Saturday, 23 January 2016


   
                     'ముందు తెలిసెనా......'
ఆత్మీయ మిత్ర బృందానికి  శుభోదయం...
        తిరుప్పావై, మార్గళి ఉత్సవాల అలవాటింకా పోలేదు నాకు...అందుకే, యీ రోజు పొద్దున టీ టీ డీ వెంకటేశ్వర భక్తి చానల్ లో వైష్ణవ దివ్యదేశాలు కాసేపు  చూసి, అటు తమిళ టీ వీ లకేసి  - నా  చేతుల్లో  రిమోట్ పరుగులెత్తింది. ఒక చోట యేదో పుణ్యక్షేత్ర కార్యక్రమం ...ఓ కే...పక్కనే  విజయ్ టీ వీ...ట్యూన్ చేయగానే  కళ్ళముందు ఓ వేదికపై నలుగురైదుగురు కూర్చుని పండరి నాథా విట్ఠల విట్ఠల...పాండురంగా..పండురంగా..అని కళ్ళు మూసుకుని తాదాత్మయంతొ పాడుతున్నారు. ప్రధాన  గాయకుని కంఠంలో పలికిన భావాలను తక్కిన సహ గాయకులూ,  ఎంతోబాగా, అనుసరిస్తుంటే, దానికి తగ్గట్టు, రెండు ఢోలక్లూ (యిలాంటి భజనల్లో, యెక్కువగా ఢొలక్లే వాడుతుంటారు..కృష్ణ చైతన్య సంప్రదాయ చిత్రలలోనూ ఇటువంతి వాయిద్యమే వుంటుంది..ఉత్తర భారత దేశంలో దీన్ని పఖావజ్ అంటారు..) చక్కగా తాళం పై వాళ్ళను  అనుసరిస్తూ! ఓ మోస్తరు వేగంతో, హయిగా సాగుతున్న ఆ భక్తి ధార, నెమ్మదిగా  వేగం పుంజుకుంటుంటే..ఆడవాళ్ళు కొందరు, ఆ పరవశంలో, లేచి  చప్పట్లు తడుతూ,  తాళానికి  అనుగుణంగా, నృత్యం  చేయటం  మొదలెట్టారు. అది గమనించిన, ఆ వేదిక పైనున్న ప్రధాన గాయకునికి కూడా ఆనందం కలిగిందేమో,  తనూ వేదిక పైనే లేచి నులుచుని, అక్కడ చేరిన వందలాది మందిలొనూ మరింత వుత్సాహాన్ని నింపుతూ, అడుగులు కదుపుతూ, పాడటం మొదలెట్టాడు. అది చూసిన, కొందరు మగవాళ్ళూ, లేచి  అడుగుల్లో  అడుగులు కలపటం మొదలెట్టారు..చూస్తూ చూస్తుండగనే, అక్కడి సమూహంలొని చాలమంది, ఆడా, మగా, చిన్న చిన్న పిల్లలూ, పిల్లలను యెత్తుకున్న తల్లులూ, ముసలివాళ్ళూ....అందరూ...తర తమ భేదాలూ సంకోచాలూ  అన్ని వదిలేసి  భక్తి పరవశతతో చేతులెత్తి చప్పట్లు తదుతూ ఆనందంతో ఊగిపోతుంటే...మనసునిండా...1970ల నాటి జ్ఞాపకాలు...
    .      కడప మోక్షంపేట విశ్వేశ్వరాలయంలో  అయ్య రామాయణం  మూడు నాలుగు సంవత్సరాలు పురాణ కాలక్షేపం చేసినప్పుడు, అయ్య, అనాటి కాలక్షేపం తరువాత, హార్మోనియం  చేతుల్లోకి తీసుకుని, భజన మొదలు పెట్టేవారు. రామకృష్ణ గోవిందా..లాంటి యెత్తుగడతో పాట మొదలై, అలా తీగె  సాగినట్టు, అయ్య అప్పటికప్పుడు ఆశువుగా అల్లి కొనసాగించే ఆ భావావేశ  పూరిత కీర్తనాగానంలో, గుడంతా, ఒక భక్తి సంద్రంవలె  మారిపోయేది ..అయ్య భజనల్లో, రామ, కృష్ణ, నృసింహదేవతాస్తుతితోపాటూ, యెక్కువగా, మీరా, తుకా, సూర్ దాసూ, తులసీ, గోరా కుంభార్ వంటి భక్త కవుల స్మరణ వినిపించేది.  ...నాకప్పుడు 16,17యేళ్ళుంటాయేమో! భక్తి అంటే యేమో  పూర్తిగా అనుభవంలోకి రాని సంగతైనా, అయ్య కనీసం నలభై ఐదు నిముషాలపాటు అలా ఆపకుండా..అప్పటికప్పుడు  భజననెట్లా కొనసాగిస్తారో అని తెగ ఆశ్చర్యమయ్యేది..(తరువాత తెలిసింది-అయ్య తన చిన్నప్పుడు, ఆ తరువాత పెళ్ళై, ప్రొద్దుటూరికి  వచ్చిన కొత్తల్లోకూడా  తనే రచించిన హరికథలు కూడా చెప్పేవారని)  చుట్టూ వున్న కొందరు భక్తుల కళ్ళల్లొ, ఆనందాశృవులు కూడా! 

 ఆనాటి  జ్ఞాపకాల హోరులో కొట్టుకుని పోతున్న నాకానాడు అయ్య వాక్ప్రవాహంలో వినిపించే మహనీయుల పేర్లూ.ప్రస్తావనలూ కూడా గుర్తొచ్చాయి. వ్యాసుడూ, వాల్మికీ,  లీలాశుక, కాళిదాస, ఆదిశంకర,రామానుజ, మధ్వాచార్య్, బుద్ధ, మహావీర, వేదాంత దేశికది  తత్వవేత్తలతోపాటూ, జ్ఞానదేవ్, తుకా, మీరా, తులసీదాసు, సూరదసూ, గొరా కుంభారూ, జ్ఞానదేవ్, నాం దెవ్, పురందరులూ, కనకదాసూ, మన అన్నమయ్యా, త్యాగరాజూ. శ్యామశాస్త్రీ,  రామదాసూ, వీరబ్రహ్మం వంటి ప్రాచీన  తత్వ తత్వ వేత్తలూ,  పదకర్తలూ, రచయితలేకాదు.  అరవిందులూ, రమణ మహర్షీ, జిడ్డు కృష్ణమూర్తీ వంటి  తాను చూచిన, తనపై ప్రభావం చూపిన అప్పటి ఆధ్యాత్మిక వేత్తల మరకతమణులవంటి సందేశాలు కూడా యెన్నింటినో, మా పుస్తకాల్లో, రన్నింగ్ నోట్స్ వలె భద్రపరచుకునేవాళ్ళం-నేనూ నా స్నేహితురాలు అన్నావజ్ఝల ప్రభావతీ!  నా జీవితంలో అయ్యపట్ల అంతులేని ఆరాధనకు  బీజం పదిన ఆ అపురూప క్షణాలే, తరువాత తరువాత, నా జీవితమౌతాయని నాడు నాకు తెలియదు. 'ముందు తెలిసెనా ప్రభూ, యీ ముంగిలి ఇటులుంచేనా' అని కృష్ణశాస్త్రి  అన్నారు కదా! తెలిసిన ఆ ఆర్తిని అయ్య పాదాలపై    కన్నిటివలె కురిపించి, తెలిసో, తెలియకో చెసిన తప్పులను మన్నించమని వేడుకుందామంటే..యేముంది? ఆ జ్ఞాపకాల  కాంతులతో వెలుగుతున్న శూన్య జీవన మార్గం తప్ప? 


No comments:

Post a Comment