Friday, 1 May 2015






 

       ప్రపంచ కార్మిక దినొత్సవం నేడు. కష్టే ఫలీ అన్న ఆర్యొక్తి మన నరాల్లో యేనాడో జీర్ణించుకుని పోయింది. కష్టానికి తగిన ఫలం లభించినపుడు,సంతోషం, దక్కనపుడు, ఆవేదన కలగటం సహజం. తద్వారా ఆక్రోశం..ఆందోళన.. యీ విషయాని గాధాసప్తశతీకారుడు యెలా చిత్రించాడో చూడండి.
     యే వస్తువునైనా పగ్గం పట్టి లాగినపుడు, ఆ వస్తువు బాగా బరువుండి లేవనప్పుడు, అప్రయత్నంగా,మన నోటినుందీ, కేకలు వెలువడుతాయి. వర్షాకాలం. వర్షం బాగా కురుస్తోంది. వురుములూ వినిపిస్తున్నాయి. గాధాకరునికి, యీ దృశ్యం చూడగానే, ఒక ఆలోచన వచ్చింది. 
            అవిరల పడంత ణవజల ధారా రజు ఘడి అం ప అ త్తేణ 
            అపహుత్తో వుఖ్ఖేత్తుం రస యీవ మేహో మహిం వుపహ (5/36)
     మేఘుడనే కార్మికుడు, అవిశ్రాంతంగా, భూమిని పగ్గాలు పట్టి పైకి లాగడానికి   ప్రయత్నిస్తున్నాడు. లాగలేకపోతున్నాడు. మూల్గుతున్నాడు. అవే యీ వురుములు కాబోలు!అద్భుతంగా ఉంది కదూ!   
     అది కెవలం ఒక కార్మికునికే సంబంధించింది. కానీ, ఆ కృషి సమిష్టిగా మారినప్పుడు,ఉద్యమమవుతుంది. ఇదే సత్యానికి ప్రతీక యీ రోజు.  
  ఈ దినోత్సవ సందర్భంగా,ఇదిగో నా గీతం..
            కార్మిక సోదరులారా! కదలిరండు నేడు, 
            కర్మవీరులందరికీ, పండగోయి నేడు.......
                జగమంతా జరుగుతోంది, ఆనందపు సంబరం
                మనమంతా కలిస్తేనె జగతినిండు సంతసం....
            నేల నింగి నీరూ, యెటు చూసిన కార్మికులే,
            సూర్యచంద్రులేకాదూ, తారకలూ కార్మికులే...  
            ప్రతి ఋతువూ, ప్రతి గ్రహమూ కార్మిక బంధువులే.....
                నియమ బద్ధ జీవితమే కావాలోయ్ ప్రగతికీ 
                హక్కులెన్ని వున్నా బాధ్యత కూడా మరువకోయ్,
                 యేకాగ్రత నాణ్యతలే మనకు వేద మంత్రాలూ,
            మానవతా నినాదాలె ఉపనిషత్తులూ...
                    విశ్వాసం పెంచే ఒక మాట మనకు వెలుగూ, 
                    సర్వస్వం ధరపోయ మనదే ముందడుగూ, 
                    భవితవ్యం, బంగారం  కార్మిక బృందావనిలో,
                    నిత్య వసంతం కార్మిక జీవన రస ధునిలో... 
     (ఆకాశవాణి కార్మికుల కార్యక్రమంలో మే డే రోజు ప్రసారితం) ..1/5/15 

No comments:

Post a Comment