Wednesday, 6 January 2016




యేవి తల్లీ నిరుడు  విరిసిన స్మృతి  లతాంతములు..   2  ?
   అరుగులపై జ్ఞాపకాల పరుగులలో  కొన్ని అప్పుడప్పుడూ తళుక్కుమని మెరిసి మాయమైపోతూ వుంటాయి.  అలాంటివాటిలో ఇదీ ఒకటి..అవధరించండి మరి..
   నేనిప్పటికీ వుస్మానియా  విశ్వ విద్యాలయ గ్రంధాలయానికి వెళ్తూనే వుంటాను.యేదో ఒక రెఫరెన్స్ మిష మీద!  గ్రంధాలయానికి తార్నాకా నుండీ వెళ్తుంటే, అక్కడొక చోట, చక్కటి బుట్టబొమ్మల్లాంటివి యెప్పుడూ అమ్ముతూ వుంటారు. అక్కడ కాసేపు, నా బైక్ ను ఆపి,  వాటిని మురిపెంగా కాసేపు చూసి మళ్ళీ బయలుదేరుతుంటాను. యెందుకంటారా? ఇదిగో...ఇందుకు...
     నా చిన్నప్పుడు, మా స్నేహితుల ఇళ్ళల్లో యెక్కడో గుడ్డతో చేసిన బొమ్మలను చూశాన్నేను. మెత్తగా, పూసల కళ్ళూ, నల్లటిదారంతో చేసిన వెంట్రుకలూ,చక్కటి దుస్తులు వేసిన ఆ ఆడా మగా బొమ్మలు నాకూ కావాలనిపించేది. గుడ్డలతో బొమ్మలు కుట్టమని 
మా అమ్మనడిగితే,  టైలర్ దగ్గరికి వెళ్ళి  గుడ్డ ముక్కలు తీసుకు రమ్మని చెప్పింది. అప్పటినుండీ, నా కష్టాలు మొదలు.
     మా ఇల్లు దాటితే,  ఒక చిన్న వంతెన (బుగ్గొంక పాయ ఒకటలా వెళ్తుండేదప్పట్లో! అది దాటగానే, కుడివైపుకో  మట్టి రోడ్డు 0డేది. వీధి మొదట్లో,  ఒక పేద్ద కట్టెల అంగడీ, ఆ తరువాత, ఒక గుర్రాలకు మాలిష్ చేసే వ్యాపారి స్థలం,గుర్రానికి మాలిష్ చేసే ప్రదేశంలోనే, యెద్దులకు నాడాలు  వేసే దృశ్యాలూ,  ఆ తరువాత ఇళ్ళూ.... కట్టెల అంగడి ఆవరణలో, చక్కెర  పళ్ళచెట్టుండేది. ఇదేదో కొత్తగా వుందే అనుకుంటున్నారు కదూ..!    ఆ చెట్టైతే నాకు బాగా జ్ఞాపకమే  ..దాని పూలెలా వుంటాయో చూడలేదుకానీ, చెట్టులో చిన్న గుత్తులుగుత్తులుగా, యెర్రటి పళ్ళు చాలాసార్లు చూసెదాన్ని..అవి  బాగా తీయగా  వుండేవేమో మరి-యెప్పుడూ దానిపై పిట్టలు తెగ సందడి చేస్తూ వుండేవి! అ యెర్రటి పళ్ళను చూస్తూ, నోరూరుతుంటే, నేను టైలర్ దగ్గరికి వెళ్ళాలన్న  సంగతే మర్చిపోయేదాన్ని మరి! యేదో, అప్పుడప్పుడూ, చాలా తక్కువసార్లు-అదాటుగా కిందపడిన వాటిని, ఆత్రంగా చేతిలోకి తీసుకుని,  పావడ మడతల్తో తుడిచి, రుచి చూసినట్టు గుర్తు..(అన్నట్టు, ఆ గుబురు చెట్టుపైన దయ్యం వుందనీ, రాత్రిపూట - యేడు దాటితే-ఆ దయ్యం అక్కడె తిష్ట వేస్తుందనీ, అందుకని చీకట్లో అటువైపే వెళ్ళొద్దనీ మా అమ్మె చెప్పిందొకసారి! అమ్మబాబోయ్  కదా మరీ!!)  అందని ద్రాక్షపళ్ళు పుల్లన అనుకుంటూ, యీసురోమని  టైలర్ దగ్గరికి వెళ్ళేదాన్ని..
 పండుగలకని  మా అమ్మ అతని దగ్గర మా అన్నయ్య (అరవింద్) నిక్కర్లూ, షర్టులూ, మా  అయ్యగారికి  జుబ్బాలూ అవీ కుట్టటానికి ఇచ్చేది. రవికెలూ, నాకు పావడాలూ  లాంటివి తనే చేత్తో  కుట్టెసేది- పండుగ నాటికి దుసురు పోగుతో (త్వరగా పని జరిగేందుకు, దూర దూరంగా కుట్టే కుట్టది..రాయలసీమ పదమేననుకుంటా! తక్కిన ప్రాంతాలలో వాడుకలో వుందోలేదో మరి..)  పని సరిపెట్టి, మళ్ళీ తీరికగా, గట్టి కుట్టు వేసేది - రవికెలకూ, పావడాలకూ! ..(అన్నట్టు, మా అమ్మ కొత్త చీరెలూ, అవీ వేసుకోవటం యెక్కువగా చూసిన గుర్తులే లేవు. ప్రతి పండుగకూ కూడా బట్టలు కుట్టించే వాడుక కూడా పెద్దగా వుండేదికాదు-మా ఇంట్లో!ఆర్థిక పరిస్థితి అలాంటిదప్పుడు  మరి! యేనాడూ డిమాండ్ చేయటమూ లేదు మేమెప్పుడూ) పని ఇచ్చేది తక్కువ కాబట్టేనేమో, ఆ టైలర్,  యెన్నిసార్లో నన్ను అలా  తిప్పించుకున్నా, తనకు పనికిరాని గుడ్డముక్కలు మాత్రం ఒక పట్టాన  ఇచ్చేవాడు కాదు..ఇచ్చినా, యేదో ఒకటో అరో!  నాకేమో ఆ గుడ్డబొమ్మలెలాగైనా  అమ్మ కుడితే, మనసారా  తాకి, చూసుకోవాలన్న పిచ్చి కోరిక! యెన్ని వందలసార్లు ఆ టైలర్ దగ్గరికి తిరిగి వుంటానో గుర్తు లేదు, నా కోరిక తీరిన మధురానంద  వీచికలూ గుర్తులేవు కానీ, ఆ  చక్కెర పళ్ళచెట్టూ, గుర్రానికి మాలిష్ చేసే ప్రదేశంలోనే, యెద్దులకు నాడలు వేసే దృశ్యాలూ, వాటి అరుపులూ.,,అవిచూస్తూ నేనక్కడే  చాలాసేపు నిలిచిపోయిన క్షణాలే ..ఇప్పటికీ, బాల్యంలోకి  పరుగులు తీయించే ఇంద్రధనుస్సులు...(ఇంతకూ...మా దుసురు పోగూ, గట్టి కుట్టూ..పదాలు మీకు నచ్చాయా లేదా...)  ...

No comments:

Post a Comment