Saturday, 9 January 2016

       ధనుర్మాసం వచ్చిందంటే,
వైష్ణవాలయ పరిసరాలు, తెల్లవారు ఝామున తిరుప్పావై పాశురాల గానాలతో కర్ణపేయంగానూ, వేడి వేడి పొంగల్ నైవేద్యాలతో రుచుకరంగానూ, దివ్య ప్రబంధ ప్రవచనాల నైపుణ్యాలతో పవిత్రంగానూ వెలుగులీనుతూ వుంటాయి.

నాకు 17, 18 యేళ్ళప్పుడు, మా అయ్యగారినడిగాను- 'నాకు తిరుప్పావై చెప్ప'మని! 'మీ అమ్మ చెబుతుంది పో' అన్నారయ్య. అమ్మ శ్రీమతి కనకమ్మగారికి కూడా, తమిళమూ, మళయాళమూ, కన్నడమూ, ఒకటి రెండు ప్రాకృత భాషలూ, సంస్కృతమూ, హిందీ, ఆంగ్లమూ బాగా వచ్చేవి. ఆమె తాతగారు విద్వత్ కవి మణి బిరుదాలంకృతులూ, శ్రీమాన్ ధన్నవాడ కిడాంబి రాఘవాచార్యులవారు. ఒకప్పుడు ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా) బహద్దూరు గారైన సవై రాజా రామ భూపాల రవుగారి అమరచింతాత్మకూరు సంస్థనంలో వారు ఆస్థాన పండితులు.(1930 ప్రాంతాలలో కావచ్చు) గజారోహణ గౌరవాన్నందుకున్న పండితోత్తములు.







. వారి ఒడిలో కూర్చుని, ఆమె పెళ్ళినాటికే సంస్కృత ఆంధ్ర పంచకావ్య పఠనం పూర్తి చేసింది మరి..(మా అయ్యగారితో పెళ్ళినాటికి ఆమె వయస్సు 14యేళ్ళు). 
మా అమ్మ యెంతో చక్కగా తిరుప్పావై అర్థ తాత్పర్యాలతొ సహా నాకు చెప్పింది. సమయ సందర్భాలను బట్టి, ఆయా పాశురాల అర్థాన్ని, మరింతగా విశ్లేషించే సంస్కృత శ్లోకాలూ, తెలుగు పద్యాలూ, కన్నడ దాసర పదాలూ, కబీర్ సూరదాసు పదాలూ- అబ్బో యెన్నెన్నో! అమ్మను విడిగ చూస్తే, యీమెలో ఇంత పాండిత్యం దాగి ఉందని యేమాత్రం అనుమనమూ రాదు. అతి సామాన్య గృహిణిగా చలా సాదా సీదాగా తొమ్మిది గజాల చీరలో, భుజన కొంగు కప్పుకుని వుండెదామె! యెప్పుదూ వేలుముడితప్ప చక్కగా జడవేసుకుని, పూలు పెట్టుకున్న అమ్మను చూసిన గుర్తులే లేవు. అప్పటి అమ్మలంతా అంతెనేమొ కదా! (అంతే కాదు-మందాసనం ముందు వంగి కూర్చుని, ముక్కుపైకి జారుతున్న కళ్ళద్దలతో శ్రద్ధగా, వాల్మీకి శ్రీమద్రామాయణ పారాయనం చేస్తున్న అమ్మ చిత్రం న మనసులొ ముద్ర వేసుకుని కూర్చుందిప్పుదు కూడా) దురదృష్టవశాత్తూ, నేను వ్రసుకున్న అప్పటి నోట్స్ కనిపించకుండా పోయింది. కానీ, కొన్ని కొన్ని పాశురాలను మా అమ్మ విశ్లేషించిన తీరు అద్భుతం తెలుసా!  

ఓంగి ఉలహళంద' అన్న మూడవ పాశురంలో, నెలకు మూడు వానలు కురిసే గొల్లపల్లెను యెంత బాగా వర్ణించిందో ఆండాళ్! ఆమె భూపుత్రి. ప్రకృతితో ఆమెకున్న అనుబంధమంతా ఆమె పాశురాలలోనూ ప్రతిఫలిస్తుంది.
      ఆమెకున్న పురాణ పరిజ్ఞానం అసాధారణం. గంభీరమైన జటిలమైన వేదాంత రహస్యాలను కూడా, తేలికైన మాటల్లొ, అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు విశద పరచటం ఆమె నైపుణ్యం.
     యేడవ పాశురంలో, పెరుగును చిలుకుతున్న గోప స్త్రీల మెడలోని, తాళిబొట్లూ, కాసుల పేరులూ ఒకదానికొకటి రాసుకొనగా పుట్టే మధుర ధ్వనికి సైతం అందంగా అక్షర రూపం ఇవ్వటం గోద పరిశీలనాసక్తికి తార్కాణం.

      15వ పాశురంలో, సంభాషణరూపంలో రచన చేయటం అప్పటి రచనలలో కానరాని, గోదాదేవి చేపట్టిన వైవిధ్యం.
       యేదైనా పని కోసం వెళ్ళేటప్పుడు, చిన్న నుంచీ, పెద్ద వరకూ, అందరినీ గౌరవించితేకానీ పని జరగదన్న లోక రీతిని గోద సైతం తన పాశురాలలో ప్రతిబింబింపజేసింది. ద్వారపాలకుడిని ముందుగా బ్రతిమాలి, కృష్ణుని గృహంలోకి ప్రవేశం సంపాదిస్తుంది.

అటుతరువాత, కృష్ణుని తల్లిదంద్రులు నంద యశోదలనుంచి కూడా మర్యాద పూర్వకంగా కృష్ణుని లేపేందుకు అనుమతిని కోరుతుంది గోద.

ఆండాళ్ మధుర భక్తి, నీళా పరిష్వంగ సుఖానందంలో అలసి సొలసిన కృష్ణుని నిదుర లేపటంలో యెన్నెన్నో వన్నె చిన్నెలు చూపుతుంది.


22వ పాశురంలో, ఆండాళ్ వర్ణనా నైపుణి, కొత్త పుంతలు తొక్కటం, నిజంగా ఆస్వాదనీయం. కృష్ణుని కళ్ళను, చిరుగజ్జేలతో పోల్చటం ప్రపంచ సాహిత్య చరిత్రలోనే అనుపమేయం. కింకిణి అంటే చిరుగజ్జెలు. ఆ చిరుగజ్జెలెలా ఉంటాయి? అతి చిన్నగా మాత్రమే తెరచుకుని వున్న కింకిణులలోని, చిన్న వెండి గుళ్ళు, అటూ ఇటూ అప్పుడప్పుడు కదులుతుంటాయి. స్వామి కళ్ళు సూర్య చంద్రులకు నెలవులు. ఆ సూర్య చంద్రుల సంపూర్ణ దృష్టి మాపై పడితే, మేము తట్టుకోలేము కదా? అమాయకులమైన మాపై, చిరు గజ్జెలనుంచి, అప్పుడప్పుడూ తొంగిచూసే వెండి గుండ్లలాంటి అర్ధ నిమీలిత దృష్టిని మాత్రమే ప్రసరించవలె నీవు!
     23వ పాశురంలో, స్వామిని శీరియ సింగం అని సంబోధిస్తుంది - గోద. 
        వర్షాకాలంలో, గుహలో పడుకుని వున్న శ్రేష్టమైన సిం హం, మేఘ గర్జనలకు, నిద్రాభంగం కాగా, నిదుర మేల్కొని, అసహనంతో, బయట కలయజూసి, హేతువు కానక, కోపంగా జూలు విదిలిస్తుంది. అటుతరువాత, నిక్కి, నీల్గి, ఒళ్ళంతా సాగదీస్తుంది. ఒకసారి భయంకరంగా గర్జించి, అప్పుడిక తన గుహలోంచీ, బయటికి వస్తుంది.
     ఈ సృష్టి సహజమైన జంతు లక్షణాన్ని, శీరియ సింగమైన కృష్ణునికి ఆపాదిస్తూ, నీళాదేవి ఘన కుచ గిరుల మధ్య శయనించి వున్న ఆ నంద కిశోరుని, ఒడలు విరచుకుని, శరిరాన్ని నిగడదీసి, బయలుదేరి బైటికి రమ్మంటుందామె!

అలా 23వ పాశురంలో, శీరియ సింగంగా స్వామిని పోల్చి, నిదుర లేపినందుకు కోపగించకుండేందుకు, 24వ పాశురంలో, ఆయనను శాంతింప జెసెందుకు, శ్రీవారి పదములకు మంగళాశాసనం చేస్తుంది తెలివిగా గోద!

'మహానుభావా! కరుణార్ద్ర హృదయా! గొవిందా! దామోదరా! ఇన్ని రోజులూ, పూలూ, కాతుకా, కర్ణాభరణములూ వంటి అలంకరణలన్నీ త్యజించి, నీ ధ్యానంలోనే, మునిగి వున్న మమ్ములను కరుణతో దగ్గరికి రానివ్వు. నీ కల్యాణగుణలను పాడేందుకు మాకు పరై అన్న మంగళ వాయిద్యన్ని నీవే దయచెయవలె సుమా! అంతే కాదు. సుమంగళీ సౌభాగ్యకరములైన గాజులూ, రెట్ట కడియములూ, చెవి కమ్మలూ, కాలి అందెలూ, ఇంకా ధరించేందుకు చక్కటి వస్త్రాలూ ఇవ్వవలె నువ్వే!
    మంగళ స్నామాచరించి, నీవిచ్చిన అభరణములు ధరించి, నిన్ను మనసారా భజించి, నేతి సరస్సులో తేలాడే విధంగా మేము చేసిన క్షిరాన్నమును, ఆ నేయి మోచేతులవెంట కారుతుండగా, నీతోకలిసి, మేము భుజించి ఆనందించవలె స్వామీ!
      ఓ కృష్ణా! మేము గొవులను మేపుకునే గొల్ల జాతివారము. ప్రపంచ వ్యవహర జ్ఞానమేమాత్రమూ లేని మాయకులం. మాగొల్ల ఇంత నివు జన్మించటమే, మాభగ్య విశేషం. మాలో ఒకడివై తిరుగుతుందిన నీ లీలామానుష రూపాన్ని యే మాత్రమూ తెలుసుకొలెక పొయాం. మమ్ము మన్నించు. నిన్ను చనువుగా యెంతో అమర్యాదగా పిలిచే వుంటాం. మమ్ము క్షమించు. శంఖమూ, చక్రమూ, వంటి వాయిద్యలనడిగేందుకె నీ వద్దకు వచ్చామనుకునెవు..అది కెవలం, నిన్ను చేరెందుకో మిష మత్రమే! నిజానికి మాకు కావలసింది, నేటికే కాదు. జన్మ జన్మలకూ, నీతొ చెడని కైంకర్య సౌభాగ్యం మాత్రమే సుమా!'
     ఇలా అమాయక గొల్ల వనితలాగా, తన మనసును తేటతెల్లం చేసిన ఆండాళ్ లో , యీ తిరుప్పావై పూర్తయేనాటికి, నిజంగానే,గొల్లవనితల వంటి శరీర గంధం వచ్చేసిందట! రామకృష్ణ పరమహంస కు, వానరం వలె తొక పుటుకొచ్చినట్టు! 'యద్భావం తద్భవతి' కదా మరి!

'ఏకస్వాదు న భుంజీత' - స్వాదు భూయిష్టమైన పదార్థాన్ని, ఒంటరిగా యెప్పుడూ భుజించకూడదంటారు పెద్దలు. అందుకే గోదాదేవి లో కూడా, తన మధుర భక్తిని, పదుగురికీ పంచి, వారిని కూడా, స్వామికి ఆత్మీయులను చేయటమనే సమిష్టి భావన కనిపిస్తుంది.
   ' సాకారుడైన నాపై మనసు నిల్పి, శ్రద్ధతో నన్నారాధించువారే నాకు కడుంగడు ప్రియులు' అని స్వామే స్వయంగా అన్నాడు కాబట్టే, గజేంద్రుడూ, శబరీ, జటాయువూ వంటివారు, స్వామి సాక్షాత్కరాన్ని పొంది తరించారు మరి! గోపికలూ రాసలీలలో స్వామితో నిరంతరమూ సామీప్య సుఖాన్ని అందుకున్న అదృష్టవంతులు. అందుకే, యీ విధంగా, మనసారా, అ దివ్య మంగళ విగ్రహుని నోరరా కీర్తించి, అమాయకులైన గొల్ల వనితలవలెనే, స్వామి సంపూర్ణానురాగాన్ని జీవులందరూ పొందవలెనని ఆండాళ్ తిరుప్పావై అంతరార్థం.
....................
   యీ విధంగా మా అమ్మ ఆ నాడు చెప్పిన తిరుప్పావై పాఠం- యీనాటికీ నా నిత్య పరాయణ గ్రంధం, నన్ను నిరంతరమూ తరింపజేస్తున్న మాతృగంధం. నమశ్శతాని తల్లీ!

                                         .........................

  









     

No comments:

Post a Comment