Thursday 14 January 2016

                                                    సంక్రాంతంటేనే .........


     
సంక్రాంతంటేనే ముగ్గులు ముగ్గులు ముగ్గులు...వంచిన నడుం యెత్తకుండా, చుక్కల ముగ్గులు, పువ్వుల ముగ్గులూ, డెజైన్ల ముగ్గులూ..అబ్బో ..యెన్ని ముగ్గులో...చిన్నప్పటి జ్ఞాపకాల్లో ముగ్గులదే ఒక ఆనంద పర్వం. ఇంట్లొ ముగ్గులు, బయటా ముగ్గులు, దాల్బందరం (ఇది రాయలసీమ పదం - అదే ద్వారబంధమండీ) మీద పైంటింగ్ లో ముగ్గులు, రెండు మూడేళ్ళు చెదరకుండా వుండేందుకు పైంటింగ్ చేసి, రంగులు కూడా నింపటం - మరువలేని పుట్టింటి సంతోష తరుణాలివన్నీ నాకు! 


అయ్యకు పద్మశ్రీ 1972లోనూ, కొద్ది రొజులకే డాక్టరేట్ కూడా వచ్చేసిన తరువాత, అమ్మ అయ్య కోసం మురిపెంగా, (యీ విజయాలకు శాశ్వత రూపమిస్తూ, ఒక 1'/3' సైజ్ లో రేకు తో నేం ప్లేట్ చేయించింది. (అంతవరకూ అయ్య పేరుతో నేం ప్లేట్ లేదు మరి) సరస్వతీపుత్ర, పద్మశ్రీ డా. పుట్టపర్తి నారాయణచార్యులు కడప అన్న అక్షరాలతో! అక్షరాలు మాత్రమే పొందిగ్గా ఉన్నాయి తప్ప మరే అలంకరణలూ లేవా ప్లేట్ మీద! నాకది నచ్చలేదు. అయ్య పేరు అట్లా యే అలంకరణలూ లెకుండా వుండటమా! ఆయ్!!!! దాన్ని పూలతో డిజైన్లతో అలంకరిస్తానన్నాను.ఆ రోజుల్లో నామాటాంటే మాటే పుట్టింట్లో! అన్నదే తడవు, మా అన్నయ్య అరవిందును బజార్ కు పంపి, తెలుపూ, పసుపూ, నీలం, ఆకుపచ్చా పైంట్లూ, బంగారు రంగు అద్దటానికి అదేదో పొడీ, బ్రషులూ - ఇవన్నీ తెప్పించింది అమ్మ!


(My mother Smt. Puttaparthi Kanakammagaru
  with my brother Sri Puttaparthi Aravind in 1980s)

ఇహ చూస్కోండి, నా విజృంభణ! వీర లెవెల్లో, పగలూ రాత్రీ అన్న తేడాలెకుండా, పైంటింగ్తో డిజైనులూ, లతలూ, పూలూ అబ్బో.. చక్కటి రంగుల కాంబినెషన్లో అందాలను ముద్దొచ్చేలా దాల్బందరం మీద ఆవిష్కరిస్తుంటే, అమ్మా, అయ్యా ఎంత ముచ్చటగా చూసేవారో! (అ తరువాత యెన్ని సంతోష తరుణాలొచ్చినా, ఆనాటి ఆనందం మకుటాయమానం) కడపలో ముఖద్వారం పైన ఆ నేం ప్లేట్, అ అలంకరణలూ ఇప్పటికి అలాగే ఉన్నట్టే గుర్తు మరి..నా పెళ్ళైన తరువాత, అత్తింటా యీ పరవశం అలా అలా కొనసాగి కొనసాగి...సాగి సాగి.. బాధ్యతలు పెరిగిన తరుణాన, ,పెద్ద పెద్ద ముగ్గులు ఒకెసారి పైంటింగ్ వేసి రంగులేసి, సంతోషపడటానికే పరిమితమైపొయింది. ఇక ఇప్పుడు సొంత ఇంటి పెరడులో మినీ శిల్పారామం కూడా!





ఇప్పటి వయసూ, ఓపికనుబట్టి, ముగ్గులూ, రంగుల సంబరం కాస్త మసకబారినా ఇప్పటి జీవితానికిదే ఆనందం మరి నాకైతే! గేహాన్ని వర్ణ సంభరితం చేయటమనే అభిరుచి,దెహంలొని హృదయగేహాన్ని భక్తి రంగవల్లికలతో అందగింపజేసుకోవటంగా మారింది మరి! మనసు నచ్చిన, మెచ్చిన, పరవశించిన ముచ్చట్లను సమభావ సమన్వితులైన స్నేహ బృందంతో పంచుకుంటూ పొందుతున్న ఇప్పటి ఆనందమూ అనుభవైకవేద్యమే మరి! (పుట్టింటి దాల్బందరం ముచ్చట మీకు నచ్చేవుండాలి మరి)


.                      ............


No comments:

Post a Comment