Monday, 11 January 2016


..................
      'వాడె  వెంకటాద్రి  మీద వరదైవమూ'.....వసంత రాగంలో మల్లాది సోదరులిద్దరూ గంభీరంగా   అన్నమయ్యను ఆలపిస్తుండటం-మార్గళి సంగీతోత్సవ  వీక్షణలో నాకు  మరింత హాయినిచ్చిన అంశం. హైదరాబాద్ సోదరులూ, సోదరీమణులూ కూడా చాలా సార్లే యీ మార్గళి వైభవాలలో పాల్గొన్నారు కానీ  వారి సంగీతాభినివేశం-చిన్న తెర  మీద యీ సంగీతోత్సవాల్లొ భాగంగా యూ ట్యూబ్ లో ఉంటుందేమో  కానీ, ఇప్పుడు వీరిరువురినీ చూస్తుండటం- తెలుగుదనము తీపిని పెంచింది!
 పైగా, మల్లాది సోదరులలో ఒకరు, అన్నమయ్య గురించిన కొన్ని వివరాలు కూడా పాట  పాటకూ ముందు ఇస్తూ ఉంటే (in tamil only)

 అనందం రెడింతలైంది. అన్నమయ్యను వెలుగులోకి తెచ్చిన ప్రాతస్మరణీయులైన పెద్దలు శ్రీమాన్ వేటూరివారూ, రాళ్ళపల్లి వారూ, గౌరిపెద్దివారూ, శ్రీపాద పినకపాణి గారలను ఆ వేదికపై  ప్రస్తావిస్తుంటే (వీరు స్వరపరచిన కొన్ని సంకీర్తనలను ఎమ్మెల్వీ అమ్మా, ఎమ్మెస్ అమ్మ ప్రాచుర్యంలోకి తెచ్చారని వివరణ కూడా)  ఆ సభలోని వారందరూ శ్రద్ధతో  విన్నారు. శతపత్ర సుందరుడు  బాలాంత్రపు వారినీ అన్నమయ్య స్వరకర్తలలో ప్రముఖులుగా పేర్కొని, వారినీ గౌరవాన్వితులను చేశారు. ప్రత్యేకించి నేదునూరి  వారి సంగీత  సామర్థ్యాన్ని ప్రస్తావించిన తీరు  బాగుంది. 1970లలో నేదునూరివారు  తిరుపతిలో సంగీత కళాశాలలో పనిచేసేటప్పుడు, టీ టీ డీ లో పనిచేస్తున్న శ్రీపాదరేణువు శ్రీమాన్ కామిసెట్టి శ్రీనివాసులుగారు నేదునూరి వారి దగ్గరికి వెళ్ళి,  స్వామీ! అన్నమయ్య సాహిత్యానికి సంగీత సౌరభాన్నద్దండి అంటూ  పదే పదే అభ్యర్థించారట!  నేదునూరివారు  ఇదేదో  చూద్దామని  మొదలు పెట్టటం ఆలస్యం..ఆ సాహిత్యాకర్షణ వారిని ఆవరించింది  పూర్తిగా! ఆ తన్మయత, జీవితాంతమూ  ఆ మాదిరిగా   వారిని ఆవహించే ఉండటం- మన అదృష్టమే కదా! అన్నట్టు వారు మొదట్లో (అక్కడే  వున్నప్పుడు) తను యేదైన కీర్తన  స్వర పరిస్తే,  స్వామి దర్శనానికి  వెళ్ళిపోయేవాళ్ళట! అక్కడ ముందుగా స్వామి  ముందు ఆలపించేవారట! ఆ విధంగా ఆ   ఆనంద నిలయుని ఆమోదాన్ని పొందినట్టే భావించి,  తరువాతే,  దాన్ని, సభావేదికలపై  పాడేవాళ్ళట!  అప్పటికే వారి సంగీత ప్రజ్ఞ సుప్రసిద్ధం ఐన, అ అఖిలాండ కోటి బ్రం హాండ నాయకుని ముందు యెంతటి ప్రముఖులైనా,  వినయంగా తల వంచవలసిందే అన్న విజ్ఞత నేదునూరివారిది మరి!
        కురంజి రాగంలో కంటి శుక్రవారము..అన్న సంకీర్తనలో  అన్నమయ్య అప్పుడే  ప్రత్యక్ష ప్రసార వ్యాఖ్యాత రూపం దాల్చాడు కూడా.  ఆ సాలిగ్రామ మూర్తి సొమ్ములన్నీ కడ (ఇది రాయలసిమ పదం . కడగా  పెట్టటమంటే, విడిగా పెట్టటం) బెట్టి, పన్నీరు తో అద్దారట!  వేష్టి (ఇది తుండు గుడ్డ అన్న అర్థన్నిచ్చే సంస్కృత పదమనుకుంటా!) చుట్టి, పచ్చ కర్పూరాన్ని  అద్దారట!  తుమ్మెద మైచాయతో.  నిత్య మల్లెపూవువలె  వెలిగిపోతున్న స్వామి కి తట్టుపునుగు కూడా దట్టంగా అద్దుతుంటే చర్మ చక్షువులతో చూసి తను తరించతమె కాక, సంకీర్తనారూపం లో అ వైభవాన్ని వివరించి, తరించాడా కారణ జన్ముడు! 
  యేమొకో చిగురుటధరమున (తిలాంగ్ రాగంలొ ) అన్నమయ్య శృంగార   సంకీర్తననాలపించిన  తరువాత   అవధారు రఘుపతీ అన్న కీర్తన ఖమాస్ లో జనరంజకంగా పాడినతరువాత కర్యక్రమం ముగిసింది..
    (కొసమెరుపు-మా శ్రీవారూ  నాతో యీ ఖమాస్ రాగ కీర్తన వింటున్నారు.  ఇంక కొంత సేపుంటే   బా గుండెది అనుకుంటూ,   నా   ఆనందాన్ని  మా వారితొ పంచుకుంటుంటే, ఠక్కున గుర్తొచ్చి అడిగానాయన్ను  'యేమండీ! యీ రాగంలో మీకు చాలా  ఇష్టమైన ఒక పాట ఉందాలి కదా?'  అని..ఓ పదిహేను ఇరవై సెకన్న్లు దీర్ఘంగా ఆలోచించి,  ఠక్కున పాటందుకున్నరు-'బ్రోచెవారెవరురా!'   అని. అరెరె..యెంత బాగా   చెప్పారో!  అప్పట్లో శంకరభరణం సినిమా పాటలంటే మా వారు చెవి కోసుకునేవారట! మా పెళ్ళి చూపుల్లో, మా మామగారీ  సంగతి గర్వంగా చెప్పారు. పెళ్ళి చూపుల్లో, నెనూ అదే కీర్తన పూర్తిగా పడితే, హాయిగ అందరూ విన్నరు. వెంటనే ఓకే కూడా చేశరు.. కూడా! మొత్తానికి ఖమాస్  రాగం మమ్మల్ని కలిపిన  రాగం  కూడా కదా మరి..!)  

No comments:

Post a Comment