.......
ప్రజాకంటకుడైన నరకాసురుణ్ణి శ్రీ కృష్ణ సత్యలిరువురూ, వధించి లోకాలకు దివ్యానందావళిని కానుకగ ఇచ్చిన శుభ పర్వాన్నే ఇలా జనులందరూ ఉత్సాహంగా దీపావళిగా జరుపుకునే సంప్రదాయం మొదలైంది. ఈ నరకాసురుడు, భూదేవికీ, విష్ణుమూర్తికీ కుమారుడేఇనా, కారణాంతరాలవల్ల అసురుదుగా మరి, మూడు లోకాలకూ ముచ్చమటలు పోయిస్తుండటం చూసింది తల్లి. కుపుత్రో జాయేత్ క్వచిదపి... అన్న శంకరులవారి మాటలకు కూడ అపురూపమైన సహన సౌశీల్యాలకు పెట్టింది పేరైన భూదేవికూడా స్ఫూర్తి అయి ఉండవచ్చు. భూనభోంతరాళాలలో తన కుమారుడివల్ల బాధితులైన ప్రజల , మిన్ను ముడుతున్న ఆర్తనాదాలు వింటూ సహనాన్ని కోల్పోయిందా మాతృదేవి. విష్ణువు దగ్గరికి వెళ్ళి, నరకాసురుణ్ణీ మట్టుపెట్టమంది. భూమిపై జీవిస్తున్న తన తక్కిన ప్రియ సంతానాన్ని ఆ దుర్మార్గుణి చెరనుంచీ తప్పించమని వేడుకుంది. కొడుకే కానీ, తక్కిన సంతానం క్షేమమూ తనకు అవసరమే కద మరి ! వాడొక్కడివల్లా ఇంతమంది కష్టాలపలవటం అన్యాయం. మహా సమాజ ధర్మం ముందు, వ్యక్తిగత ధర్మాన్ని తృణీకరించటం - ఆ తల్లి తీసుకున్న గొప్ప నిర్ణయం. ఫలితమే - అటు నరకుని పరలోక ప్రయాణం - ఇటు భువి పై సుఖ సంతోషాల పునరాగమనం. తమస్సు వీడింది. ఉషస్సు ప్రవేశించింది.
నిన్న మొన్న మనం వేడుకగా జరుపుకున్న దేవీనవరాత్రుల నేపథ్యం కూడా ఇలాంటి స్ఫూర్తే !
వ్యష్టి కన్నా సమిష్టే గొప్ప అనీ, వ్యక్తిగత న్యాయం కన్నా, సమాజ శ్రేయస్సే ముఖ్యమనీ మన సంస్కృతి తరతరాలనుంచీ నొక్కి వక్కాణిస్తూనే ఉంది.
వ్యక్తిగత ధర్మానికీ, మహాధర్మానికీ చాలా వ్యత్యాసం ఉంది. పృధ్వీరాజ్ దేశాధినేతగా అవిచ్చిన్నంగా పలిస్తున్న రోజులవి ! ఘోరీ దండెత్తి వచ్చాడు. ఓడిపోయాడు. పృధ్వీరాజ్ పాదాల పై వ్రాలి శరణు శరణన్నాడు. శరణన్నవారిని క్షమించివేయటం క్షాత్ర ధర్మం. అందుకే, పృధ్వీరాజ్ అతనికి క్షమా భిక్ష పెట్టాడు. అప్పటికి బ్రతుకుజీవుడా అనుకుని వెళ్ళిపోయిన ఘోరీ మళ్ళీ కొన్ని దినాలకు పృధ్వీరాజ్ పై దండెత్తి వచ్చాడు. మళ్ళీ ఓటమి. మళ్ళీ క్షమాభిక్ష పెట్టమని కాళ్ళా వేళ్ళా పడ్డాడు. పృధ్వీరాజ్ మళ్ళీ క్షమించేశాడు. ఘోరీ అప్పటికి వెళ్ళీపోయి, మళ్ళీ దండెత్తాడు. మళ్ళీ చరిత్ర పునరావృతమైంది. ఇలా 17సార్లు జరిగింది. అప్పుడు, పృధ్వీరాజ్ కు అనుమానం వచ్చింది. ఇలా యెందుకు జరుగుతున్నది? ఒక మహా మహిమాన్విత అఘోరీబాబా పాదాలపై పడి, దీనికి పరిష్కరం చెప్పమని వేడుకున్నాడు పృధ్వీరాజ్. అఘోరీబాబా, దీర్ఘంగా ఆలోచించి, ఒక విశాల ప్రదేశానికి రాజును తీసుకుని వెళ్ళాడు. అక్కడ, ఒక చోట శుద్ధి చేసి, ఒక పెద్ద మేకును భూమిలోదిగవేయించాడు ఆ బాబా ! 'నీ రాజ్యానికిక శతృబాధలేదు పొమ్మన్నా'డు. ఇదంతా రాజానుచరులూ, రాజుగారి పట్టమహిషి సంయుక్తాదేవి గమనిస్తున్నారు. యేదో మేకు భూమిలో దిగవేసి, ఇక నీకు శతృబాధ లేదని ఆ బాబా అనటమూ, రాజుగారు తల ఊచటమూ- ఇదేమి చోద్యం అనిపించిందట రాణిగారికి ! మహరాజుగారిని పక్కకు పిలిచి 'మహారాజా ! ఇదంతా యేదో, నవ్వులాట వలె ఉంది. అ బాబాగారేదొ చేయటం, మీరు దానికి తల వూచటం - ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. మేకు దిగవేయటం వల్ల రాజ్యం స్థిరంగా ఉండటమేమిటి? యీ చోద్యం యెవరైనా నమ్మగలరా? మీరితని మాటలు నమ్మటమేమిటి?' అని కస్త గట్టిగానే తన అసమ్మతిని తెలిపింది రాణీ సంయుక్త. అఘోరీబాబా ఇది గమనించాడు. రాజుగారిని అడిగాడు. యేమిటి సంగతని...రాజు మొహమాటంగా యేమీలేదన్నాడు. కానీ బాబాకు విషయం తెలిసింది. రెట్టించి అడిగాడు. చెప్పక తప్పలేదు రాజుకు ! రాణీగారి అభిప్రాయం చెప్పాడాయన ! బాబా చిన్నగా నవ్వి, రాణీగారినీ అక్కడికి రమ్మన్నాడు. అప్పుడన్నాడు 'రాజా! నేనిక్కడ నాటిన మేకు, భూమిని మోస్తున్న ఆదిశేషుని తలపై దిగింది. ఇక నీ సామ్రాజ్యానికి యెటువంటి ఢోకా లేదు. నన్ను నమ్ము. ' అన్నాడు. రాణీ సంయుక్త ముఖంలో ఇంకా అనుమాన చాయలు. ఇంక లాభం లేదని , బాబా, తాను నాటిన మేకును పైకి లాగించేశాడు. మేకు చివర రక్తం ధరలు కట్టి ఉంది. మేకు దిగిన చోట క్రిందికి వంగి చూస్తే, బాధగా కదలాడుతున్న పాము పడగ దర్శనమిచ్చింది. అప్పుడర్థమైంది రాణిగారికి, తన తొందరపాటు ! క్షమించమని రాజ దంపతులు కాళ్ళపై పడ్డారు. కానీ, సమయం మించిపోయింది. బాబా 'నా చేతుల్లో యేమీ లేదిక! అంతా దైవేచ్చ ! ' అంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ కొన్ని రోజులకు, ఘోరీ దండెత్తి రావటం, పృధ్వీరాజును ఓడించటం, వధించటం, భారతదేశ సింహాసనాన్ని అధిష్టించటమూ జరిగిపోయాయి. ఇదంతా దేశభవితను మార్చివేసి, కొన్ని వందల సంవత్సరాల బానిసత్వాన్ని కానుకగా ఇచ్చిన పరిణామ ఫలితాలు ! పాదాలపై పడినవాడు శతృవైనా క్షమించటం- క్షాత్ర ధర్మమే! కానీ పదే పదే యీ సంఘటన పునరావృతం కావటం వెనుక ప్రమాదాన్ని గమనించి, అక్కడ క్షాత్రధర్మం కన్నా, మహధర్మమైన దేశరక్షణకు ప్రాధాన్యత ఇవ్వటమే సముచితం. పృథ్వీరాజ్ కు యీ సంగతి అప్పుడే తోచిఉంటే,భారతదేశ చరిత్ర మరోలా ఉండేది కదూ ! ఇన్ని సార్లు ఓడి వెళ్ళిపోయినా అదే శతృవు మళ్ళి మళ్ళీ దండెత్తి వస్తున్నాడంటే, అతని మనసులోని దురూహను కనిపెట్టలేనంత క్షమాగుణం అవసరమా ! అమాత్యులైనా చెప్పలేదా ! యీ ప్రశ్నలకు సమాధానం విధి..అంతే ! బంధుప్రీతి బంధుప్రీతి, శరణాగత శతృ రక్షణ కన్నా మహత్తరమైన దేశ రక్షణాధర్మమే మిన్న అని మనకు కృష్ణుడు గీతలోనూ చెప్పాడు. స్వస్తి ! .
...........................
No comments:
Post a Comment