కర్ణాటక శాస్త్రీయ సంగీతం కొండప్ప సారు దగ్గర చిన్నప్పటినుంచే నేర్చుకునేనాళ్ళలొనే శ్యామశాస్త్రి విరచిత భైరవి రాగ స్వరజతి నాకెంతో ఇష్టంగా ఉండేది. తెలిసీ తెలియని 8-9 యేళ్ళ వయసులోనే ఆ రాగం లో ఆ స్వరజతి పాడుతుంటే ఏదో తెలియని ఆవేదన సుళ్ళూ తిరుగుతూ కన్నీళ్ళరూపంలో బయటికి వచ్చేది. జన్మాంతర బంధమేదో ఉన్నట్టూ, ఆ తల్లి ముందు మనసంతా విప్పి మనోవేదన మొరపెట్టుకుంటున్నట్టు- యేదో భావన! కడప మోచంపేట విశ్వేశ్వరాలయంలో ఉన్న పార్వతీఅమ్మవారు దక్షిణ దిక్కుకు అభిముఖంగా ఉంటుంది. ఇది చాలా అరుదని అయ్య చెప్పేవారు. అయ్య వాల్మీకి రామాయణ ప్రవచనంకూడా 4 -5 యేళ్ళు నిరంతరాయంగా సాగిందక్కడ! నాకు 16-17యేళ్ళుంటాయేమో! ఊరికే వినటం కాక, నేనూ నా స్నేహితురాలు ప్రభావతీ నోట్ బుక్కులలో రన్నింగ్ నోట్స్ రాసుకునే వాళ్ళం. యెవరూ చెప్పకపోయినా మాకే తట్టిందలా! అక్కడి అమ్మవారిముందు మొక్కుతూ యీ పాట పాడుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటే, అదేదో తృప్తి ఆ రోజుకు! పెళ్ళై హైదరాబాద్ ఉ వచ్చాక, కర్ణాటక శాస్త్రీయ సంగీత పాఠాలు ఆకాశవాణి ప్రసారం కోసం (జూనియర్స్) చల్లా కృష్ణమూర్తి శాస్త్రిగారి దగ్గర మళ్ళీ నేర్చుకున్నప్పుడూ ఇదే భావన! నా అంతరంగంలో యీ స్వరజతి అలా సాస్వత ముద్ర వేసింది. ఈ రోజెందుకో వినాలనిపించి ఊ టుఓబ్ లో గాలిస్తే, యామినీకృష్ణమూర్తిగారి సాత్వికాభినయంతో పాటూ దొరికి, మాటలు మరచి ఆనంద బాష్పాలతో చూశాను. మా దూరదర్శన్ తప్ప ఇలాంటి అద్భుత కార్యక్రమం ఇతరులెవరైనా చేయగలరా అసలు? పక్కా వ్యాపార ధోరణిలో తమ రేటింగులు పెంచుకునే ప్రయత్నాలే తప్ప మన సంస్కృతీ సంప్రదాయం విలువల గురించి పట్టించుకోని చానళ్ళ వలలో బ్రతుకీడుస్తున్న ఇప్పటి జీవితాలపై యేడుపు తన్నుకుని వచ్చింది మళ్ళీ! అమ్మా! జగజ్జననీ! యీ విషవలయం, మాయాజాల జగతి అనే దానవ సంస్కృతి నుండీ మమ్మల్ని కాపాడు తల్లీ! రెండురోజుల్లో ఇక్కడికి వస్తున్న నీ కుమర రత్నాన్ని నీకొక నివేదిక తయారు చేసి పంపమని చెప్పు, అది చూసి నీవే ఒక నిర్ణయం తీసుకోవాలి మరి!
యామినీకృష్ణమూర్తిగారు యీ పాట నాట్యాభినయానికి తగిన లయను యెన్నుకోవటమూ ఎంతో సముచితంగా ఉంది. సాహిత్యంలోని ప్రత్పదాన్నీ ముద్రలతో సంపూర్ణార్థం ఇస్తూ అమ్మవారి గంభీరమైన నడకనూ దీన భక్త హృదయవేదననూ భావాభినయం ద్వారా నేత్ర సంచలనాలతో ప్రకటిస్తూ చేశారు. కంచి కోవెల బ్యాక్ డ్రాప్ యెన్నుకోవటం కూడా, కార్యక్రమ నిర్వాహకుల నృత్యోచితంగా ఉంది. మంత్రపూరితమై, వుపసనాసక్తి కలిగిన శ్యామశాస్త్రిగారి సాహిత్యానికి, నృత్యం- బంగరానికి తావి అబ్బినట్టే! అందుకే, ఇటువంటి సాహిత్యాన్న్నీ, సంగీతాన్న్నీ అమ్మవారి అమృతోపమానమైన క్షీరధారలుగా తపస్సంపన్నులు వర్ణించారు. సాహిత్యంతో పాటీ వీక్షిస్తే మరింతబాగుంటుందనే భావంతో..ఇదిగో మీ కొసం...
ప) కామాక్షీ అంబా! అనుదినము మరువకనే
నీ పాదములే దిక్కనుచు నమ్మితిని శ్రీ కంచి ||కామాక్షీ ..............
1) కుందరదనా! కువలయ నయనా! తల్లీ రక్షించు || కామాక్షీ..............
2) కంబుగళ నీరద చికురా! విధు వదనా! మాయమ్మ || కామాక్షీ.............
3) కుంభ కుచ! మద మత్త గజగమ! పద్మభవ, హరి శంభు నుత పద!
శంకరీ! నీవు నా చింతల వేవేగ తీర్చమ్మా ఇపుడు || కామాక్షీ................
4) భక్త జన కల్ప లతికా! కరుణాలయా! సదయా! గిరి తనయ కావవే!
శరణాగతుడ కదా! తామసము సేయక వరమొసగు || కామాక్షీ................
5) పాతకములను తీర్చి నీ పద భక్తి సంతతమీయవే! (సంపదనీయవే!)
పావని కదా! మొరలిడగా (మొర వినవా?) పరాకేలనమ్మా? వినమ్మా || కామాక్షీ ............
6) కలుష హారిణి, సదా నతఫల దాయకి యను (యని) బిరుదు
భువిలో కలిగిన దొరవనుచు వేగము మొరలిడగ విను || కామాక్షీ...............
7) నీప వన నిలయా! సుర సముదయా! కర విధృత కువలయా!
మద దనుజ వారణ! మృగేంద్రాశ్రిత! కలుష దహన ఘనా!
అపరిమిత వైభవము కల నీ స్మరణ మదిలో కలిగిన (తలచిన) జనాదులకు
బహు సంపదలనిచ్చేవిపుడు మాకభయమీయవే || కామాక్షీ...............
8) శ్యామ కృష్ణ సహోదరీ! శివ శంకరీ! పరమేశ్వరీ!
హరి హరాదులకు నీ మహిమలు గణింప తరమా?
సుతుడన్న అభిమానము లేదా నాపై?
దేవీ పరాకేలనే? బ్రోవవే ఇపుడు శ్రీ భైరవి || కామాక్షీ...............
(15-9-2015)
...........................
No comments:
Post a Comment