Tuesday, 29 December 2015


                                                          యెమ్మేకోణా.....
                          వున్నట్టుండి..
                   మది తలుపు తెరుచుకున్న చప్పుడు.
                   తలెత్తి చూద్దునుగదా..
                   బిక్కమొహం వేసుకుని,
                   దీనంగా నిలబడిందో నల్లటి  ఆకారం.......
                   కళ్ళతోనే ప్రశ్నించా యేమిటని..
   సమాధానం లేదు.
   మళ్ళీ రెట్టించా..
   'యెవరు నువ్వు?
   నాతో పనేంటి?
   యెందుకా నిర్వేదం?
   యేమిటా  మౌనం?' అని..
                    అడగ్గా అడగ్గా, అప్పుడు నోరు తెరిచిందా ఆకారం.
                    గొంతు వినటానికి ఇబ్బందనిపించినా,

                    తప్పదు కదా అని సర్దుకుని,
                    చెవులు అటు పడేశా!
   'నా ఊసే మరచిపొయావే?...'
   మీ అమ్మగారికెంత  ఇష్టమైన దాన్ని కదా నేను?
   నన్నెలా  మర్చిపోయావ్?
   మీ ఇల్లు చిలకలు వాలిన మమిడి చెట్టై పోయేదిగా,
   ప్రతి వేసవిలోనూ?
   మనుమలూ, మనుమరాండ్ల అల్లరిని చూస్తూ,
   తాతగారు,
   తమ బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకునేవారు కదా!
   వాళ్ళ అల్లరికి పెద్దలు కోప్పడితే,
  ' ఇంకా బాగా అల్లరి చేయండ్రా వెధవల్లారా'  అంటూ
  పిల్లలందరినీ తెగ ప్రోత్సహించేవారు.
  తన చిన్ననాటి ముచ్చట్లూ మీ అందరితో పంచుకునేవారు,
   ముసి ముసిగా  నవ్వుతూ!
   మీ అమ్మైతే,
   పెద్ద కంచంలో పట్టెడేసి  ముద్దలు కలిపి,
   ప్రేమగా ,
   కథలూ, కాకరకాయలూ చెబుతూ,
   వాళ్ళకు తినిపించేది కదా! 
   ఆఖరున, ఇక మావల్లకాదని పిల్లలంతా ఆపసోపాలు పడుతుంటే,
   అప్పుడు నా వంతొచ్చేది.
   ' ఒందూ గందదు బిళ్ళా, (  గంధం బిళ్ళా - మొడటి  ముద్ద)
     యెరడూ గరుడా గంబా, ( గరుడ స్థంభం- రెండో ముద్ద)
    మూడూ ముత్తెపు చిప్పా, ( ముత్తెపు చిప్ప- మూడో ముద్ద)
   నాలుగూ  నాగప్పా, ( నాగ దేవత-నలుగో ముద్ద)
   ఐదూ కంటీ సారా, ( కళ్ళద్దాలు- ఐదో ముద్ద0
   ఆరూ దానిమ్మా ..( దానిమ్మ- అరూ ముద్ద)
    యేడూ....యేడూ..
    అనగానే పిల్లలంతా పరుగో పరుగు....
    మాకొద్దు..మాకొద్దు  అంటూ..
    ఇంతకూ..
    యేడూ...యెమ్మేకోణా...కద..
    యెమ్మేకోణా ..అంటే   యెనుము (బర్రె) అని తెలుగర్థం కదా!  .
    ఆ యెమ్మేకోణా ను నేనే..
    నా   లాగా యెవరూ   కాకూడదనే
    యెవరికి వారు,
   కంచం ముందునుంచీ వెళ్ళిపోయేవాళ్ళు పిల్లలంతా!
   నన్ను కాదని  అప్పుడు వాళ్ళంతా వెళ్ళిపోయినా,
   ఇప్పుడు,
  వాళ్ళకు తెలియకుండానే అందరూ..
   యెమ్మేకోణలై   పోయారుగా!
   యెమ్మేకోణా- అంతే చదువు రాని దద్దమ్మలే అని కాదు అర్థం.
   జీవితంలో యే అపురూప జ్ఞాపకాలకూ విలువనివ్వక,
   కళ్ళు మూసుకుని,
   తను నమ్మిందే వేదం, తనదారే రహదారి ..
   అనుకుంటూ,
   తమదైన మార్గంలో  నడిచే,
   గడసరి చర్మమున్న ప్రతి వారూ యెమ్మేకోణలే!
   ఈ నిజాన్ని చెప్పాలనే వచ్చా!
   నన్ను యెగతాళి చేసి,
   నా పేరొచ్చిన ప్రతిసారీ,
   అసహ్యాన్ని కనబరచిన వాళ్ళంతా,
   యెవరి పరిధిలో వాళ్ళూ,
   నా రూపం ధరించినట్టే సుమా!
   'దున్నపోతు మీద వాన కురిసినట్టు, '
   'వాడో దున్నపోతులే!'
   'దున్నపోతుకు, చర్మం మందం..'.
    ఇలా  నన్ను దృష్టిలో పెట్టుకుని
   సృష్టించిన సామెతలన్నీ,
   యీనాటి ప్రతి మనిషికీ వర్తిస్తాయని,
   అందరూ తెలుసుకోవాలని చెబుదామని  వచ్చా..అంతే!'
   ఠక్కున నా ముందటి ఆకారం మాయమైంది..
   ఐతే నేను  కూడా....
   అమ్మో.........
   (నిజానికి, మా అమ్మ తన మనుమళ్ళకూ, మనుమరాండ్రకూ, అన్నం పెడుతూ, యీ పొట్టి  గేయం కన్నడంలో వినిపించేది మా   చిన్నప్పుడు..మా ఇంట కన్నడ పలుకుబళ్ళూ,  పదాలూ కూడా బాగానే వాడుకలో వుండేవి మరి... ఆ జ్ఞాపకం  గుర్తుకు రాగానే.. నా మదిలో తలెత్తిన ఆలోచనిది. జ్ఞాపకం  యెప్పటిదో ఐనా, ఇప్పటి అన్వయం- మనందరికీ వర్తిస్తుందనే అనిపిస్తుంది నామట్టుకు నాకు! మరి మీరేమంటారో! మీ అభిప్రాయమేదైనా,  నాదృష్టిలో, యెమ్మేకోణలుగా మనమంతా, యెవరిలొకంలో వాళ్ళు జీవిస్తున్న ముదురు చర్మం జీవులమే  కదా మరి! ఇది కేవలం నా సొంత ఊహే  కానీ, యెవరినీ ప్రత్యేకించి  వుద్దేశించి వ్రాయలేదని గమనించ ప్రార్థన.  యెమ్మేకోణ ( దున్న లేక  యెనుము) కు క్షమాపణలతో) ......

No comments:

Post a Comment