చీరెల తళతళలు, గోరింట మిలమిలలు.....
ఆ.....కడప, మోక్షంపేట గుడిపాటవ్వ బాడుగ ఇంటి అరుగుల ముచ్చటలకు, సంక్రాంతి హడావిడి వల్ల కుంచెం బ్రేక్ వచ్చింది! ఆండాళ్ తిరుప్పావై పఠనంతో మా అమ్మ వాడుతుండిన కొన్ని తమిళ పదాలు, నా మనసును మోహరించాయి యీ మధ్య! తళిహిల్లు (వంటిల్లు-తళిహ అంటే తమిళ్ లో వంట అని తెలుసుగదా! తళిహ చేసే చోటు తళిహిల్లు అనటం) పెరుమాళ్ళకు తిరువళక్కు (పెరుమాళ్ళు అంటే భగవంతుడు, తిరువిళక్కు అంటే దీపాలు) మోర్ కొళంబు (మోర్ అంటే మజ్జిగ, కొళంబు అంటే సాంబార్ లేదా పులుసు) తొహెళ్ (తొక్కు) చార్చిమధు (మన చారేనండీ) సాదం (అన్నం) కణ్ మధు (పాయసం అనుకుంటా) ఇలా మోచంపేట అవ్వా వాళ్ళింట్లొ ఉన్నప్పుడూ, ఆ తరువత, జీ . ఆర్. రావు వీధిలోకి ఇల్లు మారినప్పుడు కొద్ది రోజులవరకూ, అమ్మ యీ పదాలను తరచూ వాడుతూనే ఉండేది. ఆ తరువాత యెందుకాగిపోయాయో గుర్తు లేదు మరి.
ఇంతకూ, గుడిపాటవ్వ ఇంటి అరుగులపై..చక్కటి జరీ అంచు, మెరిసిపొయే రంగుల కాంబినేషన్లలో కళ్ళు జిగేలుమనిపించే పుల్లంపేట చీరెలూ, అప్పుడప్పుడూ వెంకటగిరి చీరెలు కూడా, మా ముఖ్యమైన బంధువులొచ్చినప్పుడు నా కళ్ళు జిగేల్మనిపించేవి తెలుసా! అవునండీ, నిజ్జంగా నిజం! మ అమ్మకు ముగ్గురు చెళ్ళెల్లు. అలమెలమ్మా, శాంతమ్మా, విమలమ్మా అని. వాళ్ళంతా హైదరాబాద్ లోనే ఉండేవరు (ఇప్పుడూ ఉన్నారనుకోండి). అప్పట్లో, (అంటే 1960 ప్రాంతలలో) హైదరాబాద్ నుంచీ, కడపకు యెవరైనా చుట్టాలు రావటమంటే, యేదో విదేశాలనుంచీ వచ్చినట్టే! మా అక్కయ్యలకు పెళ్ళిల్లైన తరువాత వాళ్ళొచ్చినప్పుడు కూడా ! ఇక మా అమ్మ పాపం, వాళ్ళకు చీరెలు పెట్టేందుకు (ఇన్ స్టాల్మెంట్ల మీద ఆ అప్పు తీర్చుకునెందుకు యెన్ని నెలలు పట్టేదో మరి) మూటల వాళ్ళను పిలిచేది. అప్పుడిక వాళ్ళు విప్పి చూపించే ఆ చీరెల అందాలు యేమని చెప్పేది? హంసలు, లతలు, రకరకల డెజైన్లతో మూరెడునుంచీ బారెడు, బెత్తెడు వరకూ బార్దర్లూ, చిరె కొంగులూ, కొద్దిగ పెద్దరికం వుట్టిపడుతూ....అబ్బో!కొత్త నెత చీరెల గమ్మత్తైన వసన (యీ మాట వ్రాస్తుంటే, అన్నమయ్య పాట, 'వాడల వాడల వెంట వాడెవో వాడెవో-నీడనుండి చీరెలమ్మే నేత బేహారి' గుర్తొస్తున్నది) భలే ఉండేది! అలా మూటలవాడు చూపించే చీరల్లో, కొన్ని మా పిన్నమ్మలూ, మా అక్కయ్యలూ యెంపిక చెసుకునే వాళ్ళు. ఇదంతా చూస్తుంటే, నేనెప్పుడు పద్దవుతానా, నెనీ చీరెలు యెప్పుడు కడతానా అని ఒకటే ఆత్రం! ఆ తరువాత , నేను పెద్దై, చీరెలు కట్టెనాటికి, కొత్త రకం చీరెలు వచ్చేశాయనుకోండి! కానీ, ఆ నాటి జ్ఞాపకం-ఇప్పటికీ అపురూపమే! (అన్నట్లు, నేనీ మధ్య కడపకు వెళ్ళినప్పుడు, అ పుల్లంపేట చీరొకటి కొనుక్కుందామని షాప్లో అడిగితే, అవంతగా రావటంలేదిప్పుడు అన్నారు .. ప్చె! )
గుడిపాటి అవ్వ అరుగులపై, గుబాళించిన మరో జ్ఞాపకం-గోరింట పూలది! అవునండీ! నాకు, అప్పటి అందరు ఆడపిల్లల్లాగే, గొరింటాకంటే ప్రాణం! మా తులజక్కయ్యకూ డిటో డిటో! నేనే చిన్న పిల్లను ! గోరింటాకు ఇప్పట్లోలా కోన్ లలో అమ్మేవాళ్ళు కాదు! గోరింటాకు చెట్టు యెవరింట్లో ఉందో, దుర్భిణీ వేసి పట్టుకుని, ఇక వాళ్ళింటిపై దండెత్తటమన్న మాట! మా వెనుక వీధిలో అప్పూ అయ్యర్ వాళ్ళ ఉమ్మడి ఆస్తిలో, పేద్ద గేట్ తో ఉన్న నాలుగైదు వేల గజాల స్థలంలో అన్నదమ్ములవి మూడు నాలుగిళ్ళుండేవి. వాళ్ళింట్లో, ఒక గోరింటాకు చెట్టు వుండేది. వాళ్ళ అనుమతి తీసుకునేందుకు లోపలికి అడుగు పెట్టాలంటే, వాళ్ళీంట్లో, ఒక భయంకరమైన ఆల్సేషియన్ కుక్క తోకాడిస్తూ, గేట్ దగ్గరే వుండేది..భయపడిచచ్చేదాన్ని! అనుమతికే ఇంత సీను! ఆ కుక్క అరుపు విని, యెవరో వచ్చారని, ఇంటివాళ్ళు గేట్ దగ్గరికొస్తే, వాళ్ళతో నవ్వూ, దైన్యమూ కలబోసిన మొహం పెట్టి, గోరింటాకు కోసం వినతి(అచ్చం తిరుప్పావైలో ఆండాల్, కృష్ణుని ఇంటి దగ్గర ద్వారపాలకుణ్ణి లోపలికి వెళ్ళేందుకు అనుమతి అడిగే విధంగా) గేట్ తీసింది పిల్లలైతే, లోపలికి వెళ్ళి పెద్దవాళ్ళ అనుమతి కోరేంతవరకే పర్మిషన్! ! పెద్దలు చాలా తక్కువగానే అనుమతించేవాళ్ళు మరి! మేమూ కోసుకోవాలనే వాళ్ళు చాలా సార్లు! తప్పిదారీ, కోసుకునేందుకు అనుమతిస్తే, ఆహా..ఇక నా పంట పండినట్టే! వాళ్ళు అనుమతించకపోతేనో?
మా స్నేహితురాలు, కైప రామసుబ్బలక్ష్మి వాళ్ళ పెద్ద స్థలం లో (సొంతందే) వాళ్ళ పిన్నయ్యలవీ (చిన్నాన్నలండీ) అంటు మిద్దెలుండేవి. ఆ ఇళ్ళ చివర ఉండే మెట్లెక్కి వెళితే, పక్కనే ఉన్న విశ్వేశ్వరాలయం అవరణలో మండపాలపైకి సులువుగా చెరే చిన్న పిట్ట గోడుండేది. దానిమీదుగా అ మండపలపైకి చెరుకుని, తూరు వైపుకి నడిస్తే, వెనక వీధిలో ఉన్న అప్పూ అయ్యర్ వాళ్ళ ఇంటి వెనుక పెరడు వైపు సరిగ్గా, గోరింట చెట్టు ! (కష్టపడి, ముందుకు వంగి అందుకునే వీలుండెది) అమ్మయ్య! అలా రామసుబ్బలక్ష్మీ, నేనూ, దొంగ దొంగగా, గోరింట చెట్టు దగ్గరికి చేరుకున్నా పెద్దలెవరైన వంటింట్లోంచీ, గోరింటచెట్టు కొమ్మలు కదలటం చూసో, లేదా మా గుసగుసలు వినో, 'యెవర్రా అక్కడ!' అని గర్జిస్తే, ఠపిమని, చప్పుడు చేయకుండా కొన్ని నిమిషాలు బొక్క బోర్ల పడుకోవటం! చెట్టు కదలకుండా, కొమ్మ వంచకుండా (యేదో జానపదగాయం వుంది కదండీ), ఆకెట్లా కోయాలో అప్పుడావిద్య బాగా తెలిసుండేదేమో మరి!
ఆ తరువాత, వాళ్ళు వెళ్ళిపోయారో లేదో జాగ్రత్తగా గమనించి ,మళ్ళి, ఆకు కోయటం! ఇంతాజేసి, యెంత ఆకు ఇలా కోయగలిగే వాళ్ళమో, చేతులకెన్ని సార్లు ముళ్ళు గుచ్చుకుని పోయేవో! మళ్ళీ, ఆ కోసిన ఆకును ఇద్దరమూ పంచుకోగా, యెవరికెంత వచ్చేదో కానీ, దొంగ జామకాయల రుచివలె, ఇదీ ఒక తీయని గుర్తే!
మోచంపేట లోని అహొబిల మఠంలోనూ, గొరింటాకు చెట్టుండేది. అక్కడ, కోవెల పూజాదికాలు చూసుకుంటూ శ్రీమాన్ దేశికా చార్యులవారి కుటుంబం..వారి ఒక కూతురు నాకు శ్రీ రామకృష్ణ హైస్కూల్ లో జూనియర్. పేరు కల్యాణి. వాళ్ల అక్కయ్య, లీల (మా తులజక్కయ్య హిందీ క్లాస్ ఫ్రెండ్)ఇంకా పంకజక్కయ్యా- వాళ్ళంతా ఆ ఇంట్లో వుండేవాళ్ళు. అదికూడా, నాలుగైదువేల గజాల జాగా! మధ్యలో అహొబిల మఠం. కొవెల వెనుక గొరింట చెట్టు! అక్కడికీ, అప్పుడప్పుడు, గొరింటాకు కోసం పోయేదాన్ని.
ఇన్ని కష్టాలూ పడి, గోరింటాకు తెస్తే, మా తులజక్కయ్య రోట్లో వేసి తెగ రుబ్బేది. రుబ్బేటప్పుడే తన చేయంతా యెర్రబరటం చూసి, గోరింతను అవసరానికి మించి రుబ్బుతూందని నా కంపైంట్! అందులొని రంగంతా తన చేతికే అంతుకుంటూందనీ, నాకేమీ మిగలదనీ, తెగ యేడ్చే దాన్ని! అక్కయ్య అనేది, ఆకు బగా రుబ్బితేగదా, బగా మెదిగేదీ? అని! .ఊహూ..ఒప్పుకోబుద్ధయ్యెదే కాదు!
సరే! రాత్రి, గోరింటాకు చేతుల్లో చంద్రవంకగా, నక్షత్రంగా, సూర్యునిగా ఇమిడిపొయిన ఆ అందమైన క్షణాలు! మళ్ళి మళ్ళి కవాలనిపించే ఆ వగరు వగరు వాసన! రాత్రి నిద్రలొ, ఆకంతా చెతుల్లో అలుముకుని, యే డిజైనో తెలియకుండా పొవటం..అక్కయ్య చెతిలో కుదురుగా కొలువైన సూర్యుడూ, నక్షత్రాలూ చూసి కుళ్ళుకోవటం!...భలే భలె జ్ఞాపకాలు నాకైతే! ( వేంపల్లి గండిలో గొరింట వనాలుండేవి..16,17యేళ్ళ వయసులో, అక్కడికి నాలుగైదుసర్లు వెళ్ళినప్పుడు, ఒక సంచినిండా గోరింటాకు దూసుకుని వచ్చెదాన్ని తెలుసా!)
ఆ జ్ఞాపకాల కొనసాగింపుగా అత్తింట్లోనూ గోరింట చెట్టుందెది.. గోరింట పూలు కూడా ఆఫీస్ కు పెట్టుకుని వెళ్ళేదాన్ని. ఇప్పుడున్న సొంతింట్లోనూ గొరింట చెట్టుందండొయ్!
(gorinta in our house now)
No comments:
Post a Comment