Friday, 8 January 2016


                                       గాజుల గలగలలు 
         గుడిపాటవ్వ ఇంటి వీధి అరుగులు నా స్మృతుల్లో ఇంతగా తిష్ట వేసుకుని వున్నాయంటే, నాకూ అత్యంత ఆశ్చర్యంగానే  ఉంది సుమండీ! నిద్రలో ఠక్కున గుర్తొచ్చి, అరె..మమ్మల్నెలా  మరిచీపోయావ్ అని ఇటీవల నన్ను నిలదీసిన యీ కబుర్లు మీకోసం..
       పెద్దక్కయ్యలు కరుణాదేవి, తరులత (ఆమెకు పెళ్ళైన తరువత అత్తగారింట్లొ లలిత అని పేరు మార్చుకున్నారు. ఐన మాకామె ఇప్పటికీ తరులతక్కయ్యే) ఇద్దరి పెళ్ళిల్లూ రెందు మూడు నెలల తేడాతో అయ్యాయని చెప్పానుగా ఇదివరకే(1960లో) నాకప్పుడు యేడేళ్ళు. వాళ్ళిద్దరూ, తరచుగా పుట్టింటికి వచ్చినప్పుడు, ఇల్లంతా పండుగ వాతావరణం. వాళ్ళను పుట్టింట్లో, దింపేందుకు,తిరిగి తీసుకుపోయేందుకు అప్పుడప్పుడు అల్లుళ్ళూ వచేవాళ్ళు. మా అయ్యగారికి యెప్పుడూ యే తేడా కూడా పట్టేదేకాదు. అమ్మదే హడావిడి అంతా! ఆడ పిల్లలకు, చీరెసారెలూ, అల్లుళ్ళకు మర్యాదలూ..ఇంట్లో మ అయ్యగారి కాఫీలూ  (అయ్య యెప్పుడూ  ఒకటిన్నర గ్లాస్ తాగేవారు. రుచి చక్కగా వుండవలె! పొడీ వాటి నాణ్యత గమనించే పనంతా అమ్మదే)  వుపహారాలూ, బీడీలూ, ఆయన బట్టలు సరిగా వున్నాయా లేదా- అన్నిటితోపాటూ, అల్లుళ్ళకూ, కూతుర్లకూ పెట్టుపోతల బాధ్యతా  అమ్మదే! డబ్బు కొరత వుండనే వుంది. అమ్మొ! యెలా నెట్టుకు వచ్చేదో పాపం కదా అనిపిస్తుంది. ఈ హడావుడి ఇలా కొనసాగుటుంటే, మధ్యలో ఒక నాడు, గాజులోయమ్మా అని గాజుల మలారాలన్నీ  పెద్ద మూటగా సర్దుకుని, నెత్తిన పెట్టుకుని  గాజుల లక్షమ్మ వచ్చేసేది. ఆమె  వచ్చిందంటే, ఇక ఇంట్లో సందడే సందది..పెళ్ళైన అక్కయ్యలతో పాటూ, మా మూడో అక్కయ్య తులజాదేవీ, నేనూ కూడా పోటీ పడేవాళ్ళం. రంగు రంగుల గాజులు, రకరకాలా డిజైన్లతో  ఉన్నవి అట్ట గొట్టాలకు అమర్చినవి, లక్షుమ్మ జాగ్రత్తగా ఆ మూటలోంచీ తీసిపెట్టెది ఆలస్యం, అంతా ఆమె చుట్టూ మూగే వాళ్ళం. నెను అందరికంటే చిన్నదాన్ని కదా! నాకు మరీ ఆత్రం. నా చిట్టి చిట్టి చేతులకు సరిపడే గాజులు తక్కువే వుండేవి. అక్కయ్యలతైతే బోలెడు రకాలు..నేనెప్పుడు పెరిగి పెద్దవుతానా, వాళ్ళు వేసుకునే లాంటి గాజులు నేనూ యెప్పుడు వేసుకుంటానా, అని ఒకటే తపన! అక్కయ్యలైతే, అది కాదనీ, ఇది కాదనీ, లక్షమ్మను నానా తిప్పలూ పెట్టి, చేతుల  నిండుగానూ, ఇంకా  దాచుకుని మళ్ళీ వేసుకోవడానికి కూడా గాజులు సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. మాకా చాన్స్ లేదు. 
 అప్పుడు బుడ్డమూతి పెట్టుకుని యేడ్చినా, తరువాత సర్దుకుపోక తప్పేది కాదు మరి! ఇంట్లో ఇలాంటి గాజుల పండగలెన్ని  చూశానో! ఇప్పుడు, షాపుల్లొనూ, అప్పుడప్పుడూ వీధి లో బండిపై  గాజులు  పెట్టుకుని వచ్చేవాళ్ళ అరుపులూ,గాజుల మలారాలూ రంగులీనే కాంతులూ, అపటికంటే యెన్నో కొత్త డిజైన్ల గాజులూ,ఆర్థిక సౌకర్యమూ  యెన్నెన్నో వున్నా - ఆనాటి ఆకర్షణా,దండిగా గాజులు వేసుకోవాలన్న తపనా ,   అప్పటి సంతోషమూ లేవు. . మనసునిండా ఆనాటి గాజుల  చప్పుళ్ళే ఇప్పటికీ ముచ్చట గొలుపుతుంటాయి-యీ నాటి అనుకూలాలను ప్రశ్నిస్తూ, వెక్కిరిస్తూ కూడా! (యీ గాజుల మలారాల మురిపాలు మీకు నచ్చాయో  లేదో- తెలిసేదెలాగబ్బా? 

                                                      9-1-16  

No comments:

Post a Comment