సరస్వతీపుత్రుని అంతర్వాహిని......
దారి కాచె శబరీ రాముండిటు వచ్చుననీ...
తన పూజ గొనునటంచు ..
వనవనమూ చుట్టి చుట్టి నగనగమూ తిరిగి తిరిగి
ననలెల్లను గొని తెచ్చి,తనిపూవుల నేరియుంచి...దారి...
సెలయేటను తానమాడి, తెలినార కట్టి,
చెలిచెక్కిట చెయి జేర్చి,తలవాకిట నిక్కి చూచి..దారి..
యెలగాలులు వీచినంత తలయెత్తి ఆలకించు,
గలగల ఆకులు కదలిన అలికిడియా పదములదని..దారి...
దూరాననుందునంచు తరువెక్కి నిక్కి చూచు,
గిరిపై నిలుచుండి చూచు,కరమడ్డముగాగ చూచు..దారి..
రారామ రామయంచు రాగలడిదె వచ్చెయంచు,
రేబగళ్ళు తపియించుచు వాపోయెను వత్సరములు....దారి..
దినమొక కల్పంబుగా, క్షణమొక్క యుగంబుగా,
తనువెల్ల తపంబుగాగ, మనసెల్ల నిరాశగాగా..దారి...
పరవశిoచు తలపులతో, భయకంపిత మనముతో,
పగళ్ళెల్ల యెదురుచూచు, నిశలెల్లను మెలుకొంచు..దారి.
చనుదెంచునొలెదో, తనుజూచునొ చూడదో,
అని తపించి జపియించుచు, అనుమానము పెనగొనగా..దారి..
రా రామ రామ రామా..ప్రియదాసుల గావరావ,
కానరాని శబరి ప్రేమ నుడియుడిగిన మూగ ప్రేమ..దారి..
మా అమ్మ శ్రీమతి పుట్టపర్తి కనకమ్మగారు వ్రాసిన యీ పాట, అమ్మను యెరిగున్నవాళ్ళందరికీ, యెంతో ప్రీతిపాత్రమైన పాట! మా అయ్యకూడా, కళ్ళు మూసుకుని, తాదాత్మ్య స్థితిలో, భక్తి పారవశ్యంలో యీపాట వినటం-మేము గమనించిన సత్యం. అమ్మ 1983 లో (22nd March) తన శ్రీరామ సాన్నిధ్యానికి చేరుకున్నప్పుడు, మేమంతా, ఆమె శాశ్వత వియోగాన్ని భరించలేక-యీ పాటను అశృతప్త నయనాలతో పాడుతుంటే, అయ్య, చిన్న పిల్లవాడివలె, భోరున యేడ్వటం- అందరి హృదయాలూ తరుక్కుపోయిన క్షణాలు. కరణం, మా అయ్య జీవితానౌక, నిజమైన సరంగు అమ్మే కదా మరి! ఇల్లాలిగానూ, సాహితీపధ సహగామిగానూ, ఆ సరస్వతీపుత్రుని అంతర్వాహిని అంతశ్శక్తి కూడా ఆమే! ఆమే! అమ్మకు కన్నీటి నివాళీ!
No comments:
Post a Comment