Saturday 9 January 2016



 యేమానందము భూమీతలమున.....

     ఇవ్వాళ ఆకాశవాణి హైదరాబాద్లో భక్తిరంజని విన్నా (పొద్దున 6.10 కి) తిరుప్పావై కోసం! ఆహా! వింటుంటే, మనసు మళ్ళీ, 25 యెళ్ళ వెనకటి జలతారు గతంలోకి...ఇప్పటికీ (గత 25యేళ్ళనుండీ) ప్రసారమౌతున్న యీ కార్యక్రమం డా. ఎల్లా వెంకటేశ్వర రావుగారి నిర్వహణలో తయారైంది (1990 ప్రాంతాలలో) గౌతమ్నగర్లో (మల్కాజీగిరి దగ్గర) సంతాన గొపాలాచార్యగారని గొప్ప వేద పండితుడుండేవారు. తమిళ వైష్ణవులైన వరు, తిరుప్పావై ప్రవచనాల్లో చాలా సువిఖ్యాతులు. వెదపఠనం కర్యక్రమాలకు వచ్చేవారప్పట్లో! ద్రవిడ ప్రబంధాలూ, పాశురాల వ్యాఖ్యానం పై వారికున్న పట్టు అనితర సాధ్యం. వారితో తిరుప్పావై వ్యాఖ్యానం, ఎం.ఎల్.వసంతకుమారిగారి అసమాన గాత్రంలో అప్పటికే లభ్యాలుగా ఉన్న, ఆండాల్ తిరుప్పావై పాశురాలూ, మధుర గాయనీ, సుమధుర మనస్వినీ శ్రీరంగం గోపాల రత్నం గారి గాత్రంలో సప్తపదీ. సప్తపది తరువాత, వేదాంత  దేశికులవారి గోదా స్తుతిని శ్రీయుత చిత్తరంజన్, డీ.శేషాచారి (హైదరాబాద్ బ్రదర్స్ లొ ఒకరు-ఆకాశవాణి నిలయ విద్వాంసులు)ఆల్టర్నేట్ గా పాడటం కూడా వుంది ఇందులో....అ తరువాత యేదైనా భక్తి రచన..ఇలా కార్యక్రమమంతా ప్లాన్ చేసుకున్నారు. సువిఖ్యాత వైణికులు, అప్పుడు నిలయ విద్వాంసుడూ, శ్రీ పప్పు చంద్రశేఖర్ మృదు మధుర వీణా నేపధ్యంలో గొపాలాచార్య గారి వ్యాఖ్యానం రికార్డింగ్ యెంతో ప్రణాళికా బద్ధంగా, క్లుప్త సుందరంగా జరిగింది. శ్రీరంగం గోపాల రత్నం గారి సప్తపది రికార్డింగులూ యెంతో నియమపాలనతో అయ్యాయి. భక్తి కీర్తనలూ కొన్ని తజాగా చేసినట్టు గుర్తు మరి..ఇంతాచేసి, ప్రాథనాశ్లోకాలో? అప్పుడు చేసిన ప్లానింగ్ లో, శ్రీమాన్ వేంకటనాధర్యహ...నీళాతుంగ స్తనగిరితటీ...అన్న ప్రార్థనా శ్లోకాలు, శ్రీమాన్ చిత్తరంజన్ గారూ, నేనూ, నా ఆత్మీయ స్నేహితురలు శ్రీమతి వినయమణిగారూ మేము ముగ్గురమూ పాడగా రికార్డ్ చేశారు.  ఇందులో శ్రీ మండా బలరామ శర్మగారీ వేణువూ, పప్పు చంద్రశేఖర్  గారి వీణా  ప్రత్యేకాకర్షణలు.
 యెంత బాగా వచ్చాయో అవి...కార్యక్రమం తరువాత మంగళాశాసనం, రికార్డ్ చెసేటప్పుడు నేను లేనేమో, వినయమణిగారూ, చిత్తరంజన్ గరితో రికార్డ్ చేసేశారు. ఆ శ్లోకమిది...
    శ్రీమతే రంగజమాతృ మునీంద్రాయ మహాత్మనే
      .శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం...

మొత్తానికి,  రెకార్డింగ్ ముగిసిన తరువత, చిత్తరంజంగారు ఆ కార్యక్రమానికి యెంతో భక్తి శ్రద్ధలతో తుది రూపం ఇచ్చేందుకు తీసుకున్న శ్రద్ధ మరువలెనిది. మొత్తం కార్యక్రమంలో అయ్యగారి అస్టక్షరి కృతులు కూడా రెండో మూడో వున్నాయి. నాకు ప్రాణ ప్రదమైన ఎమ్మెల్ వసంతకుమారి గారి మధుర గాత్రంలో, బేహాగ్ రాగంలో పాశురం, శ్రీరంగం గారి గొంతులో ఖరహరప్రియ రాగంలో సప్తపది, ఘంటసాలగారి భగవద్గీత శ్లోకాలు, ఈరోజు ప్రసారమైనంతసేపూ. .కదలకుండా కూర్చుని, ఆ జ్ఞాపకాల్లో తేలిపోయా...మాకంది వచ్చిన అదృష్టం, వృత్తీ ప్రవృత్తీ ఒకటే అవటం. అదెదో, కష్టంగా కాక, ఇష్టంగా ఆడుతూ పాడుతూ ఉద్యోగం చేయటం - ఇలాంటి తీయని జ్ఞపకాలు మీలాంటి ఆత్మీయ స్నేహ బృందంతో పంచుకోగలగటం, యేమానందము భూమీతలమున- కదూ?

...........................

No comments:

Post a Comment