Thursday, 28 January 2016

త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం   ...షరా మమూలుగానే, నన్ను చేయి పట్టుకుని, బాల్యం బాట పట్టించింది. కడపలో, కొండప్ప సారు దగ్గర కర్నాటక సంగీతం నేర్చుకునే దాన్ని! యేడో యెనిమిదో యేళ్ళప్పటినుంచీ మొదలైన  అభ్యాసం, 14, 15 యేళ్ళదాకా కొనసాగింది. వర్ణాలో యిరవైదాకా, తరువాత కీర్తనలు యాభై  అరవై దాకా ఐన తరువాత, మనోధర్మ  సంగీతం నేర్పించటం  మొదలైంది.  అంటే రాగాలాపన స్వర కల్పనా, నెరవల్ (అంటే, చరణం లోఈని  మొదటి రెందు పాదాలనూ వివిధ స్థాయిలలో, రాగం అరోహణ, అవరోహణలననుసరించి కల్పనతో అల్లుకుంటూ పై స్థాయి దాకా వెళ్ళటం..దీనిలోనూ,  రాగాలాపన,  స్వరకల్పనల్లోనూ కళాకారుల ప్రతిభ బాగా  వ్యక్తమౌతుంది..) ఇవన్నీ కొంతవరకూ మొదట భట్టీయం వేయిస్తారు.తరువాత్త్తరువాత, కళాకరులే తమ  శక్తి, కల్పనలను బట్టి ఆయా రాగాలతో సంపూర్ణంగా  మమేకమైపోయి, ఆ  రాగారామంలో రమణీయంగా విహరించాలన్నమాట!..యీ క్రమంలో, కాస్త కాస్తగా రెక్కలు విప్పే తరుణంలో, మాతో (నేనూ,  నా పాట క్లాస్ మేట్ ముత్తులక్ష్మీ) అక్కడక్కడా కచ్చేరీలు  ఇప్పించేవారాయన!  రాధ అప్పటికిం కా బాగా చిన్న పిల్లే! అక్కయ్యలందరికీ పెళ్ళిల్లైపోయాయి. నన్ను అయ్య బాగనే ముద్దు చేసేవారు. నన్ను వుడికించటమంటే కూడా అయ్యకు మహా సరదా! మ పాట కచ్చేరీ ఫలనాచోట వుందనగానే, 'ఒహో! యెప్పుడే  నాగా నీ టపాచకేరీ? ' అని కనిపించినప్పుడ ల్లా   అడిగేవాళ్ళు. నేను  భలే వుడుక్కునే దాన్ని! కోపం వచ్చేది బాగా..అప్పటికే నేనేదో  పేద్ధ  కళాకారిణినైపోయినట్టే! ' పాటకచ్చేరీ అయ్యా..టపాచకెరీ కాదు.' .అని సవరించెదాన్ని పదే పదే!  అప్పటికేదో సర్దుకున్నట్టు నటించినా , మళ్ళీ అదే వరుస! అయ్యామాటన్నప్పుడల్లా, నాకు తెగ చిరాకు!.. .నా చిరాకు చూసి అయ్య మొహం నిండా నవ్వు!  నిజంగా బాల్యం యెంత మనోహరమో! మనకంటూ మరే ఆలోచనలూ, అభిలాషలూ వుండని స్వచ్చ సుందరమైన  రోజులు! పెరిగి పెద్దయేకొద్దీ,  మనకంటూ కొన్ని అభిరుచులూ, సొంత నిర్ణయాలూ, వయసు పొగరూ (మా అమ్మ తరచూ వాడుతుండేదీమాట) అబ్బబ్బబ్బా!!! ఇవన్నీ ముసురుకుని మన మనసు అద్దాన్ని, మసకబరుస్తాయేమోననిపిస్తుంది! కానీ, పుట్టిన తరువాత, యెప్పుడూ బాల్యంలోనే వుండిపోలేరుకదా యెవరైనా! జననం నుంచీ మరణం దాకా , మనసు అద్దం యెన్నిసార్లు మసక బారుతుందో, అసలది మరకేనని  తెలుసుకునే ఇంగితం వుండకపోవటం, సరే అది మసకేనని తెలిసినా శుభ్రపరచుకునే వీలు లేనంతగా జీవితంలో కూరుకుపోవటం, అ తరువాత యెన్నిసార్లు శుభ్రపరచుకున్నా, ఆ మరక పోకపోవటం,...ఒకవేళ అదృష్టం బాగుండి ఆ మరకలను తుడిచేసుకున్న  వారికి  - చరమావస్థలో కాస్త మనశ్శంతి! లేదూ - అపరాధ భావంతో చివరి దశకోసం నిరీక్షణ!  'దుడుకూ గల నన్నే దొర కొడుకూ బ్రోచు రా' ..అని   గౌళ  రాగంలోని త్యాగయ్య పంచరత్న కీర్తన ఆయనెందుకు  వ్రాశాడో   కానీ, ఇప్పటి  సమాజంలో వున్నంతటి దుర్మార్గం ఆయనలో లేదు. కానీ, అలాంటి  స్వచ్చమైన మనసుగల  పరిణతాత్మే  తన్ను తాను దుడుకువానిగా పొరబడి, దేవునిముందు, ఇంత దీనంగా మొరపెట్టుకుంటే, ఇక ఇప్పటి సమాజంలొని దుర్మార్గ చరాధముల   సంగ తేంటో మరి!   కవులలాగే, త్యాగయ్యా మనలాంటివారందరి తరఫునా రాముని - తన వినయాను సంధానంతో, మన్నించమని కోరుకున్నాడు కనుక బతికిపోయామేమో మనమంతా! దుడుకు  వారు  కాని ఉత్తమ స్నేహితులు క్షమింతురుగాత! (నేనైతే దుడుకుదాన్నే...)


No comments:

Post a Comment