Sunday 13 September 2015

 ఫోటోలో (చాలా అరుదుగా) త్రిపుండ్ర  ధారిగా  కనిపిస్తున్న పుట్టపర్తివారి గురించిన వివరణ ఇది.అయ్యతో అనేక సంవత్సరాల అనుబంధం ఉన్న కామిశెట్టివారన్నట్టు,, మా అయ్యకూ ఇలా నుదుట నామంతో కనిపించటం పెద్దగా ఇష్టం ఉండేది కాదెప్పుడూ! ఆమాట కొస్తే యీ విధంగా నామాలూ ,శిఖ -అంటే పిలక పెట్టుకోవటం- అస్సలు యెప్పుడూ లేదు. నాకు 7 లేదా 8 యేళ్ళప్పటి ముచ్చట. అహోబిల మఠ స్వామి   కడపలో మోచంపేటలోని అహోబిల మఠానికి  వచ్చారు. అక్కడి వైష్ణవులు, అయ్యను వారి  వద్దకు తీసుకుని వెళ్ళారు. అయ్య అప్పటికే తన జలద గంభీర  శివతాండవగానంతో ఆంధ్ర సాహిత్యలోకాన్ని ఉర్రూతలూగిస్తున్నారు. యీ సంగతి ఆ పీఠాధిపతికీ (మేము మఠాధిపతి అంటాము)  తెలుసునేమోకూడా! అయ్య మామూలుగా క్రాఫ్,పంచె కట్టుతో దర్శనానికి వెళ్ళారు. ఆయన, 'నీవసలు వైష్ణవుడివేనా? నామాలూ, శిఖా యెక్కడా? తీర్థం ఇవ్వను పో' అన్నారు.అయ్య అన్నారూ- 'నేను   అష్టాక్షరి అక్షర లక్షలు చేసిన వైష్ణవుణ్ణి. ఒక్క మాట! నేను పిలకా,  నామాలూ  పెట్టుకుని వస్తాను-మీరు చెప్పినట్టుగానే! కృష్ణ దర్శనమిప్పిస్తారా నాకు మరి?' అని అడిగారట! ఆ ప్రశ్నను ఊహించని మఠాధిపతికి ఛర్రున  కోపం వచ్చి- 'నీకు తీర్థం ఇవ్వను పొ'మ్మన్నారు.'నాకూ వద్దులెమ్మ'ని అయ్య వెనక్కి వచ్చేశారు. బహుశా ఆనాటి వార్తాపత్రికలలోనూ యీ సంఘటన ఒక సంచలన వార్తగా వచ్చినట్టే  లీలగా నాకు  జ్ఞాపకం. యీ సంఘటనతో మా బంధువర్గంవారూ అయ్యనూ, మా కుటుంబాన్నీ చాలా రోజులు దూరంగా పెట్టినట్టు గుర్తు కూడా!  మా అమ్మకొకటే దిగులు. ఆడపిల్లలున్నారు. వీళ్ళకు పిళ్ళిల్లెలా అయ్యేది అని!అయ్య ధోరణి అయ్యదే!
  బైటికి కనిపించే ఆచార వ్యవహారాలంటే అయ్యకంత గౌరవం ఉండేది కాదు.. మానసికంగా సంస్కారం అవసరమనేవారు. నిరంతరమూ అష్టాక్షరి  పారాయణం చేస్తూనే ఉండేవారు.నరనరాల్లోనూ అష్టాక్షరే  వారికి! అయ్యలోని  ఆర్తిని  వారి బాల్యాననే  గుర్తించిన కంచి పెద్ద స్వామి చంద్రశేఖర పరమాచార్యవారి వద్దకు అయ్య నేరుగా బట్టలు కూడా మార్చుకోకుండానే వెళ్ళటము నేను చూసిన సత్యం. (I was 12 or 13 at that time)  ప్రొద్దుటూరులో స్వామి విడిది చేశారు చాలారోజులొకసారి..ఒక సారి బీడీ కాలుస్తుండగా,  పెద్ద స్వామి  మిమ్ములను పిలుస్తున్నారని పరుగున ఒకతను రావటం, అయ్య బీడీ ఆర్పి , సిగ్గుగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళటమూ చూశాను కూడా! అంత చనువుండేది అయ్యకు..నాకు 18,19 సంవత్సరాలప్పుడు, కడపకు మధ్వ మఠ పెషావర్ స్వామి వచ్చినప్పుడూ, అయ్య అలాగే త్రిపుండ్రాలూ  వంటివేవీ లేకుండానే వెళ్ళారు. అక్కడ శాస్త్ర చర్చల్లో పాల్గొన్నారు. సన్మానితులయ్యారు కూడా! అయ్య ఆనాటికి లబ్ధప్రతిష్టులు.మధ్వ భాష్యాలూ, సిద్ధాంతాలన్నిటినీ ఆపోశన పట్టిఉన్నారప్పటికి..సుధాపరిమళ  వ్యాఖ్య (శ్రిరాఘవేంద్రస్వామి విరచిత భాగవత వ్యాఖ్య అది) అయ్యకు ప్రాణ సమానం.జైన బౌద్ధాలనూ అయ్య బాగా చదివారు.కడపలో ఒకసారి  జైనుల సభలకూ కూడా అయ్య వెళ్ళారు...అలా మా అయ్యగారిది, త్రిపుండ్రాలూ,శిఖలకే  కాదు.  నామరూపలకతీతమైన  కృష్ణోపాసన. ఇక పై ఫోటో, నా పెళ్ళిలోది. అప్పుడు 40-50 యేళ్ళ వయసునాటి పొగరూ, దుడుకుతనమూ తగ్గిన మహానదిలా ఉండేవారయ్య.  పీటలపై కన్యాదానానికి కూర్చున్నప్పుడు నామాలు  పెట్టుకోవాలికదండీ  (ఆయనకు తెలియదనికాదు) అని మా అమ్మ భయం భయంగానే అభ్యర్థించగానే నామం పెట్టుకున్నారు.ఫోటోకి చిక్కినారు కూడా!అరుదైన   రూపంలోని  అయ్యనిలాకూడా అయ్య అభిమానులకు  పరిచయం  చేయాలని నా ప్రచురణల్లో ఈ ఫోటోను వాడానెక్కదో!  రాజుగారి కంటపడింది. ఫొటొ   నేపథ్యం పంచుకునే అవకాశం నాకూ దక్కింది ఇలా! అయ్యకు కుడివైపు  (మా ఆచారం ప్రకారం-అది నా అదృష్టం కూడానేమో) ) వారి ఒడిలో కూర్చుని   నేనూ వున్నాను అసలు ఫోటోలో!దాన్నీ చూపిద్దామంటే  ఫోటో ఆల్బం కనబడటమే లేదు. నా దురదృష్టం కదూ!  (మరో సంగతి..అయ్య వుర్దూ రాయటం నేర్చుకునే సమయంలో వారితోపాటూ నేనూ అలీఫ్ బే తేలు (వాళ్ళ అ ఆ ఈ ఈ లు)  పలకపై ప్రాక్టీసు చేసేదాన్ని.అయ్య ఉర్దు ముషాయిరాలో పాల్గొని ఒక ఉర్దూ కవితకూడా చదివారొక సారి..అది భద్రపరచుకోవాలన్న జ్ఞానం లేదప్పట్లో- అందుకే ఇప్పుడు పస్చాత్తాపం మాత్రమే ఉంది)  a big thanx to RAJUgaru....  ఇంత పెద్ద వ్యాఖ్యతో  మిత్రుల సహనాన్ని పరీక్షించినందుకు క్షంతవ్యురాలను...  (14-9-15) 
              .           
............................




No comments:

Post a Comment