రామ నవమి వచ్చె, రారటే ఇక మీరు,
రామ, సీతను తోడుకొని ఇచటికీ
రామ, జగదభిరామ,రమణిలలామ,నా
రామ హృదయములోన కొలువు దీర్చ !!!
పందిళ్ళు వేయరే, పాటలూ పాడరే
పారాణి దిద్దరే పాదములకు,
పాపిట బొట్టెట్టి పసిడి నగలే పెట్టీ
పట్టు పీతాంబరము కట్టించరే! !!
సీతనూ, జనకుని తనూజనూ,
వికసిత సరోజనూ గెలచెనూ రఘురాముడూ,
రామునీ దశరధ సుపుత్రునీ
గాధేయు శిష్యునీ, పత్నియౌ సిత నేడు!!!
మల్లెలూ, మొల్లలూ, మరువమూ దవనమూ
మాలలందున చేర్చి అల్లరమ్మా,
మల్లెమొగ్గంటి మన జనకజను చేపట్టి
మహరాజు రాముడూ మురియునమ్మా!!!
వారిజాక్షూలార! వేగరా రండమ్మ,
వన్నె వన్నెల ముగ్గులేయరమ్మ,
ముత్యాలు రతనాలు కెంపులతొ బాగుగా
ముచ్చటగ చూచి కడు మురియరమ్మా !!!
జనకుడూ పత్నితో వేచిఉన్నాడమ్మ
జనకీ,రాములను చూడ వేగ
అదిగదిగొ దశరధుడు, తన పరిజనముతో
విచ్చేసినాడుగా కడు వేడ్కగా!!!
కౌసల్య, సూమిత్ర, కైక తన వెంట జన
కులగురువు మాన్యుడౌ వసిష్టుడూ
సకలురూ ముదముతో వీక్షించు చుండగ
పండితోత్తములెల్ల దీవించిరీ !!!
'నా పుత్రి సీతనూ నీకప్పగించితిని
ధర్మపత్నిగ నీవు స్వీకరించా,
ధర్మ బద్ధముగాను యేలుకో రఘురామ!
ధర్మ సంరక్షణము చేయ నీవూ,
రఘురాము పత్నిగా, జనకుని తనూజగా
కడు కీర్తి దెచ్చునూ నా పుత్రికా'!!!
అంతట పలికినది జనకపత్నీ తనదు
చెరగుతో కన్నీరు తుడుకొనుచూ
'అవని వంటీ సహనమబ్బినది సీతకూ
కడు శాంత సుందరము తనదు మనసూ
పుట్టినప్పటినుండి, ఇప్పటీ దాకనూ
కంటిపాపగ తాను పెరిగెనమ్మా!!!
ఇలుదీర్చి పెద్దలకు తలవంచి మెలిగేటి
మంచి బుద్ధులు తనకు నేర్పినానూ
అత్తగా, తల్లిగా ఆదరించగవలయు
నీ వంశగౌరవము - మా సీతనూ'!!!
కౌసల్య తాగూడ ఆర్ద్ర హృదయమ్ముతో
అటు పల్కె 'మీ సీత మా సీతగా
కడు ముదముతోనుండు, మా ఇంట మీ పంట
మాదు రఘు వంశ సత్కీర్తి నిలిపీ' !!!
పుష్ప వర్షము కురిసె గగన వీధులనుండి
పులకాంకురితమయ్యె ధరణి యంతా
పులకలూ రేగినవి తనువున సీతకూ
కడు శితలము రాము కరస్పర్శ తో !!!
వంచినా తల యెత్తి రాము మొగమును జూడ
సకియలందరు చాల మేలమాడా
అరుణారుణములైన తన కరములందునా
నీల మేఘపు చాయ ప్రతిఫలింపా !!!
తరుణి జానకి తనదు, వరుని వర్ణముగాను
దలచి తా ముగ్ధమోహనమాయెనూ,
తలవంచి యున్నట్టి సీత చేతులలొని
రతనాల గాజులా, రాము రూపూ,
కనుపించగా సీత సిగ్గులా మొగ్గాయె
అట్టి సీతకు హారతూలెత్తరే!!!
నీల గాత్రునకునూ అరుణ పల్లవమునకు
ఆకాశమంత పందిరిలోననూ
ఆరు నూరేళ్ళకూ అజరామరమ్ముగా
జరిగినది కల్యాణ వైభోగమూ'!!!
జగములన్నిటిలోను పరమతారకముగా
జగతి కల్యాణమునకాకరముగా
జగమేలు స్వామిగా, జగములకు తల్లిగా
తనరారునీజంట నిజముగానూ!!!