Wednesday 30 November 2016

ధర్మ వాహన! గలరు ధరను భక్తులు చాల
   

కర్మ మార్గమందు నిక నలసితి నే   జాల

నేగాను గడగూచి, నెరుగ నిను బేలగా,

నేగాను తిన్నడిని, నీకు నా కనులొసగ,

అల్లమ ప్రభువునుగానార్తి   గొల్వగలేను
     
భిల్ల దంపతిగాను ప్రీతి  గెలువగలేను

రారాజ చోళునిగ రాచ ఠీవిని నేను

గౌరీశ! నీకు నే  గుడిని గట్టగ లేను

కైమోడ్పు లివి నీకు,కాలాత్మ!కేదార!  

నీ మోము జూతునో నిటలాక్ష, కనులార ! 

పాడేను పరమాత్మ ! ఆడేను ప్రతియాత్మ !

Tuesday 29 November 2016





 కోటి మంత్రములతో కొలువు దీరెదవీవు

మేటినిచ్చాశక్తి  మిహిరాణ! మము  గావు,  

శ్వేత సద్యోజాత చేకితానన! శూలి!

కాతరమునున్నాను, కావరా,  కాపాలి! 

వామదేవుడ ! వరుణ! వ్యోమమున వెలసితివి,

శ్యామ కంఠా! తురీయాశక్తి  నొసగితివి,

నీవఘోరుడవౌచు, నీవె, నీశ్వరు శక్తి,  

 నీవె ధూమలుడౌచు నీవె, జ్ఞానాసక్తి 
    
 ఆనంద శక్తితో ఆత్మరూపమ్ముతో

సానంద తత్పురుష సాకార  శక్తితో

చిత్త శక్తిని బ్రోచు, చిన్మయుడవీశాన ! 
  
మత్త భక్త శరణ్య! మముగావు నీయాన !  

రుద్రుడవు నీవయా , శ్రుతుల నిదె సారమ్ము,

భద్రమగు మా జన్మ,  భవ ! నీదె భారమ్ము.

భవ తాప హర, విభో! బంధ మోచన సూత్ర !

కవనమ్ము, నీదనవ ఘన పుణ్య చారిత్ర !  
       
పాడేను పరమాత్మ, ఆడేను ప్రతి యాత్మ..

పాడేను పరమాత్మ, ఆడేను ప్రతి యాత్మ.. 

Saturday 26 November 2016


మాసమిది కార్తికము, మనుజులకు శుభకరము,

ఈశునికి,మాపతికి నెసవైన  హర్షణము 

జహ్ను సంభవ ఇతర జక్కరల గలసేను,

వహ్ని కళలను యవని   ఫలములందించేను  

 ప్రణవ పురుషుని  దయా  భాగ్యమ్ము పంచేను

వినయ నైల్యముతోన విష్ణు పదమంటేను

సంపూర్ణ కళల వెలుగొందు జాబిలి నింగి

 సొంపారునవనతుల కాంతి సంద్రము పొంగి




పాడేను  పరమాత్మ ఆడేను ప్రతి యాత్మ 

పాడేను  పరమాత్మ ఆడేను ప్రతి యాత్మ    






వేది తన గాత్రమున వేదములు బలుకంగ 

నాద యోగగు శతానందనందను డూగ 

నంది యానందమున నర్తనముతాజేయ

నందనము తా వెండి వెండికొండగ వెలయ  

నీ నాట్య గరిమతో నిండినవి భువనములు,

గానామృతము బంచు కలిమిచెలి  గమకములు   

వీణారవము తోడ వాణి నైపుణ్యములు

వేణు వాదన నిపుణు వెన్నుని ప్రమోదములు  

ఆడెలే పరమాత్మ పాడెలే ప్రతియాత్మ 

ఆడెలే పరమాత్మ పాడెలే ప్రతియాత్మ 

Friday 25 November 2016

కనుబొమల కదలికల కార్ముకమ్ములు జెదుర

వెనుదిరుగు మేఘముల వ్రేలిముద్రలు గుదుర 

అధరముల కదలికల యరుణోదయము విరియ

మదన మథనమ్ములో మార్మికతలే గురియ

కర పల్లవములందు కారుణ్యమే    మురియ 

విరియబూసిన యటుల  విరజాజి తా కురియ

నటనలను దిలకించు నగజ  నవ్వులు జింద

బుటుకు బుటుకని  జటల బుణ్య  భంగిమలంద 

ఆడెనా బరమాత్మ పాడేలే బ్రతియాత్మ 

ఆడెనా బరమాత్మ, పాడెలే బ్రతియాత్మ

Thursday 24 November 2016




కృతజ్ఞతా దినోత్సవమీరోజు :
,,,,,,,,,,,,,,,
సిసము:
ప్రతిదినమ్మీశ్వరా! ప్రణుతించవలె నిన్ను

  కరుణ మనుజ జన్మ కాచు కొరకు,

సాహితీ సంస్కార సంపదన్ జెన్నొందు

   తల్లిదండ్రుల సేవ దనరుకొరకు

చదువు సంగీతమ్ము  సారస్వతములందు

   కొసరు గల్గించిన  గురువులకును

 రస సమంచితములౌ రమ్య మార్గములందు

  తోడునిచ్చిన బంధు చెలువములకు

........... తేటగీతి(పంచపాది)....

ఆరు రుతువుల నలరారు యవనిలోన

నారు రుచులతో నలరించు నమృత భుక్తి

సన్నిహిత శత్రువుల బోలు షడ్గుణముల

షోడ షోద్దీపితములతో సోము వలెను

వెలుగు విరజిమ్ము మనికికి వినతులివియె.....  

 ..................
నీవెటు బోయితోయి,మము నీ మధు  పాటవ  గాత్ర   సానికా

రావము నుండి గొంతయును రక్తియులేకయె ద్రోసివేసి, నీ

భావ గభీరతన్ మిగుల భాస్వర సుస్వర కాంతి రేఖలన్

దేవ మహేశు చెంగటను   దీధితిమంతుని రీతి వెల్గగన్..
 

(బాల మురళికి గారికి నివాళిగా యీ ఉత్పలమాల  24-11-16)       
   

Tuesday 22 November 2016

బాల మురళివంచు బాల్యమ్మునుండియు
జగతి రాగవిద్య  సంస్కృతించి
మత్తుమందుజల్లి   మము వీడి యెటుబోతి
వీవు బహుళ పద్మ  విలసితుండ?
.................
నీదు గానామృతమ్ములో నీదులాడి
బడలిక మరచు వేల్పులే బుడమినిండ
అమరలోకాన నేవేల్పు నామతించె,
నిన్ను వినగోరి  నచటికి నీదినమున,  

అశనిపాతమై వచ్చెనీ అస్తమయము.  
............... 


.....................

Monday 21 November 2016

అసురులే నీ గణములాదిశబరుడవీవు,   

మసి యెపుడు ససి నీకు మలహరుడవే నీవు, 

మానవ కపాలములు మరుమల్లె దండలుగ,

పానమనగా గరళ పానమే ప్రాణముగ 

పెనుమసనమే నీదు పెద్ద నుదవసితముగ 

ఘనమైన తుహిన శృంగములె నీ భూములుగ 

అహితముల  వేడుకను  అణచివేసెదవీవు, 

మహిని శుభములనింపు మహదాశయమ్మీవు 


పాడునా పరమాత్మ, ఆడులే ప్రతి యాత్మ..       

పాడులే పరమాత్మ, ఆడులే ప్రతియాత్మ..  




నీ దృష్టి యొకసారి నిటలాక్ష! యీరెండ,

నీ దృష్టి మలిసారి, నీలగళ! నీరెండ,

నీ దృష్టి యౌనులే నింగిసిగ! లేయెండ

నీ దృష్టి జార్చులే ,నెలతాల్పు! చలియెండ

నీ దృష్టి వేయులే నెలదారి! చురుకెండ,

నీ దృష్టి బేర్చులే  నిండారు  పొడియెండ,

నీ దృష్టి గురియులే నాదుపై  మిడి యెండ

నీ దృష్టి కొందరికి నీయులే మూగెండ

పాడులే పరమాత్మ ఆడులే ప్రతియాత్మ

పాడులే పరమాత్మ ఆడులే ప్రతియాత్మ

Sunday 20 November 2016

నకిలీ నోట్లను బట్టుట


నికపై కడు తేలికనుట నిన్నటి మాటౌ,


ఫికరెందుకు నీకిక   మరి


యొక మార్గమిదంచు   నకిలి యొచ్చెను 

మోడీ! 


జీవనము విభ్రాంతి జీవనుడవీవెరా     
కావమందును నిన్ను, కామారి వీవురా! 
రమియింప మనసౌను  లలనార్ధ, శంకరా! 
నిమిషార్థ సంపదల నిను మరతు నెటులరా!  
సిలువలకు దుది లేదు,చిన్మయ జటాధరా! 
చలువతో  దరి జేర్చు, జడలసికదేవరా!  
నటనావతంసుడవు, నను జూడవేలరా! 
పటుతరమ్మీ  భవము బంధముల గూల్చరా!   
పాడులే పరమాత్మ ! ఆడులే ప్రతి యాత్మ!  
పాడులే పరమాత్మ ! ఆడులే ప్రతి యాత్మ!  




అసుర గుణ చయములవి  జేసినవి హుంకృతులు


విసరముల శృతులలో  వినవచ్చె ఝంకృతులు


తొలగించగా నంది దోసిట నహంకృతులు

                                   
వెలిగినవి హృది వేల్పు వేల శిఖరాకృతులు


మ్రోగిన వనేకములు  రాగముల సంస్కృతులు

                  
యోగి సంసర్గమున  యాగ వైభవ కృతులు

     
పుడమి నిండిరి శివా  పురరిపుల స్వీకృతులు 

 
 బడబానలము త్రాగు, భర్గుని  కలంకృతులు

 
పాడులే పరమాత్మ ఆడులే ప్రతి యాత్మ 

Saturday 19 November 2016





ఎగు భుజమ్ముల, వాడి యెసలు జిమ్మెడి వాడు,

నగు మొగమునను చిలిపి నటన జిలికెడి వాడు,


రాగముల నన్నిటిని రక్తి నడిపెడువాడు, 


నాగపాశములలో నవత లొలికెడువాడు

 
గమక నిపుణతజూపి కనులు గీటెడివాడు,

 
తమకతను తనుజూచు నుమను దచ్చెనలాడు


అటుజూచి దయబరపి నార్తి బాపెడువాడు


బటుతరమ్మౌ బాప పాథమార్పెడివాడు


   
పాడులే పరమాత్మ  ఆడులే ప్రతి యాత్మ 

,,,,,,,,,,,,,,,,,,,,,
  










సీసం-పూర్వభాగము

శక్తికి ముక్తికి సత్య సత్వమ్మైన
 
శాంకరుల పితకు సంస్తవములు

గురుతువెట్టగరాని గుణముల దైవమ !
 

పొలుపు జిల్కెడి మేటి పొగడికోలు

అలవిగానట్టి రాకాసి మూకల ద్రుంచి

నట్టి నభవునికి నతి శతములు

మూడు కన్నులతోను ముక్కోటి దైవాల

శాసించు శూలికి శ్లాఘనములు.

తేటగీతి(పంచపాది)

చూపు ద్రిప్పకుడెటులైన సూక్ష్ము నుండి

మనము నిండార నిలుపగ చంద్ర ధరుని

పున్నెముల పంటగా నేడు పున్నమాయె

భర్గునీవేళ కొలచిన భవ్యముగను 

మెచ్చి కార్తీక కౌముదినిచ్చు సుఖము.  
...............................




                మహ దేవ! నిను గనని మానసము తృణ సమము
                అహరహము నీ కృపయె ఆనంద  పరవశము
                నీ తాండవమ్ములో నిబిడమ్ము నీ జగము   
                మా తామసమ్మంతమౌనుగా ప్రతి క్షణము
                జనని పార్వతి నీవు, సమ భావ యామలము
                కనుగొనగ తరమౌన  గనులనీ యద్భుతము
                అద్వైత భావమ్ము అంగజుని భంగమ్ము 
                    అద్వైత  సారమ్ము  అభవ  కైలాసమ్ము            
                పాడులే పరమాత్మ, ఆడులే ప్రతియాత్మ 

                         ***************


Sunday 13 November 2016

Brundavanam vEsi tulasi mA inta....Traditional Telugu song




క్షీరాబ్ధి ద్వాదశి నాడు తులసి  పూజ సందర్భంగా పాడుకునే సంప్రదాయ స్త్రీల గేయం, నా సేకరణ నుండీ-డా.పుట్టపర్తి నాగపద్మిని   
బృందావనము వేసి తులసి మా ఇంట గంగ గౌతమి కృష్ణ కావేరి దలతు
తుంగభద్రాదేవి గౌతమిని మొదలు, నదులన్నీ మీ నామమున యుండు..
అపరిమిత పుణ్యఫలమమృతవే దేవీ! నిత్యాన నిన్ను నే వేడి కిలిచేను,
మా ఇంట పుత్ర పౌత్రాదులూ మొదలూ వెయ్యేండ్లు గావునూ వర్ధిల్లుచుండ..
అరుణోదయమ్మున మనసులో తులసి, తరుణి తల్లిని బూని మనసార మ్రొక్కి,
ప్రాత: కలమున గోమయము దెచ్చి, అలికినా చేసినా పపాలు పోవు..
ముగ్గులూ బెట్టరే పద్మాలనెపుడూ, మూడులోకాలలో ముక్తి పొందెదరూ,
పద్మాలబెట్టితే పంచవన్నెలనూ, వారి జీవితమదీ వెలుగొందునమ్మా..
శ్రీ కృష్ణ కృప నేను కలిగుండవలెనూ, కృష్ణ తులసెమ్మ నీకిత్తునర్ఘ్యములూ
శ్రీ లక్ష్మి కృప   నేను కలిగుండవలెనూ, లక్ష్మి  తులసెమ్మ నీకిత్తునర్ఘ్యములూ,
రామునీ కృప నేను కలిగుండవలెనూ, రామ తులసెమ్మ నీకిత్తునర్ఘ్యములూ,
బంగారు హోళిగలు, అతి పూరణములూ, తేనె తొనలద్దినా దివ్యాన్నములునూ...
 
ఒక్కో ప్రదక్షిణము వనిత నేజేతు, వరములిచ్చీ హరిణి రక్షించవమ్మా,
రెండవ ప్రదక్షిణము నెలత నేజేతు , నిండార సంపదలు నాకివ్వవమ్మా,
మూడవ ప్రదక్షిణము ముక్తికే త్రోవ, బడయక జూపవే దంతి తులసెమ్మా,
నాల్గవ ప్రదక్షిణము నతినే జేతు, అన్ని దానమ్ములూ నకియ్యవమ్మా,
ఐదవ ప్రదక్షిణము అతివ నే జేతు, అష్టైశ్వర్యములు నాకివ్వవమ్మా,
యెక్కువా వరము నిన్నేమి అడిగితినీ, ముక్కోటి ముత్తైదు తనము నాకిమ్మూ,
రామ జయరామ జయ రామ రఘురామ, రామ సారూప్యమ్ము నాకియ్యవమ్మా,
కృష్ణ జయ కృష్ణ జయ కృష్ణమ్మ జేతు, కృష్ణ సారూప్యమ్ము నాకియ్యవమ్మా,
గరుడ జయ గరుడ జయ గరుడ గమనూడా, కాళింగి మర్దనుడ కాచి రక్షించూ....
బృందావనుము వేసి తులసి మా ఇంట, గంగ గౌతమి కృష్ణ కావేరి దలతూ..

..............................