Friday 24 November 2017

ఎన్ని రోజులనుంచో...ఆ దేశాల సందర్శనం చేయాలని మదిలో దాగిన కోరిక నెరవేరబోతోందన్న ఉద్వేగం..
.బాంగ్ కాక్ (థాయ్ లాండ్ రాజధాని) లో విమానం దిగాము తెల్లవారు ఝామున 3.30 ప్రాంతంలో... మా టూర్ ఏజెంట్స్..'అక్కడ దిగిన తరువాత తాత్కాలిక వీసా తీసుకోవాలి..దాదాపు 3500 రూపాయలతో' అన్నారు. సరే..తాత్కాలిక వీసా తీసుకునే మార్గం (ఇమ్మిగ్రేషన్) ఇంగ్లీష్ లో కనిపించిన ప్రతివారినీ అడుగుతున్నారు మావారు..బోర్డ్లు వున్నా, సరైన దారి కనుక్కోవటం కష్టంగానే వుంది. పైగా థాయ్ భాషలోనే ఎక్కువ బోర్డులు...పైగా అక్కడ ఉద్యోగస్తులకు కూడా ఆంగ్లం అంతగా రాదు..వచ్చినా వాళ్ళ ఉచ్చారణ అర్థం కాదు కూడా.. తిప్పలు పడి అక్కడికి చేరుకుంటే...అక్కడి కరెన్సీ లోనే కావాలని నిబంధన. సరే..అదృష్టం కొద్దీ, దగ్గరలోనే కరెన్సీ మార్పిడి చేసే ఏజెంట్స్ ఉండబట్టి, త్వరగా కరెన్సీ (బాత్ లు అంటే వాళ్ళ రూపాయిలు..మన 197 పైసలు వాళ్ళకు ఒక్క బాత్, కాగా ఫారిన్ ఎక్ష్చేంజ్ లో 180 పైసలకు ఒక థాయ్ బాత్) ..ఇదంతా చేసి, దానికి కావలసిన పత్రాలు నింపుకుని, వరుసలో నిలబడేసరికి, 4.30..చాంతాడంత లైన్లు..ఒక్కరే ఆఫీసర్ ఉన్నారు..తెలుగు, తమిళ, హిందీ పర్యాటకులే ఎక్కువ. అదో ఆనందం..నెమ్మదిగా క్యూ కదులుతూ...కదులుతూ...5.30 కి మా వంతొచ్చింది.అప్పటికి మరో ఆఫీసర్ వచ్చారు...మా ముందున్న ఒక హిందీ అమ్మాయి తన పాశ్చాత్య బాయ్ ఫ్రెండ్ తో వచ్చింది.అక్కడ తాత్కాలిక వీసా ఇవ్వాలన్నా, మనం ఉండబోయే హోటల్ వివరాలూ అన్నీ చూపిస్తేగాని వీసా ఇవ్వటం లేదు..ఆ అమ్మాయి దగ్గర ఆ వివరాలు లేవు..దిగిన తరువాత హోటల్ తీసుకుందామనుకుందట..మాతో హిందీలో చెప్పింది..కానీ ఆ ఆఫీసర్ ఆ అమ్మాయినలాగే నిల్చోబెట్టేశాడు..మా హోటల్ వివరాలు వెంటనే కనబడకపోయేసరికి మమ్మల్నీ నిల్చోబెట్టెస్తున్నాడు..అంతలో..మరో ఆఫీసర్ వచ్చి, మా పేపర్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించి, సంతృప్తి చెంది..ఏదో చీటి వ్రాసి, లోపలికెళ్ళి కూర్చోమంది..మళ్ళీ అక్కడో లైన్...నాకు కాళ్ళు ఒకటే లాగుతున్నాయి.గంటన్నర నుంచీ నిలబడే వున్నాం కదా...విధి లేదు కూడా ...అక్కడ కూలబడేందుకు కుర్చీలున్నాయి..అమ్మయ్య...సరే..ఇంతలో ఆ హిందీ అమ్మాయి ఫ్రెండ్ చొరవతో..తనకూ క్లియరెన్స్ వచ్చినట్టుంది..మరో అరగంట తరువాత...తాత్కాలిక వీసా (నాలుగు రోజులకోసం)తీసుకుని ఆరున్నరకు పెట్టే బేడా తీసుకునేందుకు వెళ్ళాం...మా సూట్ కేస్ అక్కడె బెల్ట్ మీద తిరుగుతూ ఉంది, మూడు గంటలుగా.. సంతోషం..బాగేజ్ తో బైటికి వచ్చాం..మావారి పేరు ఒక పేపర్ పై వ్రాసి పట్టుకుని ఉన్నాడో ముప్ఫై యేళ్ళతను..చూసిన వెంటనే వెళ్ళాం అతని దగ్గరికి..సరే..కార్లో కూర్చున్నాం..అతని పేరడిగాను..జవాబు లేదు..ఎంత సేపు పడుతుంది హోటల్ వెళ్ళేందుకు అన్నా ఆంగ్లంలోనే..నో ఆన్సర్...ఇదేమిటబ్బా..అనుకుని..హిందీ లో ప్రశ్నించా..ఊహూ ...అప్పుడర్థమైంది. ఇతనికి హిందీ, ఇంగ్లీష్ రెండూ రావని... భగవంతుడా !!! ...మా వారు కంగారెందుకన్నట్టు, అప్పటికే..నిద్రలోకి జారుకున్నారు....తరువాతేమైంది...వేచిచూడండి..