Tuesday 23 February 2016



 


Frendz....A big thanks to Smt. Bhavaraju Padmini for publishing this  article of mine  in ACCHANGA TELUGU (Nature special issue) (Appreciate her for her soul-full efforts but excuse me for typographical mistakes)
                                                                                నాగపద్మిని పుట్టపర్తి 


 

గాధాసప్త శతిలో ప్రకృతి (లఘు వ్యాసం)
రచన :డా.పుట్టపర్తి నాగపద్మిని  

ప్రకృతి సదా సర్వదా మనసునకర్షించేదే! ప్రకృతిని భగవత్స్వరూపంగా ఆరాధించేవారీనాటికీ వున్నారు. ప్రతి వృక్షాన్నీ, ఒక్కో కావ్యంగా దర్శించిన మహనీయులూ, ప్రతి సూయకిరణంలోనూ, శృష్టికి మూలాధారమైన జీవాశక్తిని గమనించి అచ్చెరువందిన మహితాత్ములూ, వికశించే ప్రతి పువ్వులోనూ ఒక ఆత్మ వికాసాన్ని వీక్షించి పులకించిన కవిశ్రేష్టులూ, ప్రకృతి సహజ సౌందర్యాన్నే, అసలైన సౌందర్యంగా గుర్తించే సున్నిత హృదయులూ - యెంతో మందిని తరతరాలుగా, మనం దర్శించుకుంటూనే వున్నాం. యుగాలు మరినా, మానవ ప్రకృతి రక రకాలుగా రూపాలు మార్చుకున్నా, ప్రకృతి మాత్రం, యే ఋతువు లక్షణాలను ఆ ఋతువులో తనలో ఆపాదించుకుంటూ, ఆయా అందాలతో అలరిస్తూనే వుంది మానవుణ్ణి! మామూలు వాళ్ళం ఆయా అందాలను చూసి, అనంద తరంగాలలో తేలిపొతే, కవి కలం, ఆయా అందాలను తన హృదయ నేత్రంతో వీక్షించి, దానికి భావసౌందర్యాన్నీ జోడించి, శాశ్వతత్వం చేకూరుస్తుంది. అందుకే, కవులను కాలాతీతులు అన్నారు.

భారతీయ వాంగ్మయం ఆదిగ్రంధంగా ఆదరింపబడే ఋగ్వేదం నిండా ప్రకృతి వర్ణనలు విస్తరించి వున్నాయి. తమ చుట్టూ విస్తరించివున్న సుందర దృశ్యాలను అ మంత్ర ద్రష్ఠలు, అరాధించారనటానికి వారు ప్రవచించిన మంత్రాలే సాక్ష్యాలు. అలనాటి వేద మంత్రాలు - వాల్మీకి, కాళిదాసులనాటికి, అలంకారాలతో కూడిన వర్ణనలుగా అవతరించాయి. ఇంకా అశ్వఘోషుడు, భవభూతి, బాణాది కవుల రచనల్లో, ప్రకృతికి పెద్దపీట వేయటం కూడా కనిపిస్తుంది. ' బాణోచ్చిష్టం జగత్ సర్వం ' అని కూడా అన్నారంటే, ప్రకృతి వారి రచనల్లో మరింతగా హొయలు పోయిందనే కదా అర్థం?

ఆలంబనంగా ప్రకృతిని వర్ణించే పద్ధతి, క్రమంగా, వుద్దీపనగా ప్రకృతిని మలచుకునే దిశగా సాగింది కొందరి కవులలో! శకుంతల తన పతివద్దకు వెళ్ళేసమయాన, అటు ఆమె ప్రియ సఖులు,తండ్రి కణ్వుడూ- మొదలైన వారి మానసిక పరిస్థితికి సమానంగా ఆశ్రమంలోని మొక్కలూ, జింకలూ కూడా ఆమె విరహాన్ని భరించలేకున్నాయని చెప్పటం చూస్తే, భావోద్దిపన కోసం ప్రకృతిని వుపయోగించుకుంటూనే, దాని సహజ సుందరతనూ కాపాడటంలో కాళిదాసు నైపుణ్యం అనుపమేయం అనిపిస్తుంది తప్పక! .

ప్రకృతి వర్ణన అనగానే ముందుగా స్ఫురించేది- ఋతు వర్ణన. చెట్లూ, పువ్వులూ, పక్షులూ, సూర్యోదయ సూర్యాస్తమయాలూ, వెన్నెల రాత్రులూ- ఇలాంటివి మాత్రమే సహజంగా ప్రకృతిలో అందరి మనసులనూ అకర్షించే విషయాలు. పైగా విరహ వేదనలో పై వస్తువులన్నీ, మరింత బాధాకరంగా అవగతమౌతుంటాయి కూడా!

దాదాపు కొన్ని వందల సంవత్సరాల కిందట, ఇప్పటి, తెలుగు ప్రాంతం, మహారాష్ట్రలోని కొంత భాగాన్ని కుంతలదేశంగా వ్యవహరించేవారు. అ ప్రాంతం రాజైన హాలుడు, (శాతవాహన రాజైన ఈ రాజు యెప్పటివాడన్న విషయంగా, యెన్నో మతభేదాలున్నా, అశ్వఘోషునికీ, కాళిదాసుకూ మధ్యకలంలో వున్నాడన్నది మాత్రం ఖచ్చితంగా తెలుస్తున్నది) మహారాష్ట్రీ ప్రాకృత భాషలో అప్పటి వివిధ కవయిత్రులూ, కవులూ వ్రాసిన చిన్న చిన్న ముక్తకాలవంటి రచనలను సేకరించి, వాటికి సత్తసయి అని పేరుపెట్టాడు! అప్పటి, ప్రాకృత భాషలో, ఇప్పటి మన మాండలికలవలెనే, ఆయా ప్రాంత భాషాభెదాలనుబట్టి, మగధి, అర్ధమగధి, శౌరశేని, పైశాచీ (ఇది పిశాచాలు మాట్లాడుకునే భాష కాదండీ ... అపభ్రంశ భేదం..) ఇలా రకరకాల పెర్లతో వాడుకలో వుండేది. యేవరి భాష వాళ్ళక్కిష్టం కదా! కావ్యాలు సంస్క్ర్తంలో ఉన్నా, నాటకాలలో, కొన్ని పాత్రలతో, తమతమ ప్రాంతానికి చెందిన ప్రాకృత భాషలో మాట్లాడించే పద్ధతి వుండేదప్పట్లో! కాళిదాసు కూడ తన నాటకాలలో అర్ధమాగధీ ప్రాకృతం వాడాడట! అధిస్సేనుడనే ఒక జైన కవి అంటాడు. 'దేవానాం కిం భాసయే భాసంతి? (యేమయ్యా, దేవతలు యే భాషలో మాట్లాడుతారు)అని ప్రశ్న! అద్ధమగధీ భాసాయే భాసంతీ! (అర్ధమాగధి భాషలోనయ్యా!)ఇది సమాధానం. అంటే అది అతని భాష కాబట్టి, అతని దేవతలూ అదే భాషలో మాట్లాడుతారని అతని నిశ్చితాభిప్రాయం. యీ సంగతటుంచితే, గాధాశప్తశతి లో, హాలుడూ, ఓదిసుడు, కుమారిలుడు, దుగ్గసామి (ఇది మన తెలుగు పేరువలెనే వుంది కదా) భిమసామి, చందసామి, విగ్గహరాయడు మొదలైన కవులూ, అణులచ్చి, అసులద్ది, పహయీ, రేవా, రోహా, వోహా, ససిస్సహా మొదలైన కవయిత్రులూ వున్నారు. , అత్తా(అత్త) అద్దాయే(అద్దం) తుప్ప(నేయి) రంప(రంపపుపొట్టు) మయిల (మైల) చోజ్జం(చోద్యం) వంటి తెలుగు పదాలు కూడా ఉండటం వల్ల, తెలుగు భాష ప్రాచీనతకు ప్రామాణికత చేకూరిన తృప్తీ దక్కుతుంది.

గాధాశప్తశతి ప్రధానంగా శృంగార కవితల (గాధల) సంకలనమని అందరూ అనే మాట! అందుకుతగ్గట్టే, చాలా గాధల్లో శృంగార, విరహ వర్ణనల్లో ప్రకృతిని అలంబనగా పెట్టుకోవటం సర్వ విదితమూ, యెక్కువ మంది కవులు అనుసరించిన పద్ధతి కూడా! అందుకు భిన్నంగా, ప్రకృతి సహజ సుందర రూపాన్ని, యే ఇతర కవులూ చేసి వుండని రీతిలో గాధల రూపంలో వర్ణించటం కొందరు గాధాకారులకే చెల్లిందని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఏ కవి దృష్టినైనా ప్రకృతి అందాలు ఆకర్షించినంతగా, తక్కిన దృశ్యాలు ఆకర్షించవు. అందరూ, వాటికే పెద్ద పీటవేస్తే, గాధాకారులు, మన చుట్టూరా కనపడే సాధారణ దృశ్యాలలోనూ అందాలను గ్గుర్తించి, కవితాత్మ నింపి, వాటికి కావ్యగౌరవాన్నివ్వటమేకాదు, పట్టాభిషేకం చేయటమూ గమనిస్తే, ఒళ్ళు పులకరిస్తుంది. , ఇపుడు మనం ఆధునిక సమాజావిష్కరణగా గుర్తిస్తున్న సామాజిక స్ఫృహ, ఆనాడే యీ గాధల్లో, కుప్ప తెప్పలుగా కనిపించటం - ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఉదాహరణకు యీగాధ చూడండి.

రుందారవింద మందిర మఅరందాణంది అలిరించోళీ

ఝణ ఝణఇ కసణ మణిమేహల వ్వ మహుమస లచ్చీయే (6-74)

వికసించిన అరవిందమనే మందిరంలో మకరంద పానము చేసి, ఆ మత్తులో, ఝుమ్మని నాదం చేస్తున్న భ్రమర పంక్తి యెలా ఉన్నది? వాసంత లక్ష్మి నీలమణిమేఖల వలె ఉన్నదట! ఆహా! యెంత మనోజ్ఞ కల్పన! వికసిత కమలమునే కాదు.అందులోని మత్తిల్లిన భ్రమరములను, వసంత లక్ష్మి నీలమణులు పొదిగిన మేఖలగానూ, వాటి ఝంకారాన్ని, ఆ మేఖల మృదునాదంగానూ తాను దర్శించటమే కాదు. పాఠకుల కన్నులముందూ ఆ దృశ్యాన్ని సాక్షాత్కరింపజేయటం లోనే యీ గాధాకారుని ప్రజ్ఞ ఇమిడి ఉంది కదా!

మరో అద్భుత కల్పన ఇదిగో! వుదయ సంధ్యాసమయాల్లో, ఆకాశం వైపు తలెత్తి చూస్తే, ఒకే వరుసన యెగురుతున్న చిలకల గుంపులు చూడటం - ఒక మధురానుభూతి యెవరికైనా! మనందరికీ ఒక అద్భుత దృశ్యంగా మాత్రమే కనిపించే యీ అందం, గాధాకారుని కళ్ళకెలా కనిపించింది?

వుఅ పొమ్మరాగ మరగఅ సంవలిఆ ణహ అలావో ఓఅరఇ

ణహ సిరి కంఠ భట్టవ్వ కంఠిఆ కీర రించోళీ (1/75)

ఆహా! ఆకాశాన యెగురుతున్న యీ చిలుకల రించోళి (గుంపు) యెలా ఉందో తెలుసా? అచ్చు గగన లక్ష్మి మెడలోనున్న పద్మరాగ మరకత మణిహారం, అలా ఆకాశం నుండి కిందికి జారుతున్నట్టుగనే వుంది కదూ!

ఇలాంటి సహజ సుందర దృశ్యాలను తమ కల్పనాశక్తి తో మరింత సుందరంగా దృశ్యమానం చేసిన గాధాకారుల వర్షఋతు వర్ణన యెంత ఊహాతీతంగా ఉందో మీరే చూడండి.

కత్థగఅం రఇ బింబం కత్థ పణట్ఠాఓ చంద తారాఓ

గఅణే బలాఅ పంతిం కాలో హోరం వ కట్ఠేఇ (5/35)

అరెరే! పట్టపగలు .. సూర్య మండలం యెక్కడికెళ్ళిపోయిందబ్బా? పోనీ చీకటి పడింది కదా!

చంద్రుడూ, చుక్కలూ యెక్కడ? ఈ రహస్యాన్ని చేదించడానికి, కాలమనే జ్యోతిష్కుడు, జ్యోతిశ్శాస్త్రాన్ననుసరించి, అకాశాన, సుద్ద ముక్కతో ఒక గీత గీచి, చూస్తున్నాడా అన్నట్టుందట, మబ్బులతో నిండిన ఆకాశంలో ఒకే వరుసన యెగురుతున్న కొంగల పంక్తి! (పై గాధకు శృంగార నేపధ్యం లో చేసిన గంగాధరవ్యాఖ్యలో, 'పిచ్చివాడా! సూర్య చంద్రులు సైతం కనిపించనంతగా, మేఘ చ్చన్నమైన మూసలాధార వర్ష కాలంలొ, నీవు భార్యను వదిలెలా వెళుతున్నావు?ఆడ కొంగలు సైతం యీ వర్షకాలంలోనే ప్రియునితో జంటకట్టి, సమాగమంలో మైమరచి, సంతాన భాగ్యాన్ని పొందుతుంటాయి. చూశావుగదా! నీవిప్పుడు నీభార్యను ఒంటరిని చేసి ప్రవాసానికి వెళ్ళకపోతే యేమౌతుందిట?' అని వ్యాఖ్యానించారు. ఇది విషయాంతరమైనా వ్యాఖ్యాకారుని చాకచక్యానికి జోహార్లనక తప్పదు కదా! ) ఇది చదివినప్పుడు, 'ఊర్ధ్వమూలమధశ్శాఖం' అంటూ - పురుషోత్తమ ప్రాప్తి యోగం (భగవద్గీత) లో ఇంతటి విశాల దృష్టితో ప్రకృతిని పరికించటం స్ఫురణకు వచ్చింది. అంటే గాధాకారుణ్ణి, గీతాకారుని సరసన కూర్చోబెట్టటమన్న భావన అనుచితంగా తోచవచ్చు కానీ, అంతటి గంభీరమైన దృష్టి లేశమాత్రంగానైనా, గాధాశప్త శతిలో దృశ్యమానమవటం గురించి ప్రస్తావించటం అనుచితమేమాత్రం కాదు కదా!

పురుషసూక్తంలో ఇంతటి గంభీరమైన నిశితమైన కల్పన మరొకటి, ఇదిగో!

నీలతోయద మధ్యస్థా ద్విద్యుల్లేఖేవ భాస్వరా,
నీవార శూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా.(11)



' జఠరాగ్ని నడుమ సూక్ష్మమైన అగ్నిశిఖ ఊర్ధ్వముగా పైకెగయుచున్నది. అది నీల మేఘము మధ్య మెఱపు వలె ప్రకాశించుచున్నది. నివ్వరి ధాన్యపు ముల్లువలె సూక్ష్మమై పచ్చని వన్నె కలిగి అది అణువుతో సమానమై ఉన్నది.'



ప్రాచీన సాహిత్యంలో మాత్రమే ఇంతటి విశాల కల్పనాదృక్కులతో భూమండలాన్ని వీక్షించగలిగే శక్తి కలిగిన ఋషులుండేవారన్నది కేవలం ఒక అపప్రథ మాత్రమే అని నిరూపిస్తున్నఇంకా కొన్ని గాధలు, గాధాసప్త శతిలో వున్నాయి.

ఇప్పుడు మనమంతా కార్మికులూ, కర్షకులూ కాయాకష్టం చేస్తున్న సమయాల్లొ, శ్రమతో కూడిన శ్వాసను, ఊపిరి ద్వారా, చిన్న ఊతపదాలతో బయటికి నెట్టే ప్రయత్నం చేస్తారని శాస్త్రోక్తరీతిలో అంటున్నాం కానీ, ఆరవ శతాబ్దం నాటి గాధాసప్తసతి లోని , యీ గాధలో ఆనాడే కార్మికుల అలవాట్లను అక్షరబద్ధం చేసిన వైనమిది!

అవిరల పడంత నవజల ధారా రజ్జు ఘడిఅం పఅత్తేణ

అపహుత్తో, ఉఖేతుం రస ఇవ మేహో మహింవు అహ (5/36)

వర్షాకాలం వర్ణన చక్కటి వుత్ప్రేక్షతో కూడినదిక్కడ! నిరంతర జలధారల రూపమైన రజ్జువులతో, అవనిని బంధించి, పైకి లాగాలని అసఫల ప్రయత్నం చూస్తున్నది మేఘం! మేఘం యెంతో కష్టపడుతున్నదనటానికి గుర్తు - అది చేస్తున్న హుంకారాలే! (భారీ వస్తువును లాగుతున్నప్పుడు, శ్రామికులు చేసే హు..హు..అన్న శబ్దాలే యీ మేఘమనే కార్మికుని ఉరుములు మరి. )

వింధ్య పర్వత శ్రేణులూ, ఆమ్ర అరుణారుణ పల్లవములూ, ఇంద్ర ధనుస్సులూ, కుసుంభ, కరంజ, కదంబ.అశోక వృక్ష శాఖలూ, నేరేడు పళ్ళ తీయదనాలూ, సాలె పురుగులూ, తేళ్ళూ, పావురాలూ, మైనా పక్షులూ, కాకులూ, జింకలూ, యెనుములూ, కోళ్ళూ..అబ్బో ..ఇవన్నీ కూడా గాధాసప్త శతిలో, సజీవంగా సందడి చేస్తుంటాయి. అలనాటి ప్రకృతి సహజ సుందర చిత్రణలో మేమూ భగస్వాములమౌతామని గాధాకారులముందే తమ విన్నాణాలను ప్రదర్శించి, లేఖినినందుకునేలా చేశాయంటే అతిశయోక్తికాదేమో! శ్రీ శ్రీగారే కాదు, అలనాటి సప్తశతీకారుడూ యీ మాట ఆనాడే అన్నాడు , 'కాదేదీ కవితకనర్హం' అని! మధుర పదార్థాలను పదిమందితోపాటూ ఆస్వాదించాలట! అంతేకాదు. కొద్దిగానే తీసుకోవాలట! అప్పుడే వాటి అసలైన మధురిమ తెలుస్తుంది. యీ లఘువ్యాసంలో, అలాంటి తీయని, మరచిపొలేని, మళ్ళీ మళ్ళీ కావాలనిపించే రుచిని మీకందించటమే వుద్దేశ్యం.
..........................








No comments:

Post a Comment