Monday, 14 December 2015



              నా జ్ఞాపకల మరుగుల్లో అరుగులు - 3



కడప మోచంపేట (అసలు పేరు మోక్షంపేట అట..క్రమంగా నోరుతిరగక అది మోచంపేటగా ప్రజల్లో స్థిరపడింది..) ఆ ఇంటి పెద్ద అరుగులమీద కూర్చుని చక్కగా నామాలు తీర్చి దిద్దుకుంటున్న మా తాతలే గుర్తొస్తారు నాకు. రాయలసీమలో పితామహులైనా,మాతామహులైనాపిలుపు ఒక్కటే...తాత అని!..అట్లే, అమ్మమ్మైనా, నాన్నమ్మైనా- అవ్వ. అంతే! ఇప్పుడింతకూ, ఆ అరుగుల పైన, చక్కగా పద్మాసనం వేసుకు కూర్చుని మా తాతగార్లిద్దరూ నామాలు పెట్టుకోవటం నాకింకా గుర్తే! అరచేతిలో కాసిన్ని నీళ్ళచుక్కలు వేసుకుని,శ్రద్ధగా భక్తిగా త్రిపుండ్రధారణ చేసుకునే వాళ్ళిద్దరూ నా కళ్ళల్లో ఇంకా మెదులుతూనే ఉంటారు.మా పెద్దక్కయ్యలు- కరుణ, తరులత ఇద్దరి కల్యాణాలూ - ఒకే సంవత్సరం 1960లో రెండు మూడు నెలల తేడాతో అయ్యాయి. ఆ పెళ్ళిళ్ళకు మా పితామహులూ, మతామహుల దంపతులొచ్చినప్పటి ముచ్చట ఇది. నా చిన్ని లేత హృదయంలో (నాకప్పుడు 8 యేళ్ళు) అలా నిలిచిపొయిన పన్నీటి వాకలవంటి స్మృతులు.

మా పితామహులు పుట్టపర్తి తిరుమల శ్రినివాసాచార్యుల మా తాతగారు, గొప్ప సంస్కృతాంధ్ర పండితులు. పెనుగొండ (అనంతపురం జిల్లా) పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేసే మా తాతగారు, గొప్ప సంస్కృతాంధ్ర పండితులు. చక్కటి గాత్ర శుద్ధితో, సంవత్సరాల తరబడి పురాణ కాలక్షేపం చేసేవారట! మా అయ్యగారు తన బాల్యంలో మా తాతగారి పురాణకాలక్షేపంలో పద్యాలు చదువుతుంటే, మా తాతగారు వ్యాఖ్యనం చేసేవారన్న మాట! ఆశువుగా బహుచక్కని శ్లోకాలూ, పద్యాలూ చెప్పగల సత్తా వున్నా, పాతకాలం వాళ్ళందరికీ, వాల్మీకి, వ్యాసూడూ, కాళిదాసులముందు మనమెంత, మన పాండిత్యమెంత అన్న వినయసంపన్నత, కలం పట్టనిచ్చేది కాదు కదా! అందుకేననుకుంటా- మా తాతగారూ, యే రచనా చేయకపోయినా,మా అయ్యగారికి ఆయనంటే అపారమైన గౌరవముండేది. ఆయనముందూ బీడీకూడా కాల్చేవారు కాదు .



మా తాతగారు, మా బాడుగింటి అరుగులపై కూర్చుని, శ్రద్ధగా నామాలు పెట్టుకోవటం కళ్ళువిప్పార్చి అదో అద్భుత ప్రక్రియగా చూసేదాన్ని. మా అయ్యెందుకల నామాలు పెట్టుకోరో అర్థమయ్యేది కాదు.అద్దంలో చూసుకుంటూ, నుదుట యెర్రటి నామం తీర్చి దిద్దుకుని, చక్కగా అమరిన తరువాత, ఒకసారి చూసుకుని తృప్తి చెందేవారు. .


.........


మాయాబజార్ సినిమాలో, యస్వీ రంగారావును ఆట పట్టిస్తూ, 'చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ' అని పాట పాడే వృధ విప్రుని సీన్ చూసినప్పుడల్లా, నాకు మా మాతామహులైన దేశికాచార్యులవారే గుర్తొస్తారు. (మా పెద్దక్కయ్యలు- కరుణ, తరులత ఇద్దరి కల్యాణాలూ - ఒకే సంవత్సరం 1960లో రెండు మూడు నెలల తేడాతో అయ్యాయని, మా అక్కయ్యల పెళ్ళిల్లకోసం వాళ్ళూ వచ్చారని ముందే చెప్పానుగా!) మా మాతామహులు- శ్రీమాన్ దేశికాచార్యులవారూ. మా అమ్మమ్మ, శ్రీమతి శేషమ్మా ఇద్దరూ- నెలరోజుల ముందునించే మా ఇంట్లో ఉన్నట్టు గుర్తు. మా తాతగారు చాలా అమాయకులు. (వారి తండ్రిగారు-శ్రీమాన్ ధన్నవాడ కిడాంబి రాఘవాచార్యులవారు, కాశీ పండితులుగా గజారోహణ గౌరవాన్ని పొందిన ఘనులైనా, వీరు- అమాయకులూ, కాస్త పెద్ద వయసు, సంప్రదాయ చాదస్తమూ- వెరసి కలగలిసిన వ్యక్తిత్వం. ప్రాధమిక పాఠశాలలో పండితుడిగా పనిచేసి రెటైర్ అయ్యారు.) పొద్దున్నే ఆ పెద్ద అరుగులపై కూర్చుని, చాలా శ్రద్ధగా, తిరుచూర్ణంతో (తెలుపూ, పసుపూ) గంటకు పైగా కూర్చుని త్రిపుండ్రధారణం చేసుకునేవారు.పొద్దున్న శ్రద్ధగా తీర్చిదిద్దినట్టు నామాలు పెట్టుకునే మా తాతనుచూస్తే నాకు పెద్ద ఆకర్షణ అప్పట్లో! ఆ అరుగుపైనె కూర్చుని తన అనుష్టానమంతా పూర్తి చేసుకునేవాడాయన ! మా అయ్యగారికీ త్రిపుండ్రధారణల పట్ల అంత ఆసక్తి ఉండేదికాదని ముందే చెప్పినట్టు గుర్తు.

మా అవ్వ- శ్రీమతి శేషమ్మగారికి, కాఫీ అంటే పంచప్రాణాలు. ఇంట్లో వేయించిన కాఫీగింజలను ఇంట్లోనే పౌడర్ చేసే మిషిన్ ఇంట్లో పెట్టింది మా అమ్మ. నిలువ వుంచిన పొడి కంటే, తాజాగా చేసే పొడి సువాసనలు- యెంతో బాగుండేవి. కాఫీగింజలను ఆ మిషిన్ లో వేసి పౌడర్ చేయటం నాపని అప్పట్లో..నేనే చిన్న పిల్లనింట్లో మరి..పొడి యెంత మెత్తగా చేస్తే మా అవ్వ అంత బాగా నన్ను పొగిడేది. 'నీ చిన్న చిన్న చేతులతో చేస్తే పొడి యెంత బాగావస్తుందో' అని ముచ్చటపడేది కూడా..పొగడ్తలకు లొంగని మనసులుంటాయా మరి. (ఆమె పిల్లలకు కథలు చెప్పటంలో బహు దిట్ట. యెన్నెన్నో తెనలిరామకృష్ణుని కథలు రోజులతరబడి చెప్పేది.) .మా తాతైతే, యెప్పుడూ ఆ అరుగులపైనే వున్నా ఇంట్లో కాఫీపొడి సువాసనలను ఇట్టే పట్టేసేవారు. తాజాపొడితో కాఫి కాస్త చేసివ్వమని మా అవ్వను సతాయించేవాడాయన చాలాసార్లు..


(my thathagaru with my mother Kanakavalli - on his right side-and my pinnamma -Alivelamma on his left lap- way back might be in 1927 or '28) Foto courtesy- my cousin Smt.Gudihalam Manjula -daughter of smt Alivelamma)

..............

వారిరువురి తరువాత, నా జ్ఞాపకల దారుల్లోని మరచిపొలేని పరిమళం-శ్రీమాన్ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మగారు. రెండుమూడు సార్లు వారు (సందర్భాలు గుర్తులేవు) మా ఇంటికి వచ్చారు. ఆ చిన్న వయసులో వారి గొప్పతనం నాకు తెలియలేదుకానీ, మా అమ్మా, అయ్యా- వారిని గౌరవించే పద్ధతి వల్ల వీరు చాలా గొప్ప వారు అని మాత్రం తెలిసిందప్పట్లో..(ఆ తరువాత నా 16,17 యేళ్ళ వయసులో వారి అనూదిత గాధా సప్తశతి చదవటం-ఆరాధకురాలినవటం జరిగిందనుకోండి.) వారు కూడా, ఆ ఇంటి అరుగులపై కూర్చుని, శ్రద్ధగా, నామం దిద్దుకోవటం, గుర్తు. వీళ్ళందరికీ, చెంబులో నీళ్ళూ (మరేదైన అవసర వస్తువులూ) అందించెందుకు నేనే నియోగింపబడేదాన్ని మరి..రాళ్ళపల్లివారి అనుష్టానం పద్ధతీ, చిన్న గొంతుతో వారు మాట్లాడే పద్ధతీ, నన్నెంతో ఆకట్టుకున్నాయి అప్పట్లో..
 




............


ఇలా కడప-మోక్షంపేట లో. గుడిపాటి అవ్వగారింట్లో, గడచిన నా బాల్య స్మృతుల్లో (1960 ప్రాంతాలు) ఆ ఇంటి అరుగులతో ముడిపడిఉన్న నా జ్ఞాపకాల పరదాల్లోంచీ తొంగిచూస్తూ. నా కళ్ళముందు కదలాడుతున్న మరికొందరు ప్రముఖులు- , నండూరి విట్ఠల్ గారూ (1960 నుండీ, 80లవరకూ ఆకాశవాణి అజరామర వాగ్మూర్తిగా సుప్రసిద్ధులు) ఊటుకూరి లక్ష్మీకాంతంగారూ (సుప్రసిద్ధ రచయిత్రి) నాయని కృష్నకుమారి గారూ (సువిఖ్యాత రచయిత్రీ, తెలుగు విశ్వవిద్యాలయానికి వుపకులపతిగా గొప్పసేవలందించిన సాహితీవేత్త) వీళ్ళంతా!!!

No comments:

Post a Comment