కనక నారాయణీయం-9
కనక నారాయణీయం -9
–పుట్టపర్తి నాగపద్మిని
వరుని తండ్రి పుట్టపర్తి శ్రీనివాసాచార్యులవారన్నారు.’జాతకాల మాట అటుంచితే, వాల్మీకి రామాయణం కంటే ప్రమాణం మరెక్కడుంది కనుక?? రామాయణ ప్రశ్న వేతాము. అందులో ఫలితాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాము.’
వధువు వైపువాళ్ళు ఆలోచనలో పడ్డారు.
ఇంతకీ ఏమిటీ రామాయణ ప్రశ్న??
రామాయణం ప్రశ్న అంటే, ఏదైనా కష్ట సమయ వచ్చిన సందర్భంలో, వాల్మీకి మహాకవి విరచిత శ్రీమద్రామాయణ గ్రంథం ముందుంచుకుని, భక్తితో నమస్కరించి, తమ మనసులో ఉన్న ప్రశ్నకు, రామాయణ సన్నివేశ ఆధారంగా సమాధానం ఇవ్వవలసిందిగా ప్రార్థించాలి. అప్పుడు, కళ్ళు మూసుకుని, సంపూర్ణ రామాయణ గ్రంధంలోని ఏదో పుటను తెరవాలి.ముందుగా కళ్ళు ఏ శ్లోకం పై దృష్టి పడుతుందో, అదే, ఆ ప్రశ్నకు సమాధానమనుకోవాలి. (నా చిన్నప్పుడు కూడా యీ పద్ధతినే మా ఇంట్లో అనుసరిస్తూ ఉండటం నాకింకా గుర్తే..!!)
ఇంతకూ, ఆనాటి సన్నివేశంలో చిరంజీవి పుట్టపర్తి తిరుమల నారాయణాచార్యులు అనే వరుడికీ, కుంకుమ సౌభాగ్యవతి కిడాంబి ధన్నవాడ కనకవల్లి అనే వధువుకూ కల్యాణం సముచితమా కాదా?? అన్న ప్రశ్నకు సమాధానం – శ్రీమద్రామాయణ గ్రంధం ఏమి సూచించింది??
పెళ్ళిపెద్దలైన మధ్యవర్తులెవరో యీ కర్యభారాన్ని నిర్వహిస్తూ, శ్రీమద్రామాయణ గ్రంధన్ని తెరచినప్పుడు కళ్ళముందు ప్రత్యక్షమైన ఘట్టమెది??
సీతా రాములిద్దరూ..చక్కటి సంభాషణల్లో మునిగి ఉన్నారు. సంతోషం. కానీ ఎక్కడ?? అరణ్యవాసంలో, ఇద్దరూ ఒక చోట కూర్చుని చర్చింటుకున్న దృశ్యం.
వరుని తండ్రి కన్నుల్లో ఆనందం!!
వధువు తరఫు వాళ్ళకు కాస్త సందేహం !!
సీతారాములిద్దరూ ఒక చోట ఉండటం సంతోషమే!! కానీ అరణ్యంలో ఉంటే ఎలా??
జీవితమన్న తరువాత, సుఖ దు:ఖాలు అనివర్యాలు. దాంపత్య జీవితంలో కేవలం ఆనందమే సదా సందడించాలని కోరుకోవటం కంటే, జీవన రథాన్ని భార్య భర్తలిద్దరూ కలిసి జంటగా నడిపించాలని ఆశించటమే సముచితం కదా!!
మొత్తానికి, ఇటువంటి చర్చల తరువాత, ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీ కిడాంబి ధన్నవాడ దేశికాచార్యులవారి కొమరిత, కుంకుమ సౌభాగ్యవతి కనకవల్లి కన్యకామణిని,పెనుగొండ వాస్తవ్యులు శ్రీ పుట్టపర్తి తిరుమల శ్రీనివాసాచార్యులవారి కుమారుడు పుట్టపర్తి తిరుమల నారాయణాచార్యులవారికిచ్చి, వివాహం జరుపులాగున పెద్దలు నిర్ణయించారు. శుభ ముహూర్తం – భావ నామ సంవత్సర మాఘమాసంలో!! (28 – 2 – 1935)
వరుని తండ్రి పుట్టపర్తి శ్రీనివాసాచార్యుల వారికి తన కుమారుడికి ధన్నవాడ వారి ఇంటి కన్యకామణి సంబంధం కుదరటం చాలా సంతోషకారణమైంది. ఇదివరకే అనుకున్నట్టు, వధువు తాత గారు పేరందిన కాశీ పండితులు, గజారోహణ గౌరవాన్నందుకున్న బహు గ్రంధ కర్త, పైగా, అమరచింతాత్మకూరు సంస్థానానికి చెందిన గొప్ప పండితులు. పితామహుల ప్రభావం వధువు మీద ఇప్పటికే బాగా పడినట్టే ఉన్నది. వధువు కనకవల్లి ఇప్పటికే తాతగారి వద్ద తెలుగు పంచకావ్య పఠనం చేసిందట!! సంస్కృత సాహిత్యాభినివేశం ఎటూ ఉంటుంది. తన కుమరుడిప్పటికే కవిగా కీర్తి పథాన నడుస్తున్నాడు. పెనుగొండ లక్ష్మి కావ్య ముద్రణ కూడ జరిగి, పండిత ప్రశంసలందుకుంటున్నాడు. అవధానమార్గం లోనూ నడుస్తూ, శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇటువంటి వరునికి, కాశీపండితుల సంబంధమే తగినది !! ఇంకొక విషయం. మొదటి వివాహమలా విఫలమవటం వల్ల కుమారుడు కాస్త మానసికంగా క్రుంగినట్టున్నాడు కాబట్టి త్వరగా, కల్యాణం చేసి, దారిలో పెట్టటం సముచితంగా తోచింది వారికి !!
వధువు తండ్రి ప్రొద్దుటూరు ప్రాథమిక పాఠశాలలో పండితుడు. ఆదాయం తక్కువ. పెళ్ళి ఖర్చులు భరించటమే వారికి కష్టమయ్యేలా తోచింది శ్రీనివాసాచార్యులవారికి!! అప్పటి సామాజిక పరిస్థితులను బట్టి బ్రాహ్మణ కుటుంబాలలో కట్న ప్రసక్తి కూడా ఉండేది కాదు. ఏదో వరోపచారం అంటూ వెండి తట్ట (భోజనం(సాపాటు) కంచం) చెంబు (వెండి చెంబు) లోటా (వెండి గ్లాసు) కుంకుమ, పసుపు గిన్నెలు, వెండి సంధ్యావందనం సామగ్రి – ఇటువంటివే ఇచ్చేవారు!! పుట్టపర్తి శ్రీనివాసాచార్యులవారు వధువు తరఫు వారితో అన్నారు -‘మేము దేనికీ ఒత్తిడి చేయము. వాళ్ళ అల్లుదికి వారేమి పెట్టుకున్నా మాకు సమ్మతమే!! వివాహం సంప్రదాయ బద్ధంగా చేసి ఇవ్వమనండి చాలు..’ అని!!
మొత్తానికి అనుకున్న ముహూర్తానికి,కిడాంబి వారింటి కన్యకామణి కుం.సౌ. కనకవల్లి, పుట్టపర్తి తిరుమల వారి ఇంటి కోడలైంది.
తమకున్నంతలో, కుమార్తె కల్యాణం బాగానే జరిపించారు వధువు తల్లిదండ్రులు, శ్రీ ధన్నవాడ కిడాంబి దేశికాచార్యులు, శ్రీమతి శేషమ్మ దంపతులు!!
(ఇటీవల మా రెండవ అక్కయ్య శ్రీమతి బాణగిరి తరులతాదేవి వల్ల తెలిసినదేమిటంటే, సంప్రదాయ శ్రీవైష్ణవ బ్రాహ్మణ వివాహాల్లో, వరునికి పెళ్ళికుమార్తె వైపు వాళ్ళిచ్చే వెండి చెంబూ, వెండి కంచం, వెండి లోటాలు ఇచ్చే ఆర్థిక స్తోమత లేక, రాగి చెంబు, రాగి కంచం ఇచ్చారట, మా అవ్వా తాతా వాళ్ళు, పెళ్ళప్పుడు!! మా తాత దేశికా చార్యులు (మాతామహులు), వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. మా తాత గారి తరువాత, రామచంద్రాచార్యులు, చిన్న నరసిం హాచార్యులు (వీరి సంతానంలో రెండవ
కు మా ర్తె, ఇటీవలే పరమపదించిన శ్రీమతి లక్ష్మీదేవి కనకాలగారు) వెంకటాచార్యులు. వీరందరిలోకీ, మా తాతగారు దేశికాచార్యులవారికి చదువు సరిగా అబ్బక ప్రొద్దుటూరు వీధి బడిలో బడిపంతులుగా ఉద్యోగం చేసేవారట!! సంతానం నలుగురు ఆడపిల్లలు, మధ్యముడిగా ఒక కుమారుడు! అందుకని, మొదటి (మా అమ్మ) , రెండవ కుమార్తెలిద్దరికీ రెండవ వివాహ సంబంధాలే చేయగలిగారు. ఏమిటో..ఇవన్నీ తెలుస్తుంటే..విధి వ్రాతలంటే ఇటువంటివేనేమో అనిపిస్తుంటుంది..ఇక ప్రస్తుతానికి వస్తే….)
పెళ్ళినాటికి,వరునికి ఇరవై ఒక్క సంవత్సరాలు, వధువు వయస్సు పదునలుగేళ్ళు. వరుడు, పుట్టపర్తి నారాయణాచార్యులవారికింకా దగ్గు పీడిస్తూనే ఉందట!! ప్రొద్దుటూరులో ఆయుర్వేద వైద్యులెవరో ఉండటం వల్ల, పెళ్ళి తరువాత, అక్కడే ఉండిపోయారు పుట్తపర్తి వారు కొన్ని రోజులు!!
కానీ, మొదటి వివాహం, దాని వైఫల్యం, మానసిక అశాంతి, అనారోగ్యం, తదుపతి ద్వితీయ వివాహం, వదలని దగ్గు కారణంగా, నారాయణాచార్యులవారి శిరోమణి చదువు కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది.
ఓ వైపు అత్తగారింటిలో ఉండటం. మరో వైపు ఆగని సాహిత్య పిపాస. రెండు వైవిధ్యాల మధ్య, పుట్టపర్తి మేధ మాత్రం చురుకుగా తన పని తాను చేసుకుంటూనే ఉంది.
అప్పుడప్పుడూ అటు చెన్న పట్టణానికో, ఇటు తిరుపతికో (రెండూ ప్రొద్దుటూరినుంచీ, అప్పట్లో కూడా యీ రెండు వూర్లకూ ప్రయాణసౌకర్యాలు బాగానే ఉండేవి) వెళ్ళి తన సాహిత్య తృష్ణను తీర్చుకుని వస్తుండేవారట వారు!!
తన శ్రీమతి కనకవల్లి అప్పటికే పితామహుల శిక్షణలో సంస్కృత పంచకావ్య పఠనం పూర్తిచేసి ఉన్న విద్యావంతురాలు. ఆమెను తనకు తగ్గట్టుగా మలచుకునే ప్రయత్నంలో ఆంధ్ర పంచ కావ్య పఠాలూ,దీనికి తోడు, ప్రాకృత సాహిత్య పరిచయం కూడా చేయనారంభించారు, పుట్టపర్తి.
దేశికాచార్యుల వారిది బడిపంతుల ఉద్యోగం. మధ్య దిగువతరగతి జీవితం. ఐదు మంది పిల్లలు. మొదటి కుమార్తె వివాహమైంది. బాగానే ఉంది, కానీ, అల్లుడు అత్తింట్లోనే నెలలకొద్దీ ఉంటే ఆ అత్తమామలకెంత ఇబ్బంది?? పుట్టపర్తి మామగారికివేమీ పట్టవు. చేసే బడిపంతుల ఉద్యోగంలో జీతమంతా తన భర్య శేషమ్మ చేతుల్లో పోయటమొక్కటే ఆయనకు తెలుసు. చదువు సరిగా అబ్బకపోవటంతోపాటూ , వ్యవహారజ్ఞత బొత్తిగాలేని భర్త, ఐదుమంది సంతానం, అనారోగ్య కారణంగా మొదటి అల్లుడు (పుట్టపర్తి వారు) తమతోనే ఉంటుండటం..ఆర్థిక ఇబ్బందులూ..వీటన్నిటితో తమ సంసారాన్ని, మా మతామహి శేషమ్మగారెలా ఓర్పుతో నిర్వహించేవారో, ఆ పరమాత్మకే ఎరుక!!(మా అవ్వగారు ఓర్పుకు ప్రతిరూపమే. ఇది నేను కూడ చూసిన సత్యం. అసలు ఆ కాలపు మధ్య దిగువ తరగతి స్త్రీలంతే, ఇలా కష్టాలతో సహవాసం చేసినా, యే మాత్రం బయటపడేవాళ్ళు కారేమోననిపిస్తుంది.)
మా మాతామహి శేషమ్మగారి పుట్టింటివారు, జ్వాలాపురం కిడాంబి వారు. (ఇప్పుడీ జ్వాలాపురం కర్నూలు జిల్లాలో ఉంది) వాళ్ళది దిగువ మధ్యతరగతి కుటుంబం. పుట్టిల్లు, ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్నదే ఐనా, భర్త చిన్న ఉద్యోగం కారణంగా, ఆమె కూడా తన పుట్టింటిమీద కాస్త ఆధారపడేదట!! అమెకు తన అన్నయ్య, జ్వాలాపురం కిడాంబి వీరరాఘవాచార్యుల తోడ్పాటు ఎక్కువ, అన్ని రీతులా!!
అంతే కాక, ప్రొద్దుటూరిలో, సుందరాచార్లు వీధిలో భర్త పనిచేస్తున్న ప్రాథమిక పాఠశలలోనే పని చేస్తున్న కేశవమ్మ టీచర్ (బ్రాహ్మణేతరురాలు) చాలా మంచి స్నేహితురాలట!! శేషమ్మ గారికేకష్టం వచ్చినా ఆమె తక్షణం ఆదుకునేదట!! కులం వేరైనా, గుణం బట్టి మాత్రమే ఆనాటి స్నేహాలు ఉండేవని, దీనివల్ల తెలుస్తున్నది కదా?? (నాచిన్నతనంలో, మా అమ్మను చూడటానికీమె ఒకసారి మా ఇంటికి వచ్చినట్టు నాకు గుర్తు.)
(సశేషం)
****
ఫోటో వివరాలు :
ముగురమ్మలు – పుట్టపర్తి వారి అవంతీసుందరి (శ్రీమతి) కనకవల్లి గారు, పుట్టపర్తి వారి అత్తగారు, శ్రీమతి కిడాంబి శేషమ్మగారు, కనకవల్లి గారి చెల్లెలు, శ్రీమతి గుడిహాళం అలమేలమ్మ
సరస్వతీపుత్ర గా, చతుర్దశభాషా పరశేషభోగిగా చిరపరిచితులైన పుట్టపర్తి నారాయణాచార్యులవారు (1914 – 1990) , వారి ధర్మపత్ని, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ సత్కార గ్రహీత శ్రీమతి పుట్టపర్తి కనకమ్మ (1921 – 1983) దంపతుల కుమార్తెగా జన్మించటమే గొప్ప వరమనీ, ఆ ఇంటిపేరే గొప్ప బిరుదని నాగపద్మిని గారంటారు. విద్యార్హత – హిందీలో ఎం.ఏ ఎం.ఫిల్. పీహెచ్.డీ. తెలుగు ఎం.ఏ. జర్నలిజం, అనువాదకళ, టీవీ నిర్మాణకళలలో పీజీ డిప్లమోలు; ఆకాశవాణి, దూరదర్శన్ లలో ముప్పైఐదేళ్ళ ఉద్యోగ జీవితంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుధా ప్రశంసనీయమైన వందలాది కార్యక్రమాల నిర్వహణ; తెలుగు హిందీలలో యాభైదాకా పద్య, సాహితీ వ్యాస,కథ, నాటక, అనువాద రచనలు; తెలుగు విశ్వవిద్యాలయ, తమిళనాడు హిందీ అకాడెమీ, బిహార్ సాహిత్య సమ్మేళన్, గోఎంకా జాతీయ అనువాద పురస్కారాలూ, శ్రీయుత వైయస్. రాజశేఖర రెడ్డి, ఎన్.డ్.తివారీ,డా.రోశయ్య, డా. మృదులాసిన్ హా (ప్రస్తుత గోవా గవర్నర్) వంటి రాజకీయ ప్రముఖులచే సత్కారాలూ; తెలుగు రాష్ట్రాలలోనే కాక, ఖరగ్ పుర్, పాట్నా, చెన్నై, అమెరికాలో న్యూజెర్సీ, డల్లాస్, పెన్సిల్వేనియా, అట్లాంటా, వాషింగ్టన్ సాహిత్యసమావేశాల్లో ప్రసంగానంతర సత్కారాలు; . గత పదిహేనేళ్ళుగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ ప్రత్యక్ష ప్రసారాలలో హిందీ/తెలుగు వ్యాఖ్యాత. జయజయశంకర, శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ మొదలైన మాధ్యమాలలో యాభైకి పైగా ఆధ్యాత్మిక ప్రసంగాలు; అన్నిటికంటే మించి, పుట్టపర్తి వారి శతజయంతి (1914-2014)సందర్భంగా పుట్టపర్తి పద్య, కథ, నవల, అనువాద, విమర్శ సర్వస్వాల ప్రచురణ (నాలుగువేల పుటల బృహత్ ప్రచురణ).
No comments:
Post a Comment