యెందుకమ్మా అవని, ఇంత క్రోధము నీకు
నీదు బిడ్డల ఉసురు దీసితీవే?
యెందుకీ సమయాన ఇంతటి విధ్వంస
క్రీడనాడగ నీకు మనసు కలిగె?
యెవరిపై నీ రోషమెవరిపై నీ ద్వేష
మెవరిపై నీ క్లేశమమ్మ ధరణి?
అచల వని అందురే అందరూ నిను తల్లి?
యెంత చంచలవైతివీవు కనవే?
నిశ్చలవు, నిర్మలవు,భూతధాత్రివి నీవు
నీవెందుకైతివే రుధిరాక్షివి?
శాంతసుందరమైన నేపాలమీనాడు
ప్రేతవనముల భీతి గొల్పెనమ్మ,
భూతధాత్రివి నీవుగావటే నేడు మరి,
భూతదయ మరచి ఇటు విర్రవీగ?
కైలాసనాధుడే కొలువుదీరినచోట
కాటికాపరిగీవు కొలువైతివే?
తలిదండ్రికొల్పొయి పసిబిడ్డలెడ్చేటి
రోదనమె మోహనమ్మాయె నీకు
పతి పత్నులొండొరుల తోడు వీడిన శోక
మే శ్లోకమైనదా? శ్యామ నీకు?
మలి సంధ్యనాదుకొను సంతతిని కొల్పోయి
మరణ వేదన జెందు వృద్ధాప్యము,
ఇన్నిటను గాంచుటకు మనసాయెనా నీకు
ఇది యేమి చొద్యమో యెరుగనైతి..
చాలు ఇకనైన శాంతించు భూరిజమ్మా!
మేలమాడుటలు మేదినీ! చాలునమ్మ,
తాళలేమమ్మ, మము తల్లి, బ్రోవవమ్మ,
కేల మా కంటినీరునే తుడువ రమ్మ!
ప్రతిరూపమందురే క్షమయా ధరిత్రనుచు,
గతితప్పి వర్తించు బాట వీడు!
నుత మతివి స్తుతిపాత్రమేయుగమునందైన,
నూతనవు నీవు గావలెను నేటినుండి...
No comments:
Post a Comment