ఈ రోజు పొద్దున్నే అనుకోకుండా టీ టీ డీ శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ లో '108 వైష్ణవ దివ్య దేశాలు' కార్యక్రమం చూశాను. దానిలోని 'శీర్షక గీతం' నేను రాసిందే! సోదరి, స్నేహలతామురళి సంగీత దర్శకత్వంలో నిత్య సంతోషినీ, నిహాల్ పాడారు. దాదాపు నలుగేళ్ళ క్రితం చేసినది.పేర్లొచ్చే భాగాన్ని వాళ్ళు వదిలేసి, ప్రసారం చేస్తున్నారు. అది వేరే సంగతి.నా తృప్తి నాది కదా!
దానిలో ఒక వైష్ణవ దివ్యదేశం కథలో, లక్ష్మీదేవీ, భూదేవీ, నీళాదేవి- ముగ్గురికీ,తమలో యెవరు గొప్పంటే, యెవరు గొప్ప అని వాదన వచ్చింది., లక్ష్మీదేవికి కోపం వచ్చి,అలిగి, భూలోకంలో, తీవ్రంగా అష్టాక్షరీ జపం చేస్తూకూర్చుందటా! ఇక, మునులూ, ఋషులూ- అంతా అమ్మవారి దగ్గరికి పరుగులు పెట్టారు. చివరాఖరికి, ఆ నారాయణుడు సైతం, ఆమె వద్దకు చేరుకుని, ఆమె కోపం పోగొట్టి, నెనూ నీతో ఇక్కడే కొలువైతానని మాటిచ్చి, ఆమెతోపాటూ ఆ క్షేత్రంలో వెలిశాడు. ఇంతకూ, లక్ష్మీదేవంటే మాటలా మజాకానా? అనిపిస్తుంది కదూ!
శ్రీలక్ష్మి నీలీలలూ..చిత్రమైతోచునమ్మా..అని పాపం మన తెలుగింటి స్త్రీలు బుద్ధిగా పాడుకుంటారు కద! చిత్ర చిత్రమైన ఆ లీలలు- నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తాయి కదా! అందరికీ అనుభవంలోకొచ్చే సంగతులే ఇవన్నీ!
....................
టీ టీ డీ చానల్ తరువాత తమిళ్ చానళ్ళలో వస్తున్న మార్గళి ఉత్సవాలను చూస్తున్నా అప్పుడప్పుడూ! నిజంగా, సంగీతాన్ని 'శిశుర్వేత్తి పశుర్వేత్తి 'అని యే మహానుభావుడూ లేదా మహానుభావురాలు అన్నారో కానీ, అక్షర సత్యం. అసలీ సంగీతానుభవం, సంగీతాసాస్వాదన అన్న సుగుణం నుంచి మన ఆంధ్రులు క్షణ క్షణానికీ జెట్ స్పీడ్లో దూరమైపోతున్నారెందుకో! తమిళుల సంగీతారాధన ముందు మనం యెక్కడున్నామో అనిపిస్తుంది.
అక్కడి తమిళులంతా, యెంతటి ఆత్రుతతో, యీ మార్గళి సంగీతోత్సవాలలో పాల్గొంటారో మా ఆకాశవాణి నిలయ విద్వాంసుల మాటల్లో వినాలి. యీ రోజుల్లో, ఆఫీసులలోనూ కాస్తంత వెసులుబాటుంటుందట! ఉద్యోగులకుకూడా సంగీత కచ్చేరీలు వెళ్ళెందుకు కాగితాలకందని అనుమతులూ ఉంటాయట! ఇక ఇళ్ళల్లొ ఉండేవాళ్ళైతే, పొద్దున్న, యేదో కాస్త తినీ, మళ్ళీ యేదో కాస్త కట్టుకునీ, సంగీత సభలకు 'చలో జాయేంగే' అంటూ బయలుదేరతారట! బయటే దొరికే పొంగల్, ఇడ్లీ వడా, సాంబార్ వంటివాటితో తృప్తి పడతారట! అన్నిటికంటే సంగీతామృతం యెటూ ఉందిగదా అని వాళ్ళ ధైర్యం! తాంబూలం పెట్టె సదా సర్వదా చిన్న చేతి సంచీలో తప్పనీసరి!
ప్రతీ సభలోనూ పాల్గొంటున్న విద్వాంసుల వివరాలు ముందే సేకరించి పెట్టుకుంటారు కాబట్టి, ఆయా సమయాలనుబట్టి, యే సమయంలో యే సభకు వెళ్ళాలి అని ముందే టైం టేబుల్ రెడీ చేసుకుంటారు వాళ్ళు. ఆయా వేళల్లో, ఆయా సభలకు వెళ్ళి, ఆయా విద్వంసుల సంగీత పాటవాలను విశ్లేషించుకుంటారన్నమాట! సాయంత్ర వేళల కచ్చేరీలు పేరొందిన విద్వాంసులకే దక్కేది. ఆ సమయంలో కచ్చేరీ చేసేందుకు, వర్ధమాన సంగీత విద్వాంసులు తహతహలాడిపోతుంటారట! అక్కడి ఆడియన్స్ తలలూగాయంటే ఇక ప్రపంచమంతా త్వరలోనే తమ కచ్చేరీలకు తల వూస్తుందనే వాళ్ళ లెఖ్ఖ!మా ఆకాశవాణి కళాకారులూ యీ సంగీత ఋతువులో చెన్నైలో యేదైనా పేరొందిన వేదికపై, మాంచి ప్రైం టైం లో వాలిపోవాలని (కచ్చేరీ చేయాలని) తెగ తాపత్రయ పడిపోవటం... దక్కితే సాక్షత్తూ అక్షయ కలశం చేతికందినట్టే వాళ్ళ ఆనందం..లెకపోతే, మళ్ళీ వచ్చే సీజన్ లొనైనా ప్రయత్నించాలనుకుని అసంతృప్తితో సరిపెట్టుకోవటం!
...............
ఈ సంగతిక్కడ కట్ చేస్తే, యీ రోజు, విజయ్ టీ వీ లో ఇద్దరు సంగీత గాయకులు ముత్తుస్వామి దీక్షితర్ గారి 'హిరణ్మయీం లక్ష్మీం' గానం చెస్తున్నారు.ఆ రాగ స్వభావాన్నీ, అందులో చేయగల ప్రయోగాలనూ, వయోలిన్ పై మాత్రమే పలికించగల నైపుణ్యాన్ని గొంతులో పలికించటం- అబ్బా! నిజంగా అద్భుతహ! (మన 'శివశంకరీ పాట' లో ఘంటసాల మాష్టారు చివర స్వరాలను, త్వరిత గతిలో పాడుతుంటే, ఒంట్లో గగుర్పాటు కలుగుతుంది కదా! సరిగ్గా అలాంటిదే నాకూ యీ గాయకులద్వారా యీ కృతి వింటుంటే కలిగింది.)
అహా! లలిత రాగం.. ముత్తుస్వామి దీక్షితార్ వ్రాసిన ' హిరణ్మయీం లక్ష్మీం ' అన్న లలిత రాగం లోని కీర్తన నాకు మహా ఇష్టం. లలిత రాగం లోని జీవ స్వరాలైన స, రి, గ, మ, స్వరాలు, పదే పదే శృతి పక్వంగా ఉచ్చరిస్తుంటే కన్నీళ్ళు ఆగనే ఆగవు సుమా! ,కడుపులోని కల్మషమంతా తన్నుకుని కన్నీళ్ళ ద్వారా బై టికి వచ్చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది! యీ రాగం వింటుంటే, యేదో మానసిక శోధన! చిన్నప్పటినుంచీ, నేను చేసిన తప్పిదాలూ, మా అమ్మా, అయ్యా మనసును నొప్పించిన నాటి దృశ్యాలూ, నా మూర్ఖత్వమూ, నాడు నాలోలేని ఇంగితమూ, నేడు కనుమరుగైపోయిన వాళ్ళిద్దరినీ క్షమించమని అడుగలేని అపరాధ భావమూ..ఇవన్నీ సుళ్ళు తిరుగుతూ..ఇదేకాబోలు జీవుని వేదన అనిపించేలా చేస్తుందీ రాగం నన్ను!
ఈ మహాత్యం ముత్తుస్వామి వుపాసనదా, రాగానిదా లేక సాహిత్యానిదా.. వెరసి మూడింటిదీ అని నా అభిప్రాయం.
.........
చివరాఖరున..కొసమెరుపు..టీ టీ డీ, విజయ్,లక్ష్మీదేవీ, లలిత రాగం...అబ్బబ్బ.. ఇన్నిటినీ ఒక సూత్రంతో యెలా బంధించానో చూశారా! దీన్నే అంటారా stream of consciousness అనీ?
No comments:
Post a Comment