నా జ్ఞాపకల సొరుగులో అరుగులు...
అరుగులు అనగానే నలభై యాభై సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరికీ,ఎన్నో కొన్ని జ్ఞాపకల పరిమళాలు మనస్సును తేనెతుట్టెలా చుట్టేస్తాయి. ఇది వాస్తవమేనని మిత్రులు కొంతమందైనా ఒప్పుకుంటారు కదూ !
నాకూ యీ అరుగులగురించిన బృందం పోష్టులు చూడగానే కొన్ని జ్ఞాపకాలు ముసురుకొని, అవి మీఅందరితో పంచుకునేలా సందడి చేయటం మొదలు పెట్టాయి. ఆ సొదల ముచ్చట్లలో కొన్ని మీకోసం !
నేను పుట్టినది మోచంపేట (కడప) లో ! దాదాపు 9 లెదా 10 యేళ్ళవరకూ అక్కడే మేము నివాసమున్నట్టు జ్ఞాపకం. అ వీధిలో నరసరామయ్యగారని పేద్ధ లాయర్ గారి, దాదాపు 7, లెదా 8 అంకణాల ఇల్లు. (అంకణం అన్నది రాయలసీమలో ఇంటి కొలతలకు వాడే ఒక పరిమాణం. దాదాపు పది అడుగులకొక అడ్డ దూలం వేస్తారు. పొడవూ, వెడల్పూ కూడా అంతే ఉండేవని నాకు గుర్తు మరి. ఇప్పటి కొలతల్లో దాదాపు, 400 లేదా 500 గజాల స్థలం వాళ్ళది ) ఆ పేద్ధా ఇంటి ముందు, వీధి వివరి మట్టిమిద్దె బాడుగ ఇల్లు మాది. వాళ్ళ ఇల్లు దక్షిణాభిముఖంగా వీధి చివరన ఉండగా, మేము బాడుగకుండే ఇల్లు వాళ్ళింటికి యెదురుగా ఉత్తర ముఖంగా ఉండేది.) ఆ ఇంట్లోనే నేను పుట్టానట! నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు, మాఅమ్మ నిండుగర్భిణిగ సాయిబాబా పూజ చేసుకుని, వంటింట్లో, గుడ్డిదీపం వెలుతురులో పాత్రలు కడుగుతుంటే, మందాసనం (దేవతా బృందాన్నుంచే చెక్క మందిరం) కింద బాగా చప్పుడయ్యిందట! మాఅమ్మ లాంతరునటుకేసి తిప్పగానే పేద్ధా పాము బుసకొడుతూ ముందుకు వచ్చిందట! మాఅమ్మ భయపడిపోయి, మా అయ్యను (ఆయనకెప్పుడూ మ్ముందు గదిలో పుస్తకాలతోనే సావాసం మరి ! ) ' భయం లేదు. నాగ సాయిలే ఆయనే పొతాడు. దండంపెట్టి నీ పని నువ్వు చేసుకో 'అని అక్కడినుంచే సలహా ! అమ్మ పాపం, అలాగే కన్నీళ్ళతో మొక్కుకుని, పాల గిన్నె ముందు పెడితే తాగి వెళ్ళిపోయిందట ఆ పాము ! మా అక్కయ్య లే చెప్పేవాళ్ళీ కథను ! ఆ పాము మూడు నాలుగు రోజులాఇంటిముందున్న అరుగుల మూలల్లో పాకుతూ వెళ్ళిపోవటం గమనించారట మా అక్కయ్యా వాళ్ళు మరి ! అటుతరువాత అది యెటుపోయిందో కానీ , మా అమ్మ ఆ క్షణాన మొక్కిన మొక్కు కారణంగా నా పేరు ముందు 'నాగ' అటుతరువాత, పేరు కొత్తగా ఉండాలని 'పద్మిని' ని తగిలించటంవల్ల నేను 'నాగపద్మిని' అయ్యానని మా తోబుట్టువుల వువాచ !
ఇంతకూ, ఆ ఇంటి అరుగులమీద చిన్నప్పటి స్నేహితులతో ఆడుకున్న ఆటలైతే గుర్తులేవుకానీ ఆ పెద్ద అరుగులపైనే యెండాకాలం మేము వరుసగా పడుకోవటాలు గుర్తున్నాయి.
ఆ ఇంటి అరుగులు నాకెందుకింకా గుర్తంతా, దానికో కథ ఉంది మరి !
అయ్యగారు డిల్లీ సాహిత్య అకాడెమీలో కొన్ని రోజులు (1953-54 ప్రాతాలలో) పనిచేశారని మీకంతా తెలుసు కదా ! అప్పట్లో, డిల్లీ కీ కడపకూ మాటల్లో వివరించలేనంత దూరం కిందే లెక్క ! అయ్యకు వుత్తరాలు రాసే అలవాటూ తక్కువే ! మా అమ్మ నలుగురు ఆడపిల్లల సంసారాన్ని ఒంటరిగా యెలా యీదేదొ ఆ పాపం మరి ! తన బాధలను షిర్దీ బాబాకు కన్నీళ్ళతో విన్నవించుకునేదేమో ! అక్కడ , ఒక షిర్దీ బాబా భక్తురాలి ఇంట్ళొ బాడుగకు వుండేవారట అయ్య ! ఆమె కలలో కనపడి, 'యీ ఆచార్యుల భార్య చాలా కష్టపడుతున్నదక్కడ ! త్వరగా వెళ్ళిపొమ్మ'ని చెప్పమన్నాడట ! అప్పటికే అయ్య జాండీస్ తో బాధ పడుతున్నారు. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి బయలుదేరారట అయ్య ! ఆ సంగతి అప్పటికింకా అమ్మకు తెలియదు. ఆమె తెల్లవారుఝామున ఇంటిముందు కసువూడ్చి, నీళ్ళు చల్లి ముగ్గు పెడుతూంది! మా రెండో అక్కయ్య ఆమెకు తోడుగా ఉందక్కడే ! యీ లోగా, ఆ చిరు చిరు చీకట్లో, ఒక సాధువు, కాషాయ వస్త్రాలలో ఇంటిముందు నిలబడ్డాడట ! 'యేమో, దొంగాడేమో' అనుమానం
మా అక్కయ్య చిన్న బుర్రకు ! అమ్మ కన్నీళ్ళతోనే ముగ్గు పెడుతున్నది. ఆ సాధువు, అమ్మను పిలిచాడట ! అమ్మ తలెత్తి చూసింది. 'యేడవకమ్మా ! మీ ఆయన తొందరలోనే వస్తున్నాడులే' అని చేయెత్తి ఆశీర్వదించి వెళ్ళీపోయాడట ! అమ్మ నిర్ఘాంతపోయింది. మా రెండో అక్కయ్యా అంతే ! (తన పేరు తరులత- ఆంగ్ల కవయిత్రి తోరుదత్త్ పేరు కలిసొచ్చేలా ఆ పేరు పెట్టారట అయ్య తనకు. అసలు మా తోబుట్టువుల పేర్లకూ చక్కటి నేపధ్యాలున్నాయి తెలుసా, ఆ ముచ్చట్లు మరో సారి..)
అమ్మ అలాగే ముగ్గు బుట్ట చేత్లో పట్టుకుని నిలుచునే ఉంది. ఆ సాధువు మలుపు తిరిగి వెళ్ళే పోయాడు. అక్కయ్య తేరుకుని, ఆ సాధువు యెటుపోయాడో చూద్దామని గబగబా పరిగెత్తుకుని వెళ్ళిందట కానీ ఆ సాధువు అంతలోనే యెటుపోయాడో మరి !
రెండోరోజు అయ్య పెట్టే బేడా తో దిగారింటిలోకి !
ఆ అరుగులదగ్గరే యీ సంఘటన జరిగింది, పైగా మా ఇంట్లో పదే పదే చెప్పుకున్న సంగతి కావటంవల్ల, నేనూ ఆ అరుగుల చివరిదాకా వెళ్ళి ఆ సాధువు మళ్ళీ కనిపిస్తాడేమోనని చాలా సార్లు చూసేదాన్నని బాగా గుర్తు!
(నాకు అపురూపంగా గుర్తున్న మరిన్ని అరుగుల ముచ్చట్లు మళ్ళీ మరొక్కసారి) ...
No comments:
Post a Comment