున్నాడు కనుక బతికిపోయామేమో మనమంతా! దుడుకు  వారు  కాని ఉత్తమ స్నేహితులు క్షమింతురుగాత! (నేనైతే దుడుకుదాన్నే...)


Wednesday, 27 January 2016

        'ఆ.. నాగా..ఇదిగో..యీ లిస్త్ ప్రకారం, అన్ని గ్రంధాలయలకూ  పాద్యం, షాజీ, సిపాయి పితూరీ, మేఘదూతం,  శివతాండవమూ, ..ఒక్కొక్కటిగా, రిజిస్టర్డ్  బుక్ పోస్ట్ పంపవలె..నీదే బాధ్యత...(1970-71 ప్రాంతాలు)
         అయ్య ఆజ్ఞ అది.
 అయ్యకు నడి వయసులో (అంటే యాభైలు దాటిన తరువాత) సన్మానాలూ అవీ బాగానే  జరిగి, చేతుల్లో, కాస్త డబ్బులాడుతున్న సమయమది! (అంతవరకూ, తన పుస్తకాలను, ముఖ్యంగా  శివతాండవమూ, మేఘదూతమూ, పెనుగొండలక్ష్మీ, పాద్యమూ వంటివి రచనలన్నీ మాకు తెలియని వయసులొనే ముద్రాపకులకు సర్వ హక్కులతో ఇచ్చేశారట -యెదో కొద్ది చెల్లింపులకే! అయ్యే   చాలా సార్లనేవారు-నా  వల్ల పబ్లిషర్లు బాగు పడ్డారు అని..అప్పటి ఆర్థిక పరిస్ష్తితి    అలాంటిది మరి! )  అయ్య తన రచనలు పెనుగొండలక్ష్మి, షాజీ, సిపాయి పితూరీ, వ్యాస సంపుటి, శివతాండవము, పాద్యము- ఇవన్నీ, మద్రాసు, క్రాంతీ ప్రెస్సులో ప్రింట్ చేయించారు 1970 ప్రాంతాలలో! అయ్యంటే గౌరవం వున్న కొందరు జిల్లా గ్రంధాలయాధికారులు,  ఒక్కో జిల్లాలోని గ్రంధాలయలకు అన్ని బుక్కులూ ఒకటొకటి చొప్పున యెదో,  నలభై, యాభై కాపీలకు ఆర్దర్ ఇచ్చేవాళ్ళు.
        ఇంకేముంది..రంగంలొకి దూకడమే! నేనూ, మా   అన్నయ్య అరవిందూ- కలిసి, అయ్య చెప్పినట్టుగా బుక్కులు సర్ది, వాటిని పేపర్ ప్యాక్ చెసి, దాన్ని సుత్లీ దారంతో బిర్రుగా వూడిరాకుండా కట్టి,దానిపై అడ్రసులు  వ్రాసి తయారుచేసె పని తలమునకలు.మా రాధ అప్పుడు యెనిమిదేళ్ళ పిల్ల.
       నేనూ, అరవిందూ, శ్రమపడి యీ పని చెసిన తరువాత, మళ్ళీ, వాటిని విడతలు విడతలుగా, పోస్ట్ చేయటం కూడా మరో పెద్ద పని. అప్పుడు పిన్ కోడ్లు  ఉండెవి కదుగదా! అడ్రస్ సరిగా లేకపొతే, మళ్ళీ తిరిగి ఇంటికే వచ్చేసేదా పార్సల్. అప్పుడిక ఇద్దరికీ క్లాసులు.
     బుక్కులు చేరిన తరువాత, ఒక్కో గ్రంధాలయం నుంచి మని ఆర్డర్లో వచ్చే ఇరవై ముప్ఫై రూపాయలను,  దేవుడి గదిలో పెట్టిన బోర్న్ విటా డబ్బాలో వేసిపెట్టేదమ్మ!  ఆ మనీఆర్డర్లు తెచ్చే పొస్త్ మాన్ మల్లేష్ కు రోజూ టిఫినూ, కాఫీలూ మా ఇంట్లోనే! యెంత వచ్చిందో తెలియదు కానీ,  'అహహా ' అనేంత డబ్బు వచ్చివుండదనే అనుకుంటా!   ' అవ్వ తీసిన గంధం..'అని ఒక సామెత  వుంది మా రాయలసీమలో!    పుస్తకాలు వేసిన ఖర్చూ, చేసిన రిజిస్టర్డ్ బుక్ పోస్ట్  ఖర్చూ,  పోస్ట్ మాన్ కు రోజూ టిఫిన్లూ , కాఫీలూ, ఇవన్నీపోను యెంత లిబ్బి మిగిలిఉంటుందో నాకైతే యేమీ పట్టేదే కాదు.  అవసరమూ, ఆ ఆలోచనా కూడా  లేదు అప్పుటి చిన్న వయసులో!  తల్లీ, తండ్రీ మాట వినాలంతే! 
                        (  ఇప్పటికిక చాలు కదూ..తదుపరి పోస్ట్ దాకా సశేషం....)
............................





Friendz....Can aby body recognise the other VIPS and students in the foto below along with ma ayyagaru SARASWATIPUTRA....... 
I know much about RACAMALLUgaru...pl.share any news about Sri Karra Subrahmanyam- whom maa attagaru mentioned in his preface.....






Monday, 25 January 2016





అయ్యకు పద్మశ్రీ :




 1990 ఏప్రిల్ లో కడపకు వెళ్ళినప్పటికి  జ్ఞానపీఠ్ అవార్డ్ ప్రకటించేశారు. అప్పటినుంచీ, అయ్యకు ఒకటే నిర్వేదం! విశ్వనాధ తరువాత,  తనకే అవార్డ్ వస్తుందని, వివిధ సన్నిహిత వర్గాల  ద్వారా తెలియటం వల్లే అయ్య, కాస్త ఆశ పెట్టుకున్నారనే చెప్పాలి. యేదో సందర్భంలో, స్వయంగా అయ్యే యీ మాట అన్నారు కూడా! ఐనా ఫలితం తారుమారైంది. నేను కడపకు వెళ్ళీంది  '90, ఏప్రిల్ లో ననుకుంటా! అప్పుడే, నేను మూదు నాలుగు డజన్ల తెల్ల కాగితాలతో, పెద్ద బైండ్ పుస్తకం తయారు చేశాను. అయ్య గురించి అప్పటిదాకా వచ్చిన వార్తాపత్రికల కటింగ్స్  అన్నీ తేదీలవారీగా  అమర్చాను. మా కడప ఇంటి పడసాలలో (ఇంటి పెద్ద, ముఖ్యమైన  హాల్ ను మేము  పడసాల అనేవాళ్ళం) కూర్చుని, వాటినన్నింటినీ, తేదీలవరీగా అతికిస్తూ, వాటి కింద శీర్షికలు పెడుతుంటే, దీర్ఘంగా చూస్తున్నారు. 'యేమే నాగా! యెమిచేస్తున్నావే?'  అని అడిగారు. నా జవాబు విని, నిర్వేదంగా ఓ నవ్వు నవ్వి, ' నీ పిచ్చిగాని ఎవరికి వుపయోగపడతాయవి? అవ్సరం లెదుకూడా! ' అనేశారు. అయ్య మనసులో వేదన నాకు అర్థమయ్యింది. కానీ నా పని మానలేదు. రెండు మూడు రోజులు కూర్చుని దీక్షగా, అప్పటివర్కూ వున్న వార్తల కటింగ్స్ అన్నీ క్రమ బద్ధంగా పెట్టే లేచాను. నేనాపని చేస్తుంటే అయ్యకు ఓ క్షణాన ముచ్చట వేసిందేమోకూడా, మా వదినతో అన్నారట-  'దానికి మనసులో ఒకటి పడితే ఇంక వదిలిపెట్టదు.'  అని!  (అయ్య నా పట్టుదలను పదిమందిముందూ   మెచ్చుకున్న మరో సందర్భం - నేను హిందీ ఎం.యే. యెనిమిది పేపర్లూ ప్రీవియస్, ఫైనల్ రెండిటివీ కలిపి, రెండు నెల్ల తేడాతో వ్రాసి పాసైనప్పుడు '75 లో..అయ్య మాటల్లో మెచ్చుకోలు - నా చెవుల్లో అమృత  ధారలు)   నేనప్పుడు చేసిన బైండింగ్ యీరోజెందుకో బయట పడింది. అందులోని కొన్ని పేజీలు యీ పోస్ట్ లో పొందుపరుస్తున్నాను.





























..అప్పుడే,ఒక రోజు  రామకృష్ణ సమాజంలో యెదో మీటీంగ్ జరిగింది. అయ్య అధ్యక్షులనుకుంటా! తాను  మాట్లాడుతూ, తన సాహితీయాత్ర   గురించి యెన్నొ సంగతులు చెబుతూ, అన్నారు. 'ఇప్పటి వాళ్ళకేమి తెలుస్తుంది పరిశ్రమ అంటే! మహామహుల పాఠాలు వినటమే కాదు. వాళ్ళ పాఠాలు విని అర్థం చేసుకునే  అర్హత సంపాదించుకోవడమూ - అప్పటి రోజుల్లో ఒక అగ్ని పరీక్ష వంటీదే! వాళ్ళ పాఠాలను అర్థం చేసుకోవడమంటే మాటలు కావప్పట్లో! ఇప్పుడు చెప్పే గురువుకే తెలియదు - ఆ పాఠాల లోతెంతో! అన్నీ పై పై చదువులూ, పై పై రాతలూ! నేనేనాడూ ఒక్క క్షణం వృధాగా గడిపిన పాపాన  పోలేదు. యెప్పుడూ యెదో కొత్త విషయం నేర్చుకోవాలనే ఆరాటమే, తపనే, నన్నిన్ని దినాలూ ముందుకు నడిపింది. నా మాటలు ఇప్పటివాళ్ళకు వ్యర్థ భాషణలుగా  అనిపిస్తాయి. కానీ, నేను ఉన్నపుడు నా విలువ, నా మాటల విలువా తెలియదు. నేను వెళ్ళిపోయిన తరువాతే, నా విలువ తెలుస్తంది.'  అని యెంతో వుద్వేగంతో మాట్లాడారు. నేనైతే,  ఆ మీటింగ్ లో వెక్కిళ్ళు పెడుతూ యేడ్చేశాను కూడా!  ఆ క్షణాలు నాకింకా గుర్తున్నయి. తరువాత కొద్ది రోజులకే, ఆగస్ట్  లో అయ్య మా పెద్దక్కయ్య కొడుకు  కృష్ణప్రసాద్ పెళ్ళికోసమని  హైద్రాబాద్ రావడమూ, హఠాత్తుగా అనరోగ్యంతో గాంధి ఆసుపత్రిలో కొన్న్ని రోజులుండి, మళ్ళీ కడప! అ తునుంచీ, స్వర్లోక గమనం!  మరిచిపోయే క్షణాలా అవి? నిరంతరం మనసును దహించివేస్తున్న  అగ్ని పర్వతాలు.... 
     మరిచేపోయా! 25-1-1972..యిదే రోజు అయ్యకు పద్మశ్రీ వచ్చిందని టెలిగ్రాం అందుకున్నా నేను ఆ రాత్రి 12.30 ప్రాంతంలో!!!!!! నాకు అంతులేని ఆనందం ! రెండు మూడు అంగల్లో మిద్దెమీదికి పోయి, అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న అయ్యను లేపి ఇందిరాగాంధీ టెలిగ్రాం చూపించి, యీ సంతోష వార్త చెప్పి, శుభాకాంక్షలు చెబితే, నన్ను కోప్పడ్డారు - నిద్ర చెడగొట్టానని! పొద్దున చెబితే కొంపలేమి మునిగేవని విసుక్కుంటూ!.....
                                                                   25-1-16



Sunday, 24 January 2016

........
                       'యెప్పుడూ నన్ను ..........'







..............
ఇప్పుడే మావారితో కాస్త కోపంగానే అనేసొచ్చా.  ..'యెప్పుడూ నన్ను మీరు పంగిస్తూనే వుంటారులెండి..ఇది నాకు మామూలే! ' అని.(నా మాటకు మావారేమి జవాబిచ్చారు అన్నది ఇక్కద అవసరమా చెప్పండి?) .యీ మధ్య రాయలసీమ పదాలు నా మాటల్లో బాగానే దొర్లుతున్నాయని భలే సంతోషం వేసింది చెప్పొద్దూ! మా పుట్టింట్లోనూ, అత్తగరింట్లోనూ కూడా యీ పదం బాగానే వాడుకలో వుండేది. ఉంది కూడా! ఇంతకూ పంగించడం అంటే దెప్పిపొడవడం అని అర్థం. యీ మాట తక్కిన తెలుగు ప్రాంతాలలో వాదుకలో వుందో లేదో మరి...పదకొశంలో యీ మాట ఇలా ఉంది..

    వెనుక చేసిన పొరపాట్లనన్నింటిని ఎత్తిచూపి ఏడ్పించు.
"అని పంగించిన వానినప్పటికి నిష్టాలాపముల్వల్కి." [దశ-10-90]

"పాటించి నిన్నుసేయు పంగించేవారము." [తాళ్ల-10-164]

కోపించు, : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 Report an error about this Word-Meaning

అ.క్రి. అ(చ)(చ్చ)లించు, అలు(గు)(వు), ఆగ్రహించు, ఉడుకు, ఉదరు, ఎఱ్ఱవాఱు, కందు, కటకటపడు, కనలు, కనరిలు, కరకరపడు, కసరు, కాగు, కాతాళించు, కింకిరిపడు, కి(న్వ)(నువ)డు, కెరలు, కొఱకొఱలాడు, కొఱలు, కోపగించు, కోపగిల్లు, కోప్పడు, క్రోధించు, గాసిల్లు, చండించు, చిటచిటలాడు, చిడిముడిపడు, చిఱచిఱలాడు, చిఱ్ఱుమను, తీవరించు, పంగించు, పదరు, పనుకు, పొక్కిపడు, మండిపడు, మటమటలాడు, రొప్పు, రో(షిం)(సిం)చు, వేండ్రపడు.

పంగించు : మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970  

మాటలతో దెప్పు. [అనంతపురం]

పంగించు : క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992
దే.స.క్రి. కోపించు.

యీ అచ్చమైన రాయలసీమ పదాన్ని అన్నమయ్య తన పదరచనలో వాడటం వల్ల దీనికి కావ్య (పద) గౌరవమూ దక్కడం ఆనందదాయకమే కదా మరి!

Saturday, 23 January 2016


   
                     'ముందు తెలిసెనా......'
ఆత్మీయ మిత్ర బృందానికి  శుభోదయం...
        తిరుప్పావై, మార్గళి ఉత్సవాల అలవాటింకా పోలేదు నాకు...అందుకే, యీ రోజు పొద్దున టీ టీ డీ వెంకటేశ్వర భక్తి చానల్ లో వైష్ణవ దివ్యదేశాలు కాసేపు  చూసి, అటు తమిళ టీ వీ లకేసి  - నా  చేతుల్లో  రిమోట్ పరుగులెత్తింది. ఒక చోట యేదో పుణ్యక్షేత్ర కార్యక్రమం ...ఓ కే...పక్కనే  విజయ్ టీ వీ...ట్యూన్ చేయగానే  కళ్ళముందు ఓ వేదికపై నలుగురైదుగురు కూర్చుని పండరి నాథా విట్ఠల విట్ఠల...పాండురంగా..పండురంగా..అని కళ్ళు మూసుకుని తాదాత్మయంతొ పాడుతున్నారు. ప్రధాన  గాయకుని కంఠంలో పలికిన భావాలను తక్కిన సహ గాయకులూ,  ఎంతోబాగా, అనుసరిస్తుంటే, దానికి తగ్గట్టు, రెండు ఢోలక్లూ (యిలాంటి భజనల్లో, యెక్కువగా ఢొలక్లే వాడుతుంటారు..కృష్ణ చైతన్య సంప్రదాయ చిత్రలలోనూ ఇటువంతి వాయిద్యమే వుంటుంది..ఉత్తర భారత దేశంలో దీన్ని పఖావజ్ అంటారు..) చక్కగా తాళం పై వాళ్ళను  అనుసరిస్తూ! ఓ మోస్తరు వేగంతో, హయిగా సాగుతున్న ఆ భక్తి ధార, నెమ్మదిగా  వేగం పుంజుకుంటుంటే..ఆడవాళ్ళు కొందరు, ఆ పరవశంలో, లేచి  చప్పట్లు తడుతూ,  తాళానికి  అనుగుణంగా, నృత్యం  చేయటం  మొదలెట్టారు. అది గమనించిన, ఆ వేదిక పైనున్న ప్రధాన గాయకునికి కూడా ఆనందం కలిగిందేమో,  తనూ వేదిక పైనే లేచి నులుచుని, అక్కడ చేరిన వందలాది మందిలొనూ మరింత వుత్సాహాన్ని నింపుతూ, అడుగులు కదుపుతూ, పాడటం మొదలెట్టాడు. అది చూసిన, కొందరు మగవాళ్ళూ, లేచి  అడుగుల్లో  అడుగులు కలపటం మొదలెట్టారు..చూస్తూ చూస్తుండగనే, అక్కడి సమూహంలొని చాలమంది, ఆడా, మగా, చిన్న చిన్న పిల్లలూ, పిల్లలను యెత్తుకున్న తల్లులూ, ముసలివాళ్ళూ....అందరూ...తర తమ భేదాలూ సంకోచాలూ  అన్ని వదిలేసి  భక్తి పరవశతతో చేతులెత్తి చప్పట్లు తదుతూ ఆనందంతో ఊగిపోతుంటే...మనసునిండా...1970ల నాటి జ్ఞాపకాలు...
    .      కడప మోక్షంపేట విశ్వేశ్వరాలయంలో  అయ్య రామాయణం  మూడు నాలుగు సంవత్సరాలు పురాణ కాలక్షేపం చేసినప్పుడు, అయ్య, అనాటి కాలక్షేపం తరువాత, హార్మోనియం  చేతుల్లోకి తీసుకుని, భజన మొదలు పెట్టేవారు. రామకృష్ణ గోవిందా..లాంటి యెత్తుగడతో పాట మొదలై, అలా తీగె  సాగినట్టు, అయ్య అప్పటికప్పుడు ఆశువుగా అల్లి కొనసాగించే ఆ భావావేశ  పూరిత కీర్తనాగానంలో, గుడంతా, ఒక భక్తి సంద్రంవలె  మారిపోయేది ..అయ్య భజనల్లో, రామ, కృష్ణ, నృసింహదేవతాస్తుతితోపాటూ, యెక్కువగా, మీరా, తుకా, సూర్ దాసూ, తులసీ, గోరా కుంభార్ వంటి భక్త కవుల స్మరణ వినిపించేది.  ...నాకప్పుడు 16,17యేళ్ళుంటాయేమో! భక్తి అంటే యేమో  పూర్తిగా అనుభవంలోకి రాని సంగతైనా, అయ్య కనీసం నలభై ఐదు నిముషాలపాటు అలా ఆపకుండా..అప్పటికప్పుడు  భజననెట్లా కొనసాగిస్తారో అని తెగ ఆశ్చర్యమయ్యేది..(తరువాత తెలిసింది-అయ్య తన చిన్నప్పుడు, ఆ తరువాత పెళ్ళై, ప్రొద్దుటూరికి  వచ్చిన కొత్తల్లోకూడా  తనే రచించిన హరికథలు కూడా చెప్పేవారని)  చుట్టూ వున్న కొందరు భక్తుల కళ్ళల్లొ, ఆనందాశృవులు కూడా! 

 ఆనాటి  జ్ఞాపకాల హోరులో కొట్టుకుని పోతున్న నాకానాడు అయ్య వాక్ప్రవాహంలో వినిపించే మహనీయుల పేర్లూ.ప్రస్తావనలూ కూడా గుర్తొచ్చాయి. వ్యాసుడూ, వాల్మికీ,  లీలాశుక, కాళిదాస, ఆదిశంకర,రామానుజ, మధ్వాచార్య్, బుద్ధ, మహావీర, వేదాంత దేశికది  తత్వవేత్తలతోపాటూ, జ్ఞానదేవ్, తుకా, మీరా, తులసీదాసు, సూరదసూ, గొరా కుంభారూ, జ్ఞానదేవ్, నాం దెవ్, పురందరులూ, కనకదాసూ, మన అన్నమయ్యా, త్యాగరాజూ. శ్యామశాస్త్రీ,  రామదాసూ, వీరబ్రహ్మం వంటి ప్రాచీన  తత్వ తత్వ వేత్తలూ,  పదకర్తలూ, రచయితలేకాదు.  అరవిందులూ, రమణ మహర్షీ, జిడ్డు కృష్ణమూర్తీ వంటి  తాను చూచిన, తనపై ప్రభావం చూపిన అప్పటి ఆధ్యాత్మిక వేత్తల మరకతమణులవంటి సందేశాలు కూడా యెన్నింటినో, మా పుస్తకాల్లో, రన్నింగ్ నోట్స్ వలె భద్రపరచుకునేవాళ్ళం-నేనూ నా స్నేహితురాలు అన్నావజ్ఝల ప్రభావతీ!  నా జీవితంలో అయ్యపట్ల అంతులేని ఆరాధనకు  బీజం పదిన ఆ అపురూప క్షణాలే, తరువాత తరువాత, నా జీవితమౌతాయని నాడు నాకు తెలియదు. 'ముందు తెలిసెనా ప్రభూ, యీ ముంగిలి ఇటులుంచేనా' అని కృష్ణశాస్త్రి  అన్నారు కదా! తెలిసిన ఆ ఆర్తిని అయ్య పాదాలపై    కన్నిటివలె కురిపించి, తెలిసో, తెలియకో చెసిన తప్పులను మన్నించమని వేడుకుందామంటే..యేముంది? ఆ జ్ఞాపకాల  కాంతులతో వెలుగుతున్న శూన్య జీవన మార్గం తప్ప? 


Friday, 22 January 2016

                               మెత్తటి......


అరెరె!
ఎంత బాగుందీ వీడియో!
చిలుక, ఆ అమ్మాయితో పాటూ గొంతు కలిపి ఘట్టిగా అరుస్తోందీ, ఠీవిగా అటూ ఇటూ తిరుగుతూ!
భలే ముచ్చటగా వుంది..
ఆ..ఆ...
ఇదేదో మరో వీడీయో!
ఆ..ఆ..
అరెరే!...
ఈ పిల్లి ఎంత బాగా మొగ్గలేస్తోందో!
అదిగో ఆ అమ్మాయి చూపించే కర్చీఫ్ ను పట్టుకోవటానికి, భలే భలేగా మొగ్గలేస్తూ..
ఐ లైక్ దిస్!
అమ్మో! ఈ అమ్మాయికి పామంటే బొత్తిగా భయమే లేదే!
తీరా నాలుగైదేళ్ళుంటాయో లేదో!
ఒక పాము, దూరంగా వెళ్ళిపోతుంటే,
దాని తోక పట్టుకుని మరీ దగ్గరికి లాగుతోంది!
ఆ..ఆ.. ఇంకో పాము పడగ విప్పి ఆడుతుంటే, దాన్ని చేత్తో గట్టిగా పట్టుకుని..
అమ్మో..అది కాటేయదూ మరి?
ఒళ్ళు గగుర్పొడు స్తూంది చూస్తుంటే!
బహుశా..అదేమీ ఉండదేమో!
ఆ పిల్ల, పాముల మధ్యే పెరిగుంటుంది.
అందుకే పాములేమీ చేయటం లేదు...
స్నేహితులైపొయాయన్నమాట!
అరెరే! ఇదేదో వీడియో!
వరసాగ్గా..ఒంటెలు!
తిరిగ్గా నెమరు వేసుకుంటున్నాయి..
అన్నీ వరసాగ్గా నిలబడున్నయ్..అదెదో..కవతు చెస్తున్నట్తు!
యేంటబ్బా యీ వీడియోలో ఉన్నది?
వుత్సాహం పెరిగిపోతూంది...
అబ్బ! యెంతసేపు బ్రౌసింగ్ అవుతుందీ వీడియో?
హమ్మయ్య!
సౌండ్ రాదేంటీ?
హెడ్ సెట్ బాగానే ఉందా?
ఆ..ఆ... బాగానే ఉందే?
ఆ..ఆ..సౌండొచ్చింది!
వీడియో స్టార్ట్ అయింది..హమ్మయ్య!
యెవరో ఇద్దరు వీడియో లో కనిపిస్తున్నారు..ఇప్పుడీ ఇద్దరూ ,
యీ ఒంటెలతో యే విన్యాసాలు చేయిస్తారో అన్న వుత్సాహం!
అదిగో! అవన్నీ అతని వైపుకు తిరుగుతున్నాయి...
బాగా పరిచయమున్నట్టే!
అతనే వాటి ట్రైనర్ కాబోలు!
అతనేదో తెచ్చెందుకటు వెళ్ళాడు!
రెండొ అతను, ఓ ఒంటె మెడ నిమురుతున్నాడు!
ఇంతలో అ వెళ్ళినతనొచ్చాడు - చేతిలో యేదో పట్టుకుని!
టేప్ రికార్డర్లో పాటలు వినిపిస్తే
అవన్నీ డాన్స్ చేస్తాయేమో !
చూస్తూ చూస్తూనే వున్నా!
అతను చాలా వేగంగా, ఓ ఒంటె మెడ దగ్గరగా యేదో ఆడించాడు!
అంతే!
....
........
...............
...................
...........................
.........................................
....................................................

అక్కడినుంచీ రక్తం చివ్వున చిమ్మింది!..............
ఆ....ఆ....ఆ........
దిగ్భ్రాంతి!
ఆ ఒంటె ఓ పదిసెకన్లే..
అలా అలా విల విలలాడి కుప్ప కూలిపోయింది..
ఆ రాక్షసుడు..అన్ని ఒంటెలదగ్గరికీ వెళ్ళి ఇదే పని..
వాటి మెడలోంచీ ఒక్కసారిగ చిమ్ముతున్న ఆ రక్త ఫౌంటెన్ వల్ల,
తన షర్ట్ తడవకుండా..దూరం జరుగుతూ...
ఓ నిముషం ముందు, తీరిగ్గా, నెమరువేస్తూ,
అలౌకికానందలొకాల్లో విహరించిన ఆ యెడారి పడవలు..
అంతలోనే,
దానవ సైకత తీరాలను తమ రక్త ధారలతో తడుపుతూ..
నిర్జీవంగా!!!!!
నా కళ్ళలొ..
క్రోధాశృవులు..
నిస్సహాయ ఆక్రందనల శిలీముఖాలు!!


నమ్మకద్రోహానికి పరాకాష్ట!
ఓ చేత్తో గడ్డి తినిపిస్తూనే,
మరో చేత్తో గొంతు కోసే నయవంచకత!
మెత్తటి కత్తితో గొంతుకోయటమనే సామెతకు చిత్ర సాక్ష్యం!
కన్నీటి సంద్రమైన మనసుతో, లాప్-టాప్ మూసేసి,
నిస్తేజంగా నెను!!!!!!!!
అంతకు ముందు చూసిన జంతు-మానవ స్నేహ వారధులను వెక్కిరిస్తూ..
యీ వీడియో ... నయవంచనకు ప్రత్యక్ష సాక్ష్యంగా
నా ఆనందాన్ని వెక్కిరిస్తూ!!!
....................


Sunday, 17 January 2016

       
        చీరెల తళతళలు, గోరింట మిలమిలలు.....


ఆ.....కడప, మోక్షంపేట గుడిపాటవ్వ బాడుగ ఇంటి అరుగుల ముచ్చటలకు, సంక్రాంతి హడావిడి వల్ల కుంచెం బ్రేక్ వచ్చింది! ఆండాళ్ తిరుప్పావై పఠనంతో మా అమ్మ వాడుతుండిన కొన్ని తమిళ పదాలు, నా మనసును మోహరించాయి యీ మధ్య! తళిహిల్లు (వంటిల్లు-తళిహ అంటే తమిళ్ లో వంట అని తెలుసుగదా! తళిహ చేసే చోటు తళిహిల్లు అనటం) పెరుమాళ్ళకు తిరువళక్కు (పెరుమాళ్ళు అంటే భగవంతుడు, తిరువిళక్కు అంటే దీపాలు) మోర్ కొళంబు (మోర్ అంటే మజ్జిగ, కొళంబు అంటే సాంబార్ లేదా పులుసు) తొహెళ్ (తొక్కు) చార్చిమధు (మన చారేనండీ) సాదం (అన్నం) కణ్ మధు (పాయసం అనుకుంటా) ఇలా మోచంపేట అవ్వా వాళ్ళింట్లొ ఉన్నప్పుడూ, ఆ తరువత, జీ . ఆర్. రావు వీధిలోకి ఇల్లు మారినప్పుడు కొద్ది రోజులవరకూ, అమ్మ యీ పదాలను తరచూ వాడుతూనే ఉండేది. ఆ తరువాత యెందుకాగిపోయాయో గుర్తు లేదు మరి.

ఇంతకూ, గుడిపాటవ్వ ఇంటి అరుగులపై..చక్కటి జరీ అంచు, మెరిసిపొయే రంగుల కాంబినేషన్లలో కళ్ళు జిగేలుమనిపించే పుల్లంపేట చీరెలూ, అప్పుడప్పుడూ వెంకటగిరి చీరెలు కూడా, మా ముఖ్యమైన బంధువులొచ్చినప్పుడు నా కళ్ళు జిగేల్మనిపించేవి తెలుసా! అవునండీ, నిజ్జంగా నిజం! మ అమ్మకు ముగ్గురు చెళ్ళెల్లు. అలమెలమ్మా, శాంతమ్మా, విమలమ్మా అని. వాళ్ళంతా హైదరాబాద్ లోనే ఉండేవరు (ఇప్పుడూ ఉన్నారనుకోండి). అప్పట్లో, (అంటే 1960 ప్రాంతలలో) హైదరాబాద్ నుంచీ, కడపకు యెవరైనా చుట్టాలు రావటమంటే, యేదో విదేశాలనుంచీ వచ్చినట్టే! మా అక్కయ్యలకు పెళ్ళిల్లైన తరువాత వాళ్ళొచ్చినప్పుడు కూడా ! ఇక మా అమ్మ పాపం, వాళ్ళకు చీరెలు పెట్టేందుకు (ఇన్ స్టాల్మెంట్ల మీద ఆ అప్పు తీర్చుకునెందుకు యెన్ని నెలలు పట్టేదో మరి) మూటల వాళ్ళను పిలిచేది. అప్పుడిక వాళ్ళు విప్పి చూపించే ఆ చీరెల అందాలు యేమని చెప్పేది? హంసలు, లతలు, రకరకల డెజైన్లతో మూరెడునుంచీ బారెడు, బెత్తెడు వరకూ బార్దర్లూ, చిరె కొంగులూ, కొద్దిగ పెద్దరికం వుట్టిపడుతూ....అబ్బో!కొత్త నెత చీరెల గమ్మత్తైన వసన (యీ మాట వ్రాస్తుంటే, అన్నమయ్య పాట, 'వాడల వాడల వెంట వాడెవో వాడెవో-నీడనుండి చీరెలమ్మే నేత బేహారి' గుర్తొస్తున్నది) భలే ఉండేది! అలా మూటలవాడు చూపించే చీరల్లో, కొన్ని మా పిన్నమ్మలూ, మా అక్కయ్యలూ యెంపిక చెసుకునే వాళ్ళు. ఇదంతా చూస్తుంటే, నేనెప్పుడు పద్దవుతానా, నెనీ చీరెలు యెప్పుడు కడతానా అని ఒకటే ఆత్రం! ఆ తరువాత , నేను పెద్దై, చీరెలు కట్టెనాటికి, కొత్త రకం చీరెలు వచ్చేశాయనుకోండి! కానీ, ఆ నాటి జ్ఞాపకం-ఇప్పటికీ అపురూపమే! (అన్నట్లు, నేనీ మధ్య కడపకు వెళ్ళినప్పుడు, అ పుల్లంపేట చీరొకటి కొనుక్కుందామని షాప్లో అడిగితే, అవంతగా రావటంలేదిప్పుడు అన్నారు .. ప్చె! )


 





గుడిపాటి అవ్వ అరుగులపై, గుబాళించిన మరో జ్ఞాపకం-గోరింట పూలది! అవునండీ! నాకు, అప్పటి అందరు ఆడపిల్లల్లాగే, గొరింటాకంటే ప్రాణం! మా తులజక్కయ్యకూ డిటో డిటో! నేనే చిన్న పిల్లను ! గోరింటాకు ఇప్పట్లోలా కోన్ లలో అమ్మేవాళ్ళు కాదు! గోరింటాకు చెట్టు యెవరింట్లో ఉందో, దుర్భిణీ వేసి పట్టుకుని, ఇక వాళ్ళింటిపై దండెత్తటమన్న మాట! మా వెనుక వీధిలో అప్పూ అయ్యర్ వాళ్ళ ఉమ్మడి ఆస్తిలో, పేద్ద గేట్ తో ఉన్న నాలుగైదు వేల గజాల స్థలంలో అన్నదమ్ములవి మూడు నాలుగిళ్ళుండేవి. వాళ్ళింట్లో, ఒక గోరింటాకు చెట్టు వుండేది. వాళ్ళ అనుమతి తీసుకునేందుకు లోపలికి అడుగు పెట్టాలంటే, వాళ్ళీంట్లో, ఒక భయంకరమైన ఆల్సేషియన్ కుక్క తోకాడిస్తూ, గేట్ దగ్గరే వుండేది..భయపడిచచ్చేదాన్ని! అనుమతికే ఇంత సీను! ఆ కుక్క అరుపు విని, యెవరో వచ్చారని, ఇంటివాళ్ళు గేట్ దగ్గరికొస్తే, వాళ్ళతో నవ్వూ, దైన్యమూ కలబోసిన మొహం పెట్టి, గోరింటాకు కోసం వినతి(అచ్చం తిరుప్పావైలో ఆండాల్, కృష్ణుని ఇంటి దగ్గర ద్వారపాలకుణ్ణి లోపలికి వెళ్ళేందుకు అనుమతి అడిగే విధంగా) గేట్ తీసింది పిల్లలైతే, లోపలికి వెళ్ళి పెద్దవాళ్ళ అనుమతి కోరేంతవరకే పర్మిషన్! ! పెద్దలు చాలా తక్కువగానే అనుమతించేవాళ్ళు మరి! మేమూ కోసుకోవాలనే వాళ్ళు చాలా సార్లు! తప్పిదారీ, కోసుకునేందుకు అనుమతిస్తే, ఆహా..ఇక నా పంట పండినట్టే! వాళ్ళు అనుమతించకపోతేనో?

మా స్నేహితురాలు, కైప రామసుబ్బలక్ష్మి వాళ్ళ పెద్ద స్థలం లో (సొంతందే) వాళ్ళ పిన్నయ్యలవీ (చిన్నాన్నలండీ) అంటు మిద్దెలుండేవి. ఆ ఇళ్ళ చివర ఉండే మెట్లెక్కి వెళితే, పక్కనే ఉన్న విశ్వేశ్వరాలయం అవరణలో మండపాలపైకి సులువుగా చెరే చిన్న పిట్ట గోడుండేది. దానిమీదుగా అ మండపలపైకి చెరుకుని, తూరు వైపుకి నడిస్తే, వెనక వీధిలో ఉన్న అప్పూ అయ్యర్ వాళ్ళ ఇంటి వెనుక పెరడు వైపు సరిగ్గా, గోరింట చెట్టు ! (కష్టపడి, ముందుకు వంగి అందుకునే వీలుండెది) అమ్మయ్య! అలా రామసుబ్బలక్ష్మీ, నేనూ, దొంగ దొంగగా, గోరింట చెట్టు దగ్గరికి చేరుకున్నా పెద్దలెవరైన వంటింట్లోంచీ, గోరింటచెట్టు కొమ్మలు కదలటం చూసో, లేదా మా గుసగుసలు వినో, 'యెవర్రా అక్కడ!' అని గర్జిస్తే, ఠపిమని, చప్పుడు చేయకుండా కొన్ని నిమిషాలు బొక్క బోర్ల పడుకోవటం! చెట్టు కదలకుండా, కొమ్మ వంచకుండా (యేదో జానపదగాయం వుంది కదండీ), ఆకెట్లా కోయాలో అప్పుడావిద్య బాగా తెలిసుండేదేమో మరి!

ఆ తరువాత, వాళ్ళు వెళ్ళిపోయారో లేదో జాగ్రత్తగా గమనించి ,మళ్ళి, ఆకు కోయటం! ఇంతాజేసి, యెంత ఆకు ఇలా కోయగలిగే వాళ్ళమో, చేతులకెన్ని సార్లు ముళ్ళు గుచ్చుకుని పోయేవో! మళ్ళీ, ఆ కోసిన ఆకును ఇద్దరమూ పంచుకోగా, యెవరికెంత వచ్చేదో కానీ, దొంగ జామకాయల రుచివలె, ఇదీ ఒక తీయని గుర్తే!

మోచంపేట లోని అహొబిల మఠంలోనూ, గొరింటాకు చెట్టుండేది. అక్కడ, కోవెల పూజాదికాలు చూసుకుంటూ శ్రీమాన్ దేశికా చార్యులవారి కుటుంబం..వారి ఒక కూతురు నాకు శ్రీ రామకృష్ణ హైస్కూల్ లో జూనియర్. పేరు కల్యాణి. వాళ్ల అక్కయ్య, లీల (మా తులజక్కయ్య హిందీ క్లాస్ ఫ్రెండ్)ఇంకా పంకజక్కయ్యా- వాళ్ళంతా ఆ ఇంట్లో వుండేవాళ్ళు. అదికూడా, నాలుగైదువేల గజాల జాగా! మధ్యలో అహొబిల మఠం. కొవెల వెనుక గొరింట చెట్టు! అక్కడికీ, అప్పుడప్పుడు, గొరింటాకు కోసం పోయేదాన్ని.

ఇన్ని కష్టాలూ పడి, గోరింటాకు తెస్తే, మా తులజక్కయ్య రోట్లో వేసి తెగ రుబ్బేది. రుబ్బేటప్పుడే తన చేయంతా యెర్రబరటం చూసి, గోరింతను అవసరానికి మించి రుబ్బుతూందని నా కంపైంట్! అందులొని రంగంతా తన చేతికే అంతుకుంటూందనీ, నాకేమీ మిగలదనీ, తెగ యేడ్చే దాన్ని! అక్కయ్య అనేది, ఆకు బగా రుబ్బితేగదా, బగా మెదిగేదీ? అని! .ఊహూ..ఒప్పుకోబుద్ధయ్యెదే కాదు!

సరే! రాత్రి, గోరింటాకు చేతుల్లో చంద్రవంకగా, నక్షత్రంగా, సూర్యునిగా ఇమిడిపొయిన ఆ అందమైన క్షణాలు! మళ్ళి మళ్ళి కవాలనిపించే ఆ వగరు వగరు వాసన! రాత్రి నిద్రలొ, ఆకంతా చెతుల్లో అలుముకుని, యే డిజైనో తెలియకుండా పొవటం..అక్కయ్య చెతిలో కుదురుగా కొలువైన సూర్యుడూ, నక్షత్రాలూ చూసి కుళ్ళుకోవటం!...భలే భలె జ్ఞాపకాలు నాకైతే! ( వేంపల్లి గండిలో గొరింట వనాలుండేవి..16,17యేళ్ళ వయసులో, అక్కడికి నాలుగైదుసర్లు వెళ్ళినప్పుడు, ఒక సంచినిండా గోరింటాకు దూసుకుని వచ్చెదాన్ని తెలుసా!)
ఆ జ్ఞాపకాల కొనసాగింపుగా అత్తింట్లోనూ గోరింట చెట్టుందెది.. గోరింట పూలు కూడా ఆఫీస్ కు పెట్టుకుని వెళ్ళేదాన్ని. ఇప్పుడున్న సొంతింట్లోనూ గొరింట చెట్టుందండొయ్! 
 
                              (gorinta in our house now)





Thursday, 14 January 2016

Title song of 108 vaishnava divya desalu - A SVBC production (written b...


This is the TITLE song of 108 Vaishnava Divya Desalu (A SVBC Production) written by me and composed by Smt. snehalata Murali. This is sung by famous play back singers, Smt Nitya Santoshini and Sri Nihal. I know sri Nihal from 1982 or 83 as a Yuvavani artist of AIR Hyd. He was a desciple of famous Karnatak Classical Violin and Vocal artist Sri Neti Sreerama sarma, who was also a AIR staff artist. Nihal used to sing Karnatak classical Music in Yuvavani and I used to talk to him about his close relatives at our KADAPA. As I lso learnt classical music in my childhood, I used to sit with all music artists like Sriyuta Neti, Marella Kesava Rao garu, Smt. Pakala savitri (from 1981 - from my coming to Hyd - till their retirement)and afterwards with Sriyuta Kokkonda Subrahmanya Sarma, Nemani somayajulu, Pappu Chandra sekhar, Dwaram satyanarayana Rao, Manda Balarama sarma and some Hindustani Music artists also like Dilshad ahmad (Tabla) Pandit Rao (tabla) Music composer Smt Sobha rani. I fully cherish, in the good old rememberences of my job at AIR both at Kadapa, Hyderabad, waangal and DDK Hyd too...


 
                                       మా అయ్యగారి నోట రాసీమ మాట..

1. 'ఒరే..వాడు భలే కిల్లేగిత్తిరిగాడురా!'


యీ పదాన్ని ప్రయోగిస్తున్నప్పూదు, అయ్య కళ్ళల్లో నవ్వింకా నకు గుర్తే! కొంచెం (ప్రవర్తనలో) భిన్నంగా, తమాషాగా కనిపించేవాళ్ళను గురించి చెబుతున్నప్పుడనే వాళ్ళు. ఇంతకూ యీ కిల్లేగిత్తిరిగాడు అనే పదం తోలుబొమ్మలాటలో వెకిలి హాస్యం చేసే పాత్రధారి గురించి పెనుగొండ, అనంతపురం ప్రాంతాలలో వాడే పదమంటూంది పదకోశం. బాగుంది కదూ!
2. 'వాడు భలే గుల్లిపాయలు చేస్తాడురా!'


అయ్య యీ మాటను చాలా సీరియస్ గానే వాడేవాళ్ళు. వాడు నక్కవలె జిత్తులమారి సుమా, అన్న అర్థం ధ్వనించేందుకు ఈ పదం వాడేవారయ్య. ఆయనకు జివితాంతమూ, యీ విధంగా జిత్తులమారిగా (దాన్నే ఇప్పుడు లౌక్యం అంటారేమో! యే యెండకాగొడుగు పట్టేయటం కూడా ఇప్పటి లౌక్యం కిందికే వస్తుంది..యేమంటారు?) మా అయ్యగారి జీవితమంతా, మహానందిలోని సరస్సులో నీటివలె యెప్పుడూ, తేట తేటగా, మనసులో ఉన్న విషయాలనే ప్రతిబింబిస్తూ ఉండేది. మనసులో ఒకటి, మాటల్లొ మరోటి వినిపించే యీనాటి మెత్తటి శత్రుత్వాలకు అయ్య చాలా దూరం మరి!
3. 'వీడితో భలే చావుదంపులైపొయిందిరా! '



ఈ వ్యక్తి నిజంగా చాలా ఇబ్బంది పెట్టేవాడె సుమా అన్న అర్థంలో యీ ప్రయోగం. ఇదైతే, ఇప్పుడుకూడా, బాగా వాడుకలొనే వుందిలెండి!

4. 'దాదాపూ అనేందుకు 'వుజ్జాయింపుగా' అనేవాళ్ళు. పదకోశార్థమేదీ దీనికి కనబడలేదు మరి.


ఇలాంటి అచ్చమైన రాయలసీమ నుడికారాలతో, అయ్య ప్రసంగాలు కూడా, భలే ఆకట్టుకునేలా వుండేవి. ఆంధ్ర సారస్వత పరిషత్ (ఇప్పుడు 'తెలంగాణా సారస్వత పరిషత్ ' ) లో 1970 ప్రాంతలలో అయ్య, ప్రాకృత సాహిత్యోపన్యాసాలకు, ఇసుకవేస్తే రాలనంత సాహిత్యోపాసకులు వచ్చారు. అన్నమయ్య, శ్రీకృష్ణదేవరయలు, శ్రీనాధుని గురించిన అయ్య ప్రసంగాలూ ఇక్కడే జరిగాయి! గోడల మీద కూర్చుని విన్నారా వుపన్యాసాలను చాలామంది - కింద కూర్చోవటనికి స్థలం లేకపోతే! అక్కడికి వెళ్తే, సినిమా రీల్ వలె నా కళ్ళముందు ఆ నాటి దృశ్యాలు తిరుగుతాయిప్పటికీ ! 


   
...............




                                                    సంక్రాంతంటేనే .........


     
సంక్రాంతంటేనే ముగ్గులు ముగ్గులు ముగ్గులు...వంచిన నడుం యెత్తకుండా, చుక్కల ముగ్గులు, పువ్వుల ముగ్గులూ, డెజైన్ల ముగ్గులూ..అబ్బో ..యెన్ని ముగ్గులో...చిన్నప్పటి జ్ఞాపకాల్లో ముగ్గులదే ఒక ఆనంద పర్వం. ఇంట్లొ ముగ్గులు, బయటా ముగ్గులు, దాల్బందరం (ఇది రాయలసీమ పదం - అదే ద్వారబంధమండీ) మీద పైంటింగ్ లో ముగ్గులు, రెండు మూడేళ్ళు చెదరకుండా వుండేందుకు పైంటింగ్ చేసి, రంగులు కూడా నింపటం - మరువలేని పుట్టింటి సంతోష తరుణాలివన్నీ నాకు! 


అయ్యకు పద్మశ్రీ 1972లోనూ, కొద్ది రొజులకే డాక్టరేట్ కూడా వచ్చేసిన తరువాత, అమ్మ అయ్య కోసం మురిపెంగా, (యీ విజయాలకు శాశ్వత రూపమిస్తూ, ఒక 1'/3' సైజ్ లో రేకు తో నేం ప్లేట్ చేయించింది. (అంతవరకూ అయ్య పేరుతో నేం ప్లేట్ లేదు మరి) సరస్వతీపుత్ర, పద్మశ్రీ డా. పుట్టపర్తి నారాయణచార్యులు కడప అన్న అక్షరాలతో! అక్షరాలు మాత్రమే పొందిగ్గా ఉన్నాయి తప్ప మరే అలంకరణలూ లేవా ప్లేట్ మీద! నాకది నచ్చలేదు. అయ్య పేరు అట్లా యే అలంకరణలూ లెకుండా వుండటమా! ఆయ్!!!! దాన్ని పూలతో డిజైన్లతో అలంకరిస్తానన్నాను.ఆ రోజుల్లో నామాటాంటే మాటే పుట్టింట్లో! అన్నదే తడవు, మా అన్నయ్య అరవిందును బజార్ కు పంపి, తెలుపూ, పసుపూ, నీలం, ఆకుపచ్చా పైంట్లూ, బంగారు రంగు అద్దటానికి అదేదో పొడీ, బ్రషులూ - ఇవన్నీ తెప్పించింది అమ్మ!


(My mother Smt. Puttaparthi Kanakammagaru
  with my brother Sri Puttaparthi Aravind in 1980s)

ఇహ చూస్కోండి, నా విజృంభణ! వీర లెవెల్లో, పగలూ రాత్రీ అన్న తేడాలెకుండా, పైంటింగ్తో డిజైనులూ, లతలూ, పూలూ అబ్బో.. చక్కటి రంగుల కాంబినెషన్లో అందాలను ముద్దొచ్చేలా దాల్బందరం మీద ఆవిష్కరిస్తుంటే, అమ్మా, అయ్యా ఎంత ముచ్చటగా చూసేవారో! (అ తరువాత యెన్ని సంతోష తరుణాలొచ్చినా, ఆనాటి ఆనందం మకుటాయమానం) కడపలో ముఖద్వారం పైన ఆ నేం ప్లేట్, అ అలంకరణలూ ఇప్పటికి అలాగే ఉన్నట్టే గుర్తు మరి..నా పెళ్ళైన తరువాత, అత్తింటా యీ పరవశం అలా అలా కొనసాగి కొనసాగి...సాగి సాగి.. బాధ్యతలు పెరిగిన తరుణాన, ,పెద్ద పెద్ద ముగ్గులు ఒకెసారి పైంటింగ్ వేసి రంగులేసి, సంతోషపడటానికే పరిమితమైపొయింది. ఇక ఇప్పుడు సొంత ఇంటి పెరడులో మినీ శిల్పారామం కూడా!





ఇప్పటి వయసూ, ఓపికనుబట్టి, ముగ్గులూ, రంగుల సంబరం కాస్త మసకబారినా ఇప్పటి జీవితానికిదే ఆనందం మరి నాకైతే! గేహాన్ని వర్ణ సంభరితం చేయటమనే అభిరుచి,దెహంలొని హృదయగేహాన్ని భక్తి రంగవల్లికలతో అందగింపజేసుకోవటంగా మారింది మరి! మనసు నచ్చిన, మెచ్చిన, పరవశించిన ముచ్చట్లను సమభావ సమన్వితులైన స్నేహ బృందంతో పంచుకుంటూ పొందుతున్న ఇప్పటి ఆనందమూ అనుభవైకవేద్యమే మరి! (పుట్టింటి దాల్బందరం ముచ్చట మీకు నచ్చేవుండాలి మరి)


.                      ............


Wednesday, 13 January 2016










.....
ఆత్మీయ మిత్రులందరికీ, భోగి, సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు.
  శ్రీవైష్ణవులనే  కాదు. చరాచర జగత్తు సర్వాన్న్నీ  ప్రేమపాత్రుడైన మురళీకృష్ణుని  మధుర భక్తిలో తలమునకలుగ నిండమనీ, అదే జన్మ జన్మలకూ తన జీవితాశయమని ఆండాళ్ తన పాశురాలలో విశద పరచిన పవిత్ర మార్గశీర్షమాసమిది. ఆ తల్లి,  జీవులందరూ  స్త్రీలే-ఒక్క పరమాత్మ తప్ప,  అంటూ  మనందరికీ  సూచించిన యీ పరమ సత్యాన్ని,  స్త్రీప్రాయమితరం జగత్ అన్న వేదోక్తి యేనాడో ధృవీకరించింది. అసలు గోపికలందరూ రామైక్యాన్ని ఆశించిన మునులేనంటున్నాయి పురాణాలు కూడా! వాళ్ళందరూ గోపికారూపాలలో,  మధుర భక్తిని తమ సొంతం చేసుకున్నారట ద్వాపర  యుగంలో! స్త్రీ పురుషులన్న  తేడాలేమాత్రమూ   లేక, అందరమూ, శ్రీకృష్ణుని లీలామానుష రూపాకర్షణకు  లొంగని వాళ్ళెవరూ ఇప్పుడూ ఉండరు కదా! 1970లో అయ్య, నల్లకుంట రామాలయంలో, ముఫై రోజులపాటు  తిరుప్పావై వుపన్యసాలిచ్చినప్పుడు, అయ్యతొ నేనూ వున్నాను. శ్రీమాన్ వీ.పీ.రాఘవాచార్యులుగారూ (ఒకప్పుడు వుపాధ్యాయుల హక్కులకోసం చాలా అంకిత భవంతో  తీవ్రంగా కృషి వేసిన యెం. యెల్. సీ కూడా వారు - వురుపుటూరు రాఘవాచారి  అనేవారయ్య   వారిని) శ్రీమాన్ వీ .రాఘవన్ గారూ  (1980లో ఆంధ్ర ప్రదేష్  రాష్ట్ర అత్యున్నత సివిల్ ఇంగినీర్ గా పనిచేసిన, ఇప్పుడు కూడా అనేకానేక  సామాజిక సాంఘిక సేవా కార్యక్రమలలో చురుకుగా పనిచేస్తున్న వారు,  డీ డీ కాలనీలో  అహోబిల మఠ్ ఆలయాన్ని కట్టించినవారు, రాఘవాచారిగారికి మరిదిగారు) వీరిరువురి అధ్వర్యంలో జరిగాయా ప్రసంగ మాలికలు! అప్పుడు అయ్య యెంతో వుద్వేగంతో  ప్రతిరోజూ రెండు గంటలపాటు భక్తి సంప్రదాయం, మధుర భక్తీ, ద్రవిడ ప్రబంధ  విశేషాలూ అన్నిటితో, వుపన్యసించటం విన్నాన్నేను.  పూర్తిగా కాకపోయినా, అ శృత  పాండిత్యం కస్త ఇంకా నాలో మిగిలే వుంది.(వాటికి సంబంధించి అయ్య స్వదస్తూరీతో తయారు చేసుకున్న  నోట్స్ కూడ నావద్ద కొంత వున్నది)  అందుకే ఆ అనుబంధానికి, అయ్య మాకందించిన హిందీ లో అక్షర రూపమివ్వగా, టీ టీ డీ హిందీ సప్తగిరిలో 2008లో ధారావాహికగా రావటం, అటు తరువాత, డా.శ్రీమాన్ కే.వీ.రమణాచారిగారు, టీ టీ డీ కి సీ ఈ ఓ గా   వున్నప్పుడు, దాన్ని టీ టీ డీ ప్రచురణగా  అంగీకరించటమూ జరిగింది. (బాపూ గారి వర్ణచిత్రాలు కూడా ఇందులో పొందుపరచటం-అయ్య ఆశీస్సులవల్లే జరిగిందనుకుంటాను) ఆ నాటి జ్ఞాపకాలతో ఆ  ప్రచురణలోని కొన్ని పుటలు ఇవిగో మీకోసం! 
  13-1-2016