శర షట్పద
ఏమని దెలిపెద
నీ యానందము
శివ కీర్తన లట! నటు వినవే!
వచ్చెనొ యేమొ వి
యచ్చర దైవత
మంతయు నిల పై,నటు గనవే!
నిండుగ వెల్గెడు
దీపావళులను
శివ చేతనలను విన రావే!
మెండుగ నృత్య
ప్రవచన గానము
హరి హర విభవము గన రావే!
ప్రాణములో ను
ఛ్వాసములో జగ
దీశుని దలవని బ్రదుకేలే ?
సందడి సేయుచు
శివ సంకీర్తన
సుఖమును బొందుటె సొగసౌలే !
కార్తిక శోభలు
కేదారునకతి
ప్రియములనుట నీవెరిగితివా!
క్షీర సముద్భవ
దామోదరులకు
శోభనమౌనట దెలిసితివా!
హరి హర భేదము
మదినెంచుటలో
హరియించిన యుగములు యెన్నో !
ఇరువుర గోపా
లురుగా దెలిసిన
భక్తుల నిజ గాధలు యెన్నో!
వాముండాతడు,
వామనుడీతడు,
వారల భేదము గననేలా?
ఇరువురి నాట్య వి
భా వైభవమే
జగతి గ దెలియుట వినవేలా?
No comments:
Post a Comment