నదీవేదన
ఒకనాడు విష్ణు నిజపద్మపీఠిక నుండి
జననమొందిన జీవ నదిని నేను,
ఒకనాడు భాగీరధిగ వేడ్క భువికిరా
నిచ్చగించిన దివిజ గంగ నేను,
ఒకనాడు నిటలాక్షు ఘనజటాజూటాన
నర్తించినట్టి విఖ్యాతి నాది,
ఒకనాడు జహ్ను ముని ఆశ్రమమ్మున హరిణ
విహరణము సల్పిన యశము నాది,
అట్టి శ్రుతకీర్తినైనట్టి నాదు యశము,
కట్టుకథ వలెను దోచునట! యేమి వింత?
నిత్య సౌభాగ్యదాయినియైన నన్ను
యేటికీరీతి శొకముఖి జేతురయ్య?
నాదు తరళోర్మికల స్పర్శతో నాశమౌ
పాపతతి, శ్వేతమౌ వాయసమ్ము,
నాదు తీరములందు ఇహలోకమును వీడు
వారలకు మోక్షమ్ము బహు తథ్యము,
నాదు స్మరణమె విష్ణు స్మరణమని స్పష్ష్తముగ ,
నినదించునిప్పటికి శృతులు, స్మృతులు,
నాదు పథమును దివ్య పథముగా కీర్తించి
ఇంటింట కలశముగ నిల్పు విధము,
జీవధారగా వేవేల వత్సరముల,
జీవనంబైతి దేశ సంస్కృతి నిల్పగా,
జీవమే చచ్చి యీనాడు నిల్చితిట్లు,
కావవే నన్ను నాతండ్రి! నారాయణా!
నేడు నా రూపు కాలుష్య కాసారము,
నేడు నా రేవు మలమూత్ర సామ్రాజ్యము,
నేడు నా వునికి సందేహ సందోహము,
నేడు నా దారి మరుభూమి ఇది నిజమ్ము!
No comments:
Post a Comment