Saturday, 27 February 2016
...........
''అబ్బా!నేను తెచ్చిన కూరగాయలు నచ్చకపోతే, బైటపడెయ్..నీవే తెచ్చుకోవల్సింది మరి..ఇంక మీదట నేను కూరగాయలు తెస్తేచూడు. నీకెప్పుడూ ఇదే పని, నేనేంచేసినా పొటుకుతూనే ఉంటావు..." (యేదో తప్పులు పడుతూనే ఉండటం) ఇదీ మావారికీ నాకూ ఇటీవల జరిగిన మాటల యుద్ధం. యుద్ధం సంగతెలా వున్నా యీ ' పొటకడం' అన్న మాట ప్రయోగించి చాలారోజులైందే ..అని తెగ మురిసిపోయాన్నేను..ఇలాణ్టి మాటలు యధాలాపంగా మాటల్లో వచ్చినప్పుడు, భలే సంతోషమౌతుంది నాకైతే!
అలాగే 'జంబం' అనే పదం. 'ఆ..ఆపిల్లకు భలే జంబమబ్బా..' (పొగరు అన్న అర్థంలో) .అని మా చిన్నప్పుడు కడపలో, భలే వాడేవాళ్ళం. 'దంభము' కాస్తా తెలుగులోకి వచ్చేసరికి, జంబమైందనుకుంటా!
యీరెండు పదాల ( పొటుకు, జంబం) వాడకం గురించి మిత్రులు మరిన్ని వివరాలు వ్రాస్తే, మరింత సంతోషం !!!!
...........
.......................

Tuesday, 23 February 2016
Frendz....A big thanks to Smt. Bhavaraju Padmini for publishing this article of mine in ACCHANGA TELUGU (Nature special issue) (Appreciate her for her soul-full efforts but excuse me for typographical mistakes)
నాగపద్మిని పుట్టపర్తి
గాధాసప్త శతిలో ప్రకృతి (లఘు వ్యాసం)
రచన :డా.పుట్టపర్తి నాగపద్మిని
ప్రకృతి సదా సర్వదా మనసునకర్షించేదే! ప్రకృతిని భగవత్స్వరూపంగా ఆరాధించేవారీనాటికీ వున్నారు. ప్రతి వృక్షాన్నీ, ఒక్కో కావ్యంగా దర్శించిన మహనీయులూ, ప్రతి సూయకిరణంలోనూ, శృష్టికి మూలాధారమైన జీవాశక్తిని గమనించి అచ్చెరువందిన మహితాత్ములూ, వికశించే ప్రతి పువ్వులోనూ ఒక ఆత్మ వికాసాన్ని వీక్షించి పులకించిన కవిశ్రేష్టులూ, ప్రకృతి సహజ సౌందర్యాన్నే, అసలైన సౌందర్యంగా గుర్తించే సున్నిత హృదయులూ - యెంతో మందిని తరతరాలుగా, మనం దర్శించుకుంటూనే వున్నాం. యుగాలు మరినా, మానవ ప్రకృతి రక రకాలుగా రూపాలు మార్చుకున్నా, ప్రకృతి మాత్రం, యే ఋతువు లక్షణాలను ఆ ఋతువులో తనలో ఆపాదించుకుంటూ, ఆయా అందాలతో అలరిస్తూనే వుంది మానవుణ్ణి! మామూలు వాళ్ళం ఆయా అందాలను చూసి, అనంద తరంగాలలో తేలిపొతే, కవి కలం, ఆయా అందాలను తన హృదయ నేత్రంతో వీక్షించి, దానికి భావసౌందర్యాన్నీ జోడించి, శాశ్వతత్వం చేకూరుస్తుంది. అందుకే, కవులను కాలాతీతులు అన్నారు.
భారతీయ వాంగ్మయం ఆదిగ్రంధంగా ఆదరింపబడే ఋగ్వేదం నిండా ప్రకృతి వర్ణనలు విస్తరించి వున్నాయి. తమ చుట్టూ విస్తరించివున్న సుందర దృశ్యాలను అ మంత్ర ద్రష్ఠలు, అరాధించారనటానికి వారు ప్రవచించిన మంత్రాలే సాక్ష్యాలు. అలనాటి వేద మంత్రాలు - వాల్మీకి, కాళిదాసులనాటికి, అలంకారాలతో కూడిన వర్ణనలుగా అవతరించాయి. ఇంకా అశ్వఘోషుడు, భవభూతి, బాణాది కవుల రచనల్లో, ప్రకృతికి పెద్దపీట వేయటం కూడా కనిపిస్తుంది. ' బాణోచ్చిష్టం జగత్ సర్వం ' అని కూడా అన్నారంటే, ప్రకృతి వారి రచనల్లో మరింతగా హొయలు పోయిందనే కదా అర్థం?
ఆలంబనంగా ప్రకృతిని వర్ణించే పద్ధతి, క్రమంగా, వుద్దీపనగా ప్రకృతిని మలచుకునే దిశగా సాగింది కొందరి కవులలో! శకుంతల తన పతివద్దకు వెళ్ళేసమయాన, అటు ఆమె ప్రియ సఖులు,తండ్రి కణ్వుడూ- మొదలైన వారి మానసిక పరిస్థితికి సమానంగా ఆశ్రమంలోని మొక్కలూ, జింకలూ కూడా ఆమె విరహాన్ని భరించలేకున్నాయని చెప్పటం చూస్తే, భావోద్దిపన కోసం ప్రకృతిని వుపయోగించుకుంటూనే, దాని సహజ సుందరతనూ కాపాడటంలో కాళిదాసు నైపుణ్యం అనుపమేయం అనిపిస్తుంది తప్పక! .
ప్రకృతి వర్ణన అనగానే ముందుగా స్ఫురించేది- ఋతు వర్ణన. చెట్లూ, పువ్వులూ, పక్షులూ, సూర్యోదయ సూర్యాస్తమయాలూ, వెన్నెల రాత్రులూ- ఇలాంటివి మాత్రమే సహజంగా ప్రకృతిలో అందరి మనసులనూ అకర్షించే విషయాలు. పైగా విరహ వేదనలో పై వస్తువులన్నీ, మరింత బాధాకరంగా అవగతమౌతుంటాయి కూడా!
దాదాపు కొన్ని వందల సంవత్సరాల కిందట, ఇప్పటి, తెలుగు ప్రాంతం, మహారాష్ట్రలోని కొంత భాగాన్ని కుంతలదేశంగా వ్యవహరించేవారు. అ ప్రాంతం రాజైన హాలుడు, (శాతవాహన రాజైన ఈ రాజు యెప్పటివాడన్న విషయంగా, యెన్నో మతభేదాలున్నా, అశ్వఘోషునికీ, కాళిదాసుకూ మధ్యకలంలో వున్నాడన్నది మాత్రం ఖచ్చితంగా తెలుస్తున్నది) మహారాష్ట్రీ ప్రాకృత భాషలో అప్పటి వివిధ కవయిత్రులూ, కవులూ వ్రాసిన చిన్న చిన్న ముక్తకాలవంటి రచనలను సేకరించి, వాటికి సత్తసయి అని పేరుపెట్టాడు! అప్పటి, ప్రాకృత భాషలో, ఇప్పటి మన మాండలికలవలెనే, ఆయా ప్రాంత భాషాభెదాలనుబట్టి, మగధి, అర్ధమగధి, శౌరశేని, పైశాచీ (ఇది పిశాచాలు మాట్లాడుకునే భాష కాదండీ ... అపభ్రంశ భేదం..) ఇలా రకరకాల పెర్లతో వాడుకలో వుండేది. యేవరి భాష వాళ్ళక్కిష్టం కదా! కావ్యాలు సంస్క్ర్తంలో ఉన్నా, నాటకాలలో, కొన్ని పాత్రలతో, తమతమ ప్రాంతానికి చెందిన ప్రాకృత భాషలో మాట్లాడించే పద్ధతి వుండేదప్పట్లో! కాళిదాసు కూడ తన నాటకాలలో అర్ధమాగధీ ప్రాకృతం వాడాడట! అధిస్సేనుడనే ఒక జైన కవి అంటాడు. 'దేవానాం కిం భాసయే భాసంతి? (యేమయ్యా, దేవతలు యే భాషలో మాట్లాడుతారు)అని ప్రశ్న! అద్ధమగధీ భాసాయే భాసంతీ! (అర్ధమాగధి భాషలోనయ్యా!)ఇది సమాధానం. అంటే అది అతని భాష కాబట్టి, అతని దేవతలూ అదే భాషలో మాట్లాడుతారని అతని నిశ్చితాభిప్రాయం. యీ సంగతటుంచితే, గాధాశప్తశతి లో, హాలుడూ, ఓదిసుడు, కుమారిలుడు, దుగ్గసామి (ఇది మన తెలుగు పేరువలెనే వుంది కదా) భిమసామి, చందసామి, విగ్గహరాయడు మొదలైన కవులూ, అణులచ్చి, అసులద్ది, పహయీ, రేవా, రోహా, వోహా, ససిస్సహా మొదలైన కవయిత్రులూ వున్నారు. , అత్తా(అత్త) అద్దాయే(అద్దం) తుప్ప(నేయి) రంప(రంపపుపొట్టు) మయిల (మైల) చోజ్జం(చోద్యం) వంటి తెలుగు పదాలు కూడా ఉండటం వల్ల, తెలుగు భాష ప్రాచీనతకు ప్రామాణికత చేకూరిన తృప్తీ దక్కుతుంది.
గాధాశప్తశతి ప్రధానంగా శృంగార కవితల (గాధల) సంకలనమని అందరూ అనే మాట! అందుకుతగ్గట్టే, చాలా గాధల్లో శృంగార, విరహ వర్ణనల్లో ప్రకృతిని అలంబనగా పెట్టుకోవటం సర్వ విదితమూ, యెక్కువ మంది కవులు అనుసరించిన పద్ధతి కూడా! అందుకు భిన్నంగా, ప్రకృతి సహజ సుందర రూపాన్ని, యే ఇతర కవులూ చేసి వుండని రీతిలో గాధల రూపంలో వర్ణించటం కొందరు గాధాకారులకే చెల్లిందని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఏ కవి దృష్టినైనా ప్రకృతి అందాలు ఆకర్షించినంతగా, తక్కిన దృశ్యాలు ఆకర్షించవు. అందరూ, వాటికే పెద్ద పీటవేస్తే, గాధాకారులు, మన చుట్టూరా కనపడే సాధారణ దృశ్యాలలోనూ అందాలను గ్గుర్తించి, కవితాత్మ నింపి, వాటికి కావ్యగౌరవాన్నివ్వటమేకాదు, పట్టాభిషేకం చేయటమూ గమనిస్తే, ఒళ్ళు పులకరిస్తుంది. , ఇపుడు మనం ఆధునిక సమాజావిష్కరణగా గుర్తిస్తున్న సామాజిక స్ఫృహ, ఆనాడే యీ గాధల్లో, కుప్ప తెప్పలుగా కనిపించటం - ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఉదాహరణకు యీగాధ చూడండి.
రుందారవింద మందిర మఅరందాణంది అలిరించోళీ
ఝణ ఝణఇ కసణ మణిమేహల వ్వ మహుమస లచ్చీయే (6-74)
వికసించిన అరవిందమనే మందిరంలో మకరంద పానము చేసి, ఆ మత్తులో, ఝుమ్మని నాదం చేస్తున్న భ్రమర పంక్తి యెలా ఉన్నది? వాసంత లక్ష్మి నీలమణిమేఖల వలె ఉన్నదట! ఆహా! యెంత మనోజ్ఞ కల్పన! వికసిత కమలమునే కాదు.అందులోని మత్తిల్లిన భ్రమరములను, వసంత లక్ష్మి నీలమణులు పొదిగిన మేఖలగానూ, వాటి ఝంకారాన్ని, ఆ మేఖల మృదునాదంగానూ తాను దర్శించటమే కాదు. పాఠకుల కన్నులముందూ ఆ దృశ్యాన్ని సాక్షాత్కరింపజేయటం లోనే యీ గాధాకారుని ప్రజ్ఞ ఇమిడి ఉంది కదా!
మరో అద్భుత కల్పన ఇదిగో! వుదయ సంధ్యాసమయాల్లో, ఆకాశం వైపు తలెత్తి చూస్తే, ఒకే వరుసన యెగురుతున్న చిలకల గుంపులు చూడటం - ఒక మధురానుభూతి యెవరికైనా! మనందరికీ ఒక అద్భుత దృశ్యంగా మాత్రమే కనిపించే యీ అందం, గాధాకారుని కళ్ళకెలా కనిపించింది?
వుఅ పొమ్మరాగ మరగఅ సంవలిఆ ణహ అలావో ఓఅరఇ
ణహ సిరి కంఠ భట్టవ్వ కంఠిఆ కీర రించోళీ (1/75)
ఆహా! ఆకాశాన యెగురుతున్న యీ చిలుకల రించోళి (గుంపు) యెలా ఉందో తెలుసా? అచ్చు గగన లక్ష్మి మెడలోనున్న పద్మరాగ మరకత మణిహారం, అలా ఆకాశం నుండి కిందికి జారుతున్నట్టుగనే వుంది కదూ!
ఇలాంటి సహజ సుందర దృశ్యాలను తమ కల్పనాశక్తి తో మరింత సుందరంగా దృశ్యమానం చేసిన గాధాకారుల వర్షఋతు వర్ణన యెంత ఊహాతీతంగా ఉందో మీరే చూడండి.
కత్థగఅం రఇ బింబం కత్థ పణట్ఠాఓ చంద తారాఓ
గఅణే బలాఅ పంతిం కాలో హోరం వ కట్ఠేఇ (5/35)
అరెరే! పట్టపగలు .. సూర్య మండలం యెక్కడికెళ్ళిపోయిందబ్బా? పోనీ చీకటి పడింది కదా!
చంద్రుడూ, చుక్కలూ యెక్కడ? ఈ రహస్యాన్ని చేదించడానికి, కాలమనే జ్యోతిష్కుడు, జ్యోతిశ్శాస్త్రాన్ననుసరించి, అకాశాన, సుద్ద ముక్కతో ఒక గీత గీచి, చూస్తున్నాడా అన్నట్టుందట, మబ్బులతో నిండిన ఆకాశంలో ఒకే వరుసన యెగురుతున్న కొంగల పంక్తి! (పై గాధకు శృంగార నేపధ్యం లో చేసిన గంగాధరవ్యాఖ్యలో, 'పిచ్చివాడా! సూర్య చంద్రులు సైతం కనిపించనంతగా, మేఘ చ్చన్నమైన మూసలాధార వర్ష కాలంలొ, నీవు భార్యను వదిలెలా వెళుతున్నావు?ఆడ కొంగలు సైతం యీ వర్షకాలంలోనే ప్రియునితో జంటకట్టి, సమాగమంలో మైమరచి, సంతాన భాగ్యాన్ని పొందుతుంటాయి. చూశావుగదా! నీవిప్పుడు నీభార్యను ఒంటరిని చేసి ప్రవాసానికి వెళ్ళకపోతే యేమౌతుందిట?' అని వ్యాఖ్యానించారు. ఇది విషయాంతరమైనా వ్యాఖ్యాకారుని చాకచక్యానికి జోహార్లనక తప్పదు కదా! ) ఇది చదివినప్పుడు, 'ఊర్ధ్వమూలమధశ్శాఖం' అంటూ - పురుషోత్తమ ప్రాప్తి యోగం (భగవద్గీత) లో ఇంతటి విశాల దృష్టితో ప్రకృతిని పరికించటం స్ఫురణకు వచ్చింది. అంటే గాధాకారుణ్ణి, గీతాకారుని సరసన కూర్చోబెట్టటమన్న భావన అనుచితంగా తోచవచ్చు కానీ, అంతటి గంభీరమైన దృష్టి లేశమాత్రంగానైనా, గాధాశప్త శతిలో దృశ్యమానమవటం గురించి ప్రస్తావించటం అనుచితమేమాత్రం కాదు కదా!
పురుషసూక్తంలో ఇంతటి గంభీరమైన నిశితమైన కల్పన మరొకటి, ఇదిగో!
నీలతోయద మధ్యస్థా ద్విద్యుల్లేఖేవ భాస్వరా,
నీవార శూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా.(11)
'ఈ జఠరాగ్ని నడుమ సూక్ష్మమైన అగ్నిశిఖ ఊర్ధ్వముగా పైకెగయుచున్నది. అది నీల మేఘము మధ్య మెఱపు వలె ప్రకాశించుచున్నది. నివ్వరి ధాన్యపు ముల్లువలె సూక్ష్మమై పచ్చని వన్నె కలిగి అది అణువుతో సమానమై ఉన్నది.'
ప్రాచీన సాహిత్యంలో మాత్రమే ఇంతటి విశాల కల్పనాదృక్కులతో భూమండలాన్ని వీక్షించగలిగే శక్తి కలిగిన ఋషులుండేవారన్నది కేవలం ఒక అపప్రథ మాత్రమే అని నిరూపిస్తున్నఇంకా కొన్ని గాధలు, గాధాసప్త శతిలో వున్నాయి.
ఇప్పుడు మనమంతా కార్మికులూ, కర్షకులూ కాయాకష్టం చేస్తున్న సమయాల్లొ, శ్రమతో కూడిన శ్వాసను, ఊపిరి ద్వారా, చిన్న ఊతపదాలతో బయటికి నెట్టే ప్రయత్నం చేస్తారని శాస్త్రోక్తరీతిలో అంటున్నాం కానీ, ఆరవ శతాబ్దం నాటి గాధాసప్తసతి లోని , యీ గాధలో ఆనాడే కార్మికుల అలవాట్లను అక్షరబద్ధం చేసిన వైనమిది!
అవిరల పడంత నవజల ధారా రజ్జు ఘడిఅం పఅత్తేణ
అపహుత్తో, ఉఖేతుం రస ఇవ మేహో మహింవు అహ (5/36)
వర్షాకాలం వర్ణన చక్కటి వుత్ప్రేక్షతో కూడినదిక్కడ! నిరంతర జలధారల రూపమైన రజ్జువులతో, అవనిని బంధించి, పైకి లాగాలని అసఫల ప్రయత్నం చూస్తున్నది మేఘం! మేఘం యెంతో కష్టపడుతున్నదనటానికి గుర్తు - అది చేస్తున్న హుంకారాలే! (భారీ వస్తువును లాగుతున్నప్పుడు, శ్రామికులు చేసే హు..హు..అన్న శబ్దాలే యీ మేఘమనే కార్మికుని ఉరుములు మరి. )
వింధ్య పర్వత శ్రేణులూ, ఆమ్ర అరుణారుణ పల్లవములూ, ఇంద్ర ధనుస్సులూ, కుసుంభ, కరంజ, కదంబ.అశోక వృక్ష శాఖలూ, నేరేడు పళ్ళ తీయదనాలూ, సాలె పురుగులూ, తేళ్ళూ, పావురాలూ, మైనా పక్షులూ, కాకులూ, జింకలూ, యెనుములూ, కోళ్ళూ..అబ్బో ..ఇవన్నీ కూడా గాధాసప్త శతిలో, సజీవంగా సందడి చేస్తుంటాయి. అలనాటి ప్రకృతి సహజ సుందర చిత్రణలో మేమూ భగస్వాములమౌతామని గాధాకారులముందే తమ విన్నాణాలను ప్రదర్శించి, లేఖినినందుకునేలా చేశాయంటే అతిశయోక్తికాదేమో! శ్రీ శ్రీగారే కాదు, అలనాటి సప్తశతీకారుడూ యీ మాట ఆనాడే అన్నాడు , 'కాదేదీ కవితకనర్హం' అని! మధుర పదార్థాలను పదిమందితోపాటూ ఆస్వాదించాలట! అంతేకాదు. కొద్దిగానే తీసుకోవాలట! అప్పుడే వాటి అసలైన మధురిమ తెలుస్తుంది. యీ లఘువ్యాసంలో, అలాంటి తీయని, మరచిపొలేని, మళ్ళీ మళ్ళీ కావాలనిపించే రుచిని మీకందించటమే వుద్దేశ్యం.
..........................
Thursday, 18 February 2016
Saturday, 13 February 2016
Alarulu kuriyaga adenade.....by Tallapaka Annamacarya
ఈ రోజు ప్రేమ దినోత్సవం. నిన్నటి నా పుస్తక శోధనలో బయటపడిన 12,మే 1982 నాటి ఆంధ్ర ప్రభ ప్రత్యేక సంచిక (వారపత్రిక) లో చిన తిరుమలయ్య వ్రాసిన శృంగార మంజరిలొని యీ ముచ్చటగొలిపే వివరణ చూడండి.
గాలిపటాలలో, కస్తూరిలో అద్దిన లేఖినితో ప్రేమలెఖ వ్రాసిన ఆ నాయకి వర్ణన యెంత మనోజ్ఞం! యేమొకో చిగురుటధరమున.....ఇదీ అంతే! రుక్మిణీదేవి కూడా, శ్రీకృష్ణుని వలచి ప్రేమలెఖ పంపింది కదా మరి! అన్నమయ్య అలమేలు మంగ, తన పతి మనసు గెలుచుకునేందుకు, అరతెర మరుగున నుంచీ నాట్యం చేసిందని అన్నమయ్య అంటాడు అలరులుగురియగ ఆడెనదే..అన్న పదంలో! అప్పటి రోజుల్లో, వీధినాటకలలోనో మరెక్కడో,(అప్పటికి భామాకలాపం వుండేదా?) తెరమరుగు నుండీ నాయిక పాత్ర ప్రవేశించే విధానం అన్నమయ్య రచనలో ప్రతిబింబించిందని అయ్య చెప్పినట్టు గుర్తు - నాచేత శ్రీ రామకృష్ణాహైస్కూల్ లో యీ పాటకు నాట్యం చేయించినప్పుడు! మా తులజక్కయ్య, బాలసరస్వతిగారి నాట్యాభినయ గ్రంధాన్ని దగ్గర పెట్టుకుని, ముద్రలూ అవీ అయ్య సూచనల ప్రకారం నాకు నేర్పించింది. 'కందువ తిరువెంకతపతి మెచ్చగా అన్న చోట, దశావతారాలూ యివిధంగా అభినయించమని చెప్పి చెసి చూపించారు అయ్య స్వయంగా! .ఇక ప్రదర్శన తరువాత, మ అయ్య నన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నరు - మురిపెంగా! అమ్మ ఇంట్లో దిష్టి తీసింది! అయ్యో..కేవలం స్మృతి పటలంపై మాత్రమే రికార్డ్ చేసుకోగలిగానే, అని ఇప్పుడు యెంత ఆవేదనో! అప్పటి ఫోటొలు కూడా యేవీ లేకపోవటం - యెంతటి తప్పిదం కదా! (ఆ పాట ఇప్పటి నా గానంలో _ శంకరాభరణ రాగం)
అలరులు కురియగ నాడెనదే |
అలుకల గులుకుల అలమేలు మంగ ||
అరవిరి సొబగుల నతివలు మెచ్చగ |
అరతెర మరగున నాడెనదే |
వరుస పూర్వదువాళపు తిరుపుల |
హరిగరగింపుచు అలమేలు మంగ ||
మట్టపు మలపుల మట్టెల కెలపుల |
తట్టెడి నడపుల దాటెనదే |
పెట్టిన వజ్రపు పెణ్డెపు తళుకులు |
అట్టిట్టు చిమ్ముచు అలమేలు మంగ ||
చిందుల పాటల సిరి పొలయాటల |
అందెల మోతల నాడెనదే |
కందువ తిరువేఘ్కటపతి మెచ్చగ |
అందపు తిరుపుల అలమేలు మంగ ||....
.............................
Friday, 12 February 2016
Wednesday, 10 February 2016
.................
ఈనాడు మనకందరికీ మైసూర్ గా చిర పరిచితమైన ఆ నగరాన్ని, ఇదివరకు, అంటే పాత కాలంలో యేమని పిలిచేవారో తెలుసా? మహీశూర పురం! యెంత బాగుంది కదా! ఆ మహీశూర పురంలోనే శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందిన ప్రాచీనమైన పరకాల మఠం వుంది.(నేను మైసూరుకు ఉద్యోగంలో వున్నప్పుడు రెండు మూడు సార్లు అక్కడికి వెళ్ళి, ఆ పూర్వ వైభవాన్ని దర్శించి, ధన్యురాలై వచ్చాను) మరి ఇప్పుడా ప్రసక్తి యెందుకంటే, ఆనంద భైరవి రాగం లోని యీ మంగళహారతి శ్రీ శ్రీ శ్రీ కృష్ణ బ్రహ్మ తంత్ర పరకాల మహాదేశికుల వారు (31st swamiji of the Muth) తన పూర్వాశ్రమంలో రచించినది. నా చిన్నప్పుడు, యీ మంగళహారతిని, మా అమ్మ, శ్రీమతి కనకమ్మా, మా అక్కయ్యలు కరుణ, తరులతల యుగళగళాలలో యెన్నో సార్లు విన్న అందమైన జ్ఞాపకం యీనాడీవిధంగా మీముందుకు తీసుకువస్తున్న సంతోషం! నోరు తిరిగేందుకు, 'గాదె కింద కంది పప్పు'...ఇంకా... 'నల్ల లారి మీద యెర్ర లారీ'...ఇలాంటి ప్రయోగాలేమంటారొ మరిచిపోయానిప్పుడు కానీ యీ పాటలోని పదాలను క్షుణ్ణంగా, తప్పులు లేకుండా పలకడం అంత సులువేంకాదు సుమా! ఒక సారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది! సంస్కృత రచనే ఐనా, ద్రాక్షాపాకమండీ! యెంత మధుర పదజాలం! యెంత చక్కటి భావం! ముందు రచన చూడండి. తరువాతే పాట వినండి దయచేసి.....( 'కల్యాణ గీత మంజరి' పేరుతో 1966లొ ముద్రితమైన యీ చిన్ని పొత్తాన్ని, పుట్టింటి ఆస్తిగా వెంట తెచ్చుకున్నాను - యెప్పుడో.! .యేమిటో..నా పిచ్చి నాకు ఆనందం!)
........................
జలజ నయన తవసు మంగళం
భుజగ శిఖరి, కలిత నిలయ భవతు మంగళం....
జలధి శయన విబుధ వినుత లలిత లలిత చరిత భరిత
వలభి దుపల పటల రుచిర చలిత లులిత చికుర నిటిల...
.జలజ నయన తవసు మంగళం
భుజగ శిఖరి కలిత నిలయ భవతు మంగళం...
శరణ వరుణ కుతుకి దేవతా
భరణ రుచిత.. కరుణ నిగమ సుగమ దైవతా..
అరుణ తరుణ తరుణి కిరణ
చరణ చరణ హరిణ హరణ
హరిణ కిరణ వదన జనన
సరణి తరణ కరణ శరణ...
జలజ నయన తవసు మంగళం
భుజగ శిఖరి కలిత నిలయ భవతు మంగళం.....
సురత మృదిత జలధితాస్తనా..
భరత సహజ హరిత తురగ తనుజ పాలనా..
స్ఫురద విరత సతత కఠిన
విరుత భువన కదన జనన
దురిత భరిత చరిత సదన
నిఋతి వితతి విరతి లకన
జలజ నయన తవసు మంగళం
భుజగ శిఖరి కలిత నిలయ భవతు మంగళం..
పవన తనయ వినుతి భాజనా పవన హరణ
నవన వచన నివహ పావనా..
పవన లవన యవన గహన
జవన వలన వహన పవన
నవ సుదుర్గ భవన కృష్ణ
కవన సరణి జవన చరిత...
జలజ నయన తవసు మంగళం
భుజగ శిఖరి కలిత నిలయ భవతు మంగళం...
......................
Friday, 5 February 2016
(Ayya and Dr.Tripuraneni Hanuman Chowdarygaru in the back drop of the main door which I decorated with my painting-foto of 1974 or 1975)
...............
'ఆ.. నాగా..ఇదిగో....
(11-1-16 .. పోస్ట్ తరువాయి....)
యీ ప్రభ మూడు నాలుగేళ్ళు నడిచిందనుకుంటా! అయ్య '72లో రెటైర్ అయ్యారు. మా అన్నయ్య అరవింద్ జీతం పెద్దగా వుండేది కాదు ఇంటి అవసరాలు ఆదుకునే స్థాయిలో! ముగ్గురు పెళ్ళిల్లైన అక్కయ్యలూ, వాళ్ళ అవసరాలూ..అబ్బో! రోజులెట్లా గడిచెవో మరి! యీ లోగా అయ్యకు పద్మశ్రీ రావటమూ, సంజీవరెడ్డిగారు కడప కలెక్టర్ గా వచ్చినప్పుడు, అయ్య షష్టి పూర్తి పెద్ద యెత్తున జరిగి ఓ ఇరవై ఐదు వేల రూపాయల పర్స్ (సరిగ్గా గుర్తులేదండీ..ఐనా అవన్నీ పెద్దవాళ్ళ విషయాలు అప్పట్లో) ఇవ్వటమైంది. జిల్లెళ్ళమూడి అమ్మ కరుణతో, చీరాలా, పేరాలా (అప్పుడు అయ్యతో నేనూ వెళ్ళానండొయ్ అక్కడికంతా!) అటు వైపు బాగా సన్మనాలవీ జరిగి రెక్కలు అల్లార్చుకునే సమయానికి అమ్మ తీవ్ర అనారోగ్యం! మాటి మాటికీ, ఆసుపత్రి పాలు కావటం, డబ్బు నీళ్ళలా ఖర్చైపోవటమూ! ఆ రోజులు తలచుకుంటే కడుపులోంచీ యేడుపు యెగదన్నుకుని వస్తుంది. ఆర్థిక స్థోమత అవసరం అప్పుడప్పుడే తెలుస్తున్న రోజులవి!
తరువాతి కాలంలో, అయ్య తన పెద్ద రచనలు పండరీభాగవతమూ , జనప్రియ రామాయణమూ, వేసుకున్నారు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడి రేట్లతొ ఇచ్చిన పేపర్తో కాస్త ధైర్యంగానే! కానీ, అప్పటికే, తెలుగు సాహిత్యభిలాష మసకబారుతున్నట్టుందేది. ఆ గ్రంధాలెవరూ గ్రంధాలయాలకంటూ కొనలెదు.పండరీభాగవతం, చెక్క బీరువాల్లో వుండటం వల్ల, వర్షపు నీళ్ళు దిగి, చెదలు పట్టి పోయాయి చాలా కాపీలు!..అయ్య ఆ చెదలు పట్టిన పుస్తకాల మధ్య కూర్చుని నిర్వేదంగా, యే భావమూ ప్రకటించని గాజు కళ్ళతో, అన్న మాటలు ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి 'చివరికి, నా పండరీభాగవతాన్ని చెదలే చదివినాయన్నమాట ప్రీతిగా! ' అని!
అట్లా, అయ్యకు తన పుస్తకాలను తానే ముద్రించుకోవటం కూడా తప్పేనని తెలుసుకునే వేళకు జరగాల్సిన నష్టం జరిగేపోయింది. జనప్రియ రామాయణం, శ్రీనివాస ప్రబంధమూ, అయ్య పోయిన తరువాత, కొన్ని బ్రౌన్ లైబ్రరీకీ, కొన్ని..(యేడుపొస్తూంది) రక రకాలుగా మాయమైపోయాయి.. . పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, అయ్యను చూసిన స్ఫూర్తి తో, నేనూ యీ ప్రచురణ రంగంలోకి, అయ్య పుస్తకాలను ప్రచురిస్తూ, ఆడ అభిమన్యునిగా ప్రవేశించాను. నేను వేసిన పుస్తకాలవల్ల, లాభాలెన్ని వచ్చాయన్నది కేవలం అనుభవైక వేద్యమే ! వ్యాపార చతురత ముఖ్యంగా వుండవలె కదా! వుద్యోగినులుగా వుంటూ, ప్రచురణ రంగంలో కూడా ప్రతిభ కనబరుస్తూ, సక్సెస్ సాధించిన మహిళలు, చాలా తక్కువే యెలాగైనా! యేమైనా చెప్పండి అదిప్పటికీ నాకు రాని కళే! యేమైనా మాట్లాడేవాళ్ళని 'మీరూ పుస్తకాలు వేసి చూడండి, తెలుస్తుంది ఆ బాధేమిటో ' అనేస్తాను నేనైతే! గట్టుపై కూర్చుని యెన్ని మాటలైనా మాట్లాడవచ్చు. దిగితే కదా లోతు తెలిసేది. అక్కడో వూబే ఉండొచ్చు. మొసలే వుండొచ్చు. సుడిగుండమే కావచ్చు. యేమీ లేకపోనూ వచ్చు. అదంతా అదృష్టం.. యెంతకూ దృష్టం కానిది మరి! పుస్తకాలు వేసి అమ్ముకోవటానికి నానా తిప్పలూ, నానా గడ్డీ తింటూ అగచాట్లూ పడుతున్న వాళ్ళకే యీ విషయాలు తెలుస్తాయి. పైగా అయ్యనుంచీ, వారసత్వంగా వచ్చిన కొన్ని సుగుణాలుండనే వున్నాయాయె! చొరవ లేదు. వుద్యోగస్తురాలినైనా, లంచాలిచ్చి పనులు చేయించుకోవడమన్న విద్య రాకపాయె! పుచ్చుకునే విద్య ఒస్తే, ఇచ్చే విద్యా వస్తుందట! అదే రాదు కదా మరి! యేమి మాట్లాడినా అయ్యకే చెడ్డపేరొస్తుందనే భయమూ! ఐనా, కిందపడి దెబ్బ తగిలినా, అనుభవం మాత్రం చక్కటిదే, అన్నట్టు, పుస్తకాలమాటెటున్నా, పుట్టపర్తాయన బిడ్డగా, వచ్చిన గుర్తింపే యీ జన్మకు చాలు అన్నట్టుంది నాకైతే! యేమంటారు?

Thursday, 4 February 2016
Dari kace Sabari - A Telugu Devotional song
సరస్వతీపుత్రుని అంతర్వాహిని......
దారి కాచె శబరీ రాముండిటు వచ్చుననీ...
తన పూజ గొనునటంచు ..
వనవనమూ చుట్టి చుట్టి నగనగమూ తిరిగి తిరిగి
ననలెల్లను గొని తెచ్చి,తనిపూవుల నేరియుంచి...దారి...
సెలయేటను తానమాడి, తెలినార కట్టి,
చెలిచెక్కిట చెయి జేర్చి,తలవాకిట నిక్కి చూచి..దారి..
యెలగాలులు వీచినంత తలయెత్తి ఆలకించు,
గలగల ఆకులు కదలిన అలికిడియా పదములదని..దారి...
దూరాననుందునంచు తరువెక్కి నిక్కి చూచు,
గిరిపై నిలుచుండి చూచు,కరమడ్డముగాగ చూచు..దారి..
రారామ రామయంచు రాగలడిదె వచ్చెయంచు,
రేబగళ్ళు తపియించుచు వాపోయెను వత్సరములు....దారి..
దినమొక కల్పంబుగా, క్షణమొక్క యుగంబుగా,
తనువెల్ల తపంబుగాగ, మనసెల్ల నిరాశగాగా..దారి...
పరవశిoచు తలపులతో, భయకంపిత మనముతో,
పగళ్ళెల్ల యెదురుచూచు, నిశలెల్లను మెలుకొంచు..దారి.
చనుదెంచునొలెదో, తనుజూచునొ చూడదో,
అని తపించి జపియించుచు, అనుమానము పెనగొనగా..దారి..
రా రామ రామ రామా..ప్రియదాసుల గావరావ,
కానరాని శబరి ప్రేమ నుడియుడిగిన మూగ ప్రేమ..దారి..
మా అమ్మ శ్రీమతి పుట్టపర్తి కనకమ్మగారు వ్రాసిన యీ పాట, అమ్మను యెరిగున్నవాళ్ళందరికీ, యెంతో ప్రీతిపాత్రమైన పాట! మా అయ్యకూడా, కళ్ళు మూసుకుని, తాదాత్మ్య స్థితిలో, భక్తి పారవశ్యంలో యీపాట వినటం-మేము గమనించిన సత్యం. అమ్మ 1983 లో (22nd March) తన శ్రీరామ సాన్నిధ్యానికి చేరుకున్నప్పుడు, మేమంతా, ఆమె శాశ్వత వియోగాన్ని భరించలేక-యీ పాటను అశృతప్త నయనాలతో పాడుతుంటే, అయ్య, చిన్న పిల్లవాడివలె, భోరున యేడ్వటం- అందరి హృదయాలూ తరుక్కుపోయిన క్షణాలు. కరణం, మా అయ్య జీవితానౌక, నిజమైన సరంగు అమ్మే కదా మరి! ఇల్లాలిగానూ, సాహితీపధ సహగామిగానూ, ఆ సరస్వతీపుత్రుని అంతర్వాహిని అంతశ్శక్తి కూడా ఆమే! ఆమే! అమ్మకు కన్నీటి నివాళీ!
Tuesday, 2 February 2016
Padake na rani....(A Telugu Light song)
ఆకాశవాణి తెలుగు ప్రసారాలు ప్రారంభమైన తొలి రోజుల్లో, సొంతంగా సంస్థ రికార్డ్ చేసుకున్న కొన్ని అద్భుత లలిత గేయాల్లో ఇది ఒకటి...
ఘంటసాలగారి గొంతులో, గుండెలు పిండేసే యీ వేదనాభరిత గేయాన్ని వినగల్గటం- ఒక మరపురాని అనుభూతి. (రచన రచన శ్రీ అడవి బాపిరాజు గారు. ఇది సంధుభైరవి రాగంలో కూర్చబడింది).ఆ రికార్ద్లమీద,
కేవలం గాయకుల వివరాలుండేవి తప్ప, రచయితా, సంగీత దర్శకుల పేర్లు వుండేవి కావు అప్పట్లో. కానీ చిత్తరంజన్ గారు చెప్పినట్టు గుర్తు.) .)
పాడకే నా రాణి పాడకే పాటా..
పాట మాధుర్యాన ప్రాణాలు మరిగెనే...
పాడకే నా రాణి, పాడకే పాట....
. రాగమాలాపించి వాగులా ప్రవహించి,
సుడి చుట్టు గీతాల సురిగిపోనీయకే...పాడకే..
కల్హార ముకుళములు కదలినవి పెదవులూ,
ప్రణయపద మంత్రాల బంధించె జీవనము...పాడకే...
శృతి లేని నా మదికి చతుర గీతాలేల,
గతిరాని పాదాలకతుల నృత్యమ్మటే..పాడకే...
......................................
Monday, 1 February 2016
Mance digave...very famous Telugu yala padam..(I like this veryyyyyyy much)
1978..కడప ఆకాశవాణిలో ఉద్యోగం...ప్రతిరోజూ పొద్దున 7.15 కు జానపదగేయాలు..అప్పట్లో కడప లో యెక్కువ జానపద గేయాలు రికార్డ్ అయ్యేవి కావు. హైద్రాబాద్ కేంద్రం నుంచీ, విజయవాడ కేంద్రం నుంచీ, అక్కడ రికార్డ్ చేసిన జానపద గేయాలను తెప్పించి ప్రసారం చేసేవాళ్ళు.( చిన్నప్పటినుంచీ, అయ్యగారి ప్రభావం వల్ల కూడా కొంత, జానపద సాహిత్యం అంటే నాకు భలే ఆసక్తి. నేనూ కొన్ని గొబ్బిళ్ళపాటలు వంటివి సేకరించానప్పటికే! )నేను డ్యూటీ ఆఫీసర్గా ఆ రోజు డ్యూటీలో ఉన్నప్పుడే కాదు. ఇంట్లో ఉన్నా, ఆ టైం కు సరిగ్గా రేడియోలో జానపద గేయాలు వినాల్సిందే! శారదాశ్రీనివాసన్ గారూ, రజనీగారూ (ఇప్పటి శతవసంత సుందరుడు) ఇద్దరూ పాడిన యుగళ గీతం- 'పెం డ దీసీ దీసీ దీసీ, చేయంతా నొప్పులూవుట్టే ' (అందులో రజనీగారు, ఆ..ఆయ్...అంటూ ఇల్లాలిని కసురుకునే విధానం భలే నచ్చేది) వింజమూరి సీత,అనసూయగారలు పాడిన 'మందులోడా'.. పాట నుంచీ 'మాయమాటలు చెబితీవీ పిల్లడో'...(అంటూ వెక్కి వెక్కి యేడుస్తూ తనను మోసం చేశాడంటూ పాడే పాట) 'నక్కలోళ్ళా సిన్నాదాన్నీ', 'మొక్కజొన్న తోటలో', ఇంకా పాకాల సావిత్రీదేవీ, నేతి శ్రీరామ శర్మగారలు పాడిన 'రూపాయి కావాలా, రూపాయీ చిల్లర కావాలా,' (వీళ్ళు కర్ణాటక సంగీతంలో అప్పటికేసువిఖ్యాతులైనా, జానపద గేయాలనూ అంతే ఇష్టంగా పాడటం నాకు భలే నచ్చిందప్పట్లో) ఇంకా.... మధుర గాయని శ్రీరంగం గోపాల రత్నంగారూ, యెన్.సీ.వీ.జగన్నాధాచార్యులు గారూ పాడిన యీ పాటా...ఆహాహా...డ్యూటీ లో ఉన్నప్పుడీపాటను, విడిగా అ టేప్ యెన్ని సార్లు ప్లే చేసుకుని వినేదాన్నో! పిచ్చి శ్రీరంగం గారి గొంతటే!నన్నంత మంత్ర ముగ్ధం చేసేసిన అప్పటి యీ పాట ఇప్పుడెక్కడా వినిపించటం లేదెందుకో! యేది యేమైనా మా ఆకాశవాణికీ జై! యెంతో జానపద సాహిత్యాన్ని టేపుల్లో భద్రం చేసి, ఇప్పటి తరానికి భద్రంగా అందజేసిన - నా మాతృ సంస్థ! (నేనూ ఆకాశవాణి కడప, హైదరాబాద్ కేంద్రాల్లో పనిచేసేటప్పుడు కూడా యెన్నో పాటలు సేకరించి పాడటం పాడించటం, ఒగ్గుకథలూ, చిందు యక్షగనాలూ, జమిడిక కథలూ..ఇలా వాటికో ప్రత్యేకమైన చంక్ పెట్టి ప్రొమోట్ చేయటం, కూడా చేసిన తృప్తే కొండంత ఆనందాన్నిస్తుందిప్పటికీ!) ఏదైనా అసలు పాట పట్టుకునేవరకూ, నేను పాడుకునే రీతిలో ఇలా రికార్డ్ చేసేసా.....మీకు నచ్చితే ఓకే! (నచ్చకపోతే మరింత పేద్ద ఓకే!)
మంచె దిగవే ఓ పాంచాల సిలక..మంచె దిగవే..
ఒంచిన తలా యెత్తి వాలు సూపులూ సూసి..మంచె దిగవే.....
మంచే దిగవే ఓ పాంచాల సిలకా...మంచే దిగవే...
సేబాసు కుర్రోడా సెవుల పోగులా వోడా..
మా బావా విన్నా కన్నా మరియాదా దక్కూనా..మంచే దిగానూ...
మంచే దిగానూ..ఓ పొంచున్న చినవోడా..మంచే దిగనూ...
అల్లాము బెల్లాము తెల్లా కొంగునా కడుదు,
తెల్లాకొంగున కట్టీ తెల్లారేసరికీ పోదూ..మంచే దిగావే..
మంచే దిగవే..ఓ పాంచాల సిలకా..
అల్లాము బెల్లాము వొల్లాదూ నా మనసూ
అన్నాదమ్ములు సూత్తే ఆచోటూ నిలువారూ..మంచే దిగానూ..
మంచే దిగనూ..ఓ మంచీ మురుగులవోడా...మంచే దిగనూ..
పూలా రైకా దానా వాలు సూపులాదానా.
కాలిలో ములు దిగెనూ కాసంత ములుదీవే..మంచే దిగావే..
మంచె దిగవే ఓ పాంచాలా సిలకా..మంచె దిగవే..
కాలిలో ములూ దిగితే కర్రీ మంగలీ కలడూ,
తాలీ గట్టీనోడూ తాయెత్తు గట్టూ ..మంచె దిగనూ..
మంచె దిగనూ ఓ పొంచున్న చినవోడా..మంచే దిగనూ..
..................................

Subscribe to:
Posts (Atom)