నయన నయ భాషణం
కనులు మాటలాడుననీ,మనసు పాట పాడుననీ' అంటూ కనులు మాట్లాడే సంగతిని నాయికా నాయకుల ప్రణయ విహారంలో చక్కగా వాడుకున్నారు సినీకవులు. 'కన్నులే నీకోసం కాచుకున్నాయీ' మరో సినిమాలో నాయకుడు నాయికకోసం తన యెదురుచూపులనీవిధంగా ఆవిష్కరించాడు. 'నాలుగు కళ్ళు రెండైనాయీ-రెండు మనసులు ఒకటైనాయీ' అంటూ అసలు ప్రేమావిష్కరణకు కళ్ళు కలుసుకోవటమే తొలి అడుగుగా తేల్చేశారు కూడా! 'నా కంటి పాపలో నిలిచిపోరా' అని ఒక ప్రియురాలు తన ప్రియుణ్ణి ఆహ్వానిస్తే, 'కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసూ' అని పాడుకుంటుందొక బాధాతప్త నాయిక! ఇంతకూ, సందర్భం యేదైనా, కళ్ళకున్న ప్రాధాన్యత మరే అవయవానికీ ఉండదని,ఇప్పుడు మన సినీకవులు ఘంటాపథంగా చెప్పారు . యీ సంగతిని మన కవులు యేనాడో నొక్కి చెప్పారు- తమ రచనల్లో! 'సర్వేంద్రియాణాం నయనం ప్రధానం' అని యెప్పుడో వాళ్ళెందుకన్నారంటే, కళ్ళు లేకుంటే, జీవితమంతా అంధకారమయమనీ,జీవితానందమనుభవించటంలో కళ్ళదే ప్రధాన పాత్ర అనీ వాళ్ళ అభిప్రాయం. కళ్ళతో సకల ప్రపంచాన్ని చూసి ఆనందించటం ఒక యెత్తైతే,ప్రణయప్రపంచంలో కళ్ళప్రాముఖ్యత మరో యెత్తనీ, దాన్ని వొట్టి మాటల్లో వర్ణించటంకంటే కవితాత్మకత జోడించి చెప్పటంతోనే దానికి సరైన న్యాయం జరుగుతుందనీ మనకవులేనాడో గ్రహించారు కాబట్టే, కన్నుల భాషలను తమ కావ్యాలలో ఇలా ఆవిష్కరించారనవచ్చు. సంస్కృత సాహిత్యం మొదలు, తెలుగు, ఉర్దూ, ఆంగ్ల సాహిత్యాలలో కళ్ళ కనికట్టునెలా కవిత్వీకరించారో చూద్దామా!
కవికుల గురువు గా కీర్తినొందిన కాళిదాసు తన కుమార సంభవంలో పార్వతీదేవి కళ్ళనిలా వర్ణించాడు. చంచలములూ, ఆకర్షణీయములూ, నల్లని కాంతులతో మిలమిలలాడే హరిణముల నేత్రాలతో ఆడవారి నేత్రాలను పోల్చటం ఆనవాయితీగా వస్తున్నది చాలాకాలం నుండీ! మరి కాళిదాసు యేమంటున్నాడు?
ప్రవాళ నీలోత్పల నిర్విశేషమధీరవిప్రేక్షిత మాయతాక్ష్యా,
తయా గృహీతం ను మృగాంగనాభిస్తతో గృహీతం ను మృగాంగనాభి :
(కుమారసంభవం-కాళిదాసు)
పార్వతి కన్నులు తుఫానులో కదలాడుతున్న నీలితామరల వలె ఉన్నాయి.వాటి చంచలతను చూస్తే, సందేహమౌతుంది- ఆమె ఆ చూపులను హరిణాలనుండీ నేర్చిందా, లేక హరిణాలే ఆమె నుండీ నేర్చాయా అని!.. అంతేనా!
తస్యాహ శలాంకాంజన నిర్మితేవ,కాంతిర్భువోరాయత లేఖయోర్యా
తాం వీక్ష్య లీలాచతురామనంగ : స్వచాప సౌందర్య మదం ముమోచ.
(కాళిదాసు-కుమారసంభవం)
'పార్వతి యొక్క మనోహరములైన పెద్ద కనుబొమలు, యెవరో తూలికతో వేసినట్టే వున్నాయి.తన ధనువును చూసి కామదేవునికున్న పొగరును, ధిక్కరించేలా ఉన్నాయవి..' కాళిదాసు మాళవికాగ్నిమిత్రం లోనూ మనోజ్ఞమైన నేత్రవర్ణన వుంది. కాళిదాసు స్త్రీమనస్తత్వ విజ్ఞానంలోనూ ఆరితేరినవాడని నిరూపించే సందర్భాలు చాలా ఉన్నాయి.. నాల్గవ అంకంలో రాజు కళ్ళగురించి చెప్పే యీ మాటలు, ప్రేమికులకే అర్థమౌతాయి మరి..
కాత్స్యేన నివర్ణయితుం చ రూపమిచ్ఛంతి తత్పూర్వసమాగమానాం,
న చ ప్రియేష్వాయతనానాం సమగ్రవృత్తీని విలోచనాని..
అంటే, తమ ప్రియులను కలవటానికి ఆరాటపడే స్త్రీలు, సహజంగానే సిగ్గరులుగా ఉంటారు. మొట్టమొదట తాము కలసిన పురుషులను కళ్ళనిండా చూసుకోవాలనే వారికి ఉంటుంది. కానీ వాళ్ళ పెద్ద పెద్ద కళ్ళూ, తమ ప్రేమికులముందు, పూర్తిగా తెరచుకుంటేకదా!' ఈ అసమంజస స్థితి లోనే, వారి సమయమoతా గడచిపోతుంది మరి! కానీ కళ్ళ యీ విధమైన స్థితికూడా, ఒక భాషవంటిదే కదా మరి!
'అభిజ్ఞానశాకుంతలం 'లో దుష్యంతుడు శకుంతల కనుల ద్వైధీభావాన్ని కళ్ళకు కట్టినట్టు చెబుతున్నాడు చూడండి.
అభిముఖే మయి సం హృతమీక్షితం,హసితమన్య నిమిత్త కృతోదయం,
వినయవారితవృత్తి రతత్ స్తయా న విద్ధతో మదనో న చ సంవృత :
'నేను ఆమె వదనంవైపు చూస్తున్నప్పుడు, ఆమె తన వదనాన్ని అటు తిప్పుకుంటుంది. యేదో కారణంతో నవ్వేస్తుంది కూడా! సిగ్గువల్లనే, ఆమె అటు తన ప్రేమను దాచుకోనూలేక, ఇటు ప్రకటించనూలేక సతమతమవుతున్నది.' మొత్తానికి, అటు సిగ్గు వల్లో, ఇటు శీల నిర్వహణవల్లో స్త్రీలు తమ ప్రణయ భ్హావాన్ని బయటపెట్టలేకపోవటమున్నా, అది కూడా వారికి అలంకారంగానే పరిణమిస్తూ, మరింత ఆకర్షణను పెంచుతుందేమో!
భవభూతి అనగానే, కరుణరసాన్ని పండించిన కవివతంసునిగానే గుర్తిస్తున్నారు కానీ, సంయోగ వియోగ వర్ణనలోనూ అతనిది అందెవేసిన చెయ్యేనని కొన్నీ వర్ణనల ద్వారా తెలుస్తున్నది. వారి మాలతీమాధవ నాటకంలో, సమ్యోగ వియోగ వర్ణనలు రసపరిపాక దశలో ఉన్నాయి.
మామూలుగా, కన్నులు అదరటం కొన్ని సూచనలు చేస్తాయని అందరూ నమ్ముతారు కదా! పైగా పురుషులకు కుడికన్నూ, స్త్రీలకు యెడమ కన్నూ అదిరితే చాలా మంచి శకునంగాకూడా భావించటం ఇప్పటికీ ఉన్నది. ఇలా నేత్రాలు అదరటం గురించిన నమ్మకాన్ని, భవభూతి మాలతీమాధవుల వల్ల 'స్ఫురతా వామకేనాపి' అంటూ, వామనేత్రం అదరటాన్ని వారిరువురి పరిణయానికి శుభసంకేతంగా ధృవీకరించాడు కూడా! ఇక , మాలతి సౌందర్యాన్ని పొగడుతూ మాధవుడన్న మాటలు..
స్తిమితవికసితానాముల్లసద్భూలతానాం,
మసృణముకులితానాం ప్రాంతవిస్తారభాజాం,
ప్రతినయననిపత కించిదాకుంచితానాం,
వివిధమహమభావం పాత్రమాలోకితానాం..
'ఆ సుందరి రెండు నేత్రాలూ, ఒక నిముషం నిశ్చలంగానూ, మరో నిముషం సుప్రసన్నంగానూ, ఇప్పుడు పైకెత్తిన కనుబొమలతోనూ, మరొకప్పుడు విశాలంగానూ, ఒకసారి కోమలభావంతో అర్ధనిమీలితాలై, మరో క్షణం-నా కళ్ళతో కలిసినప్పుడు సిగ్గుతో సంకుచితాలై- ఇలా భిన్న క్షణాల్లో భిన్న భావాలకు నేనామె కళ్ళకు ఆశ్రయమైనాను.'
ఇలా విద్యుత్ గతిలో కళ్ళలో భావాన్ని మార్చటమన్నది, కేవలం కళ్ళకేఉన్న శక్తి.సామర్థ్యం కూడా! మాధవుడు ఆ కళ్ళ ఆకర్షణకు చిక్కాడంటే ఆశ్చర్యమే లేదు మరి!
అలస వలిత ముగ్ధ స్నిగ్ధ నిష్యంద మందై,
రధిక వికస దంతర్విస్మయస్మేరతారై :
హృదయమశరణం మే పక్ష్మలాక్షాహ కటాక్షే
ఖలతమపవిద్ధం పీతమున్మీలితం చ..
'సిగ్గు వల్ల యేమీచేయలేకా, మళ్ళిచూడాలన్న కోరికతో వంకరగా, లక్ష్యాన్ని వదలి మరెక్కడికీ వెళ్ళలేనివీ, నెమ్మదిగా అతిశయ విస్తారంతో, మదిలోపల ఆశ్చర్యం వల్ల వేగంగా కదలాడుతున్న కనుపాపలతో, ఆ దీర్ఘమైన కనుబొమల సుందరి చూపులు, నా నిస్సహాయమైన మనోహరమైనహృదయాన్ని అపహరించాయి. దానిపైన క్రూరంగా దాడి చేశాయి. నా హృదయాన్ని తాగేశాయి. దాన్ని నిర్మూలించేశాయి.' కనుబొమలుకూడా కళ్ళకు సంబంధించిన అంగాలే! రెండుగా ఉన్నప్పటికీ ఒకే భావాన్ని వ్యక్తపరుస్తుంటాయవికూడా! కళ్ళకు తమ సంపూర్ణసహకారమందిస్తూ, ఒకింత కళ్ళభావాన్ని మరింత మెరుగుపరుస్తూకూడా వుంటాయవి.వీటికితోడు ముఖమూ, మెడా కూడా కళ్ళకి సహకరిస్తే యెలా ఉంటుందో ఇదిగో, భవభూతి మాటల్లో గమనించండి.
యాంత్యాముహుర్బలిత కంధరమాననం త
దావృత్తవృంత శతపత్ర నిభం వహంత్యా
దిగ్ధోమృతేన చ విషేణ చ పక్ష్మలాక్ష్యా
గాఢం నిఖాత యివ మే హృదయే కటాక్ష : ...
'మాటిమాటికీ తన మెడ తిప్పుతూ, గాలికి అటూ ఇటూ తిరిగే కమలంవలె, మనోహరమైన మోముగల ఆ సుందరి, తన చిక్కనైన కనుబొమలతోకూడిన కన్నుల ద్వారా, అమృతమూ విషమూ రెండింటిలో తడిపిన చూపులను, నా హృదయంపై సంధించింది.'
భవభూతి 'మాలతీమాధవం' లో మదయంతిక, మకరంద్ ల ప్రేమ ప్రకరణాన్నికూడా, యెంతో హృదయాభిరామంగా వర్ణించాడు.ఇరువురి కన్నుల భాష గురించి కామందకి (యోగిని) మాటల్లో:
ఈషత్తిర్యగ్వలనవిషమం కూపిణ కూణిత ప్రాంతమేత-
త్ప్రేమోదేభదస్తిమిత లలితం కించిదాకుంతితభ్రు'
అంతర్మోదానుభవమసృణం,స్రస్త నిష్కంప పక్ష్మ
వ్యక్తం శంసత్యచిరమనయో ర్దృష్టిభాకేకరాక్షం
'వీరిరువురి కళ్ళు, ఒకరినొకరు చూసుకునేటప్పుడు, కాస్త వక్రించాయి. ఒకే వైపునమాత్రమే పూర్తిగా వికసితంగా వున్నాయి. అనురాగప్రకటనం వల్ల నిశ్చలములూ, మనోహరములూకూడా అయ్యాయి. అంతరాంతరాలలో ఆనందానుభూతివల్ల అనురాగరంజితాలయ్యాయి. కనుపాపలు, నిశ్చలంగా ఉన్నాయి. ఇలా అప్పుడప్పుదూ వికసితంగా, మరొసారి సంకుచితనేత్రాలతో పరస్పర దర్శనంవల్ల, వీరిరువురి మధ్య మానసిక సంగమమైనట్టే తోస్తున్నది. ' ఇక్కడ భవభూతి కేవలం ప్రేమలో ఉన్నవారికెకాక, చూసేవారికి కూడా ఆ చూపుల అర్థం అవగతమౌతాయంటున్నాడు.
మరో సందర్భంలో మదయంతిక మాలతీమాధవుల ప్రణయం నేత్రాల ద్వార వ్యక్తీకరింపబడిన వైనమూ వివరంగా చెబుతుంది. 'కుసుమాకరోద్యానంలో వీరిరువురూ తొలిసారి కలిసినప్పుడు, నీలకమలాల్లా, వీరిరువురి కనులూ, వివిధ ప్రస్తారాలు చేస్తూ, మాటిమాటికీ మూతపడటమూ, మళ్ళీ అంతలోనే విహ్వలతతో తెరచుకోవటమూ కూడా, నేను చూడలేదా? కనుపాపలు కూడా వీరిరువురి హృదయగత ప్రణయభావనకు అనుకూలంగానే నర్తించాయి. కామదేవుని అన్ని శాస్త్రాల వుపదేశాలనూ నైపుణ్యంతో ప్రదర్శిస్తున్నాయా అనిపించింది సుమా!
ప్రబంధ సాహిత్యానికి నాడీమండలం వంటి అన్నమయ్య పదాలలోనూ, కన్నుల వర్ణన సమ్మోహనమే! 'చెలియ చూసిన చూపు-చీకటిలో వెన్నెల'అంటాడొకచోట! 'గాలాల వంటి చూపు' అంటాడు మరోచోట! (ఇంకానేలదాచేవు అన్న పదంలో) 'తొలసితో మొల్లలట్టే తురిమీ చూపులను' అంటాడు - ఇటువంటి వేడుక అన్న పదంలో!'చిత్తజుని యమ్ములును చెలియజూపులు' (బిగిసేవింకా) 'వాలుకజూపులు'( అల్లదె మేడమీద) అని స్త్రీల చూపులను వర్ణిస్తూ, 'కన్నులు చెదరి చెలి గ్రక్కున రెప్పలు వంచె, వెన్నెలో అది నీకు వేసగో' నీవే తేల్చుకోవాలి సుమా అని వెంకటేశుని హెచ్చరిస్తాడు కూడా! 'కన్నుల జూచినప్పుడే, కాకలెల్లా బెడబాసె' (ఇచ్చకమే మది) అంటూ, ఆ కన్నుల్లో చెప్పరానికారాలే చిందుతాయని - కాంతలగుణాలిటువంటివి సుమా అని జాగ్రత్తలు చెబుతాడు వెంకటేశునికి! (యీవల కాంతల) మగవాని నవ్వునూ వర్ణించాడాయన - 'వెన్నెలవంటిదింతే వెస మగవాని నవ్వు-యెన్నిచోట్ల గాసిన నేమాయెనే'..అంటాడు. (ఇద్దరూనేకములై) అసలు కన్నుల బాసల విషయంలో అన్నమయ్య ఆవిష్కరించని అందాలు లేవంటే అతిశయోక్తి కాదేమో!
ప్రబంధ సాహిత్యంలో, పెద్దనామాత్యునికి పెద్దపీటే వేసి గౌరవించాడు కృష్ణదేవరాయలు. మనుచరిత్రలోని పద్యాలన్నీ, రసగుళికలే! ప్రవరాఖ్యుని చూసిన వరూధిని కన్నులేమంటున్నాయో పెద్దన మాటల్లోనే పరికించండి.
'విలోకనప్రభావీచికలన్, తదీయపదవిన్ గలశాంబుధివెల్లి గొల్పుచున్ ' విలాసమనే శృంగార చేష్ట చేస్తున్నది వరూధిని. 'దయితావలోకనాదౌ విశేషాంగ క్రియాసు య: శృంగార చేష్ట సహితో విలాసస్సముదీరిత:' (మాలతీమాధవ వ్యాఖ్య)
యానస్తానాసనాదీనాం ముఖనేత్రాది కర్మణాం,
విశేషస్తు విలాసహ స్యాదిష్ట సందర్శనాదినా.
తనకిష్టమైనవారిని చూసినప్పుడు, నడకలో, వునికిలో, కూర్చోవటంలో, మాట్లాడటంలో, చూడటంలోనూ, కనపడే విశేషమే విలాసమనీ, ఒయ్యారమనీ సాహిత్య దర్పణమంటుంది. వరూధిని ప్రవరుని చూడటంలో యీ ఒయ్యారం కనబడిందట!
మునుమున్ పుట్టెదు కొంకు లౌల్యము నిడన్ మోదంబు విస్తీర్ణతన్,
జొనుపన్, గోర్కులు క్రేళ్ళు ద్రిప్ప మదిమెచ్చుల్ రెప్పలల్లార్ప న
త్యనుషంగ స్థితి రెచ్చపాటొసగ నొయ్యారంబునన్ జంద్రికల్,
దనుకన్ జూచె లతాంగి భూసురు బ్రఫుల్లన్నేత్ర పద్మంబులన్.
ఈ పద్యంలో ప్రవరాఖ్యుని చూసిన వరూధిని చూపులను వర్ణిస్తూ, పెద్దన అంటున్నాడు. కొత్తగా వచ్చిన ఆ పురుషుని చూసిన వెంటనే ఆమె చూపులు, సంకోచంవల్ల చలించాయట! అతగాని లోకోత్తర సౌందర్యాన్ని ఆస్వాదించటం వల్ల కలిగిన ఆనందం వల్ల ఆ చూపులు విస్తృతమయ్యాయి.మనసులో కోర్కెలు కొల్లలుగా సందడించటంవల్ల, కనురెప్పలు అల్లలాడసాగాయట! ప్రవరుడు క్రమంగా దగ్గరకు రావటంచూసి, మ్రాన్పడినట్టుగా నిలచిపోయాయట ఆమె చూపులు!
ఇలా వివిధ దశల్లో, వరూధిని చూపుల ద్వారా, అమె అనురాగం వ్యక్తీకరించబడటం వల్ల, ఇక్కడ చూపులు అనుభావములవుతున్నాయని నరస భూపాలీయ వ్యాఖ్య. (ప్రారూఢ కటాక్షాదిక మారయననుభావమయ్యె)
ప్రవరుని వేషంలో ఉన్న యక్షుని చూసిన వరూధిని కన్నులేమంటున్నాయో పెద్దన మాటల్లోనే పరికించండి.
ఆ కమలాక్షి ఇంపున దృగంచల మించుక మూసి హర్ష బా
ష్పాకుల కోణ శోణరుచులగ్రమునంజనజూచు చూపు తీ
రై కనుపట్టె దమ్మరసమంటుకొనన్ వెడవింటివాడు క్రో
ధైక ధురీణతం గరచి యేసిన సింగిడికోలయోయనన్.... (మను-3/90)
సాక్క్షాత్తూ మన్మధుడే క్రోధారుణమానసంతో ప్రయోగించిన సింగిణికోలయట- ఆ కమలాక్షి చూపు!
మనోరమాస్వరోచుల వివాహ వర్ణనలో, మనోరమ చూపులు, 'చటులత లజ్జ దల్లడిలె,జాలరిచేపలబాసి ధాత్రిపై, నటునిటు మిట్టి మిట్టిపడు నంబుచరంబులవోలె' స్వరోచికి కనబడ్డాయట!
రాజుచూడ్కి కపుడు రాజీవముఖి చూడ్కు
లెదురుకొనియె లజ్జ గొదికి కొదికి,
జడిసి జడిసి, జహ్ను సంభవాంభోవేణి
కెదురు లెక్కు మీల కొదమ లనగ..(5/83)
'కావ్యాలంకర చూడామణి'లోనూ, 'రసగంగాధరం' లోనూ, ఇలా కంటిరెప్పలనుంచీ చూడటమన్న అనుభావం చెప్పకపోయినా, నాయిక లజ్జవల్ల. నాయకుడెదురుగా వున్నా, తలవంచుకుని ఉండటం, ఐనా, కనురెప్పల చివర్ల నుండీ నాయకుని చూడటం మనోహరమే కదా!
'పాండురంగ మహాత్మ్యము'లో తెనాలి రామకృష్ణుడు తన వంతుగా, కాపు కోడలు చూపులను, 'కలగల్పు చూపులు', 'తేలెడు కన్నుదోయి', 'పారవశ్యమున్ బొరసిన నిట్టు చూపులు' అని వింగడించి మరీ చెప్పాడు.
'విక్రమార్క చరిత్రము' లో జక్కన మదనరేఖ సౌందర్యాన్ని వర్ణిస్తూ, 'వనజాక్షి చూపులు, వలరాజు తూపులు'..అంటాడు. విదర్భ రాజపుత్రి అందాన్ని నారదుడు విక్రమార్కునికి వర్ణించి తెలుపుతూ,
వెలది సోయగంబు వీక్షింప వినుతింప
వేయికన్నులమర విభునకిచ్చి,
రెండుజిహ్వలలండజాధీశున
కొసగబోలు పంకజోద్భవుండు..
అంటాడు. (4/16) ఆతరువాత,నరమోహినీ వృత్తాంతం లో
ఆయంగన క్రేగన్నుల
యోయారపు గలికిచూపుటురులంబడినన్,
గాయజునిచిత్తమైనను,
గాయజసంతాపవహ్నిగరుగక యున్నే? (5/171)
అంటాడు. ఆమె చూపులబారినపడితే, మన్మధుడికికూడా, మన్మధబాణముల వాడి తగలకపోదు అనటంలో, ఆ చూపుల శక్తి చెప్పకనే చెప్పినట్టయింది మరి. గుణవతీ వర్ణనంలో..
కలువలుగండుమీలు దొలుకారు మెరంగులు నీడురామికిం,
జెలువుగ నేపదార్థమెనసేయుదునో సతికన్నుదోయికిం?
దలచి పయోజసంభవుడు తామరలంబ్రతిసేయబోలు, నౌ
బొలుపుగ నెల్లవారు, దమ పుట్టిన ఇండ్లను, బెద్దసేయరే? (7/46)
కలువలు, గండుమీను చేపలు, తొలుకారు మెరపులు..ఇవేవీ ఆమె కన్నుదోయికి సాటి రాలేదని, పయోజసంభవుడు, చివరికి, ఆమె కన్నులకు ప్రతిగా తామరలను చేశాడత! కరణం-బ్రహ్మ పుట్టినదే తామరలొకదా!పుట్టిన ఇల్లు యెవరికైనా ప్రీతిపాత్రములేకదా అని ముక్తాయింపు. ఇలా కొందరు తెలుగు కవుల కలాల్లో కన్నుల కాంతులిలా ప్రతిఫలించాయి మరి!
పింగళిసూరన 'కళాపూర్ణోదయం'లో పువుబోండ్ల చూపులను విశ్లేషించిన తీరిది!
బెళుకులు చిమ్ముచున్ గలికి బిత్తరి చూపు సరత్నకుండలాం
చల కషణోజ్వలత్వము పసల్ నెరపన్ జళిపించుచున్, భుజం
గుల హృదయస్థలుల్ వొడిచి, కొంచక తోడన పోటుగండ్ల దూ
రె లలన యౌర! యొక్కొక్కతరిం బువుబోండ్లు కటారి కత్తియల్ (1/32)
ఇలా తరచి చూస్తూ వెళితే, తెలుగుకవుల కలాలు కళ్ళభాషను కావ్యీకరించిన తీరు మనలను కట్టిపడెస్తుంది-ఆయా కావ్యాలకు!
ఇదిలాఉండగా,ఇతర భాషాసాహిత్యాలలో కళ్ళకబుర్లేమిటంటే, మర్యాదాపురుషోత్తమునిగా రాముణ్ణి వర్ణించటంలో తనకు తనే సాటి అనిపించుకునే తులసీదాసు కూడా, యేదొవిధంగా కళ్ళ కదలికలకు అందమైన భాష్యాలు చెప్పాడు. 'రామచరిత్ మానస్' లో సీతాదేవి చూపులను తులసీదాస్ యేమని వర్ణించాడో చూడండి. స్వయంవరానికి ముందు, గౌరీదర్శనానికి వెళ్ళిన సీత అనుభవమిది.
జాని గౌరి అనుకూల్ సియ హియ హరషి న జాయ కహి,
మంజుల్ మంగల్ మూల్, వాం అంగ్ ఫరకన్ లగే
గౌరి దర్శనం తరువాత, సీతకు మనసులో ఉత్సాహం అంకురించింది. దానికి తగ్గట్టే యెడమ వైపు అంగాలన్నీ అదిరాయట-కంటితో సహా! ! కళ్ళు అదరటమూ (పదేపదే కొట్టుకోవటం) కొన్ని పరిణామాలను సూచిస్తుంది. ఆడవారికి యెడమ వైపూ, మగవారికి కుడి వైపు అంగాలు అదరటం శుభ సూచకాలుగా పరిగణించటం- భారతీయ సంస్జృతిలో ఒక భాగం. సీతాదేవి యెడమ కన్ను ఇలాగే అదిరి, రామునితో సమాగమాన్ని సూచించిందట!
అయోధ్యనుండీ, రామ లక్ష్మణులతో వనవాసానికి వెళ్తున్న సీత కు మార్గమధ్యంలో కొంత మంది గ్రామీణ స్త్రీలు కనబడ్డారు.
బహురి బదను బిధు బంధన్ ఢాంకీ
పియ తను చితయీ భౌహ్ కర్ బాంకీ
ఖంజన్ మంజు తిరీఛే నయనని
నిజ్ పతి కహెవు తిన్ హహి సియ సయనని
'వీరిద్దరిలో నీ భర్త యెవరు' అని వారడిగారు. అప్పుడు సీత, సిగ్గుతో తలవంచుకుని, కళ్ళ చివర్ల నుండీ రాముని వైపు చూసిందట! బహుశా, కళ్ళ భాషను ఇంతకంటే ముగ్ధ మనోహరంగా చిత్రించిన కావ్యం ఇంకొకటి లేదేమో!
శృంగారశిరోమణిగా ప్రసిద్ధుడైన బిహారీ, కళ్ళభాషను చదవటంలో నిష్ణాతుడు. అతని నాయికానయకులిద్దరూ బహు చతురులు. చుట్టూ, వేలమందివున్నా, కళ్ళతోనే తమ సంభాషణను అతిచాకచక్యంగా కొనసాగించగలరు కూడా!
కహత్, నటత్, రీఝత్,ఖిజత్, మిలత్,ఖిలత్, లజియాత్,
భరే భౌన్ మే కరత్ హై, నయనన్ హీ సౌ బాత్
చెప్పటం, నటించటం, అలగటం, కలుసుకోవటం, నవ్వటం, సిగ్గుపడటం, ఇలా అనేకవిధాలుగా వందలాదిమంది ముందే చూపులతోనే మాట్లాడే నేర్పు వారి సొంతమట!
చూపులను కళ్ళాలు లేని అశ్వాలంటాడు కూడా! సిగ్గు అన్న కళ్ళెంతోనూ వాటిని బంధించలేమట! కళ్ళెంతో వాటికి అదుపులోపెట్టుకోవాలని ప్రయత్నించేకొద్దీ, మరీ అదుపుతప్పిపోతాయి సుమా! అంటాడొకచోట! కమలాక్షి, విశాలాక్షి, మీనాక్షి..ఇలా అందమైన కళ్ళను యెన్నివిధాల పోల్చినా లాభమేమీ లేదట! ఆ కళ్ళకు చాతురీమంతమైన భాష తెలిస్తేనే నిజమైన అందమూ, ఆనందమూనూ! అని తేల్చేస్తాడు కూడా!
............
ఉర్దూ సాహిత్యంలో కళ్ళకు గొప్ప ప్రాధాన్యత ఉంది. గాలిబ్ మరీ ముఖ్యంగా కళ్ళభాషను విశ్లేషించాడు. 18వ శతాబ్దంలో యీ వొరవడి ప్రవేశించినా, 19వ శతాబ్దిలోనే ఆతశ్, శేఫ్తా, మోమిన్, గాలిబ్, జౌక్, దాగ్, హాలీ, అక్బర్, సర్ శార్, వంటి గజల్ రచయితలవల్ల, మరింతగా వేళ్ళూనుకుందనే చెప్పాలి.
ఇశారో' ఇశారో మే హుయే ఉన్ సే సవాల్ అక్ సర్,
నిగాహో నిగాహో మే ముహబ్బత్ కా జవాబ్ ఆయా..
నోటితో చెప్పలేని విషయాలు అనేకం కళ్ళతో అతి సునాయాసంగా చెప్పివేయటం నిజంగా ఆశ్చర్యమే కదా! ఒక్కోసారి కనురెప్పలు తాటించటం వల్ల కూడా యెన్నో విషయాలు చెప్పటమూ ఉంది.
ఇష్క్ కా హుస్నే తలబ్ ఇక్ మాని యే బేలఫ్ జ్ హై
టక్ టకీ బంధ్ జాయేగీ మత్లబ్ అదా హో జాయెగా..
............................
Friendz dears...This is the TEXT of my talk entitled NAYANA NAYA BHASHANAM broadcast on AIR Hyd (in 3 parts of 7 minits each) on 22nd, 29th and coming 5th jan. i will post the next part after completion of it's broadcast pl..........
.........
No comments:
Post a Comment