Wednesday, 4 January 2017

నాగదంతపు కోళ్ళ శయ్యది, నయన సుందర దీప స్తిభినులు
భోగ యాగపు తూల శయ్యను, పూల గుత్తుల శిఖా హేలలు
చక్కదనముల స్వామి! సిరి శ్రీ జాని వక్షస్థలము నుండగ
ఒక్కటైనను మాట చక్కగ నోయని పల్కు నూరడింపుగ 
అంజనాక్షీ! తెల్లవారెను, నా వ్రజవరుని లేవనీవే! 
తేజరిల్లెడి మోము వానిని దీనులము మము జూడనీవే! 
వదలి స్వామిని నిముసమైనా పద్మినీ! నీవుండలేవా? 
కదలవే, కూడదే, వెన్నుని కౌగిలిని విడు, లేవనీవా? (19)










మదగజమ్ములనేకములు దన మందలో గల నందగోపుడు 
మదముగల శత్రువుల భుజ స్తోమమున తానోడించు నాతడు,
గుణములకు పెన్నిధగు నందుని గోడలా! సౌందర్య రాశీ! 
మనవి విను సౌరభాలక! మామాధవు దయా వారిరాశీ!
కోడి కొక్కొరొకోలు,మాధవి కుంజముల కోకిలల స్వరములు
చెండు బట్టిన ముద్దుగుమ్మా! సేయవలె హరి కీర్తనమ్ములు 
గలగలల గాజుల రవములను ,కమలపాణీ! గడియ దీవలె,
తళతళల భువి మెరయుచున్నది దామినీ ! ధవు జూడనీవలె. (18)

Tuesday, 3 January 2017



అంబరమ్ములు, త్రాగునీరాహారమును గడు దానమొసగెడి,
ఎంబెరుమాళు   నందగోపుల యేలికకు మేల్గొల్పు బాడుడి.
చక్కదనముల  కొలువు అతివల జాతికే నవ దళమువమ్మా.
చొక్కనౌ  గోకులపు నవలా  జ్యోతి,లేవవె యశోదమ్మా!
పెరిగితీవు నభంబువరకా రెండడుగులనె   గొలచినావే? 
మరచినావా? రాక కారణమా దినమునె,  బరుండి లేవే?
వెన్నదొంగకు అన్న,సాత్వత! పిన్నవారల గావుమయ్యా!    
విన్నపమ్మిదె, పసిడి కడియపు పెబువ!నిద్దుర లేవుమయ్యా! (17) 
...................

 . .
తోరణమ్ములు ధ్వజములతొ బంధురమ్మౌ  తిరుమాళిగే గా , 
రారె, ఇది మన  నందగోపుల వారి నవ్య నివాసమేగా. 
'నంద నాయకు కోవెలను సానందముగ గాపాడు దేవా!
అందమౌ మణి  ఖచిత ద్వారపు యంత్రమును  దయ  దెరువలేవా?'
'హితముగాదుగ రాత్రులం,'దా హేతువులు మేమెరుగమయ్యా'
'ఇతము?' ' వెన్నుడు  నోము సాధనలిత్తు రమ్మని బిలచెనయ్యా'
'పవలు రాగదె?' ' వెంబడించెను పలుగు నిన్ననె  దీసుకొమ్మని
యవన శత్రుని లేపవచ్చితి మీవు బీగముదీయు గరుణను'. (16)




Monday, 2 January 2017





ఎంత చిత్రమె, లేత చిలుకా?లేవవెందుకు ఇంతవరకును?' 
 'ఎందుకే బొగడెదరు వచ్చెద నిపుడె,' 'వేచెదమంతవరకును',
కట్టుకథలను వింటిమమ్మా, కానుపించవె, త్వరగ కొమ్మా,'
వట్టిమాటలు చెప్పనేటికె', 'వచ్చితిని, గేలేలనమ్మా?
విరహమే నా శాపమౌగా, పెడసరపు మాటలును మీవిక!
మీరలందరు?' 'జెప్పనేరము మేము, లెక్కిడ నీవె రమ్మిక.' , 
'ఇదిగిదిగొ నే వచ్చుచుంటిని, యేమి జేయగవలెనొ జెప్పవె,'
'దానవుల, కుంజరపు మదమును దమించిన మాయావి నెరుగవె?' (15)



మాటకారీ! చేతలేవే? మౌన ముద్రను వీడవేలే?
నీటిపుట్టువు విచ్చుకొన్నది,నీలి కలువలు వాడెనేలే? 
మీదు పెరడున యున్నదే  యా మీన గోధిక జూడ వేలనె?
 మాదు మాటల నమ్మవా?  కువ  మణీచకములు వాడెనేలనె?
ధాతు శాటి ధరించి తెల్లని దంతముల యోగులదిగోనే,
జాతవేదుని గుడిని వేకువ శంఖ సేవల కోసమేనే,
మాట దప్పెద వేల నోముకు మమ్ము బిలిచెదనంటివేలే? 
 కైటభారిని,చక్రధారిని,కమలనేత్రుని  బొగడ వేలే?  (14th) 

Sunday, 1 January 2017




        చీల్చివేసెను బకాసురునా జిష్ణుడాతని ముక్కు రెండుగ,
 గిల్లె రావణు  పదితలల నొక కేలి గోటితొ రాముడొంటిగ,
       రామలందరు జేరినారటు రామ కృష్ణుల బాడుకొంచును
నోము నోచుట మరచినావా? నోరుదెరువక మెదలకుండను,  
       శుక్రతారదిగో గగనమున, సూర్య కిరణపు కాంతి గనుమా!
వక్ర బుద్ధులు మాను, బుధుడటు వెడలినాడే, ముద్దుగుమ్మా!
       లేవవెందుకె తోయజాక్షీ? లేమలందరు గూడినారటు,
 నీవొకతెవే ఇంకనింటను నిదుర మగతను  వీడి రమ్మిటు.. (13) 


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,