Monday 14 September 2015


విశ్వనాధ వారి కల్పవృక్షంలో సీత(నా పరిశోధనలోనుండి కొన్ని అంశాలు) 
ఆధునిక రామకావ్యాలలో విశ్వనాథ వారి కల్పవృక్షం, ఒక కమనీయ రమణీయ శిల్ప వృక్షమే!అందులో సీతారాముల గురించిన సన్నివేశాలు అత్యద్భుతాలు.  
..................
పరశురామ గర్వభంగం ఘట్టం కల్పవృక్షంలో నన్ను అమితంగా ఆకర్షించింది. సీత లక్ష్మీతత్వం, రాముని విష్ణుతత్వం రెండింటి అపూర్వ సంగమం మిథిలలో జరిగేలా చిత్రించటం జరిగిందిక్కడ. 
   మిథిలా  శృంగాటకముల పృథులంబగు విషయమట్లు వినబడియెడు, శ్రీ
   మధురాకృతి సీత ధరకు మధుసూదను రాణి వచ్చి మన్నించినటుల్, 
   మధురాకృతి మా రాముడు, మధుసూదనుడౌనొ కాదొ, మధుసూదను నం
   సధురాఖ్యాతుని భార్గవునధరీకృత తీజుజేయుటది యద్భుతమే! 
రాముని సంపూర్ణ వైష్ణవతేజాన్ని దర్శింపజేయటమే, యీ సన్నివేశం ముఖ్యోద్దేశం.

           కల్పవృక్షం సీత రామునికి బ్రహ్మానంద  సంధాయనిగా కనిపించిందనటం అతి ఉదాత్తమైన కల్పన. 'తన ప్రతిబింబమే, తన యెదుట నిలిచిందా అన్నట్టుగా రాముడు సందేహించాడట కూడా! సాక్షాత్ విష్ణువే, రామునిగా అవతరించినా, మానవజన్మ కాబట్టి, మానవ సహజమైన భావనలు అతనిలో కలగటాన్ని విశ్వనాథవారు అత్యంత హృద్యంగా వర్ణించారు.
  సంకల్ప సంభవాస్థానమౌ తెరదోచి వంచీకృతంబులౌ ప్రాణములును,
  దెరవెంక ప్రతిబింబ ధీధితుల్ ప్రకటించి తనకు మించిన మోహనముగ వెలిగి,
  తనుదాన రాముడయ్యును విస్మరించి తత్ప్రతిబింబమునయందు రాముడౌచు, 
  తెరదీసినంతనతెలిసి నిజ స్వరూపంబు బ్రహ్మానంద పరిధియౌచు, 
  యెంతటి మహీయుడయ్యును నినకుల  శిశు  వింత గణనీయుడై సర్వ సృస్టిసహజ 
  మైన విభ్రాంతినొందె మోహజమైన వికృతి నలుగురితోబాటు విస్తరించు, 
  .                                                         (బాల/కల్యాణ/)
....................... 
  మంగళసూత్రధారణవేళ రాముని కరస్పర్శ వల్ల సీత శరీరం, పులకాంకితమైంది. తలంబ్రాలవేళ, ఆమె నుదుటిచెమటకంటుకుని నిలచిన రెండు ముత్యాలు రామునిలో పులకింతకు కారణమయ్యాయట! 
           అలుపములు రెండుముత్యాలు నిలిచి సీతపాపిటలో చిరు చెమటపోసె,
           హత్తుకుని గంధపూతముత్యాలు రెండు రాముని మేన ధారకలు పొలిచె 
                                               (కల్పవృక్షం/బాల/కల్యాణ/84వ పద్యం) 
...............................  
           నవోఢ సీత, రాముని అల్లంత దూరాన చూడగానే, సిగ్గుతో పారిపోతుందట! అతను తన దగ్గర నిల్చుంటే, వినమ్రంగా తానూ లేచి నిల్చుంటుందట! యెదురెదురుగా ఉన్నప్పుడు, నిశ్చల సరసివలె, స్థిరముద్రలోకి వస్తుందట! రాముడటుగా వెళ్తుంటే, ఆ చంద్రకాంతిని కళ్ళారా చూడలన్న కాంక్షతో విస్ఫారిత నేత్ర అవుతుందట! నిత్యమూ సంబోధనసుఖాన్ని అతనినుండీ పొందగోరుతుందట ఆమె హృదయం! (కల్యాణ/161) వారిరువురి పరస్పర భావనలు చూస్తే, వారే ప్రకృతి-పురుషులా అనిపిస్తుందంటారాయన..ఆ ప్రేమ సహజతి సహజం. కృత్రిమతకు తావు లేనిది. నిత్య నూతనత్వం వుంది వారి దాంపత్యంలో! సర్వజ్ఞులూ, మర్మజ్ఞులూకూడా! తాము యుగయుగాలుగా, కల్పములుగా. పతిపత్నులుగా ఇలాగే కలిసి ఉన్నామేమో అనిపించేలా ఉంటారట!(పైదే-176వ పద్యం) సీత జ్యోతిస్వరూపిణిగా, రాముని మదిలో ప్రభాలోకావిష్కరణ చేసిందట..(పైదే-266వ పద్యం) వారిరువురిదీ ఒక అద్వైత ప్రేమ. (దేహమ్మునందు నేనొకాదొ వచింపగలేనుగాని, యాత్మ నిన్ను నిత్యంబుగా హత్తుకొందు-267వ పద్యం) సీత పార్వతి ఐతే, రాముడు పరమేశ్వరుడు. సీత లక్ష్మి. రాముడు సాక్షాత్తూ  శ్రీమన్నారాయణుడే!  భవిష్యత్తుకూడా ముందే వారికి తెలుసునుకాబట్టి, ఇప్పుడు వారిరువురూ, వియోగావస్థకు అవకాశమే ఇవ్వటంలేదట! 
..........
అనేకాభరణాలతో సీతను రాముడు స్వయంగా అలంకరిస్తాడట!  పాదాలకు లాక్షారసం పూస్తాడట! కల్ హార   మాలలతో కంఠాన్నీ,కేశరాసినీ అలంకరించి, వీక్షించి ఆనందిస్తాడటకూడా! వైదేహి,  మైథిలి,  జానకి-ఇలా పలు నామములతో ఆమెను సంబోధిస్తూ తన ప్రేమను పలువిధాలుగా ప్రకటిస్తాడట! బ్రహ్మజ్ఞాని  జనకుని పుత్రి ఆమె.తన మామగారిపట్ల గౌరవాన్ని అలా ఆమె తండ్రి పేరుతోనే కలిపి సంబోధించటం ఆతనికిష్టం.(290 వ పద్యం) 
    సీత శ్రీరామచంద్రుని  చిత్తపదము, రామచంద్రుడు జానకీప్రాణప్రదము,
    రామ సర్పఫణామణి రమణి సీత, ధరణిజాజీవితతపహ్ సరణి స్వామి
                                             (291వ పద్యం)
  ఇలా సీతారాముల దాంపత్య వర్ణనలో శృంగార, వైరాగ్య భావనల మనోజ్ఞ సమ్మిశ్రణం కల్పవృక్షకారుని మౌలిక కల్పనాచాతుర్యం. గంగాయమునల సంగమంలా అతి పవిత్రమూ, ఉన్నతమూ కూడా! అన్య రామకావ్యాలలో కనపడని యీ భావుకత కల్పవృక్షంలో పరవళ్ళు తొక్కుతూ పఠితలను ముగ్ధులను గావిస్తుంది. విభిన్న ఋతువుల పరివర్తనననుసరించి సీతారాముల ప్రేమ కర్మ వికాసాన్ని చిత్రించటంకూడా ఇందులోని అద్భుతం. వారిరువురి ప్రేమలో ముగ్ధత్వమూ, గంభీరతా, ఔన్నత్యమూ, లోతూకూడా ఉన్నాయి. ఇదే విశ్వనాధవారి ప్రత్యేకత. రససిద్ధులైన సుకృతులైన కవీశ్వరులకు నిత్యమూ జయమే!
.....................
విశ్వనాధ కల్పవృక్షంలో నన్నాకర్షించిన మరో ఘట్టం- సుమంత్రానీత రథంపై వనవాసానికై రామునితోపాటూ సీత వెళ్తున్న వర్ణన. 
        త్రయ్యధ్వమున  స్వరితానుదాత్తములచే దీపించెడునుదాత్త దీధితివలె, 
        సత్వ రజోగుణ సంసేవితంబైన లీనతమోగుణ రేఖవోలె,
        నీశాన్యమాజ్ఞేయమిరుదెసన్ బలిసిన ప్రాచీదిశాకంతి భరమువోలె,
        నాదివరాహ దంస్ట్రాగ్ర శేషాహి ఫణాగ్ర భూషిత వసుంధరమువోలె, 
      హృషిత నారద తుంబురు ఋషి విపంచికాసమాభిసేవిత సామగానవిద్య
      వోలె శ్రీజానకీదేవి వొలిచెనంత ప్రభుతమెయి సుమంత్రానీత రధముమీద.
                               (కల్ప/అయోధ్య/ప్రస్థాన/279వ పద్యం)
  స్వరిత, ఉదాత్తానుదాత్తాలతో సమ్మిళితమైన  వేదనాదంవలె  ఉన్నదట సుమంతుని రధంపై వనవాసానికి ప్రయాణమైన సీత! సత్వ రజోగుణాలతో సేవింపబడే తమోగుణ రేఖవలె ఉన్నదామె. ఈశాన్యమూ,ఆగ్నేయములలో వెల్లివిరుస్తున్న ప్రాచీదిశాకాంతివలె, ఆదివరాహ దంస్ట్రాగ్రభాగాన నిలిచిన వసుంధరవలె దర్శనమిస్తున్నది. నారద తుంబురు ఋషివందిత సామగానవిద్యే ఆమె.  అంతేనా? 
  బుధ్యహంకార యుగళాత్తమధ్యభాగ  నిహితమన ఇంద్రియంబుల నెగడు తెలివి
  రాణమెయి సుమంత్రానీత రధముమీద జానకీదేవి సర్వ భూషణయు బొలిచె 
                       (పైదే/అయోధ్య/ప్రస్థాన/280వ పద్యం) 
    బుధ్యహంకారముల మధ్య  నిలచిన మేధవలె,  సర్వభూషణాలంకృత సీత సుమంత్రుని రధంపై నిలిచింది. ఇంతకంటే మించిన మరో వర్ణన ఇదిగో...
  నిరుదెసన్ రామలక్ష్మణులిద్దరొలసి తుండములువోని ధనువులతోదనొప్ప,
  రక్తిమెయి సుమంత్రానీత రధము మీద జనకీదేవి గజలక్ష్మిసరణి బొలిచె
                       (పైదే/అయోధ్య/ప్రస్థన/278వ పద్యం) 
 రామలక్ష్మణులనే మహాగజములు అటూఇటూ నిలువబడియుండగా, ఆసీనురాలైయున్న గజలక్ష్మివలె సీత దర్శనమివ్వటం అనితరసాధ్యమైన,విశ్వనాధవారికి మాత్రమే సాధ్యమైన  కల్పన. మార్గాయాసాన్ని  పోగొట్టేందుకూ, ఉల్లాసంగా ఉంచేందుకూ రాముడు ఆమెకు ఫలపుష్పాదులను అందిస్తూ, వనంలోని తరుబృందాలనూ, జీవజంతువులనూ పరిచయంచేస్తున్నాడట కూడా!
  సీతకు మార్గాయాసమే లేదు. ఆమె కోమలచరణాల లాక్షారసం సైతం వివర్ణమవనేలేదు. తీవ్రమైన యెండవేళలోనూ, ఆమె తనువు వాడిపోలేదు.ఆమె ముఖారవిందంలో  యెల్లప్పుడూ ప్రశాంతతే కనిపించింది. 
   అడవిలోనడచినయప్పుడైనను దల్లి చిరుకాళ్ళపారాణి జెరగలేదు,
   కోసయెండలు తలన్ గుప్పుచున్ననునైన గోడలి వదనంబు వాడలేదు, 
   బడలిక యెంత చొప్పడిన జెమ్మటబోసి చిరుత కుంకుమబొట్టు చెరగలేదు, 
   వడగాలిరివ్వున బారదోలినను  యల గంధపుంబూత యారలేదు,
     తల్లిడయ్యదు,చిరునవ్వు వెల్లిమొగమునందు దొలగదుతల్లికేమమ్మదల్లి,
     జానకీ భీతి నీకవసరములెదు, కడుపుగూర్చిన బెదరంతకంటె లేదు
                  (పైదే/అయోధ్య/మునిశాప/12వ పద్యం)  
..................   
 అరణ్యకాండలో శరభంగాశ్రమం. వానప్రస్థాశ్రమ మునులప్రార్థనలను విన్నరాముడు, వారిని దానవులబారినుండీ రక్షిస్తాననీ, ఆయుధధారణచేసి దానవులను తుదముట్టిస్తానంటాడు. రామునికి సీత అడ్డుచెబుతుంది. 'అసలు మనం వనవాసానికి వచ్చినదెందుకు? శాంతిగా ప్రకృతిమధ్య బ్రతికేందుకుకదా? అలాంటిది, వాళ్ళేదో అలా అడగ్గానే ఇలామాటైచ్చివేయటంలో అర్థం ఉందా అసలు? మహబాగాఉందిలెండీ  అని అచ్చం తెలుగింటి ఇల్లాలివలె భర్తతో వాదనకు దిగుతుంది.విశ్వనాధవారి కలానికి యీ ఘట్టంలో  - బహుశా వారి ఇంటివాతావరణం గుర్తుకు వచ్చిందేమోమరి! (కల్ప/అరణ్య/193వ పద్యం) అకారణ ద్వేషాలు హానికారకాలు అంటూ హితవు పలుకుతుంది కూడా! కానీ రాముని మనసు తోణకదు.పైగా 'ప్రతిజ్ఞాపాలనలో నేను నిన్నూ, తమ్ముణ్ణీ కూడా వదిలివేసేందుకు సిద్ధమే' అనటంచూసి సిత పతిచేతిలోని ఖడ్గాన్ని తాను తీసుకుని ముందుకు అడుగేసిందంటారాయన! ఇలా స్త్రీని  సబలగా కూడా కూడా చూపే ప్రయత్నం చేశారు విశ్వనాధవారు. 
....................
కల్పవృక్షంలో సీతాపహరణంలో  చాయాసీత గురించి స్పష్టంగా  చెప్పలేదుకానీ,వివిధ సందర్భాలలో చాయాస్వరూప వృత్తాంతం ధ్వనిస్తుందంతే! రావణుడు సీతను పలురీతుల భయపెడతాడు. అన్నీవిన్న సీత, తాపీగా, 'అలాగా! అదుగో! నా నాధుడొచ్చేస్తున్నాడు. కాసేపాగవయ్యా' అంటూ, కుటీరంలోకి వెళ్ళిపోతుంది.(అరణ్య/జటాయు/82వ పద్యం) అపహరణసమయంలోనూ 'వట్టికట్టెను తీసుకుని వెళ్తున్నావే!' అని హాస్యమాడుతుంది కూడా! (పైదే/292వ పద్యం) యుద్ధభూమిలో రావణుడు సంశయంలో పడతాడు 'అసలు నేను సీతను అపహరించుకువచ్చానా లేదా!' అని! (పైదే/335వ పద్యం) 
...........
అశోకవనంలో సీత యెలాఉంది? 
    ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్ బొమ తీరు స్వామి చా
    పకృతి కన్నులన్ ప్రభుకృపాకృతి కైశికమందు రామదే
    హాకృతి  సర్వదేహమున యందున రాఘవ వంశమౌళి ధ
    ర్మాకృతి  కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞ ముర్తియై. . 
                            (సుందర/పరరత్ర/139వ పద్యం)
       సిత కనుబొమలతీరు రాముని బాణములవలె ఉన్నది.ఆమెకన్నులలో స్వామి కృప  మూర్తికట్టినట్టుంది. ఆమెదేహం మొత్తం రాఘవ వంశమౌళి వలెనే అనిపించటంలో కల్పవృక్షకారుని కల్పన అత్యద్భుతం.      
  ........................
 లంకనుండీ,అయోధ్యకు తిరిగి వెళ్ళేసమయంలో పంచవటిలో పుష్పక విమానం ఆగుతుంది. సీత కిందకు దిగి తమ కుటీరంలోకి వెళ్తుంది. లోనికి వెళ్ళిన సీతా, బయటికివచ్చిన సీతా- ఇరువురి మధ్యకనిపించే భేదాన్ని కల్పవృక్షకారుడిలా చిత్రించాడు.
    లోనికి జన్న పృధ్విజ విలోకనలోక జయ ప్రగల్భ, ప్ర
    జ్ఞానిధి, సిమ్హయాన, వికసన్నవలోచన పుండరీక, ర
    షోనివసంబునందగడు సొచ్చిన శీర్ణతణూ ప్రబంధ సం
    ధ్యా నవవహ్నికావిరచితాకృతి, యాకృతి మత్ప్రతిజ్ఞయున్. 
                               (యుద్ధ/ఉపసమ్హరణ/270వ పద్యం) 
 లోనికి వెళ్ళిన సీత, సింహగమన. విజయవిలాసిని.అగ్నిదేహిని.స్వర్ణకాంతిమయి.మరి కుటీరమ్నుంచీ వెలుపలికి వచ్చినె సీతో? మందయాన. మృదుశరీర. పతివెంట సుందర సుకుమరంగా, వనవాసానికి వచ్చిన అంతిపుర వనిత. ఈ వర్ణనద్వారా, లంకనుంచీ  వచ్చిన  సీతను, చాయాస్వరూపిణిగా, అయోధ్యకు రామునివెంట ప్రయాణమైన సీత అసలైన సీతగానూ ధ్వనింపజేశారు విస్వనాధవారు. అధ్యాత్మ రామాయణప్రభావం ఇక్కడ సుస్పష్టం.   
..................  
 అశోకవనంలో రావణుడు, అక్కడి స్త్రీలకు, సీతను జాగ్రత్తగా ఎలా చూసుకోవాలో నొక్కిచెబుతాడు. ఆమె నోరుతెరచి అడుగకముందే ఆమెకవసరమైన వస్తువులన్నీ సమకూర్చవలెనట! నిరాదరణభావం చూపకూడదట! యెండ తగులరాదు. నొసటిపైకూడా మబ్బురేకలనీడ మసలనేరాదట! చలిగాలి దోపరాదు. పూవులధూళికూడా ఆమెపై పడకూడదుసుమా!' (అరణ్య/జటాయు/332వ పద్యం) ఈ మాటలలో సీతపట్ల అతనిమనసులోఉన్నది దైవీభావంగానే ధ్వనింపజేశారు కవి. అది, భక్తుడు-భగవత్ శక్తీకీ  మధ్యనున్న భక్తితోకూడిన భయమేననిపిస్తుంది.  అతనిమనసులో సీత స్థిర నివాసం యేర్పరచుకుంది. భక్తుడు తన ఉపాసనామూర్తికి తనగోడు విన్నవించుకున్నట్టే, రావణుడితో సీతను 'నన్ను కృపానేత్రము విచ్చి ఒడ్డుకు చేర్చమనీ, నా భావనేత్రపధంబున నిన్నే పదిలపరచుకొన్నాననీ' చెప్పిస్తారాయన! చివరికి రాముని శరాఘాతాలతో నేలకొరిగిన దశలోనూ, రామునిలోనూ సీతనే దర్శించేలా రావణుని మలచారు. (పైదే/384వ పద్యం)   
....................... 
రామలక్ష్మణుల మాయాశిరస్సులను చూసిన సీత, రోదిస్తున్నది. రాముని ఆగమనవార్తను మోసుకునివచ్చిన ఒక హంస, అక్కడి అశోకవృక్షశాఖలపై, సరిగ్గా, ఇదివరకూ, హనుమ కూర్చుని కనిపించినచోటే ఉన్నది.సిత యేమనుకున్నది? 
    అపుడు కపిరాజు పరమేశుడిపుడు హంస ప్రాపణము గాంచగ బరస్పర ప్రవృత్తి,
    ఇంత శుభహేతువుండునటే లతాంగి కపి వృషాకపులటునిటు గాంచియుంట.
                                           (యుద్ధ/సంశయ/90వ పద్యం)
     ఈ కల్పనకు ఆధారం వేదాంతదేశిక విరచిత 'హంససందేశ   కావ్యమనవచ్చు.అందులోనూ ఇలాగే హంస రామసందేశాన్ని సీతకు అందిస్తుంది. ఈ సంస్కృత రచనను కృష్ణామాత్యుడన్న తెలుగు కవి అనువదించాడుకూడా! 
.............................  
 నాగపాశ బద్ధులైన రామలక్ష్మణులనిరువురినీ, కాపలా స్త్రీలద్వారా  చూపించి రావణుడు, ఇంకేముందీ? నీ భర్త పరలోకగతుడైనాడంటాడు. కానీ, త్రిజట, కాదు, వారి ముఖాలింకా తేజోవంతంగానే ఉన్నాయనిచెప్పి సీతకు ధైర్యాన్నిస్తుంది. అప్పుడు సీత, మునుపెవ్వరూ మొక్కని మొక్కు మొక్కుతూ, నా భర్త మోహనరూపుడైన రాముడీ ఆపద దాటితే, నేను అగ్నికి ఆహుతవుతానని ప్రతినబూనుతుంది (358వ పద్యం)అన్నదమ్ములను రక్షించు. నేను అగ్నిప్రవేశం చేస్తాను. హుతవహా! నా యెదలోనున్న దీపాన్ని ఆర్పివేయకుమయ్యా! అని వేడుకుంటుంది. రాబోయే అగ్నిప్రవేశ ఘట్టానికిది సూచనగా విశ్వనాధవారు మలచారు.   
................
        రాముని కఠినోక్తులను విన్న విశ్వనాధ సీత ఆడుది అని చులకనగా రాముడు మాట్లాడటాన్ని అడ్డుకుంటుంది.
          ఆడది ఇంతసేయుననుటన్నది ఉన్నదె యంచునన్ను మా
          టాడితి కైక కోరక మహాప్రభు! నీ వని రాక లేదు, నీ
          యాడది సీత కోరక మహాసుర సమ్హరణంబులేదు, యా
          యాడది లేక లేదు జగమంచు నిదంతయు నేన చేసితిన్..
                                                                                                                  (పైదే/154వ పద్యం) 
 అంతేకాదు. మన  ఇద్దరిదీ ఒకే రూపం. ఇది సత్యం.లొకకల్యాణంకోసమే ఇరువురమైనాము. ఒకే దీపశిఖకు రెండుభాగాలు మనం. కేవలం పరమ శివునికి మాత్రమే యీ రహస్యం తెలుసును.నేను ప్రకృతిని. నీవు పురుషుడవు.  అంతే! అనికూడా కుండ బద్దలుకొట్టి చెబుతుంది. 
...................
అగ్నిప్రవేశానంతరం దెబ్బతిన్న మనసుతో సీత ' నా మనసెంతో దెబ్బ తిన్నది. మా తల్లి ధరణి  వద్దకు వెళ్ళాలనిపిస్తున్నది. కానీ, చెడి పుట్టినింటికి  వెళ్ళకూడదంటారు కదా! అది గుర్తుకు వచ్చి, యీ జీవితాన్నిక్కడే అంతమొందించుకోవాలనిపించింది. కానీ అగ్నిదేవతవల్ల మిమ్ములనిలా కలిశాను మళ్ళీ అంటుంది, ఆవేశంగా! (పైదే/210వ పద్యం) ఇక్కడ సీత ఆత్మాభిమానం వెల్లడవటమే కాక, ఉత్తరకాండకు బీజారోపణ కూడా జరిపించారు కవి. అయోధ్యకు  తిరుగు ప్రయాణంలో అనసూయను కలిసినప్పుడు, ఆ మహాసాధ్వి, శ్రమపడి, విమానమెక్కి, తాను మరచేపోయానంటూ, సీతచేతిలో రెండు ఫలాలుపెట్టి ఆశీర్వదింపజేయటం-  విశ్వనాధవారికి మన తెలుగు సంప్రదాయాలపట్ల ఉన్న మక్కువ కాక మరేమిటి? 
  ఇలా తన కల్పవృక్షాన్ని రమణీయ కావ్యవృక్షంగా మలచిన విశ్వనాధవారు తెలుగువారి వాల్మీకే! 

.................................................      

No comments:

Post a Comment