..........................
విజయ విజ్జిక
नीलोत्पलदलश्यामां विज्जिकां मामजानता ।
वृथैव दण्डिना प्रोक्ता सर्वशुक्ला सरस्वती ॥
nīlotpala-dala-śyāmāṃ vijjikāṃ mām ajānatā
vṛthaiva daṇḍinā proktā sarva-śuklā sarasvatī
నీలోత్పల దళశ్యామాం విజ్జికాం మాం అజానతా
వృధైవ దండినాప్రోక్తా సర్వశుక్లా సరస్వతీ...
'నల్లకలువ రేకుల వంటి వర్ణమున్న నేను తనకు తెలియకపోవటంవల్లే, మూర్ఖుడైన దండి సరస్వతీ దేవిని తెల్లనివర్ణంకలదని వర్ణించాడు. (నేనే అతనికి తెలిసి ఉండి, నా రచనలనతడు చదివి వుంటే - యీ పొరపాటు చేసి ఉండేవాడు కాడని ఇందులోని ధ్వని.)
విజ్జిక అన్న కవయిత్రి ఎంతో ఆత్మాభిమానంతో చెప్పిన యీ శ్లోకం- ఆమె కౌశల్యానికి తార్కాణంగా నిలుస్తున్నది.
సరస్వతీవ కర్ణాటీ విజయాంబా జయత్యసౌ,
యా వైదర్భ గిరాం వాస : కాళిదాసాదనంతరం.
10 వ శతాబ్దానికి చెందిన రాజశేఖరుడు, కాళిదాసు తరువాతి వారిలో
వైదర్భీరీతిలో రచనలు చేసేవారిలో విజయాంబమాత్రమే పేర్కొనదగినదన్నాడు.దండిమహాకవికి సమకాలికురాలో, లేక కాస్త తరువాతదిగానో పరిగణింపబడే యీ విజ్జిక (విజయాంబ)వ్రాసిన కౌముదీమహోత్సవమనే సంస్కృతనాటకం పై కాళిదాసు ప్రభావం కొట్టవచ్చినట్టుగా కనిపిస్తుందంటారు. కీర్తిమతీ కల్యాణ వర్మల ప్రణయం-మొదటిభాగం. కాగా, పాటలీపుత్ర రాజు సుందర వర్మ మంత్రి, మంత్రగుప్తుని పన్నాగం - రెండవ భాగం. 7వ శతాబ్దం నాటి, ఒకానొక కర్ణాటక రాజు పత్నిగా
మాత్రమే వివరాలు తెలియవచ్చిన యీ కవయిత్రిగురించిన మరో శ్లోకమిది.
ఏకోభూత్ నలినాత్ తతశ్చ పులినాత్ వల్మీకతశ్చాపర :
తేసర్వే కవయ : ప్రసన్నమతయ : తేభ్యో మహద్భ్యో నమ :
అర్వాంచో యది గద్య పద్య రచనా చాతుర్యమాతన్వతే
తేషాం మూర్ధ్ని దదామి వామ చరణం కర్ణాట రాజప్రియా.
'బ్రహ్మ, వ్యాస, వాల్మీకులు, పద్మము, మృత్తిక, వల్మీకములయందు
పుట్టిన ప్రాతహ్ స్మరణీయులు. వారికి నా నమోవాకములు.నా సమకాలిక
కవులెవరైనా, నా ముందు వారి విద్యను ప్రదర్శింపదలిస్తే, కర్ణాట పట్టమహిషిగా, నా వామచరణాన్ని(యెడమ) వారి శిరసుపై ముందు మోపుతాను.'
పై శ్లోకంలోని 'తేషాం మూర్ధ్ని' బదులుగా, 'తేషాం వామ చరణం'
(క్రియాపదం 'మమ మూర్ధ్ని దదామి' ) అని మార్పుచేస్తే, 'యెవరైనా, గద్య
పద్యాలలో నన్ను మెప్పిస్తే, వారి వామపాదాన్ని నేను నా శిరసుపై ధరిస్తాను'
అన్న అర్థం వస్తుంది. దండికవి, వ్యాస, వాల్మీకులకు సమ వుజ్జీగా అప్పట్లో
గుర్తింపు పొందాడుకాబట్టి, అతన్నే ఉద్దేశిస్తూ విజ్జిక, పై శ్లోకం
చెప్పిందంటారు కూడా!
జాతే జగతి వాల్మీకౌ శబ్ద : కవిరితి స్మృత :
కవీ ఇతి తతో వ్యాస : కవయశ్చేతి దండిని.
వ్యంగ్యంగా దండిని ఇక్కడకూడా పేర్కొనటం చూస్తే, విజ్జికకూ, దండికీ, కొంత
భేదాభిప్రాయాలు అప్పట్లో ఉండేవని తెలుస్తున్నది. యేది యేమైనా, అటు 7వ శతాబ్దనికో, ఇటు 10వ శతాబ్దానికో చెందిన యీ కర్ణాటక సామ్రాజ్య
పట్టమహిషి విజ్జికను 9వ శతాబ్దానికి చెందిన ముకుళభట్టూ, 11వ శతాబ్దానికి
చెందిన మమ్మటుదూ, భోజుడూ, 13వ శతాబ్దానికి చెందిన విశ్వనాధుడూ-
కీర్తించారు.
యీ రచన వ్రాతప్రతి ముందుగా కేరళకు చెందిన రామకృష్ణకవికి
లభ్యమైంది. రామకృష్ణ కవే యీ కౌముదీ మహోత్సవ రచనను
ముద్రించాడు. కానీ, అతనికి లభ్యమైన ప్రతిలో రచయితపేరు విజ్జికే
అనటానికి తగిన ఆధారాలు అందటం లేదు.'కయా నిబద్ధం' అని మాత్రమే
ఉండటంవల్ల (అంతకు ముందు అక్షరాలు, అస్పష్టంగా వుండటంవల్ల, ) 'విజ్జికయా నిబద్ధం' అనేందుకు తగినట్టుగా ఉందని కొందరు
పరిష్కర్తల అభిప్రాయం.
పైగా, ఒకానొక కర్ణాటక చాళుక్య రాజు విజయాదిత్యుని రాణి, విష్ణువర్ధనుని
తల్లి విజయ కాగా, మరొక కర్ణాటక చాళుక్య రాజు విజయాదిత్యుని భార్య పేరు విజయమహాదేవి అని తెలుస్తున్నది.
మీను విజయాదిత్యో సూర్యాన్వయ సముద్భవాం,
వుపయేమేథ విజయాం, మహాదేవీం, మహీసమాం.
బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి కోడలూ, చంద్రాదిత్య మహారాజు
అర్ధాంగీ ఐన మరో విజయకూడా ఉన్నట్టు తెలుస్తున్నది. నృపతుంగుని
సేనాధ్యక్షుడైన బంకేశుని శ్రీమతి, విజయ కూడా చక్కటి కర్ణాటక కవయిత్రేననంటున్నది చరిత్ర.
ఇంతకూ, కౌముదీమహోత్సవ కవయిత్రి వీరిలో యెవరో స్పష్టంగా
తెలియకపోయినా, దండిని ఢీకొన్నవిజ్జిక అన్న ఒక కవయిత్రి చరిత్రలో ఉండేదన్నది మాత్రం సత్యమే కదా!
జయహో విజయా! జయహో మహిళా!
..................................
No comments:
Post a Comment