Wednesday, 10 February 2016

Jalaja Nayana... A sweet Sanskrit Mangala Harathi




.................
ఈనాడు మనకందరికీ మైసూర్ గా చిర పరిచితమైన ఆ నగరాన్ని, ఇదివరకు, అంటే పాత కాలంలో యేమని పిలిచేవారో తెలుసా? మహీశూర పురం! యెంత బాగుంది కదా! ఆ మహీశూర పురంలోనే శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందిన ప్రాచీనమైన పరకాల మఠం వుంది.(నేను మైసూరుకు ఉద్యోగంలో వున్నప్పుడు రెండు మూడు సార్లు అక్కడికి వెళ్ళి, ఆ పూర్వ వైభవాన్ని దర్శించి, ధన్యురాలై వచ్చాను) మరి ఇప్పుడా ప్రసక్తి యెందుకంటే, ఆనంద భైరవి రాగం లోని యీ మంగళహారతి శ్రీ శ్రీ శ్రీ కృష్ణ బ్రహ్మ తంత్ర పరకాల మహాదేశికుల వారు (31st swamiji of the Muth) తన పూర్వాశ్రమంలో రచించినది. నా చిన్నప్పుడు, యీ మంగళహారతిని, మా అమ్మ, శ్రీమతి కనకమ్మా, మా అక్కయ్యలు కరుణ, తరులతల యుగళగళాలలో యెన్నో సార్లు విన్న అందమైన జ్ఞాపకం యీనాడీవిధంగా మీముందుకు తీసుకువస్తున్న సంతోషం! నోరు తిరిగేందుకు, 'గాదె కింద కంది పప్పు'...ఇంకా... 'నల్ల లారి మీద యెర్ర లారీ'...ఇలాంటి ప్రయోగాలేమంటారొ మరిచిపోయానిప్పుడు కానీ యీ పాటలోని పదాలను క్షుణ్ణంగా, తప్పులు లేకుండా పలకడం అంత సులువేంకాదు సుమా! ఒక సారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది! సంస్కృత రచనే ఐనా, ద్రాక్షాపాకమండీ! యెంత మధుర పదజాలం! యెంత చక్కటి భావం! ముందు రచన చూడండి. తరువాతే పాట వినండి దయచేసి.....(  'కల్యాణ గీత మంజరి'  పేరుతో 1966లొ ముద్రితమైన యీ చిన్ని పొత్తాన్ని, పుట్టింటి ఆస్తిగా వెంట తెచ్చుకున్నాను - యెప్పుడో.! .యేమిటో..నా పిచ్చి నాకు ఆనందం!)
........................
జలజ నయన తవసు మంగళం  
భుజగ శిఖరి, కలిత నిలయ భవతు మంగళం....
జలధి శయన విబుధ వినుత లలిత లలిత చరిత భరిత
వలభి దుపల పటల రుచిర చలిత లులిత చికుర నిటిల...
.జలజ నయన తవసు మంగళం
భుజగ శిఖరి కలిత నిలయ భవతు మంగళం...
శరణ వరుణ కుతుకి దేవతా
భరణ రుచిత.. కరుణ నిగమ సుగమ దైవతా..
అరుణ తరుణ తరుణి కిరణ
చరణ చరణ హరిణ హరణ
హరిణ కిరణ వదన జనన
సరణి తరణ కరణ శరణ...
జలజ నయన తవసు మంగళం
భుజగ శిఖరి కలిత నిలయ భవతు మంగళం.....
సురత మృదిత జలధితాస్తనా..
భరత సహజ హరిత తురగ తనుజ పాలనా..
స్ఫురద విరత సతత కఠిన
విరుత భువన కదన జనన
దురిత భరిత చరిత సదన
నిఋతి వితతి విరతి లకన
జలజ నయన తవసు మంగళం
భుజగ శిఖరి కలిత నిలయ భవతు మంగళం..
పవన తనయ వినుతి భాజనా పవన హరణ
నవన వచన నివహ పావనా..
పవన లవన యవన గహన
జవన వలన వహన పవన
నవ సుదుర్గ భవన కృష్ణ
కవన సరణి జవన చరిత...
లజ నయన తవసు మంగళం
భుజగ శిఖరి కలిత నిలయ భవతు మంగళం...

......................

Friday, 5 February 2016

                   (Ayya and Dr.Tripuraneni Hanuman Chowdarygaru in the back drop of the main door which I decorated with my painting-foto of 1974 or 1975)

...............
'ఆ.. నాగా..ఇదిగో....
 (11-1-16 .. పోస్ట్ తరువాయి....)
        యీ ప్రభ మూడు నాలుగేళ్ళు నడిచిందనుకుంటా!  అయ్య '72లో రెటైర్  అయ్యారు.  మా అన్నయ్య అరవింద్ జీతం  పెద్దగా వుండేది కాదు ఇంటి అవసరాలు ఆదుకునే స్థాయిలో!  ముగ్గురు పెళ్ళిల్లైన అక్కయ్యలూ,  వాళ్ళ అవసరాలూ..అబ్బో! రోజులెట్లా గడిచెవో మరి!  యీ లోగా అయ్యకు పద్మశ్రీ రావటమూ, సంజీవరెడ్డిగారు కడప   కలెక్టర్ గా  వచ్చినప్పుడు, అయ్య షష్టి పూర్తి పెద్ద యెత్తున జరిగి ఓ ఇరవై ఐదు వేల రూపాయల పర్స్ (సరిగ్గా  గుర్తులేదండీ..ఐనా అవన్నీ పెద్దవాళ్ళ విషయాలు అప్పట్లో) ఇవ్వటమైంది. జిల్లెళ్ళమూడి అమ్మ కరుణతో, చీరాలా, పేరాలా (అప్పుడు అయ్యతో నేనూ వెళ్ళానండొయ్ అక్కడికంతా!)  అటు వైపు బాగా  సన్మనాలవీ జరిగి రెక్కలు అల్లార్చుకునే సమయానికి  అమ్మ తీవ్ర అనారోగ్యం! మాటి మాటికీ, ఆసుపత్రి పాలు  కావటం, డబ్బు నీళ్ళలా ఖర్చైపోవటమూ! ఆ రోజులు తలచుకుంటే కడుపులోంచీ యేడుపు యెగదన్నుకుని వస్తుంది. ఆర్థిక స్థోమత అవసరం అప్పుడప్పుడే తెలుస్తున్న రోజులవి!
       తరువాతి కాలంలో, అయ్య తన పెద్ద రచనలు పండరీభాగవతమూ ,  జనప్రియ రామాయణమూ, వేసుకున్నారు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడి రేట్లతొ ఇచ్చిన పేపర్తో కాస్త ధైర్యంగానే!  కానీ, అప్పటికే, తెలుగు సాహిత్యభిలాష మసకబారుతున్నట్టుందేది. ఆ గ్రంధాలెవరూ గ్రంధాలయాలకంటూ కొనలెదు.పండరీభాగవతం, చెక్క బీరువాల్లో  వుండటం వల్ల, వర్షపు నీళ్ళు దిగి, చెదలు పట్టి పోయాయి చాలా  కాపీలు!..అయ్య ఆ చెదలు పట్టిన పుస్తకాల మధ్య కూర్చుని నిర్వేదంగా, యే భావమూ ప్రకటించని గాజు కళ్ళతో,  అన్న మాటలు ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి 'చివరికి,  నా  పండరీభాగవతాన్ని చెదలే చదివినాయన్నమాట  ప్రీతిగా! ' అని! 
         అట్లా, అయ్యకు తన పుస్తకాలను తానే  ముద్రించుకోవటం కూడా తప్పేనని  తెలుసుకునే వేళకు జరగాల్సిన నష్టం జరిగేపోయింది. జనప్రియ రామాయణం,  శ్రీనివాస ప్రబంధమూ, అయ్య పోయిన తరువాత, కొన్ని బ్రౌన్ లైబ్రరీకీ, కొన్ని..(యేడుపొస్తూంది) రక రకాలుగా  మాయమైపోయాయి.. .        పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు,  అయ్యను చూసిన స్ఫూర్తి తో, నేనూ  యీ ప్రచురణ రంగంలోకి, అయ్య పుస్తకాలను  ప్రచురిస్తూ, ఆడ అభిమన్యునిగా ప్రవేశించాను. నేను వేసిన పుస్తకాలవల్ల,  లాభాలెన్ని వచ్చాయన్నది  కేవలం  అనుభవైక వేద్యమే !  వ్యాపార చతురత ముఖ్యంగా వుండవలె కదా! వుద్యోగినులుగా వుంటూ, ప్రచురణ రంగంలో కూడా ప్రతిభ కనబరుస్తూ, సక్సెస్  సాధించిన  మహిళలు, చాలా  తక్కువే యెలాగైనా! యేమైనా చెప్పండి అదిప్పటికీ నాకు  రాని కళే! యేమైనా మాట్లాడేవాళ్ళని 'మీరూ పుస్తకాలు వేసి చూడండి, తెలుస్తుంది ఆ బాధేమిటో ' అనేస్తాను నేనైతే!   గట్టుపై కూర్చుని యెన్ని మాటలైనా మాట్లాడవచ్చు. దిగితే కదా లోతు తెలిసేది. అక్కడో  వూబే ఉండొచ్చు. మొసలే వుండొచ్చు. సుడిగుండమే కావచ్చు. యేమీ లేకపోనూ వచ్చు. అదంతా  అదృష్టం.. యెంతకూ దృష్టం కానిది మరి!   పుస్తకాలు వేసి అమ్ముకోవటానికి నానా  తిప్పలూ,  నానా  గడ్డీ తింటూ అగచాట్లూ పడుతున్న వాళ్ళకే యీ విషయాలు తెలుస్తాయి.  పైగా అయ్యనుంచీ, వారసత్వంగా వచ్చిన కొన్ని సుగుణాలుండనే  వున్నాయాయె! చొరవ   లేదు.  వుద్యోగస్తురాలినైనా, లంచాలిచ్చి పనులు చేయించుకోవడమన్న  విద్య రాకపాయె!  పుచ్చుకునే విద్య ఒస్తే, ఇచ్చే విద్యా వస్తుందట! అదే రాదు కదా మరి! యేమి మాట్లాడినా అయ్యకే చెడ్డపేరొస్తుందనే భయమూ!  ఐనా, కిందపడి దెబ్బ తగిలినా, అనుభవం మాత్రం చక్కటిదే, అన్నట్టు, పుస్తకాలమాటెటున్నా,    పుట్టపర్తాయన బిడ్డగా,  వచ్చిన గుర్తింపే యీ జన్మకు చాలు అన్నట్టుంది నాకైతే! యేమంటారు?    

......................
 

Thursday, 4 February 2016

Dari kace Sabari - A Telugu Devotional song



 సరస్వతీపుత్రుని అంతర్వాహిని......




             దారి కాచె శబరీ రాముండిటు వచ్చుననీ...

            తన పూజ గొనునటంచు ..

            వనవనమూ చుట్టి చుట్టి నగనగమూ తిరిగి తిరిగి

            ననలెల్లను గొని తెచ్చి,తనిపూవుల నేరియుంచి...దారి...

            సెలయేటను తానమాడి, తెలినార కట్టి,

            చెలిచెక్కిట చెయి జేర్చి,తలవాకిట నిక్కి చూచి..దారి..

            యెలగాలులు వీచినంత తలయెత్తి ఆలకించు,

             గలగల ఆకులు కదలిన అలికిడియా పదములదని..దారి...

             దూరాననుందునంచు తరువెక్కి నిక్కి చూచు,

             గిరిపై నిలుచుండి చూచు,కరమడ్డముగాగ చూచు..దారి..

             రారామ రామయంచు రాగలడిదె వచ్చెయంచు,

             రేబగళ్ళు తపియించుచు వాపోయెను వత్సరములు....దారి..

             దినమొక కల్పంబుగా, క్షణమొక్క యుగంబుగా,

             తనువెల్ల తపంబుగాగ, మనసెల్ల నిరాశగాగా..దారి...

             పరవశిoచు తలపులతో, భయకంపిత మనముతో,

             పగళ్ళెల్ల యెదురుచూచు, నిశలెల్లను మెలుకొంచు..దారి.

             చనుదెంచునొలెదో, తనుజూచునొ చూడదో,

             అని తపించి జపియించుచు, అనుమానము పెనగొనగా..దారి..

             రా రామ రామ రామా..ప్రియదాసుల గావరావ,

             కానరాని శబరి ప్రేమ నుడియుడిగిన మూగ ప్రేమ..దారి..

మా అమ్మ శ్రీమతి పుట్టపర్తి కనకమ్మగారు వ్రాసిన యీ పాట, అమ్మను యెరిగున్నవాళ్ళందరికీ, యెంతో ప్రీతిపాత్రమైన పాట! మా అయ్యకూడా, కళ్ళు మూసుకుని, తాదాత్మ్య స్థితిలో, భక్తి పారవశ్యంలో యీపాట వినటం-మేము గమనించిన సత్యం. అమ్మ 1983 లో (22nd March) తన శ్రీరామ సాన్నిధ్యానికి చేరుకున్నప్పుడు, మేమంతా, ఆమె శాశ్వత వియోగాన్ని భరించలేక-యీ పాటను అశృతప్త నయనాలతో పాడుతుంటే, అయ్య, చిన్న పిల్లవాడివలె, భోరున యేడ్వటం- అందరి హృదయాలూ తరుక్కుపోయిన క్షణాలు. కరణం, మా అయ్య జీవితానౌక, నిజమైన సరంగు అమ్మే కదా మరి! ఇల్లాలిగానూ, సాహితీపధ సహగామిగానూ, ఆ సరస్వతీపుత్రుని అంతర్వాహిని అంతశ్శక్తి కూడా ఆమే! ఆమే! అమ్మకు కన్నీటి నివాళీ!







Tuesday, 2 February 2016

Padake na rani....(A Telugu Light song)






 


ఆకాశవాణి తెలుగు ప్రసారాలు ప్రారంభమైన తొలి రోజుల్లో, సొంతంగా సంస్థ రికార్డ్ చేసుకున్న కొన్ని అద్భుత లలిత గేయాల్లో ఇది ఒకటి...

ఘంటసాలగారి గొంతులో, గుండెలు పిండేసే యీ వేదనాభరిత గేయాన్ని వినగల్గటం- ఒక మరపురాని అనుభూతి. (రచన రచన శ్రీ అడవి బాపిరాజు గారు. ఇది సంధుభైరవి రాగంలో కూర్చబడింది).ఆ రికార్ద్లమీద,

కేవలం గాయకుల వివరాలుండేవి తప్ప, రచయితా, సంగీత దర్శకుల పేర్లు వుండేవి కావు అప్పట్లో.  కానీ చిత్తరంజన్ గారు చెప్పినట్టు గుర్తు.) .)


                         పాడకే నా రాణి పాడకే పాటా..

             పాట మాధుర్యాన ప్రాణాలు మరిగెనే...

             పాడకే నా రాణి, పాడకే పాట....

.            రాగమాలాపించి వాగులా ప్రవహించి,

             సుడి చుట్టు గీతాల సురిగిపోనీయకే...పాడకే..

            కల్హార ముకుళములు కదలినవి పెదవులూ,

            ప్రణయపద మంత్రాల బంధించె జీవనము...పాడకే...

            శృతి లేని నా మదికి చతుర గీతాలేల,

            గతిరాని పాదాలకతుల నృత్యమ్మటే..పాడకే...
......................................

Monday, 1 February 2016

Mance digave...very famous Telugu yala padam..(I like this veryyyyyyy much)



 1978..కడప ఆకాశవాణిలో ఉద్యోగం...ప్రతిరోజూ పొద్దున 7.15 కు జానపదగేయాలు..అప్పట్లో కడప లో యెక్కువ జానపద గేయాలు రికార్డ్ అయ్యేవి కావు.  హైద్రాబాద్ కేంద్రం నుంచీ, విజయవాడ కేంద్రం నుంచీ, అక్కడ రికార్డ్ చేసిన జానపద గేయాలను తెప్పించి ప్రసారం చేసేవాళ్ళు.( చిన్నప్పటినుంచీ, అయ్యగారి ప్రభావం వల్ల కూడా కొంత, జానపద సాహిత్యం అంటే  నాకు భలే ఆసక్తి.  నేనూ కొన్ని గొబ్బిళ్ళపాటలు వంటివి సేకరించానప్పటికే! )నేను డ్యూటీ  ఆఫీసర్గా ఆ రోజు డ్యూటీలో ఉన్నప్పుడే కాదు. ఇంట్లో ఉన్నా, ఆ టైం కు సరిగ్గా రేడియోలో జానపద గేయాలు వినాల్సిందే! శారదాశ్రీనివాసన్   గారూ,  రజనీగారూ  (ఇప్పటి శతవసంత సుందరుడు) ఇద్దరూ పాడిన యుగళ గీతం- 'పెం డ దీసీ దీసీ దీసీ, చేయంతా నొప్పులూవుట్టే ' (అందులో  రజనీగారు, ఆ..ఆయ్...అంటూ ఇల్లాలిని  కసురుకునే విధానం భలే నచ్చేది) వింజమూరి సీత,అనసూయగారలు పాడిన 'మందులోడా'.. పాట నుంచీ  'మాయమాటలు చెబితీవీ పిల్లడో'...(అంటూ వెక్కి వెక్కి యేడుస్తూ తనను మోసం చేశాడంటూ   పాడే పాట) 'నక్కలోళ్ళా  సిన్నాదాన్నీ',   'మొక్కజొన్న తోటలో',  ఇంకా పాకాల   సావిత్రీదేవీ, నేతి శ్రీరామ   శర్మగారలు పాడిన 'రూపాయి కావాలా, రూపాయీ చిల్లర కావాలా,'  (వీళ్ళు కర్ణాటక సంగీతంలో అప్పటికేసువిఖ్యాతులైనా, జానపద గేయాలనూ అంతే ఇష్టంగా పాడటం నాకు భలే నచ్చిందప్పట్లో)  ఇంకా.... మధుర గాయని శ్రీరంగం గోపాల రత్నంగారూ, యెన్.సీ.వీ.జగన్నాధాచార్యులు  గారూ    పాడిన యీ పాటా...ఆహాహా...డ్యూటీ లో  ఉన్నప్పుడీపాటను,  విడిగా అ టేప్ యెన్ని సార్లు ప్లే చేసుకుని వినేదాన్నో! పిచ్చి శ్రీరంగం గారి గొంతటే!నన్నంత మంత్ర ముగ్ధం చేసేసిన అప్పటి యీ పాట ఇప్పుడెక్కడా వినిపించటం లేదెందుకో! యేది యేమైనా మా ఆకాశవాణికీ జై! యెంతో జానపద సాహిత్యాన్ని టేపుల్లో  భద్రం చేసి, ఇప్పటి తరానికి భద్రంగా అందజేసిన -  నా మాతృ సంస్థ! (నేనూ ఆకాశవాణి  కడప, హైదరాబాద్ కేంద్రాల్లో పనిచేసేటప్పుడు  కూడా యెన్నో పాటలు సేకరించి పాడటం పాడించటం, ఒగ్గుకథలూ, చిందు యక్షగనాలూ, జమిడిక కథలూ..ఇలా వాటికో ప్రత్యేకమైన చంక్ పెట్టి ప్రొమోట్ చేయటం,  కూడా చేసిన తృప్తే  కొండంత ఆనందాన్నిస్తుందిప్పటికీ!)  ఏదైనా అసలు పాట పట్టుకునేవరకూ, నేను పాడుకునే రీతిలో ఇలా రికార్డ్ చేసేసా.....మీకు నచ్చితే ఓకే! (నచ్చకపోతే మరింత పేద్ద ఓకే!)


    మంచె దిగవే ఓ పాంచాల సిలక..మంచె దిగవే..
    ఒంచిన తలా యెత్తి వాలు సూపులూ సూసి..మంచె దిగవే.....
   మంచే దిగవే ఓ పాంచాల సిలకా...మంచే దిగవే...
                  సేబాసు కుర్రోడా సెవుల పోగులా వోడా..
                 మా బావా విన్నా కన్నా మరియాదా దక్కూనా..మంచే దిగానూ...
                 మంచే దిగానూ..ఓ పొంచున్న  చినవోడా..మంచే దిగనూ...
  అల్లాము బెల్లాము తెల్లా కొంగునా కడుదు,
  తెల్లాకొంగున కట్టీ తెల్లారేసరికీ పోదూ..మంచే దిగావే..
  మంచే దిగవే..ఓ పాంచాల సిలకా..
                అల్లాము  బెల్లాము  వొల్లాదూ నా మనసూ
               అన్నాదమ్ములు సూత్తే ఆచోటూ నిలువారూ..మంచే దిగానూ..
               మంచే దిగనూ..ఓ మంచీ మురుగులవోడా...మంచే దిగనూ..
  పూలా రైకా దానా వాలు సూపులాదానా.
  కాలిలో  ములు దిగెనూ కాసంత ములుదీవే..మంచే దిగావే..
  మంచె దిగవే ఓ పాంచాలా సిలకా..మంచె దిగవే..
               కాలిలో ములూ దిగితే కర్రీ మంగలీ కలడూ,
              తాలీ గట్టీనోడూ తాయెత్తు గట్టూ ..మంచె దిగనూ..
              మంచె దిగనూ ఓ పొంచున్న చినవోడా..మంచే దిగనూ..



..................................