Monday, 5 December 2016

కనుగొంటి నిను నేను కలిమిలో చెలిమిలో


కనుగొంటి నీశ్వరా! కడలిలో, కనులలో,

తెలుసుకొంటిని నిన్ను, తెలివిలో  దేటలో, 

తెలుసుకొంటిని నిన్ను, తెలి దేటి పాటలో,  

మసలుకొంటిని నీదు మధురమౌ తలపులో 

మసలుకొనుదాన నీ మహితాత్మ మెలపులో 

కలసికొందున నిన్ను గడసారి చూపులో?

కలసికొనగలన నిను, మలిసారి జన్మలో? 

పాడునా పరమాత్మ ఆడులే ప్రతియాత్మ,

పాడునా పరమాత్మ, ఆడులే ప్రతియాత్మ.


సహనము లేదు దండ్రి!  యిక  సవ్యముగా నడువంగలేను నీ 

గహన సుదీర్ఘ జీవనపు గానన మందు సుధాపయోధి ! భూ  

రుహ ఘన శాఖ యగ్రమున లోలక రీతిని   నిల్చి నీ దయా  

కుహరమునందు జేరుకొరకున్  దపియించెడి బిందు వైతిగా.  


      

  

Sunday, 4 December 2016



పంచ కూపములతో  బగబూనినది జగము,

పంచ క్లేశములెపుడు బచ్చెకాడులె నిజము,

పంచ దపములు జేసి, బరిణతిని గోరితిని, 

పంచ కృత్యముల నీ పంచ నే  జేరితిని

పంచ కోశములందు పంచముఖ !నిలువరా! 

పంచ తన్మాత్రలను పచరింప గోరుదుర! 

పంచ తత్వపు గంధ పరిమళము నలదేన?   

పంచ కల్ప కుఠార ప్రసవ మాలిక దేన? 

ఆడులే పరమాత్మ, పాడులే ప్రతి యాత్మ,

ఆడులే పరమాత్మ, పాడులే ప్రతి యాత్మ.
....................
కనుల బడినంతనే కావలయునను బులుపు, 

మనము మాటను వినక మంచె దాటెడు గునపు 


కడి విదల్పక ధనము గాపాడు గక్కుర్తి, 


వడిని మదినణగించి వశము జేకొను మిత్తి 


తలపైని కన్నులను దీర్చేటి మొక్కలము,


కలకలమ్మును రేపి కసి నుమియు మచ్చరము,


చెప్ప నారే గాని జేయునది బహు నష్టి,


చెప్పవలె నా స్వామి,సెగకంటి, నీ సృష్టి. 


పాడునా పరమాత్మ, ఆడులే ప్రతియాత్మ,


పాడునా పరమాత్మ, ఆడులే ప్రతియాత్మ.. 




Friday, 2 December 2016




 15. ఇవిగొ నీ సుమములను నింద్రుడే తా దెచ్చె,

నివి కల్ప వృక్షాన నేడె రేకులు  విచ్చె,

విరుల ఫలముల హారముల   యగ్ని దెచ్చెగా,

ధరణీశ! నీకు కడు తనిసి నర్పించెగా 

పసిడి హారముల గొని బరుగు పరుగున వచ్చె

ససిగ నా  యమరాజు, జడదారి, జిగి హెచ్చె,

ముత్తెముల రాసులవి ముచ్చటది వరుణునిది,

గుత్తమౌ గంధమ్ము,  గొనితెచ్చె వాతుడది,

అపురూపవజ్రముల,   యగణితాభరణములు

కపురంపు పేటికలు గుహుని యుపహారములు

ధనపాలు గని నవ్వు దశభుజను   జూచితివి,

కినుక విడనాడుమని కనులతో బల్కితివి,

ఆడెనట పరమాత్మ, బాడెనట ప్రతి యాత్మ.

ఆడెనట పరమాత్మ, బాడెనట ప్రతి యాత్మ.. 
................ 

Thursday, 1 December 2016

అదిగదిగొ నటుజూడ నైరావతమ్మదియె 

గదలకయె నిలచినది, కైమోడ్పు నతులవియె 

అదిగదిగొ గనరండి యట తగరు, మహిషమ్ము, 

పదపడిగ హరిణమ్ము, వార్భటము, యశ్వమ్ము,

నటరాజు చరణముల నర, వృషభ సేవలును 

 ఎటుబోవ నెటు జూడ నింద్రాది యమరులును, 

శచి, యశోవత్యాది సహ ధర్మచారిణులు 

రుచిరముగ వినిపించు  రుద్రు సంకీర్తనలు   

ఆడెనా పరమాత్మ పాడులే ప్రతి యాత్మ..

ఆడెనా పరమాత్మ పాడులే ప్రతి యాత్మ..