Saturday, 31 December 2016





నిన్ను లేపగ వచ్చినారము, నిజముగా కడు   భాగ్య వతివే! 
వన్నెలాడీ! నీదు భ్రాతయె వెన్నునికి ప్రియ సఖుడు గదవే!
ధవళ దోహజ ధారలందున దమము నిండిన నీదు దేహళి
కవల నిలచితి మిహిక ధారల,కనుల బ్రియ సఖు  వలపు జావళి,
పలుకవెందుకె కలికి చిలుకా? వాజసుండన నీకు అలుసా?
వలపు దాచుట నోము    కొరకా? ఫలము దక్కును మనకు దెలుసా?
పడతి సీతను యెగ్గు జేసిన  పాప రావణు దునిమె రాముడు 
గడియ దీసిటు  రమ్ము రాముని కథను గానము జేతుమిప్పుడు. 

Friday, 30 December 2016





గోసమెరుగని గొల్ల కులమున, గొమ్మరో!  బంగారు దీవవె,

దాసులము శ్రీ కృష్ణునికి నీ దలుపునిపుడే దెరచి బ్రోవవె,


గోప కులమున బుట్టువారలు, గుశలురే గోదోహదమ్మున,


కోపుతో శత్రువుల మదమును క్రుంగదీతురు   కదనమందున, 


పాము పడగయె నీ నితంబము, వన మయూరివి నీవెగావే,


మా మనోరధమెరిగి మాధవు  మాదు తోడను  గలువ  రావే


నీల మేఘుని  నామమును విని,నీవిదే వత్తువనుకొంటిమె, 


ఉలుకు పలుకునులేక శయ్యను , ఊరకుంటివిదేమి బీరమె? (11)


మాదు నోమిటు లాగి ఉన్నది,మాతరో!  నీ నోము ముగిసెగ, 

నీదు చెంతనె  కృష్ణుడుండగ, నిదురలో నీ తోడు నీడగ,

బదులు పల్కుట పాడిగాదే? పడతిరో! పెను నిద్దురేటికె?

కదలికలె లేవాయెనె?  కుంభ కరణు నిద్దుర బొందనేటికె?



తులసిదాముడు రాము చేతను దోరె యా నిద్రాసురుడు మా

వలపు రాముని యందె, నీవును వచ్చి రాముని బాడు కొమ్మా!

రాగదే ఓ జాతి రత్నమ ! రాగదే అలసతను వీడిటు

వేగ నీరాడగా బోదము, వీడు దలుపులు దెరచు నీవిటు..  


హేమ కాంతులు విరియు గృహమున   ప్రమిదె కాంతుల వెలుగులందున

ధూమ సౌరభ   శయ్య  నిద్దుర తొంగలించదు   పగటియందున

మామ కూతుర!మాటలాడుము,  మారుబల్కని   మరుమమేమే?
 
మా మనోరధ మెరగి నీ  మణిమయపు ఘటికను  దెరువవేమే? 

కరుణ తో మేనత్త! తనయను గారవమ్మున నిదుర లేపుమ,

వెరపు తెలియని అలసటా అది? పలుకలేనిద, చెవిటిదనమా?

మంత్ర మహిమా? కాదు, మాధవు మంత్ర మహిమది దెలియు మనసా! 

మంత్రమదియా! వినుమిదే, మా మాధవా! వైకుంఠ వాసా! (9)



Thursday, 29 December 2016

....................
ఎర్రబారిన తూరుపునుగని యెనుములన్నియు మేత వెడలెను,

గుర్రు మానిక రమ్ము, పిల్లల గుంపు మాధవు కొరకు  గదలెను, 
నిన్ను గలవగగోరు కృష్ణుడె, నీదు తోడుత మేము బోదుము,

వెన్నుడను వాయెత్తి బాగుగ, వేడి యాతని  మనము గొలుతుము,


తురగ రూపమునందు జంపగ దొడిబడిన దానవుని దునిమెను,


దురిత కంసుని మల్ల యోధుల దొసగు దెలియగ, మదమణంచెను


దేవతలకధినాధుడాతడు   దెలిసి బలుక, మనల  విడువడిక,


మా వినతి విను బ్రియ  సకియరో! మాధవుని సేవింప రమ్మిక. (8)

Wednesday, 28 December 2016

గూడు విడచెడు వేళ బులుగుల గోల వినబడదేల సకియా? 
వేడుకను నిదురించ జాలిక, వేకువాయెను మంకు చెలియా!
కడియములు గాజులును మ్రోగెడి గలగలల సౌరభములీను, ప
సిడి గురియు గొల్లెతల ముచ్చట, జెవుల జేరద నీకు నిపుడు, ప
విత్రమౌ నారాయణామృత వినిమయము గురుతించ వెరపా? 
మిత్రురాలా!కేశి దునిమిన మేటి కేశవు బొగడ మరపా? 
మాదు గానము నీకు నేడగు మధురమౌ పవళింపుబాటగ? 
 కాదు కాదిటు రాగదే, చెలి,గడియ దీయుము, వాణి మీటగ ! (7)



Image may contain: 2 people, indoor

Tuesday, 27 December 2016

పీలులవిగో నరచుచున్నవి  భూరి శంఖద్వనుల వినుడే 
చల్ల నవ్వుల విషము  గుడిపిన శఠత దునిమిన బుడతడితడే 
నీల గాత్రుని చేత జచ్చెను   నీచ శకటాసురుడు,  వినుడే, 
వేల నమరుల స్వామి గా వేవేతలల ఫణిశాయి గనుడే,
పలుకువాలుల కీర్తనమ్ముల  వారిశుడు వేదార్థ తనుడే, 
మెల్ల మెల్లగ గనుల విప్పుడె, మినుకుటూర్పులవానిబొగడుడె,
మేలు మీకగు సకియలారా! మెలపునందగ వాని జూడుడె.