కవిత నిశ్శబ్ద నిష్క్రమణం..
ఒంటరిగా
తెరచాప లేని పడవపై
ధైర్యంగా ప్రయాణం..
ప్రశంసకూ , విమర్శకూ
చిరునవ్వే కవిత సమాధానం..
సాహితీపానమే ఊపిరిగా,
వ్యవధానమేలేని అవధానమే తన శక్తిగా,
సత్యశొధనే లక్ష్యంగా,,
చిరునవ్వే చీకటిరాత్రుల దీపంగా
ప్రాచ్య కవితాగానాల్లో సేద తీరుతూ
పాశ్చాత్య కావ్య రీతుల విశ్లేషణలో తలమునకలౌతూ
చేరబోయే తీరాల గురించి కలలు కంటూ
అలలపై సాగిపోతున్న ఆ 'కవిత
'ఒంటరి పూల బుట్ట'గా ఓ సారీ,
ఒళ్ళు విరుచుకుని ముందుకు సాగి పోయింది..
'అగ్ని హంస' గా మారి ఆకాశంలో చక్కర్లు కొట్టింది మరోసారి..
'ఇది కవి సమయం' అంటూ రాగాలు తీసింది ఇంకోసారి..
'పద్యమండపం' గా తనను తాను మలచుకుని,
సప్తగిరిశునికి తన విన్నపాలను వినిపించుకుంది..
అవధాన విద్యను తాను ఆపోశనం పట్టిన తీరును
అక్షరాలరూపంలో పేర్చింది..
ముఖ పుస్తకం సాక్షిగా
లక్ష రేకుల కుసుమంగా విరబూయాలనుకుని
శ్రీకారమూ చుట్టింది..
అంతలో యే దిష్టి చూపులు పడ్డాయోగానీ
యే స్వరం అపస్వరంగా పలికిందోగానీ,
తాను చేరాలనుకున్న తీరాలను చేరకుండానే
ఆ కవిత కాలరేఖలను దాటి
క్షితిజరేఖను అధిగమించి
అనంతలోక యాత్రకై నిష్క్రమించింది..
దాని మనసుకేమి గాయమయిందో
అది తీర్చిన ఒంటరి పూలబుట్ట లొని పూలనడిగితే చెబుతాయా?
అగ్ని హంస చెబుతుందా?
తిరుమల వెంకన్నేమైనా జవాబివ్వగలడా?
రాతి దేవుడు సమాధానమిస్తాడో లేదోగానీ
ఆ కవిత నిశ్శబ్ద నిష్క్రమణం తో,
కవితాలోకం ఇప్పుడు
నిజంగా నిస్తేజ గగనం.. (రాళ్ళబండి వారి ఒక కవిత ఆధారంగా)
రాళ్ళబండి వారితో గత ఉగాది నాటి నా విలువైన జ్ఞాపకం..;
No comments:
Post a Comment