Monday, 25 January 2016





అయ్యకు పద్మశ్రీ :




 1990 ఏప్రిల్ లో కడపకు వెళ్ళినప్పటికి  జ్ఞానపీఠ్ అవార్డ్ ప్రకటించేశారు. అప్పటినుంచీ, అయ్యకు ఒకటే నిర్వేదం! విశ్వనాధ తరువాత,  తనకే అవార్డ్ వస్తుందని, వివిధ సన్నిహిత వర్గాల  ద్వారా తెలియటం వల్లే అయ్య, కాస్త ఆశ పెట్టుకున్నారనే చెప్పాలి. యేదో సందర్భంలో, స్వయంగా అయ్యే యీ మాట అన్నారు కూడా! ఐనా ఫలితం తారుమారైంది. నేను కడపకు వెళ్ళీంది  '90, ఏప్రిల్ లో ననుకుంటా! అప్పుడే, నేను మూదు నాలుగు డజన్ల తెల్ల కాగితాలతో, పెద్ద బైండ్ పుస్తకం తయారు చేశాను. అయ్య గురించి అప్పటిదాకా వచ్చిన వార్తాపత్రికల కటింగ్స్  అన్నీ తేదీలవారీగా  అమర్చాను. మా కడప ఇంటి పడసాలలో (ఇంటి పెద్ద, ముఖ్యమైన  హాల్ ను మేము  పడసాల అనేవాళ్ళం) కూర్చుని, వాటినన్నింటినీ, తేదీలవరీగా అతికిస్తూ, వాటి కింద శీర్షికలు పెడుతుంటే, దీర్ఘంగా చూస్తున్నారు. 'యేమే నాగా! యెమిచేస్తున్నావే?'  అని అడిగారు. నా జవాబు విని, నిర్వేదంగా ఓ నవ్వు నవ్వి, ' నీ పిచ్చిగాని ఎవరికి వుపయోగపడతాయవి? అవ్సరం లెదుకూడా! ' అనేశారు. అయ్య మనసులో వేదన నాకు అర్థమయ్యింది. కానీ నా పని మానలేదు. రెండు మూడు రోజులు కూర్చుని దీక్షగా, అప్పటివర్కూ వున్న వార్తల కటింగ్స్ అన్నీ క్రమ బద్ధంగా పెట్టే లేచాను. నేనాపని చేస్తుంటే అయ్యకు ఓ క్షణాన ముచ్చట వేసిందేమోకూడా, మా వదినతో అన్నారట-  'దానికి మనసులో ఒకటి పడితే ఇంక వదిలిపెట్టదు.'  అని!  (అయ్య నా పట్టుదలను పదిమందిముందూ   మెచ్చుకున్న మరో సందర్భం - నేను హిందీ ఎం.యే. యెనిమిది పేపర్లూ ప్రీవియస్, ఫైనల్ రెండిటివీ కలిపి, రెండు నెల్ల తేడాతో వ్రాసి పాసైనప్పుడు '75 లో..అయ్య మాటల్లో మెచ్చుకోలు - నా చెవుల్లో అమృత  ధారలు)   నేనప్పుడు చేసిన బైండింగ్ యీరోజెందుకో బయట పడింది. అందులోని కొన్ని పేజీలు యీ పోస్ట్ లో పొందుపరుస్తున్నాను.





























..అప్పుడే,ఒక రోజు  రామకృష్ణ సమాజంలో యెదో మీటీంగ్ జరిగింది. అయ్య అధ్యక్షులనుకుంటా! తాను  మాట్లాడుతూ, తన సాహితీయాత్ర   గురించి యెన్నొ సంగతులు చెబుతూ, అన్నారు. 'ఇప్పటి వాళ్ళకేమి తెలుస్తుంది పరిశ్రమ అంటే! మహామహుల పాఠాలు వినటమే కాదు. వాళ్ళ పాఠాలు విని అర్థం చేసుకునే  అర్హత సంపాదించుకోవడమూ - అప్పటి రోజుల్లో ఒక అగ్ని పరీక్ష వంటీదే! వాళ్ళ పాఠాలను అర్థం చేసుకోవడమంటే మాటలు కావప్పట్లో! ఇప్పుడు చెప్పే గురువుకే తెలియదు - ఆ పాఠాల లోతెంతో! అన్నీ పై పై చదువులూ, పై పై రాతలూ! నేనేనాడూ ఒక్క క్షణం వృధాగా గడిపిన పాపాన  పోలేదు. యెప్పుడూ యెదో కొత్త విషయం నేర్చుకోవాలనే ఆరాటమే, తపనే, నన్నిన్ని దినాలూ ముందుకు నడిపింది. నా మాటలు ఇప్పటివాళ్ళకు వ్యర్థ భాషణలుగా  అనిపిస్తాయి. కానీ, నేను ఉన్నపుడు నా విలువ, నా మాటల విలువా తెలియదు. నేను వెళ్ళిపోయిన తరువాతే, నా విలువ తెలుస్తంది.'  అని యెంతో వుద్వేగంతో మాట్లాడారు. నేనైతే,  ఆ మీటింగ్ లో వెక్కిళ్ళు పెడుతూ యేడ్చేశాను కూడా!  ఆ క్షణాలు నాకింకా గుర్తున్నయి. తరువాత కొద్ది రోజులకే, ఆగస్ట్  లో అయ్య మా పెద్దక్కయ్య కొడుకు  కృష్ణప్రసాద్ పెళ్ళికోసమని  హైద్రాబాద్ రావడమూ, హఠాత్తుగా అనరోగ్యంతో గాంధి ఆసుపత్రిలో కొన్న్ని రోజులుండి, మళ్ళీ కడప! అ తునుంచీ, స్వర్లోక గమనం!  మరిచిపోయే క్షణాలా అవి? నిరంతరం మనసును దహించివేస్తున్న  అగ్ని పర్వతాలు.... 
     మరిచేపోయా! 25-1-1972..యిదే రోజు అయ్యకు పద్మశ్రీ వచ్చిందని టెలిగ్రాం అందుకున్నా నేను ఆ రాత్రి 12.30 ప్రాంతంలో!!!!!! నాకు అంతులేని ఆనందం ! రెండు మూడు అంగల్లో మిద్దెమీదికి పోయి, అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న అయ్యను లేపి ఇందిరాగాంధీ టెలిగ్రాం చూపించి, యీ సంతోష వార్త చెప్పి, శుభాకాంక్షలు చెబితే, నన్ను కోప్పడ్డారు - నిద్ర చెడగొట్టానని! పొద్దున చెబితే కొంపలేమి మునిగేవని విసుక్కుంటూ!.....
                                                                   25-1-16



No comments:

Post a Comment