' అనగనగా ఒక లేడి'
బోను లో లేడి..
ఒక స్వరం..
'రాత్రి తొమ్మిదింటి తరువాత ఆడదానికి రోడ్ల పైన యేమి పని?..
వస్తే వాళ్ళ బ్రతుకు కుక్కల పాలే..'
లేడి మనసులో సందేహం..
'చర్చిలో ఉన్న ప్రేమమూర్తి సంగతో?'
మరో స్వరం.
'ప్రేమా దోమా అంటూ మగాళ్ళ వెంట పడితే యేమౌతుందీ?
తక్కిన వాళ్ళ కళ్ళూ పడవూ మరి?'
లేడి గుండె గొంతులోకి వచ్చింది.
'మరి మీ ప్రేమను అంగీకరించని ఆడపిల్లపై ఆసిడ్ యెలా పోశారు?'
మరో కరుడు కట్టిన స్వరం.
'పైటలేసుకునే వయసు నుంచే ప్రణయ పాఠాలూ, వెకిలి డ్రెస్సులూ..'
లేడి కళ్ళళ్ళొ యెరుపు జీరలు..
'అంకుల్..అనటనికే సిగ్గుగా ఉంది. కానీ, మీ వయసెంత?
వయసును దాచుకుని మీరు బస్సుల్లొనూ,
ఆఖరికి విమానాల్లోనూ వేసే వేషాలు తెలియవా ప్రపంచానికి?'
మరో వెకిలి గొంతుక..
'వీళ్ళ వేషాలు మగాళ్ళని రెచ్చగొట్టటానికేనండి..
మళ్ళీ మనపై నిందలు...'
లేడి కళ్ళల్లో కన్నీటి ధారలు.
'మీరంతా మృగాళ్ళే..ఇంట్లో భార్యలు 'సీతామాతలు..
బైటి వాళ్ళంతా రంభా ఊర్వశులు మీ కళ్ళకు..
ఆరేళ్ళ పసిపాపా, అరవై యేళ్ళ వృద్ధ నారీ కూడా ఊర్వశేనా మీ కంటికి?'
మరో మగాడు గొంతు చించుకున్నాడు..
'అసలు వీళ్ళకు స్వాతంత్ర్యం ఇవ్వకూడదండీ..
ఏదో చదువుకుని మనల్ని ఉద్ధరిస్తారనుకుంటే
స్చూళ్ళలోనూ కాలేజీలలోనూ వీళ్ళు మనకి తలవంపులే తెస్తున్నారు.
అందుకే చదువూ వద్దూ, చట్టుబండలూ వద్దు.
పన్నెండేళ్ళకే పెళ్ళి చేసి అత్తారింటికి తరిమేయాలి.
లేదూ, పుట్టినప్పుడే మట్టుపెట్టాలి.'
బోనులో ఉన్న లేడి గర్జించింది గట్టిగా...
'ఒరేయ్!!!
సంకుచితమైన మీ ఆలోచనలకో నమస్కారం..
మైత్రేయి, గార్గిలను
సీతా,అనసూయలనూ,
ఝాన్సీ బాయీ,రుద్రమదేవులనూ,
సుబ్బులక్ష్మినీ, మేరీకోం నూ
వారిని కన్నదీ ఆడవారేనే..
కైకేయీ, మంధరా, శూర్పణఖా
తాటకీ కూడా ఓ తల్లి పిల్లలే..
మరి మగాళ్ళలోనూ అందరూ రాముడూ కృష్ణుడే ఉన్నారా?
ఇప్పుడైతే రావణుడూ, కీచకుడూ, దుశ్శాసనుడూ యెక్కువగా ఉన్నారే?
బస్సుల్లోనూ, రైళ్ళలోనూ,
రోడ్లలోనూ, యెక్కడ చూసినా కనిపిస్తుంటే,
మమ్మల్ని వేటాడి, వెంటాడి తుదముట్టిస్తుంటే
మమ్మల్ని దోషులంటరేమిట్రా పశువుల్లారా?
వేశ్యలైనా, వేషాలేసే ఆడవాళ్ళైనా
మీరు సృష్టీంచిన పాత్రలే..
'మావాళ్ళంతా పవిత్రమైన వాళ్ళూ,
తక్కిన వాళ్ళంతా నీతిమాలిన వాళ్ళు'
అనుకునే మీలాంటి వాళ్ళవల్లే మన సమాజం ఇలా యేడ్చింది.
ముందు, మీ గురించి మీ ఇంటిఆడాళ్ళు యేమనుకుంటున్నారో తెలుసుకోండి.
తరువాత మమ్మల్ని గురించి మాట్లాడండి..
అసలు ఇదంతా యెందుకు?
మొత్తం మా ఆడజాతే మిమ్మల్ని బహిష్కరించి
మరో లోకానికి వెళ్ళిపోతున్నాం.
మీరూ, మీ దురహంకారమే రాజ్యాన్ని యేలుకోండి.'
బోనులోని లేడి శివంగిలా మరోసారి గాండ్రించి,
చింతనిప్పుల్లాంటి కళ్ళతో
కలియజూసి, బోను బైటికి దూకింది.
కోర్తులో ఇంతవరకూ గ్యాలరీల్లొ
బిక్కు బిక్కుమని చూస్తూ
బెంబేలెత్తిపొతున్న లేళ్ళన్నీ
శివంగులై గాండ్రిస్తూ
మీదపడెసరికి,
ఇంతవరకూ గొంతు చించుకుని అరుస్తున్న మగమృగాలన్నీ
'బతికుంటే బలుసాకు తినైనా బతొకొచ్చూ '
అన్న పెద్దల మాటను పాటిస్తూ
కాళ్ళకు బుద్ధి చెప్పాయి. ...........
పుట్టపర్తి నాగపద్మిని గారు,
ReplyDeleteమీ ఆవేదన, ఆక్రోశం చాలా బాగా వ్యక్తం అయ్యాయి ’అనగనగా ఒక లేడి,’లో.
చాలా బాగా రాసారు. ఈ సమస్య చాలా క్లిష్టమయినది కానీ ప్రతి లేడి తమ గొంతు విప్పి ఇలాగే తమ
ఆక్రోశాన్ని, ఆవేదనని, ఆవేశాన్ని వ్యక్తం చేయగలిగాలి, తల్లితండ్రుల దృక్పధంలో మార్పు రావాలి. మగ
పిల్లలకు చిన్నప్పటి నుండే ఆడపిల్లలను, స్త్రీలను సాటి మనుషులుగా గౌరవించడం నేర్పించాలి. అలాగే
ఆడపిల్లలకు ఆత్మవిశ్వాసాన్ని, వారు ఎందులోనో ఎవ్వరికీ తీసిపోరని, ఏ పనైనా చేయగలరని నేర్పించాలి.
ఈ మధ్యన కొంతమంది మధ్యతరగతి కుటుంబాల్లో తల్లి తండ్రులు వారికి ఇద్దరు, ముగ్గురు ఆడపిల్లలున్నా
వారి పెళ్ళిళ్ళ గురించి బెంగ పడకుండా వారిని వారికిష్టమయిన చదువులు చదివించి, వారి కాళ్ళమీద వారు
నిలబడేలా చేస్తున్నారు. వీరి సంఖ్య తక్కువే కావొచ్చు కానీ రాను రాను వీరి సంఖ్య తప్పకుండా పెరుగుతుంది
పెరిగేలా చూసే బాధ్యత మనమీద అంటే ప్రతి ఒక్కరి మీద వున్నదనుకుంటున్నాను.