అప్పట్లో, మా అమ్మా, అయ్యా మాటల్లో, తరచుగా వినిపించే పదం 'ఇంగిత జ్ఞానం'. 'వాడికామాత్రం ఇంగిత జ్ఞానముండొద్దూ?' 'మనిషనేవాడికి ఇంగిత జ్ఞానముండవలె గదా!' అన్న వాక్యాల ప్రయోగాలలో, యీ ఇంగిత జ్ఞానం అన్నది, విచక్షణ అన్న అర్థంలో వాళ్ళిద్దరూ వాడేవాళ్ళు. మానవ జన్మ కొన్ని లక్షల జన్మల తరువాత వచ్చే అపురూపమైన అవకాశమనీ, అదృష్టమనీ, జంతువులకు లేని యీ ఇంగిత జ్ఞానం మనిషికే వుంటుందనీ, దాన్ని అలవరచుకోవటం అవసరమనీ, అయ్య యెన్నో మార్లు తన రామాయణ ప్రవచనల్లో చెబుతూవుండేవారు. మహా మహా వాళ్ళకే, యీ జ్ఞనాన్ని అలవరచుకోవటమూ, జీవితాంతమూ దీన్ని ఆచరించటమూ - అసాధ్యమని మన పురాణలూ, నీతి కథలూ ఘోషిస్తూవున్నాయి.. అసలిప్పటి రోజుల్లో ఐతే, యీ పదానికి విలువే లేదనిపిస్తుంది. నా అభిప్రాయంలో, మీరూ, నేనూ- వెరసి మనమంతా దీన్నుంచీ మినహాయింపేమాత్రమూ కాదు. (మీరు పూర్తిగా నా అభిప్రాయంతో యీకీభవించకున్నా ఫరవాలేదు. .మీకా హక్కుంది. నా అభిప్రాయమూ నాదే కదా మరి!) కాకపోతే, జీవితంలో యీ ఇంగిత జ్ఞానాన్ని అమలు పరచే పర్సెంటేజ్ లో యెక్కువ-తక్కువలు వారివారి దృష్టికోణం మీద ఆధారపడి వుంటాయనవచ్చు.
ఇంతకూ, ఇంగితం మరియు ఇంగితజ్ఞానం అన్న తెలుగు పదం ఇప్పట్లో వాడుకలో వుందా లేదా మరి చెప్పాలి మీరు...
శబ్దార్థ కోశంలో ఇంగితం అన్న పదానికిచ్చిన వివరణ యీ క్రిందిది...
ఇంగితము
ఆకూతము, ఆకూతి, ఆశయము, ఇంగము, ఇంగితము, ఉద్దేశము, కా(న్పు)(నుపు), ఛందము, డెందము, తలపు, తాత్పర్యము, భావము, మతము, మనసు, సంకల్పము.
అభిప్రాయము.
"ఇంగితము తెలియక ఇతరులతో మాటలాడకు."
ముఖమందలి వికారము, లోపలి భావమును తెలుపు చేష్ట.
(మా అమ్మా, అయ్యా యీ పదాన్ని, వివేకం, విచక్షణాజ్ఞానం అనే అర్థంలోనే వాడేవారు మరి..)
No comments:
Post a Comment