Monday 30 November 2015

maa ayyagaru: .................       గురజాడ దేశభక్తి గేయం చాల...

maa ayyagaru:
.................
      గురజాడ దేశభక్తి గేయం చాల...
: .................       గురజాడ దేశభక్తి గేయం చాలా గొప్పది. తెలెఉగులో  అటువంటిది మరి లేదు.  అంతమాత్రాన ప్రపంచ సాహిత్యంలోనే  అటువంటిది లేదన...

maa ayyagaru: (సంవత్సరం వివరాలు లేవుకానీ విశాలాంధ్ర వార్తాపత్రి...

maa ayyagaru:
(సంవత్సరం వివరాలు లేవుకానీ విశాలాంధ్ర వార్తాపత్రి...
: (సంవత్సరం వివరాలు లేవుకానీ విశాలాంధ్ర వార్తాపత్రికలో చాలా విపులంగా వచ్చినె అంశమిది...)                           గురజాడ మహా కవి మాత్రమే...

Sunday 29 November 2015

Friday 27 November 2015


     
    
                 ప్రాకృత సాహిత్యంలో పాటల ప్రసక్తి
          
తెలుగులో శాతవాహనుల కాలం నుండి పాటలు ఉన్నాయి.హాలుడు(క్రీ.శ19-247) గాథాసప్తశతిలో సహజ దేశీయమైన తెలుగు పాటల ప్రసక్తి కొన్ని చోట్ల కనిపిస్తుంది.
చక్కగా దంచిన సన్నబియ్యపు వన్నులాంటి వెన్నెల,తాను కోరుకున్నదానికన్న కొల్లాగా పండిన పైరును పల్లెరైతు చూచి ఆనందంతో ఇచ్ఛవచ్చినట్లు పాడుకొన్నాడు అని గాథాసప్తశతి 789వ గాథలో ఉంది.
              ణిప్పణ్ణసస్సరిద్ధీ సచ్చందం గాఇ పామరో సరఏ
              దలిఅ ణవ సాలితండుల ధవల మి అంగాసు   రాఈసు  (గాధా/7-89)
742వ గాథలో పెళ్ళి కూతురికి పెళ్ళి కడియాలు తొడిగించి పుణ్యస్త్రీలు మంగళగీతాలు పాడుకొన్నారు ఆ పాటల్లో కాబోయె మొగుని పేరు,అతని వంశం పేరు వర్ణిస్తు ఉంటే వింటున్న పెళ్ళి కూతురికి ఒళ్ళు పులకరించేదట.
                  ' గిజ్జంతే మంగల గాయి ఆహి వరగొత్తదిణ్ణ అణ్ణాయే
                   సోవుంవ ణిగ్ ఓ వుఅహ హొంత వహు ఆ యి రోమాంచో '
.........
ఒక విరహిని తనకు దూరమైన ప్రియున్ని తలచుకుంటు దుఃఖంతో పాటు పాడిన ఎడబాటు పాట ప్రసక్తి కూడా ఉంది.
........................
  మరో గాధలో ఉదయాన్నే ముఖం వేలాడేసుకుని, తన సఖితో ఒక ప్రియురాలు  అంటున్నదిలా:-
             అజ్జ సహి కేణ కం పి మనె వల్లహం భరంతేణ
             అమ్హం మఅణ సరాహఅ హిఅఅవ్వణ ఫోఅణం గీఅం (4/81)
  'సఖీ! ఈ రోజు ఉదయాన్నే నా హృదయాన్ని తూట్లు పొడిచేలా, యెవరో విరహాతురుడు తన ప్రియురాలిని గుర్తు చేసుకుంటూ, పాటొకటి పాడినాడు. దాన్ని విన్నతరువాత,  నా మనసు మరింతగా వేగిపోతున్నదే!' ...................

సంగీతము, కావ్యమూ, రమణులు;
                    వరజువయి విలసియేణం గంధవ్వేణ చ యెత్థ లోయెమ్మి
                    జస్స న హీరయి హియయం సో పసుఓ అహవ పుణ దేవా
                                                నాగ పంచమీ (మహేస్వర సూరి) 10/294
                   సుందరీమణుల హవ భావాలతో, లేదా, సంగీత మధురాలాపనతో హృదయం ముగ్ధం కాకపోతే, వాడు ఇక పశువో దేవతో కావాలి! సంగీతమూ, కావ్యమూ, రమణిమణుల హావ భావాలు, మనిషిని రస లోలుపులను చేసే  సామర్థ్యం  కలిగినవన్నమాట! 
........... 
అయితే ఈ పాత గేయాలు,పాటలను ఆదిలో ఎవరు జాగ్రత్త చేయలేదు.చేసివుంటే మనకు కూడా అతి ప్రాచీనమైన సాహిత్యం ఉండేదని సగర్వంగా చెప్పుకొని ఉండేవాళ్ళం. తమిళంలో క్రీ.శ. 4వ శతాబ్దంలో ప్రాచీన గేయాలను సేకరించి,వాటిని సక్రమమైన సంకలన గ్రంథాలుగా వేయించాలని,అందుబాటులో ఉండే గ్రంథాలుగా రూపొందించాలని నాటి తమిళ రాజులు గుర్తించారు. నిట్టుత్తొగై, పత్తుప్పాటు మొదలైన గేయ సంకలనాలు ఇట్లు వెలువడ్డ గ్రంథాలే .క్రీ.శ. 1వ శతాబ్దిలోనే హాలుడు ఆంధ్రదేశంలో ప్రాకృత గాథలను సేకరించాడు.అప్పటి తెలుగు పాటలను ఎవరు (రాజులు) సంకలనం చేయలేదు అలా చేసి ఉంటే తమిళ భాషలోలాగే మన తెలుగు భాషలో కూడా శాతవాహనుల కాలం నుండే పాటలు దొరికి ఉండేవి.
...........................

Tuesday 24 November 2015









కార్తీక మాసం అనగానే ముందు గుర్తొచ్చే మాటలు రెండు. కార్తీక సోమవారాలూ, శివాలయ సందర్శనం
 ఇంకా  వనభోజనాలూ!మేము చిన్నప్పుడు కడప మోచంపేటలో  ఉన్న బాడుగ ఇంటి యజమానురాలు  గుడిపాటి అవ్వ.(ఆమె అప్పటికి పండు ముసలావిడెమీ  కాకపోయినా  ఆమెనలాగే  పిలిచేవాళ్ళందరూ.) వాళ్ళు స్మార్తులు. పాపం  ఆమె బాల వితంతువు.తెల్లటి తెలుపూ, కను ముక్కు తీరు బాగుండేదామెకు  ..కానీ  క్రమం తప్పకుండా పాపం  నెలకో రెణ్ణెల్లకో ఓసారి వెనుక వాకిటివేపు మంగలివాణ్ణి పిలిపంచుకుని శుభ్రంగా గుండు కొట్టించుకునేది. నాకైతే,  భలే జాలి వేసేదామెను చూస్తె అప్పుడే! 
ఆమె యెందుకలా చేసితిరాలో తెలీని వయసు మరి..అసలు సంగతి ఇది. కార్తీక మాసంలో ఆమె మమ్మల్ని వనభోజనానికి   బయల్దేరదీసేది. (మా కుటుంబమె కక, ఇంకా యెవరెవరు వచ్చేవాళ్ళో గుర్తు లేదు మరి..) కడపకు దగ్గర్లో ఓ పదో పన్నెండో మైళ్ళ దూరంలో పాలకొండలు అని కొండలుండేవి. (ఇప్పుడున్నాయో లేదో మరి..) తెల్లవారుఝామునే యెద్దుల బండిలో వంటసామానులు వేసుకుని బయలుదేరేవాళ్ళం, అమ్మ, మా తులజక్కయ్యా,  మా అరవింద్ అన్నయ్యా, నేనూ.అయ్య వచ్చిన  జ్ఞాపకమైతే లేదెందుకో!  (మా చిన్న చెల్లెలు  రాధ అప్పటికి పుట్టలేదనుకుంటా) పల కొండలు అని ఆ కొందలకు పెరెందుకు వచ్చిందో తెలీదుకనీ,వెళ్ళే దారంతా పచ్చటి పొలాలూ చిక్కటి చెట్లూ....ఆవ పొలాలో  మరేవొకానీ  ఆ పువ్వుల పచ్చదనం  ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతూనె ఉంటుంది. యెగుడు దిగుళ్ళతో కూడిన బాట! కొండ దగ్గరికి రాగానే పరుగులు పెడుతూ పైకెక్కే పోటిలు...ఆ కొండలలో  ఒక మోస్తరు పైకి  వెళ్ళగానే, అక్కడేదో గుడి ఉన్న  జ్ఞాపకం. దగ్గరలోనే ఒక చిన్న నీటి మడుగు..అందులో తెల్లని తామర  పువ్వులూ..చిన్న చేప పిల్లలూ..గట్టునుంచీ నీటిలోకి యెగిరెగిరి పడే కప్పలూ..అప్పుడప్పుడూ వినిపించే పక్షుల సందడీ .కాస్త  దూరంలొ చెట్ల నడుమ ఒక శివలింగం..మా గుడిపాటి అవ్వా, మ అమ్మా కలిసి శ్రద్ధగా మడి కట్టుకుని వంట చేసెవాళ్ళు. . ఆ నీటి మడుగులోని తామర పువ్వులు తెచ్చి శివునికి పెట్టాలని పిల్లలంతా పోటీ పడేవాళ్ళం  కూడా!  ఆ శివలింగం  దగ్గర నైవేద్యం పెట్టి  భక్తిగ నమస్కరించేది గుడిపాటి అవ్వ..   (పాపం యేమని  మొక్కెదో మరి) మేమైతే  కొండ యెక్కటం, 
దిగటం..ఇదే ఆట!  ఆపై, యెప్పుడెప్పుడు నైవేద్యలవుతయా
   అని యెదురు చూపులు! మొత్తానికి,  మా వెంట తెచ్చుకున్న విస్తరాకుల్లొ వేడి  వేడి అన్నం,  చక్కెర పొంగలి,  కారిపోతుందేమోనని   భయంతొ ఒడిసిపట్టుకునె  సాంబారూ,  చారూ,  నీళ్ళ మజ్జిగా..భలె రుచిగ
  ఉండెవా వంటకాలన్నీ !  సాయంత్రం   దాకా అలా  ఆడుకునీ  పాడుకునీ  చికటి పడకముందే బయలుదేరి, రాత్రి యే యెనిమిదింటికో ఇల్లు చేరేవాళ్ళం...తిరిగి వచ్చేవేళలో, ఆ యెద్దుల  బండి, చప్పుడూ,, యెద్దుల మెడలొ గంటల గణగణలూ, పొడవాటి పడమటి  నీడలూ..ఇవన్నీ నా చిన్ననాటి కార్తీక వనభోజనాల  అందమైన పచ్చ పచ్చని  జ్ఞాపకాలు మరి!.......     

Brundavanme mandiramaina imp


Friday 13 November 2015

నా జ్ఞాపకాల సొరుగులో అరుగులు - 2

నా జ్ఞాపకాల సొరుగులో అరుగులు - 2 

 నాకు అరుగుల నేపథ్యంలో కొన్ని చక్కని జ్ఞాపకాలే ఉన్నాయనిపిస్తున్నది -



ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే !  కడప మోచంపేట విశ్వేశ్వరాలయం


ఉన్న వీధిలోకి మారినప్పటి జ్ఞపకాలూ చక్కనివే..ఉత్తరముఖంగా, వీధీ


చివరగా ఉన్న ఆ ఇంటికి పెద్ద పెద్ద అరుగులే ఉండేవి.(మా ఇంటికీ ఆనుకుని


ఒక పాడుపడిన ఇల్లుండేది. ఆ ఇంటివైపుచూడాలన్న భయపడి చచ్చేదాన్ని.)


నా చిన్నప్పుడు, మా ఇంటికి, బూచివాడులాగే గొంగడి కప్పుకున్న


 కనికట్టు కళాకారుడొచ్చేవాడు.  మా అయ్యగారికివన్నీ సరదాలు మరి.


అతనొచ్చినప్పుడు, అ వీధి పిల్లలంతా మా ఇంటి అరుగులపై మూగేవారు.


అతను,  తన కనికట్టుతో, గవ్వలు ఆడిస్తూనే, క్షణాల్లో మండ్రగబ్బలు


సృష్టించేవాడు.  అవెలా వచ్చేవో ఆశ్చర్యమే మాకంతా ! వాటిని చూసి


తెగ భయపడిపోయి, ఒకరి పై మరొకరు పడిపోవటం ! అంతలోనే


అవి మాయమైపోయి,  పూలు వచ్చేసేవి.. మళ్ళీ తేళ్ళు కూడా ! అమ్మో!


ఎంత థ్రిల్లింగో ! అప్పుడు  నాకు 10 లేదా 11 సంవత్సరాలుంటాయేమో !


 ఇంకా యేవేవో చేసేవాడు కానీ, ఇదైతే  అలా ముద్ర వేసుకుని కూర్చుంది


 నా మనసులో ! అతనికి అయ్య శాలువా కప్పి, బియ్యం, బట్టలూ


 కూడా ఇచ్చేవారని గుర్తు...యీ నా జ్ఞాపకం యెలాఉందో మీరే  చెప్పాలి


మరి....మీలో మరికొందరికీ ఇలాంటి జ్ఞాపకాలు ఉండవచ్చు కూడా!


యేదో సరదాకి ఇలా పంచుకోవటం !    

Tuesday 10 November 2015



  


.......
ప్రజాకంటకుడైన నరకాసురుణ్ణి శ్రీ కృష్ణ సత్యలిరువురూ, వధించి లోకాలకు దివ్యానందావళిని కానుకగ ఇచ్చిన శుభ పర్వాన్నే ఇలా జనులందరూ ఉత్సాహంగా దీపావళిగా జరుపుకునే సంప్రదాయం మొదలైంది. ఈ నరకాసురుడు, భూదేవికీ, విష్ణుమూర్తికీ కుమారుడేఇనా, కారణాంతరాలవల్ల అసురుదుగా మరి, మూడు లోకాలకూ ముచ్చమటలు పోయిస్తుండటం చూసింది తల్లి. కుపుత్రో జాయేత్ క్వచిదపి... అన్న శంకరులవారి మాటలకు కూడ అపురూపమైన సహన సౌశీల్యాలకు పెట్టింది పేరైన భూదేవికూడా స్ఫూర్తి అయి ఉండవచ్చు. భూనభోంతరాళాలలో తన కుమారుడివల్ల బాధితులైన ప్రజల , మిన్ను ముడుతున్న ఆర్తనాదాలు వింటూ సహనాన్ని కోల్పోయిందా మాతృదేవి. విష్ణువు దగ్గరికి వెళ్ళి, నరకాసురుణ్ణీ మట్టుపెట్టమంది. భూమిపై జీవిస్తున్న తన తక్కిన ప్రియ సంతానాన్ని ఆ దుర్మార్గుణి చెరనుంచీ తప్పించమని వేడుకుంది. కొడుకే కానీ, తక్కిన సంతానం క్షేమమూ తనకు అవసరమే కద మరి ! వాడొక్కడివల్లా ఇంతమంది కష్టాలపలవటం అన్యాయం. మహా సమాజ ధర్మం ముందు, వ్యక్తిగత ధర్మాన్ని తృణీకరించటం - ఆ తల్లి తీసుకున్న గొప్ప నిర్ణయం. ఫలితమే - అటు నరకుని పరలోక ప్రయాణం - ఇటు భువి పై సుఖ సంతోషాల పునరాగమనం. తమస్సు వీడింది. ఉషస్సు ప్రవేశించింది.
నిన్న మొన్న మనం వేడుకగా జరుపుకున్న దేవీనవరాత్రుల నేపథ్యం కూడా ఇలాంటి స్ఫూర్తే !


వ్యష్టి కన్నా సమిష్టే గొప్ప అనీ, వ్యక్తిగత న్యాయం కన్నా, సమాజ శ్రేయస్సే ముఖ్యమనీ మన సంస్కృతి తరతరాలనుంచీ నొక్కి వక్కాణిస్తూనే ఉంది.
వ్యక్తిగత ధర్మానికీ, మహాధర్మానికీ చాలా వ్యత్యాసం ఉంది. పృధ్వీరాజ్ దేశాధినేతగా అవిచ్చిన్నంగా పలిస్తున్న రోజులవి ! ఘోరీ దండెత్తి వచ్చాడు. ఓడిపోయాడు. పృధ్వీరాజ్ పాదాల పై వ్రాలి శరణు శరణన్నాడు. శరణన్నవారిని క్షమించివేయటం క్షాత్ర ధర్మం. అందుకే, పృధ్వీరాజ్ అతనికి క్షమా భిక్ష పెట్టాడు. అప్పటికి బ్రతుకుజీవుడా అనుకుని వెళ్ళిపోయిన ఘోరీ మళ్ళీ కొన్ని దినాలకు పృధ్వీరాజ్ పై దండెత్తి వచ్చాడు. మళ్ళీ ఓటమి. మళ్ళీ క్షమాభిక్ష పెట్టమని కాళ్ళా వేళ్ళా పడ్డాడు. పృధ్వీరాజ్ మళ్ళీ క్షమించేశాడు. ఘోరీ అప్పటికి వెళ్ళీపోయి, మళ్ళీ దండెత్తాడు. మళ్ళీ చరిత్ర పునరావృతమైంది. ఇలా 17సార్లు జరిగింది. అప్పుడు, పృధ్వీరాజ్ కు అనుమానం వచ్చింది. ఇలా యెందుకు జరుగుతున్నది? ఒక మహా మహిమాన్విత అఘోరీబాబా పాదాలపై పడి, దీనికి పరిష్కరం చెప్పమని వేడుకున్నాడు పృధ్వీరాజ్. అఘోరీబాబా, దీర్ఘంగా ఆలోచించి, ఒక విశాల ప్రదేశానికి రాజును తీసుకుని వెళ్ళాడు. అక్కడ, ఒక చోట శుద్ధి చేసి, ఒక పెద్ద మేకును భూమిలోదిగవేయించాడు ఆ బాబా ! 'నీ రాజ్యానికిక శతృబాధలేదు పొమ్మన్నా'డు. ఇదంతా రాజానుచరులూ, రాజుగారి పట్టమహిషి సంయుక్తాదేవి గమనిస్తున్నారు. యేదో మేకు భూమిలో దిగవేసి, ఇక నీకు శతృబాధ లేదని ఆ బాబా అనటమూ, రాజుగారు తల ఊచటమూ- ఇదేమి చోద్యం అనిపించిందట రాణిగారికి ! మహరాజుగారిని పక్కకు పిలిచి 'మహారాజా ! ఇదంతా యేదో, నవ్వులాట వలె ఉంది. అ బాబాగారేదొ చేయటం, మీరు దానికి తల వూచటం - ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. మేకు దిగవేయటం వల్ల రాజ్యం స్థిరంగా ఉండటమేమిటి? యీ చోద్యం యెవరైనా నమ్మగలరా? మీరితని మాటలు నమ్మటమేమిటి?' అని కస్త గట్టిగానే తన అసమ్మతిని తెలిపింది రాణీ సంయుక్త. అఘోరీబాబా ఇది గమనించాడు. రాజుగారిని అడిగాడు. యేమిటి సంగతని...రాజు మొహమాటంగా యేమీలేదన్నాడు. కానీ బాబాకు విషయం తెలిసింది. రెట్టించి అడిగాడు. చెప్పక తప్పలేదు రాజుకు ! రాణీగారి అభిప్రాయం చెప్పాడాయన ! బాబా చిన్నగా నవ్వి, రాణీగారినీ అక్కడికి రమ్మన్నాడు. అప్పుడన్నాడు 'రాజా! నేనిక్కడ నాటిన మేకు, భూమిని మోస్తున్న ఆదిశేషుని తలపై దిగింది. ఇక నీ సామ్రాజ్యానికి యెటువంటి ఢోకా లేదు. నన్ను నమ్ము. ' అన్నాడు. రాణీ సంయుక్త ముఖంలో ఇంకా అనుమాన చాయలు. ఇంక లాభం లేదని , బాబా, తాను నాటిన మేకును పైకి లాగించేశాడు. మేకు చివర రక్తం ధరలు కట్టి ఉంది. మేకు దిగిన చోట క్రిందికి వంగి చూస్తే, బాధగా కదలాడుతున్న పాము పడగ దర్శనమిచ్చింది. అప్పుడర్థమైంది రాణిగారికి, తన తొందరపాటు ! క్షమించమని రాజ దంపతులు కాళ్ళపై పడ్డారు. కానీ, సమయం మించిపోయింది. బాబా 'నా చేతుల్లో యేమీ లేదిక! అంతా దైవేచ్చ ! ' అంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ కొన్ని రోజులకు, ఘోరీ దండెత్తి రావటం, పృధ్వీరాజును ఓడించటం, వధించటం, భారతదేశ సింహాసనాన్ని అధిష్టించటమూ జరిగిపోయాయి. ఇదంతా దేశభవితను మార్చివేసి, కొన్ని వందల సంవత్సరాల బానిసత్వాన్ని కానుకగా ఇచ్చిన పరిణామ ఫలితాలు ! పాదాలపై పడినవాడు శతృవైనా క్షమించటం- క్షాత్ర ధర్మమే! కానీ పదే పదే యీ సంఘటన పునరావృతం కావటం వెనుక ప్రమాదాన్ని గమనించి, అక్కడ క్షాత్రధర్మం కన్నా, మహధర్మమైన దేశరక్షణకు ప్రాధాన్యత ఇవ్వటమే సముచితం. పృథ్వీరాజ్ కు యీ సంగతి అప్పుడే తోచిఉంటే,భారతదేశ చరిత్ర మరోలా ఉండేది కదూ ! ఇన్ని సార్లు ఓడి వెళ్ళిపోయినా అదే శతృవు మళ్ళి మళ్ళీ దండెత్తి వస్తున్నాడంటే, అతని మనసులోని దురూహను కనిపెట్టలేనంత క్షమాగుణం అవసరమా ! అమాత్యులైనా చెప్పలేదా ! యీ ప్రశ్నలకు సమాధానం విధి..అంతే !     బంధుప్రీతి బంధుప్రీతి, శరణాగత శతృ రక్షణ కన్నా మహత్తరమైన దేశ రక్షణాధర్మమే మిన్న అని మనకు కృష్ణుడు గీతలోనూ చెప్పాడు. స్వస్తి !
.
...........................


      


Sunday 8 November 2015


                           నా జ్ఞాపకల సొరుగులో అరుగులు...
          అరుగులు అనగానే నలభై యాభై సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరికీ,ఎన్నో కొన్ని జ్ఞాపకల పరిమళాలు మనస్సును తేనెతుట్టెలా చుట్టేస్తాయి. ఇది వాస్తవమేనని మిత్రులు కొంతమందైనా ఒప్పుకుంటారు కదూ !
        నాకూ యీ అరుగులగురించిన బృందం పోష్టులు చూడగానే  కొన్ని జ్ఞాపకాలు ముసురుకొని, అవి మీఅందరితో పంచుకునేలా సందడి చేయటం మొదలు పెట్టాయి. ఆ సొదల ముచ్చట్లలో కొన్ని మీకోసం !
       నేను పుట్టినది మోచంపేట (కడప) లో ! దాదాపు 9 లెదా 10 యేళ్ళవరకూ అక్కడే మేము నివాసమున్నట్టు  జ్ఞాపకం. అ వీధిలో నరసరామయ్యగారని పేద్ధ లాయర్ గారి, దాదాపు 7, లెదా 8 అంకణాల ఇల్లు. (అంకణం అన్నది రాయలసీమలో ఇంటి కొలతలకు వాడే ఒక పరిమాణం. దాదాపు పది అడుగులకొక అడ్డ  దూలం వేస్తారు. పొడవూ, వెడల్పూ కూడా అంతే ఉండేవని నాకు గుర్తు మరి.  ఇప్పటి కొలతల్లో దాదాపు, 400 లేదా 500 గజాల స్థలం వాళ్ళది ) ఆ పేద్ధా  ఇంటి ముందు, వీధి వివరి మట్టిమిద్దె బాడుగ ఇల్లు  మాది. వాళ్ళ ఇల్లు దక్షిణాభిముఖంగా  వీధి చివరన ఉండగా, మేము బాడుగకుండే ఇల్లు వాళ్ళింటికి యెదురుగా ఉత్తర ముఖంగా ఉండేది.)   ఆ  ఇంట్లోనే నేను పుట్టానట!  నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు,  మాఅమ్మ నిండుగర్భిణిగ సాయిబాబా పూజ చేసుకుని, వంటింట్లో, గుడ్డిదీపం వెలుతురులో పాత్రలు కడుగుతుంటే, మందాసనం (దేవతా బృందాన్నుంచే చెక్క మందిరం) కింద బాగా  చప్పుడయ్యిందట!  మాఅమ్మ లాంతరునటుకేసి తిప్పగానే పేద్ధా పాము బుసకొడుతూ ముందుకు వచ్చిందట!   మాఅమ్మ భయపడిపోయి, మా అయ్యను (ఆయనకెప్పుడూ మ్ముందు గదిలో పుస్తకాలతోనే సావాసం మరి ! ) ' భయం లేదు. నాగ సాయిలే ఆయనే పొతాడు. దండంపెట్టి నీ పని నువ్వు  చేసుకో 'అని అక్కడినుంచే సలహా !  అమ్మ  పాపం, అలాగే కన్నీళ్ళతో మొక్కుకుని, పాల గిన్నె ముందు పెడితే తాగి వెళ్ళిపోయిందట ఆ పాము ! మా అక్కయ్య లే చెప్పేవాళ్ళీ కథను !  ఆ పాము మూడు నాలుగు రోజులాఇంటిముందున్న  అరుగుల మూలల్లో పాకుతూ వెళ్ళిపోవటం గమనించారట మా అక్కయ్యా వాళ్ళు మరి ! అటుతరువాత అది యెటుపోయిందో కానీ , మా అమ్మ ఆ క్షణాన మొక్కిన మొక్కు కారణంగా నా పేరు ముందు 'నాగ' అటుతరువాత, పేరు కొత్తగా ఉండాలని 'పద్మిని' ని తగిలించటంవల్ల నేను 'నాగపద్మిని' అయ్యానని మా  తోబుట్టువుల వువాచ !
         ఇంతకూ, ఆ ఇంటి అరుగులమీద చిన్నప్పటి స్నేహితులతో ఆడుకున్న ఆటలైతే గుర్తులేవుకానీ ఆ పెద్ద అరుగులపైనే యెండాకాలం మేము వరుసగా పడుకోవటాలు గుర్తున్నాయి.
        ఆ ఇంటి   అరుగులు నాకెందుకింకా గుర్తంతా, దానికో కథ ఉంది మరి !
        అయ్యగారు డిల్లీ సాహిత్య అకాడెమీలో కొన్ని రోజులు (1953-54 ప్రాతాలలో) పనిచేశారని మీకంతా తెలుసు కదా ! అప్పట్లో, డిల్లీ కీ కడపకూ మాటల్లో వివరించలేనంత దూరం కిందే లెక్క ! అయ్యకు వుత్తరాలు రాసే అలవాటూ తక్కువే ! మా అమ్మ నలుగురు ఆడపిల్లల సంసారాన్ని ఒంటరిగా  యెలా   యీదేదొ ఆ  పాపం మరి ! తన బాధలను షిర్దీ బాబాకు కన్నీళ్ళతో విన్నవించుకునేదేమో ! అక్కడ , ఒక షిర్దీ బాబా భక్తురాలి ఇంట్ళొ బాడుగకు వుండేవారట అయ్య !  ఆమె కలలో కనపడి, 'యీ ఆచార్యుల భార్య చాలా  కష్టపడుతున్నదక్కడ !  త్వరగా వెళ్ళిపొమ్మ'ని చెప్పమన్నాడట ! అప్పటికే అయ్య జాండీస్ తో బాధ పడుతున్నారు. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి బయలుదేరారట అయ్య ! ఆ సంగతి అప్పటికింకా అమ్మకు తెలియదు.  ఆమె  తెల్లవారుఝామున ఇంటిముందు కసువూడ్చి, నీళ్ళు చల్లి ముగ్గు పెడుతూంది! మా రెండో అక్కయ్య ఆమెకు తోడుగా ఉందక్కడే ! యీ లోగా, ఆ చిరు చిరు చీకట్లో, ఒక సాధువు, కాషాయ వస్త్రాలలో ఇంటిముందు నిలబడ్డాడట !  'యేమో, దొంగాడేమో'  అనుమానం
మా అక్కయ్య చిన్న బుర్రకు !  అమ్మ కన్నీళ్ళతోనే ముగ్గు పెడుతున్నది. ఆ సాధువు, అమ్మను పిలిచాడట ! అమ్మ తలెత్తి చూసింది. 'యేడవకమ్మా ! మీ ఆయన తొందరలోనే వస్తున్నాడులే' అని చేయెత్తి ఆశీర్వదించి వెళ్ళీపోయాడట ! అమ్మ నిర్ఘాంతపోయింది. మా రెండో అక్కయ్యా అంతే ! (తన పేరు తరులత- ఆంగ్ల కవయిత్రి తోరుదత్త్ పేరు కలిసొచ్చేలా ఆ పేరు పెట్టారట అయ్య తనకు. అసలు మా తోబుట్టువుల పేర్లకూ చక్కటి నేపధ్యాలున్నాయి తెలుసా, ఆ ముచ్చట్లు మరో సారి..)  
అమ్మ అలాగే ముగ్గు బుట్ట చేత్లో పట్టుకుని నిలుచునే ఉంది. ఆ సాధువు మలుపు తిరిగి వెళ్ళే పోయాడు. అక్కయ్య  తేరుకుని, ఆ సాధువు యెటుపోయాడో చూద్దామని గబగబా పరిగెత్తుకుని వెళ్ళిందట  కానీ ఆ   సాధువు అంతలోనే యెటుపోయాడో మరి !
         రెండోరోజు అయ్య పెట్టే బేడా తో దిగారింటిలోకి !
         ఆ అరుగులదగ్గరే  యీ సంఘటన జరిగింది, పైగా మా ఇంట్లో పదే పదే చెప్పుకున్న సంగతి కావటంవల్ల,  నేనూ ఆ అరుగుల చివరిదాకా వెళ్ళి ఆ సాధువు మళ్ళీ కనిపిస్తాడేమోనని చాలా సార్లు చూసేదాన్నని బాగా గుర్తు! 
  (నాకు అపురూపంగా గుర్తున్న మరిన్ని అరుగుల ముచ్చట్లు  మళ్ళీ మరొక్కసారి) ...

Friday 6 November 2015

Sarasijanabha sodari .......



.....


        ప్రియ స్నేహ బృందానికి,
     సంగీతం - ఒంటరివేళల్లో,మనసు గాయపడిన వేళల్లో,ఆనందడోలికల  తరుణంలో- యెంత సేదతీర్చి తోడుగా ఉంటుందో, పెద్దలందరూ యెన్నోవిధాలుగా తెలియజెబుతూనే ఉంటారు కదా! నాకైతే, మాటా- పాటా యెల్లవేళలా తోడునిలిచే చక్కటి నేస్తాలే !  చిన్నప్పుడు నేర్చుకున్న శాస్త్రీయ సంగీతం, తరువాత నేర్చుకున్న భక్తి,లలిత గేయ మాధుర్యం - యెప్పుడూ మనసుకు సేద తీర్చే మంచినీటి చెలమలే!  కేవలం ఆత్మానదం కోసం పాడుకునేవైనా - మిత్రులతొ , అందునా సమభావ సంస్పర్శ ఉన్న ఆత్మీయులతో ఆనందాన్నైనా,ఆవేదననైనా పంచుకోవటంలోని ఆనందమే వేరుకదా! ఇది వినండి మరి !!! 
  (recorded only for self satisfaction not as a professional please....)     
  
 

Sunday 1 November 2015





కరీణ్ణగరం లోని యజ్ఞ వరాహస్వామి పవిత్ర సన్నిధిలో యీ పురస్కారం అందుకోవటం- యెంతో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీమాన్ విజయసారధి గురువర్యుల ఆశీస్సులుకూడా దక్కటం మరో గొప్ప అనుభూతి. సహజ సుందరమైన పరిసరాలు, మనసులూ, భక్తి భావ తత్పరతతో జరుగుతున్న పూజదికాలూ.. యజ్ఞాలూ నన్ను మరొలోకంలొకి తీసుకెళ్ళాయి. ఘనాపాటులైన వేదపండితులూ, గురుతుల్యులూ, మా అయ్యగారికి అత్యంత ఆప్తులూ, నాకు మార్గనిర్దేశకులూఐన శ్రీరంగాచార్య స్వామివారూ, సోదరుడూ, సువిఖ్యాత విమర్శకులూ డా. లక్ష్మణచక్రవర్తి గారితోపాటూ ఒక పురస్కారాన్ని అందుకోవటం యెంతో ఆనందదాయకం. సువిఖ్యాత కవి, విమర్శకులూ శ్రీమాన్ గిరిజామనోహర్ బాబుగారు యీ పురస్కరానికి నన్ను అర్హురాలిగా యెంపికచేయటం-కేవలం పుట్టపర్తివారి తనయను కావటమేనని నా విశ్వాసం. కారులో నిన్నటి ప్రయాణంలో, శ్రీరంగాచార్యులవారి చతురోక్తులూ, సాహిత్య రసగుళికల ఆస్వాదనోల్లాసం- లక్ష్మణచక్రవర్తిగారికీ నాకూ కూడా మర్గాయాసమన్నమాటే గుర్తుకు రాకుండా చేశాయి. ధన్యోస్మి! (యీ లింక్ పంపిన మేడిశెట్టి గోపాల్ గారికి కృతజ్ఞతలు)...2-11-15
...................