Tuesday, 13 October 2015

                                              
                                       తిరుమల రామచంద్ర 



     నా చిన్ననాటి సంస్కృత పండితులలో సాహిత్య చక్రవర్తి కుంటిమద్ది శేషాచార్యులు. చాలా విఖ్యాతులు. అప్పుడు, వున్నత పాఠశాలలోనూ ఆంగ్లంలోనే బోధన జరిగేది కనుక సంస్కృతాన్ని ఆంగ్లంలో బోధించేవారు. శ్రీనివాసాచార్యులవారు అప్పుడే వెలువడిన భండార్కర్ రీడర్లను విద్యార్థులతో కంఠోపాఠం చేయించేవారు. ఆయన పుత్రులలో ఒకరు తిరుపతిలో నా సహాధ్యాయుడు కుంటిమద్ది శేషశర్మగారు. వ్యాకరణాలంకార వెదంత శాస్త్రాలలో గొప్ప విద్వాంసుడు. మనుచరిత్ర, ఆముక్త మాల్యద మున్నగు తెలుగు కావ్యాలను సంస్కృతీకరించి, ఇతర రాష్ట్రాల సంస్కృత విద్వాంసులకు చుబ్బన చూరలిచ్చిన కవివతంసుడు. మైసూరు  పరకాలమఠం ఆస్థాన పండితుడు.
       శ్రీనివాసాచార్యుల అనుజుడు కుంటిమద్ది రామాచార్యులు. ఈయన అవధాన ప్రక్రియను స్వాయత్తం చేసుకున్నవారు. భాగవత, భగవద్గీతలలో యీ పదం యే అక్షరం యెన్నిసార్లు ప్రయుక్తమైందీ యీయనకు కరతలామలకం. 
      ఒకమారు బళ్ళారి-అనంతపురం  జిల్లా కలెక్టర్ యీయన అవధానం కేవలం ఈ సాహిత్యంలోనేనా? అని ప్రశ్నించారట! యే విషయమైనాసరే! అన్యభాష ఐనా సరే! అన్నారట ఈయన! అప్పుడు కలెక్టర్ వీరిని పరీక్షింపగోరి, వంద యూరోపీన్ జంటలను  సమావేశపరచి, రామాచార్యులుగారికి, వారిని (ఇతడు ఫలానా, ఈమె ఇతని భార్య అని) పరిచయం చేయించి, మూడు నాలుగు గంటలపాటు విందులూ వినోదాలూ నాట్యాలూ జరిగిన పిదప మరల సమావేశపరచి, చెల్లాచెదురుగా  వారిని కూర్చోబెట్టి, రామాచార్యులను పిలచి, స్వామీ!   మీకు మూడు గంటలక్రితం పరిచయంచేసిన దంపతులను పేరుపేరునా పిలిచి వారెక్కడెక్కడ వున్నారో కనుక్కుని ఆహ్వానించండి అని కోరాడట! అవధానిగారికి తెలుగు, సంస్కృతం, తమిళం, కన్నడం తప్ప మరే  భాషా రాదు. ఆయన  స్టోన్ గారూ! దయచేయండి.  శ్రీమతి ఎలిజబెత్ గారూ!అమ్మా! దయచేసి మీ భర్త ప్రక్కన నిలుచోండి, అంటూ రెండువందలమందినీ పేరుపేరునా పిలిచి గుర్తించి నిర్దిష్టకాలంలో సమావేశపరచారట! కలెక్టర్ ఆశ్చర్యపడి, ఆయనపై ప్రశంసావర్షం కురిపించాటమేకాక,తక్కినవారుకూడా ఆయన ధారణాపాటవాన్ని కొనియాడారట!
                                               తిరుమల రామచంద్రగారు,

                                    (రూపనగుడి నారాయణరావుగారి ఆర్యసుభాషితములు -మొదటిభాగము అభిప్రాయంలో)
(తిరుమల రామచంద్రగారంటే నాకు గొప్ప ఆరాధన. మా అయ్యగారివలెనే, యెంతో వినయ సంపన్నులువారు. మీదు మిక్కిలి, యెంత జ్ఞాన సంపన్నులో, అంత  నిరాడంబరులు. యెంత గంభీర హృదయులో, అంత హాస్య చతురులు కూడా! వారి ఇంటికి వెళ్ళీ ఒకసారి కలిసినప్పుడు స్వయం పాకం చేసుకుంటున్నారు. నేను కూరగాయలు తరిగి ఇస్తానన్నా, ఒప్పుకోలేదు. నేను తరిగే ప్రమాణంలో నీవు తరగలేవులేమ్మా!నా కొలతలూ నా రుచులూ నావి! అని సున్నితంగా వద్దనేశారు! వారిదగ్గర కొన్ని రోజులు శిష్యరికం చేద్దామని పథకం వేసినా,
 ఫలించకపోవటం- నా దురదృష్టంగా ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాను.)

No comments:

Post a Comment