Sunday, 3 January 2016










 

యేవి తల్లీ నిరుడు విరిసిన స్మృతి లతాంతములు...
అరుగులనుంచీ మనసు కిందికి దిగనే దిగనంటూంది..యేమిచేయటం?
     ఇప్పుడు మా ఇంట్లో కనకాంబరాలు బాగా పూస్తున్నయి. ఆ సున్నితమైన తేలికైన పువ్వులను చూస్తుంటే, మనసు గతంలోకి ఒకటే పరుగులు..
.   చిన్నప్పుడు, నా సుదీర్ఘ కేశరాసిగురించి (ఇప్పుడది గత వైభవమేలెండి) ఇదివరకే చెప్పానుకదా! నాకు చిన్నప్పుడవంటే తెగ ఇష్టం. యెన్ని పూలు పెట్టుకున్నా, బరువే వుండదు. పైగా, ఒకపట్టన వాడిపోవూ, నలిగిపోవుకూడా కదా! వీధిలోకి కనకంబరాలు వస్తే చాలు..మా అమ్మ నాకోసం రెండు మూడు తులాలు (మ రాయలసీమలో అప్పట్లో కనకంబరాలు అలాగే అమ్మేవారు. తులమంటే, 100గ్రాములేమో అప్పట్లో) కొని, గుడిపాటి అవ్వ బాడుగ ఇంటి అరుగుపై కూర్చుని, శ్రద్ధగా మాలకట్టి, నా జడలో పెట్టేది. ఇక మనకు , అకాశమార్గంలో తేలిపోతున్నట్టే ఫీలింగ్! అంతేనా? మొగలిపూల జడ యెంతబగా వేసేదో మా అమ్మ నాకు! మొగలి పూల సీజన్లో, పొద్దున్నే మొగలి పువ్వు కొనటం..మొగలి రేకులను సరైన ఆకారంలో కత్తిరించుకోవటం, ఘట్టిగా (బిర్రుగా) వేసిన నా జడను ఆ మొగలి రేకు ఒక్కొక్కటీ వాటి కొలతల ప్రకారం (జడ మొదట్లో పెద్ద ముక్కలూ, రాను రానూ చిన్న ముక్కలూ) అమర్చి సూదితో కుట్టటం. మధ్య మధ్యలో ఆ సూది యెప్పుడైనా నా మెడకు కాస్తంత తగిలినా, నేను ఆరున్నొక్క రాగమందుకోవటాలూ, నన్ను బుజ్జగించి, జడ పూర్తయ్యేదాక నన్ను కూర్చోబెట్టేందుకు మా ప్రయత్నాలూ..ఇలా మొత్తానికి మధ్యాహ్నం యే మూడుకో మొదలైన ఆ జడ పూర్తయెసరికి, సాయంత్రం 5 గంటలయ్యేది.
మొగలిపూల జడ పూర్తైన తరువాత, జడ స్నేహితులకు చూపించుకుని, ఆడీ, పాడీ, ఇంటికి చేరి, అన్నం తిన్న తరువాత, ఆ జడ గుచ్చుకోకుండా, కిందికి జారవిడిచి, పడుకోవటం యెంత కష్టమో కదా! కష్టే ఫలీ అన్నట్టు, మరుసటిరోజు, స్కూల్కు కూడా, ఆ జడతోనే వెళ్ళి, అక్కడి స్నేహితుల మెప్పు పొందటంలో మజాయే
 వేరనిపించేది సుమా! 


అన్నట్టు, అ అరుగులమీదే, మ మూడో అక్కయ్య తులజ, అమె స్నేహితురాండ్రు ఇందిరా, లలితా, కస్తూరీ (వీళ్ళందరిని నేను అక్కయ్యలనె పిలిచెదాన్ని మరి) కలిసి, రంగు రంగుల పూలతో చక్కగా మాలలు కట్టేవాళ్ళు. జాజి, మల్లే, కనకాంబరం, మరువం, దవనం- ఇలా యే సీజన్లో పూలతో అ మాలలు- భలేగా కట్టేవాళ్ళు. యెందుకంటే, మ అయ్యగరు అప్పట్లో, కృష్ణా చైతన్య ప్రభు భక్తులు. భజనలు భలే చెసేవాళ్ళింట్లో మిద్దెమీద! మ ఇంట్లో ఉన్న కృష్ణ చైతన్యా ప్రభువు పటానికి పూల మలలు అలంకరించి, అయ్య పాటలు పాడుతుంటే, మేమంతా బృంద గానం చేసేవాళ్ళం. అ పాటలు గుర్తులేవుకానీ, మ అయ్య కన్నుల్లో, అ పరవశ్యంలో, ఆనంద బాష్పలు రాలటం యెన్నో సార్లు చూసేదాన్ని కానీ నాకు అర్థమయ్యే వయసు కాదది! (పదేళ్ళుంటాయేమో-1963 ప్రాంతాలలో కదామరి))

హమ్మయ్య! ప్రస్తుతానికి, కడప మోక్షంపేటలోని, గుడిపాటవ్వ ఇంటి అరుగులపై నా జ్ఞాపకాల పరుగులనాపుతున్నాను..మీకు నచ్చితే మరికొన్ని! ఓకే?

No comments:

Post a Comment