Wednesday 30 December 2015













మందాక్రాంత వృత్తంలో సాగే వేదాంత దేశికులవారి హంస సందేశ కావ్యం లోని వస్తువు- రాజ హంసతో శ్రీరాములవారు- అశోకవనంలోనున్న తన ధర్మపత్ని సీతాదేవికి సందేశాన్ని పంపటం. అసలు మందాక్రాంత వృత్తం అంటే? మందం ఆక్రమితి- మెల్లగా కొండచిలువవలె నెమ్మదిగా సాగే వృత్తం అని పెద్దలు చెబుతారు. క్షేమేంద్రుని ప్రకారం, విరహ బాధను వర్ణించేందుకు బహు బాగుగా పనికి వచ్చే వృత్తమిది. పరకాల నాయకీ(పెరియ తిరుమొళి) పరాంకుశ నాయకీ (తిరువాయ్ మొళీ) వీరిరువురూ, కొంగలనూ, చిలుకలనూ తమ సందేశవాహకులుగా వినియోగించుకున్నారు. కాళిదాసు మేఘ సందేశం యెలాగూ వుండనే వుంది.
'సర్స్వతంత్ర స్వతంత్ర'  'వేదాంతదేశిక', ' కవితార్కికకేసరి', 'ఘంటావతార' .ఇలా యెన్నో బిరుదులు కలిగిన యీ వేంగడనాధుడు, అద్వైత, శైవ, అలంకర శాస్తాలలొ పారీణులైన అప్పయ్య దీక్షితుల గౌరవాన్నందుకున్న వేదాంతస్వరూపుడు. వేదాంత దేశికుల రచన 'యాదవాభ్యుదయా నికి, అప్పయ్య దీక్షితులవారు చక్కని వ్యాఖ్యకూడా వ్రాశారట!

        మరి ఇందులో, వేదాంత దేశికులవారు, హంసను వాడుకోవటం, జ్ఞాన స్వరూపమైన సత్వ స్వరూప నిరూపణకోసమనే తేటతెల్లమౌతుంది. ఇక వివరాల్లోకి వెళితే, యీ కావ్యంలో భారత దేశ నైసర్గిక భౌగోళిక స్వరూపం గురించి వేదాంత దేశికులవారికున్న సంపూర్ణ పరిజ్ఞాన0 విశదమవటమే కాక, శ్రీవైష్ణవ తత్వ సారాన్నంతా ఇందులో పొదిగి కావ్యరూపమిచ్చిన వైనం- అద్భుతమనిపిస్తుంది తప్పక!

          ఈ కావ్యంలోని ప్రతీకాత్మక ధర్మ సూక్ష్మాలు కొన్ని. శరీరమే లంక. సంసారమనే సముద్రంలో మునిగివున్నది- అహంకార పూరిత హృదయం. (పది ఇంద్రియాల వశంలో వున్న రావణుని వంటి శరీరంలో) జీవం బందీగా (విషయనుభవాల ముసుగులో) వుంది-అచ్చు సీతమ్మవారివలె! శ్రీరాముడే భగవంతుడు. హంస- ఆచార్యుని రూపంలో పరమాత్మ సందేశాన్ని తీసుకుని వెళ్ళి , ముందు అతని కళ్యాణ గుణప్రశంసచేసి, తనను తాను కాపాడుకునే విధానాన్ని తెలుపుతుంది జీవాత్మకు! అసలు రామాయణమంతా శరణాగతి వేదమేనని శ్రీవైష్ణవుల వాదం. (కడపలో ఒకసారి విశ్వనాధవారికి ఘనంగా సన్మానం జరిగింది. 1976-77లో ననుకుంటా! విశ్వనాధ 'నాకు రామాయణం గురించి తెలిసినంతగా వేరెవరికీ, తెలియదేమో' అన్నారు ..అయ్య ఆ సభాధ్యక్షులు. ఆయనన్నారూ 'మా శ్రీవైష్ణవ సిద్ధాంతం ప్రకారం వాల్మీకి రామాయణానికి పద్ధెనిమిదిదాకా వ్యాఖ్యలున్నాయి. అవేమిటో నాకు తెలుసు. నీకు తెలిస్తే చెప్పు. ఇప్పుడే మాట్లాడుకుందాం' అని సవాల్ విసిరారు. విశ్వనాధ వారికి అయ్య సంగతి తెలుసు బాగా అప్పటికే..అందుకే నిజమేక కాబోలు లేవయ్యా!' అని తానే సర్ది చెప్పారు అప్పటికి..అప్పటి పాండిత్యాలూ..అప్పటి స్పర్ధలూ లేని బావిలో - కప్పల్లా, చీకటి రోజుల్లో బ్రతుకుతున్న మనకెందుకీ కథలన్నీ! కదా!) ఇది ఇప్పుడు అప్రస్తుతమైనా, ఒకసారి మా అయ్యనలా తలచుకుని ముందుకు!.. అప్పటిదాకా శృంగార రసాస్వదనలో తలమునకలై వున్న కవితాలోకానికి ఆధ్యాత్మిక సౌరభ సౌఖ్యాన్ని ఆస్వాదింపజేసేందుకే, సాక్షాత్తూ, ఆ తిరువేంకట నాధుడే, వేదాంత దేశికుల రూపంలో ఇలపై అవతరించారనీ ఒక వాదం ప్రబలంగా వినిపిస్తుంది.
(నేను పీహెచ్. డీ చేసేటప్పుడు, వేదాంతదేశికులవారి హంస సందేశ కావ్యం గురించి తెలిసింది. అప్పుడు, దొరికిన కొన్ని శ్లోకాలతో సరిపిపెట్టుకోవలసి వచ్చినా, తరువాత, యే సందర్భం దొరికినా, యీ హంస సందేశం గురించి బాగానే వెదికాను- నిరాశే మిగిలింది. అడపా దడపా దాన్ని గురించి వాకబులూ, శోధనలూ చేస్తూ, కొంత విషయ సేకరణ చేసినా, ఇటీవల యీ కావ్యం పూర్తి పాఠం దొరకటం నా అదృష్టంగానే భవిస్తూ, యీ ధనుర్మాస పావన తరుణంలో, ఈ కావ్యం గురించి మరికొన్ని విశేషాలు నా ఊహకందినంత వరకూ త్వరలో)




No comments:

Post a Comment