Thursday, 14 January 2016

                                                    సంక్రాంతంటేనే .........


     
సంక్రాంతంటేనే ముగ్గులు ముగ్గులు ముగ్గులు...వంచిన నడుం యెత్తకుండా, చుక్కల ముగ్గులు, పువ్వుల ముగ్గులూ, డెజైన్ల ముగ్గులూ..అబ్బో ..యెన్ని ముగ్గులో...చిన్నప్పటి జ్ఞాపకాల్లో ముగ్గులదే ఒక ఆనంద పర్వం. ఇంట్లొ ముగ్గులు, బయటా ముగ్గులు, దాల్బందరం (ఇది రాయలసీమ పదం - అదే ద్వారబంధమండీ) మీద పైంటింగ్ లో ముగ్గులు, రెండు మూడేళ్ళు చెదరకుండా వుండేందుకు పైంటింగ్ చేసి, రంగులు కూడా నింపటం - మరువలేని పుట్టింటి సంతోష తరుణాలివన్నీ నాకు! 


అయ్యకు పద్మశ్రీ 1972లోనూ, కొద్ది రొజులకే డాక్టరేట్ కూడా వచ్చేసిన తరువాత, అమ్మ అయ్య కోసం మురిపెంగా, (యీ విజయాలకు శాశ్వత రూపమిస్తూ, ఒక 1'/3' సైజ్ లో రేకు తో నేం ప్లేట్ చేయించింది. (అంతవరకూ అయ్య పేరుతో నేం ప్లేట్ లేదు మరి) సరస్వతీపుత్ర, పద్మశ్రీ డా. పుట్టపర్తి నారాయణచార్యులు కడప అన్న అక్షరాలతో! అక్షరాలు మాత్రమే పొందిగ్గా ఉన్నాయి తప్ప మరే అలంకరణలూ లేవా ప్లేట్ మీద! నాకది నచ్చలేదు. అయ్య పేరు అట్లా యే అలంకరణలూ లెకుండా వుండటమా! ఆయ్!!!! దాన్ని పూలతో డిజైన్లతో అలంకరిస్తానన్నాను.ఆ రోజుల్లో నామాటాంటే మాటే పుట్టింట్లో! అన్నదే తడవు, మా అన్నయ్య అరవిందును బజార్ కు పంపి, తెలుపూ, పసుపూ, నీలం, ఆకుపచ్చా పైంట్లూ, బంగారు రంగు అద్దటానికి అదేదో పొడీ, బ్రషులూ - ఇవన్నీ తెప్పించింది అమ్మ!


(My mother Smt. Puttaparthi Kanakammagaru
  with my brother Sri Puttaparthi Aravind in 1980s)

ఇహ చూస్కోండి, నా విజృంభణ! వీర లెవెల్లో, పగలూ రాత్రీ అన్న తేడాలెకుండా, పైంటింగ్తో డిజైనులూ, లతలూ, పూలూ అబ్బో.. చక్కటి రంగుల కాంబినెషన్లో అందాలను ముద్దొచ్చేలా దాల్బందరం మీద ఆవిష్కరిస్తుంటే, అమ్మా, అయ్యా ఎంత ముచ్చటగా చూసేవారో! (అ తరువాత యెన్ని సంతోష తరుణాలొచ్చినా, ఆనాటి ఆనందం మకుటాయమానం) కడపలో ముఖద్వారం పైన ఆ నేం ప్లేట్, అ అలంకరణలూ ఇప్పటికి అలాగే ఉన్నట్టే గుర్తు మరి..నా పెళ్ళైన తరువాత, అత్తింటా యీ పరవశం అలా అలా కొనసాగి కొనసాగి...సాగి సాగి.. బాధ్యతలు పెరిగిన తరుణాన, ,పెద్ద పెద్ద ముగ్గులు ఒకెసారి పైంటింగ్ వేసి రంగులేసి, సంతోషపడటానికే పరిమితమైపొయింది. ఇక ఇప్పుడు సొంత ఇంటి పెరడులో మినీ శిల్పారామం కూడా!





ఇప్పటి వయసూ, ఓపికనుబట్టి, ముగ్గులూ, రంగుల సంబరం కాస్త మసకబారినా ఇప్పటి జీవితానికిదే ఆనందం మరి నాకైతే! గేహాన్ని వర్ణ సంభరితం చేయటమనే అభిరుచి,దెహంలొని హృదయగేహాన్ని భక్తి రంగవల్లికలతో అందగింపజేసుకోవటంగా మారింది మరి! మనసు నచ్చిన, మెచ్చిన, పరవశించిన ముచ్చట్లను సమభావ సమన్వితులైన స్నేహ బృందంతో పంచుకుంటూ పొందుతున్న ఇప్పటి ఆనందమూ అనుభవైకవేద్యమే మరి! (పుట్టింటి దాల్బందరం ముచ్చట మీకు నచ్చేవుండాలి మరి)


.                      ............


Wednesday, 13 January 2016










.....
ఆత్మీయ మిత్రులందరికీ, భోగి, సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు.
  శ్రీవైష్ణవులనే  కాదు. చరాచర జగత్తు సర్వాన్న్నీ  ప్రేమపాత్రుడైన మురళీకృష్ణుని  మధుర భక్తిలో తలమునకలుగ నిండమనీ, అదే జన్మ జన్మలకూ తన జీవితాశయమని ఆండాళ్ తన పాశురాలలో విశద పరచిన పవిత్ర మార్గశీర్షమాసమిది. ఆ తల్లి,  జీవులందరూ  స్త్రీలే-ఒక్క పరమాత్మ తప్ప,  అంటూ  మనందరికీ  సూచించిన యీ పరమ సత్యాన్ని,  స్త్రీప్రాయమితరం జగత్ అన్న వేదోక్తి యేనాడో ధృవీకరించింది. అసలు గోపికలందరూ రామైక్యాన్ని ఆశించిన మునులేనంటున్నాయి పురాణాలు కూడా! వాళ్ళందరూ గోపికారూపాలలో,  మధుర భక్తిని తమ సొంతం చేసుకున్నారట ద్వాపర  యుగంలో! స్త్రీ పురుషులన్న  తేడాలేమాత్రమూ   లేక, అందరమూ, శ్రీకృష్ణుని లీలామానుష రూపాకర్షణకు  లొంగని వాళ్ళెవరూ ఇప్పుడూ ఉండరు కదా! 1970లో అయ్య, నల్లకుంట రామాలయంలో, ముఫై రోజులపాటు  తిరుప్పావై వుపన్యసాలిచ్చినప్పుడు, అయ్యతొ నేనూ వున్నాను. శ్రీమాన్ వీ.పీ.రాఘవాచార్యులుగారూ (ఒకప్పుడు వుపాధ్యాయుల హక్కులకోసం చాలా అంకిత భవంతో  తీవ్రంగా కృషి వేసిన యెం. యెల్. సీ కూడా వారు - వురుపుటూరు రాఘవాచారి  అనేవారయ్య   వారిని) శ్రీమాన్ వీ .రాఘవన్ గారూ  (1980లో ఆంధ్ర ప్రదేష్  రాష్ట్ర అత్యున్నత సివిల్ ఇంగినీర్ గా పనిచేసిన, ఇప్పుడు కూడా అనేకానేక  సామాజిక సాంఘిక సేవా కార్యక్రమలలో చురుకుగా పనిచేస్తున్న వారు,  డీ డీ కాలనీలో  అహోబిల మఠ్ ఆలయాన్ని కట్టించినవారు, రాఘవాచారిగారికి మరిదిగారు) వీరిరువురి అధ్వర్యంలో జరిగాయా ప్రసంగ మాలికలు! అప్పుడు అయ్య యెంతో వుద్వేగంతో  ప్రతిరోజూ రెండు గంటలపాటు భక్తి సంప్రదాయం, మధుర భక్తీ, ద్రవిడ ప్రబంధ  విశేషాలూ అన్నిటితో, వుపన్యసించటం విన్నాన్నేను.  పూర్తిగా కాకపోయినా, అ శృత  పాండిత్యం కస్త ఇంకా నాలో మిగిలే వుంది.(వాటికి సంబంధించి అయ్య స్వదస్తూరీతో తయారు చేసుకున్న  నోట్స్ కూడ నావద్ద కొంత వున్నది)  అందుకే ఆ అనుబంధానికి, అయ్య మాకందించిన హిందీ లో అక్షర రూపమివ్వగా, టీ టీ డీ హిందీ సప్తగిరిలో 2008లో ధారావాహికగా రావటం, అటు తరువాత, డా.శ్రీమాన్ కే.వీ.రమణాచారిగారు, టీ టీ డీ కి సీ ఈ ఓ గా   వున్నప్పుడు, దాన్ని టీ టీ డీ ప్రచురణగా  అంగీకరించటమూ జరిగింది. (బాపూ గారి వర్ణచిత్రాలు కూడా ఇందులో పొందుపరచటం-అయ్య ఆశీస్సులవల్లే జరిగిందనుకుంటాను) ఆ నాటి జ్ఞాపకాలతో ఆ  ప్రచురణలోని కొన్ని పుటలు ఇవిగో మీకోసం! 
  13-1-2016

Monday, 11 January 2016


..................
      'వాడె  వెంకటాద్రి  మీద వరదైవమూ'.....వసంత రాగంలో మల్లాది సోదరులిద్దరూ గంభీరంగా   అన్నమయ్యను ఆలపిస్తుండటం-మార్గళి సంగీతోత్సవ  వీక్షణలో నాకు  మరింత హాయినిచ్చిన అంశం. హైదరాబాద్ సోదరులూ, సోదరీమణులూ కూడా చాలా సార్లే యీ మార్గళి వైభవాలలో పాల్గొన్నారు కానీ  వారి సంగీతాభినివేశం-చిన్న తెర  మీద యీ సంగీతోత్సవాల్లొ భాగంగా యూ ట్యూబ్ లో ఉంటుందేమో  కానీ, ఇప్పుడు వీరిరువురినీ చూస్తుండటం- తెలుగుదనము తీపిని పెంచింది!
 పైగా, మల్లాది సోదరులలో ఒకరు, అన్నమయ్య గురించిన కొన్ని వివరాలు కూడా పాట  పాటకూ ముందు ఇస్తూ ఉంటే (in tamil only)

 అనందం రెడింతలైంది. అన్నమయ్యను వెలుగులోకి తెచ్చిన ప్రాతస్మరణీయులైన పెద్దలు శ్రీమాన్ వేటూరివారూ, రాళ్ళపల్లి వారూ, గౌరిపెద్దివారూ, శ్రీపాద పినకపాణి గారలను ఆ వేదికపై  ప్రస్తావిస్తుంటే (వీరు స్వరపరచిన కొన్ని సంకీర్తనలను ఎమ్మెల్వీ అమ్మా, ఎమ్మెస్ అమ్మ ప్రాచుర్యంలోకి తెచ్చారని వివరణ కూడా)  ఆ సభలోని వారందరూ శ్రద్ధతో  విన్నారు. శతపత్ర సుందరుడు  బాలాంత్రపు వారినీ అన్నమయ్య స్వరకర్తలలో ప్రముఖులుగా పేర్కొని, వారినీ గౌరవాన్వితులను చేశారు. ప్రత్యేకించి నేదునూరి  వారి సంగీత  సామర్థ్యాన్ని ప్రస్తావించిన తీరు  బాగుంది. 1970లలో నేదునూరివారు  తిరుపతిలో సంగీత కళాశాలలో పనిచేసేటప్పుడు, టీ టీ డీ లో పనిచేస్తున్న శ్రీపాదరేణువు శ్రీమాన్ కామిసెట్టి శ్రీనివాసులుగారు నేదునూరి వారి దగ్గరికి వెళ్ళి,  స్వామీ! అన్నమయ్య సాహిత్యానికి సంగీత సౌరభాన్నద్దండి అంటూ  పదే పదే అభ్యర్థించారట!  నేదునూరివారు  ఇదేదో  చూద్దామని  మొదలు పెట్టటం ఆలస్యం..ఆ సాహిత్యాకర్షణ వారిని ఆవరించింది  పూర్తిగా! ఆ తన్మయత, జీవితాంతమూ  ఆ మాదిరిగా   వారిని ఆవహించే ఉండటం- మన అదృష్టమే కదా! అన్నట్టు వారు మొదట్లో (అక్కడే  వున్నప్పుడు) తను యేదైన కీర్తన  స్వర పరిస్తే,  స్వామి దర్శనానికి  వెళ్ళిపోయేవాళ్ళట! అక్కడ ముందుగా స్వామి  ముందు ఆలపించేవారట! ఆ విధంగా ఆ   ఆనంద నిలయుని ఆమోదాన్ని పొందినట్టే భావించి,  తరువాతే,  దాన్ని, సభావేదికలపై  పాడేవాళ్ళట!  అప్పటికే వారి సంగీత ప్రజ్ఞ సుప్రసిద్ధం ఐన, అ అఖిలాండ కోటి బ్రం హాండ నాయకుని ముందు యెంతటి ప్రముఖులైనా,  వినయంగా తల వంచవలసిందే అన్న విజ్ఞత నేదునూరివారిది మరి!
        కురంజి రాగంలో కంటి శుక్రవారము..అన్న సంకీర్తనలో  అన్నమయ్య అప్పుడే  ప్రత్యక్ష ప్రసార వ్యాఖ్యాత రూపం దాల్చాడు కూడా.  ఆ సాలిగ్రామ మూర్తి సొమ్ములన్నీ కడ (ఇది రాయలసిమ పదం . కడగా  పెట్టటమంటే, విడిగా పెట్టటం) బెట్టి, పన్నీరు తో అద్దారట!  వేష్టి (ఇది తుండు గుడ్డ అన్న అర్థన్నిచ్చే సంస్కృత పదమనుకుంటా!) చుట్టి, పచ్చ కర్పూరాన్ని  అద్దారట!  తుమ్మెద మైచాయతో.  నిత్య మల్లెపూవువలె  వెలిగిపోతున్న స్వామి కి తట్టుపునుగు కూడా దట్టంగా అద్దుతుంటే చర్మ చక్షువులతో చూసి తను తరించతమె కాక, సంకీర్తనారూపం లో అ వైభవాన్ని వివరించి, తరించాడా కారణ జన్ముడు! 
  యేమొకో చిగురుటధరమున (తిలాంగ్ రాగంలొ ) అన్నమయ్య శృంగార   సంకీర్తననాలపించిన  తరువాత   అవధారు రఘుపతీ అన్న కీర్తన ఖమాస్ లో జనరంజకంగా పాడినతరువాత కర్యక్రమం ముగిసింది..
    (కొసమెరుపు-మా శ్రీవారూ  నాతో యీ ఖమాస్ రాగ కీర్తన వింటున్నారు.  ఇంక కొంత సేపుంటే   బా గుండెది అనుకుంటూ,   నా   ఆనందాన్ని  మా వారితొ పంచుకుంటుంటే, ఠక్కున గుర్తొచ్చి అడిగానాయన్ను  'యేమండీ! యీ రాగంలో మీకు చాలా  ఇష్టమైన ఒక పాట ఉందాలి కదా?'  అని..ఓ పదిహేను ఇరవై సెకన్న్లు దీర్ఘంగా ఆలోచించి,  ఠక్కున పాటందుకున్నరు-'బ్రోచెవారెవరురా!'   అని. అరెరె..యెంత బాగా   చెప్పారో!  అప్పట్లో శంకరభరణం సినిమా పాటలంటే మా వారు చెవి కోసుకునేవారట! మా పెళ్ళి చూపుల్లో, మా మామగారీ  సంగతి గర్వంగా చెప్పారు. పెళ్ళి చూపుల్లో, నెనూ అదే కీర్తన పూర్తిగా పడితే, హాయిగ అందరూ విన్నరు. వెంటనే ఓకే కూడా చేశరు.. కూడా! మొత్తానికి ఖమాస్  రాగం మమ్మల్ని కలిపిన  రాగం  కూడా కదా మరి..!)  

                                                 ఓరి నీ పాసుగూలా?  

  ఇది అయ్య నోటినుండీ చాలా యెక్కువగా వినిపిస్తూ ఉండిన అచ్చమైన  రాసీమ  పదం. మా అక్కయ్యల పిల్లలు (కృష్ణప్రసాద్, శ్రీనిధి, రవికిషోర్, శ్రీకాంత్-వయసులవారీగా) తెగ అల్లరి చేస్తుంటే, ముచ్చటగా వాళ్ళను గద్దించేందుకీ మాట వాడేవారాయన! నీ బండబడ.. అన్నట్టు, ఇదికూడా ఒక పలుకుబడి అనే  అనుకోవచ్చు. అసాధ్యుదివే అన్న అర్థంలో, అవతలి వారితో  యెక్కువ చనువు వున్నప్పుడు, నవ్వుతూ అనేసుకునే  మాటిది. కోపంలొనూ, అవతలివారి ధోరణి నచ్చకపోయినా, 'వాడి  పాసు గూలా' అనికూడా, వాడటం కద్దు.
  తనదగ్గరికి వచ్చే శిష్యుల మాటకరితనమో, అల్లరి కామెంటో నచ్చినప్పుడు కూడా  అయ్య  యీ ప్రయోగం చేసేవారు కూడా!
  యీ మాటంటున్నప్పుడు అయ్య వదనంలో వెలిగే ముసి ముసి నవ్వుల వెలుగులిప్పటికీ గుర్తొస్తూనే వుంటాయి-కళ్ళల్లొ నీళ్ళు తెప్పిస్తూ! 
యీ ప్రయోగం  గురించి పదకోశం యేమంటుందంటే, 
ఏపు, శక్తి. [నెల్లూరు]
నీ పాసుగాల; -నీ పాసు పిల్లిబెరక అని తిట్టు.


Saturday, 9 January 2016

       ధనుర్మాసం వచ్చిందంటే,
వైష్ణవాలయ పరిసరాలు, తెల్లవారు ఝామున తిరుప్పావై పాశురాల గానాలతో కర్ణపేయంగానూ, వేడి వేడి పొంగల్ నైవేద్యాలతో రుచుకరంగానూ, దివ్య ప్రబంధ ప్రవచనాల నైపుణ్యాలతో పవిత్రంగానూ వెలుగులీనుతూ వుంటాయి.

నాకు 17, 18 యేళ్ళప్పుడు, మా అయ్యగారినడిగాను- 'నాకు తిరుప్పావై చెప్ప'మని! 'మీ అమ్మ చెబుతుంది పో' అన్నారయ్య. అమ్మ శ్రీమతి కనకమ్మగారికి కూడా, తమిళమూ, మళయాళమూ, కన్నడమూ, ఒకటి రెండు ప్రాకృత భాషలూ, సంస్కృతమూ, హిందీ, ఆంగ్లమూ బాగా వచ్చేవి. ఆమె తాతగారు విద్వత్ కవి మణి బిరుదాలంకృతులూ, శ్రీమాన్ ధన్నవాడ కిడాంబి రాఘవాచార్యులవారు. ఒకప్పుడు ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా) బహద్దూరు గారైన సవై రాజా రామ భూపాల రవుగారి అమరచింతాత్మకూరు సంస్థనంలో వారు ఆస్థాన పండితులు.(1930 ప్రాంతాలలో కావచ్చు) గజారోహణ గౌరవాన్నందుకున్న పండితోత్తములు.







. వారి ఒడిలో కూర్చుని, ఆమె పెళ్ళినాటికే సంస్కృత ఆంధ్ర పంచకావ్య పఠనం పూర్తి చేసింది మరి..(మా అయ్యగారితో పెళ్ళినాటికి ఆమె వయస్సు 14యేళ్ళు). 
మా అమ్మ యెంతో చక్కగా తిరుప్పావై అర్థ తాత్పర్యాలతొ సహా నాకు చెప్పింది. సమయ సందర్భాలను బట్టి, ఆయా పాశురాల అర్థాన్ని, మరింతగా విశ్లేషించే సంస్కృత శ్లోకాలూ, తెలుగు పద్యాలూ, కన్నడ దాసర పదాలూ, కబీర్ సూరదాసు పదాలూ- అబ్బో యెన్నెన్నో! అమ్మను విడిగ చూస్తే, యీమెలో ఇంత పాండిత్యం దాగి ఉందని యేమాత్రం అనుమనమూ రాదు. అతి సామాన్య గృహిణిగా చలా సాదా సీదాగా తొమ్మిది గజాల చీరలో, భుజన కొంగు కప్పుకుని వుండెదామె! యెప్పుదూ వేలుముడితప్ప చక్కగా జడవేసుకుని, పూలు పెట్టుకున్న అమ్మను చూసిన గుర్తులే లేవు. అప్పటి అమ్మలంతా అంతెనేమొ కదా! (అంతే కాదు-మందాసనం ముందు వంగి కూర్చుని, ముక్కుపైకి జారుతున్న కళ్ళద్దలతో శ్రద్ధగా, వాల్మీకి శ్రీమద్రామాయణ పారాయనం చేస్తున్న అమ్మ చిత్రం న మనసులొ ముద్ర వేసుకుని కూర్చుందిప్పుదు కూడా) దురదృష్టవశాత్తూ, నేను వ్రసుకున్న అప్పటి నోట్స్ కనిపించకుండా పోయింది. కానీ, కొన్ని కొన్ని పాశురాలను మా అమ్మ విశ్లేషించిన తీరు అద్భుతం తెలుసా!  

ఓంగి ఉలహళంద' అన్న మూడవ పాశురంలో, నెలకు మూడు వానలు కురిసే గొల్లపల్లెను యెంత బాగా వర్ణించిందో ఆండాళ్! ఆమె భూపుత్రి. ప్రకృతితో ఆమెకున్న అనుబంధమంతా ఆమె పాశురాలలోనూ ప్రతిఫలిస్తుంది.
      ఆమెకున్న పురాణ పరిజ్ఞానం అసాధారణం. గంభీరమైన జటిలమైన వేదాంత రహస్యాలను కూడా, తేలికైన మాటల్లొ, అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు విశద పరచటం ఆమె నైపుణ్యం.
     యేడవ పాశురంలో, పెరుగును చిలుకుతున్న గోప స్త్రీల మెడలోని, తాళిబొట్లూ, కాసుల పేరులూ ఒకదానికొకటి రాసుకొనగా పుట్టే మధుర ధ్వనికి సైతం అందంగా అక్షర రూపం ఇవ్వటం గోద పరిశీలనాసక్తికి తార్కాణం.

      15వ పాశురంలో, సంభాషణరూపంలో రచన చేయటం అప్పటి రచనలలో కానరాని, గోదాదేవి చేపట్టిన వైవిధ్యం.
       యేదైనా పని కోసం వెళ్ళేటప్పుడు, చిన్న నుంచీ, పెద్ద వరకూ, అందరినీ గౌరవించితేకానీ పని జరగదన్న లోక రీతిని గోద సైతం తన పాశురాలలో ప్రతిబింబింపజేసింది. ద్వారపాలకుడిని ముందుగా బ్రతిమాలి, కృష్ణుని గృహంలోకి ప్రవేశం సంపాదిస్తుంది.

అటుతరువాత, కృష్ణుని తల్లిదంద్రులు నంద యశోదలనుంచి కూడా మర్యాద పూర్వకంగా కృష్ణుని లేపేందుకు అనుమతిని కోరుతుంది గోద.

ఆండాళ్ మధుర భక్తి, నీళా పరిష్వంగ సుఖానందంలో అలసి సొలసిన కృష్ణుని నిదుర లేపటంలో యెన్నెన్నో వన్నె చిన్నెలు చూపుతుంది.


22వ పాశురంలో, ఆండాళ్ వర్ణనా నైపుణి, కొత్త పుంతలు తొక్కటం, నిజంగా ఆస్వాదనీయం. కృష్ణుని కళ్ళను, చిరుగజ్జేలతో పోల్చటం ప్రపంచ సాహిత్య చరిత్రలోనే అనుపమేయం. కింకిణి అంటే చిరుగజ్జెలు. ఆ చిరుగజ్జెలెలా ఉంటాయి? అతి చిన్నగా మాత్రమే తెరచుకుని వున్న కింకిణులలోని, చిన్న వెండి గుళ్ళు, అటూ ఇటూ అప్పుడప్పుడు కదులుతుంటాయి. స్వామి కళ్ళు సూర్య చంద్రులకు నెలవులు. ఆ సూర్య చంద్రుల సంపూర్ణ దృష్టి మాపై పడితే, మేము తట్టుకోలేము కదా? అమాయకులమైన మాపై, చిరు గజ్జెలనుంచి, అప్పుడప్పుడూ తొంగిచూసే వెండి గుండ్లలాంటి అర్ధ నిమీలిత దృష్టిని మాత్రమే ప్రసరించవలె నీవు!
     23వ పాశురంలో, స్వామిని శీరియ సింగం అని సంబోధిస్తుంది - గోద. 
        వర్షాకాలంలో, గుహలో పడుకుని వున్న శ్రేష్టమైన సిం హం, మేఘ గర్జనలకు, నిద్రాభంగం కాగా, నిదుర మేల్కొని, అసహనంతో, బయట కలయజూసి, హేతువు కానక, కోపంగా జూలు విదిలిస్తుంది. అటుతరువాత, నిక్కి, నీల్గి, ఒళ్ళంతా సాగదీస్తుంది. ఒకసారి భయంకరంగా గర్జించి, అప్పుడిక తన గుహలోంచీ, బయటికి వస్తుంది.
     ఈ సృష్టి సహజమైన జంతు లక్షణాన్ని, శీరియ సింగమైన కృష్ణునికి ఆపాదిస్తూ, నీళాదేవి ఘన కుచ గిరుల మధ్య శయనించి వున్న ఆ నంద కిశోరుని, ఒడలు విరచుకుని, శరిరాన్ని నిగడదీసి, బయలుదేరి బైటికి రమ్మంటుందామె!

అలా 23వ పాశురంలో, శీరియ సింగంగా స్వామిని పోల్చి, నిదుర లేపినందుకు కోపగించకుండేందుకు, 24వ పాశురంలో, ఆయనను శాంతింప జెసెందుకు, శ్రీవారి పదములకు మంగళాశాసనం చేస్తుంది తెలివిగా గోద!

'మహానుభావా! కరుణార్ద్ర హృదయా! గొవిందా! దామోదరా! ఇన్ని రోజులూ, పూలూ, కాతుకా, కర్ణాభరణములూ వంటి అలంకరణలన్నీ త్యజించి, నీ ధ్యానంలోనే, మునిగి వున్న మమ్ములను కరుణతో దగ్గరికి రానివ్వు. నీ కల్యాణగుణలను పాడేందుకు మాకు పరై అన్న మంగళ వాయిద్యన్ని నీవే దయచెయవలె సుమా! అంతే కాదు. సుమంగళీ సౌభాగ్యకరములైన గాజులూ, రెట్ట కడియములూ, చెవి కమ్మలూ, కాలి అందెలూ, ఇంకా ధరించేందుకు చక్కటి వస్త్రాలూ ఇవ్వవలె నువ్వే!
    మంగళ స్నామాచరించి, నీవిచ్చిన అభరణములు ధరించి, నిన్ను మనసారా భజించి, నేతి సరస్సులో తేలాడే విధంగా మేము చేసిన క్షిరాన్నమును, ఆ నేయి మోచేతులవెంట కారుతుండగా, నీతోకలిసి, మేము భుజించి ఆనందించవలె స్వామీ!
      ఓ కృష్ణా! మేము గొవులను మేపుకునే గొల్ల జాతివారము. ప్రపంచ వ్యవహర జ్ఞానమేమాత్రమూ లేని మాయకులం. మాగొల్ల ఇంత నివు జన్మించటమే, మాభగ్య విశేషం. మాలో ఒకడివై తిరుగుతుందిన నీ లీలామానుష రూపాన్ని యే మాత్రమూ తెలుసుకొలెక పొయాం. మమ్ము మన్నించు. నిన్ను చనువుగా యెంతో అమర్యాదగా పిలిచే వుంటాం. మమ్ము క్షమించు. శంఖమూ, చక్రమూ, వంటి వాయిద్యలనడిగేందుకె నీ వద్దకు వచ్చామనుకునెవు..అది కెవలం, నిన్ను చేరెందుకో మిష మత్రమే! నిజానికి మాకు కావలసింది, నేటికే కాదు. జన్మ జన్మలకూ, నీతొ చెడని కైంకర్య సౌభాగ్యం మాత్రమే సుమా!'
     ఇలా అమాయక గొల్ల వనితలాగా, తన మనసును తేటతెల్లం చేసిన ఆండాళ్ లో , యీ తిరుప్పావై పూర్తయేనాటికి, నిజంగానే,గొల్లవనితల వంటి శరీర గంధం వచ్చేసిందట! రామకృష్ణ పరమహంస కు, వానరం వలె తొక పుటుకొచ్చినట్టు! 'యద్భావం తద్భవతి' కదా మరి!

'ఏకస్వాదు న భుంజీత' - స్వాదు భూయిష్టమైన పదార్థాన్ని, ఒంటరిగా యెప్పుడూ భుజించకూడదంటారు పెద్దలు. అందుకే గోదాదేవి లో కూడా, తన మధుర భక్తిని, పదుగురికీ పంచి, వారిని కూడా, స్వామికి ఆత్మీయులను చేయటమనే సమిష్టి భావన కనిపిస్తుంది.
   ' సాకారుడైన నాపై మనసు నిల్పి, శ్రద్ధతో నన్నారాధించువారే నాకు కడుంగడు ప్రియులు' అని స్వామే స్వయంగా అన్నాడు కాబట్టే, గజేంద్రుడూ, శబరీ, జటాయువూ వంటివారు, స్వామి సాక్షాత్కరాన్ని పొంది తరించారు మరి! గోపికలూ రాసలీలలో స్వామితో నిరంతరమూ సామీప్య సుఖాన్ని అందుకున్న అదృష్టవంతులు. అందుకే, యీ విధంగా, మనసారా, అ దివ్య మంగళ విగ్రహుని నోరరా కీర్తించి, అమాయకులైన గొల్ల వనితలవలెనే, స్వామి సంపూర్ణానురాగాన్ని జీవులందరూ పొందవలెనని ఆండాళ్ తిరుప్పావై అంతరార్థం.
....................
   యీ విధంగా మా అమ్మ ఆ నాడు చెప్పిన తిరుప్పావై పాఠం- యీనాటికీ నా నిత్య పరాయణ గ్రంధం, నన్ను నిరంతరమూ తరింపజేస్తున్న మాతృగంధం. నమశ్శతాని తల్లీ!

                                         .........................

  









     


 యేమానందము భూమీతలమున.....

     ఇవ్వాళ ఆకాశవాణి హైదరాబాద్లో భక్తిరంజని విన్నా (పొద్దున 6.10 కి) తిరుప్పావై కోసం! ఆహా! వింటుంటే, మనసు మళ్ళీ, 25 యెళ్ళ వెనకటి జలతారు గతంలోకి...ఇప్పటికీ (గత 25యేళ్ళనుండీ) ప్రసారమౌతున్న యీ కార్యక్రమం డా. ఎల్లా వెంకటేశ్వర రావుగారి నిర్వహణలో తయారైంది (1990 ప్రాంతాలలో) గౌతమ్నగర్లో (మల్కాజీగిరి దగ్గర) సంతాన గొపాలాచార్యగారని గొప్ప వేద పండితుడుండేవారు. తమిళ వైష్ణవులైన వరు, తిరుప్పావై ప్రవచనాల్లో చాలా సువిఖ్యాతులు. వెదపఠనం కర్యక్రమాలకు వచ్చేవారప్పట్లో! ద్రవిడ ప్రబంధాలూ, పాశురాల వ్యాఖ్యానం పై వారికున్న పట్టు అనితర సాధ్యం. వారితో తిరుప్పావై వ్యాఖ్యానం, ఎం.ఎల్.వసంతకుమారిగారి అసమాన గాత్రంలో అప్పటికే లభ్యాలుగా ఉన్న, ఆండాల్ తిరుప్పావై పాశురాలూ, మధుర గాయనీ, సుమధుర మనస్వినీ శ్రీరంగం గోపాల రత్నం గారి గాత్రంలో సప్తపదీ. సప్తపది తరువాత, వేదాంత  దేశికులవారి గోదా స్తుతిని శ్రీయుత చిత్తరంజన్, డీ.శేషాచారి (హైదరాబాద్ బ్రదర్స్ లొ ఒకరు-ఆకాశవాణి నిలయ విద్వాంసులు)ఆల్టర్నేట్ గా పాడటం కూడా వుంది ఇందులో....అ తరువాత యేదైనా భక్తి రచన..ఇలా కార్యక్రమమంతా ప్లాన్ చేసుకున్నారు. సువిఖ్యాత వైణికులు, అప్పుడు నిలయ విద్వాంసుడూ, శ్రీ పప్పు చంద్రశేఖర్ మృదు మధుర వీణా నేపధ్యంలో గొపాలాచార్య గారి వ్యాఖ్యానం రికార్డింగ్ యెంతో ప్రణాళికా బద్ధంగా, క్లుప్త సుందరంగా జరిగింది. శ్రీరంగం గోపాల రత్నం గారి సప్తపది రికార్డింగులూ యెంతో నియమపాలనతో అయ్యాయి. భక్తి కీర్తనలూ కొన్ని తజాగా చేసినట్టు గుర్తు మరి..ఇంతాచేసి, ప్రాథనాశ్లోకాలో? అప్పుడు చేసిన ప్లానింగ్ లో, శ్రీమాన్ వేంకటనాధర్యహ...నీళాతుంగ స్తనగిరితటీ...అన్న ప్రార్థనా శ్లోకాలు, శ్రీమాన్ చిత్తరంజన్ గారూ, నేనూ, నా ఆత్మీయ స్నేహితురలు శ్రీమతి వినయమణిగారూ మేము ముగ్గురమూ పాడగా రికార్డ్ చేశారు.  ఇందులో శ్రీ మండా బలరామ శర్మగారీ వేణువూ, పప్పు చంద్రశేఖర్  గారి వీణా  ప్రత్యేకాకర్షణలు.
 యెంత బాగా వచ్చాయో అవి...కార్యక్రమం తరువాత మంగళాశాసనం, రికార్డ్ చెసేటప్పుడు నేను లేనేమో, వినయమణిగారూ, చిత్తరంజన్ గరితో రికార్డ్ చేసేశారు. ఆ శ్లోకమిది...
    శ్రీమతే రంగజమాతృ మునీంద్రాయ మహాత్మనే
      .శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం...

మొత్తానికి,  రెకార్డింగ్ ముగిసిన తరువత, చిత్తరంజంగారు ఆ కార్యక్రమానికి యెంతో భక్తి శ్రద్ధలతో తుది రూపం ఇచ్చేందుకు తీసుకున్న శ్రద్ధ మరువలెనిది. మొత్తం కార్యక్రమంలో అయ్యగారి అస్టక్షరి కృతులు కూడా రెండో మూడో వున్నాయి. నాకు ప్రాణ ప్రదమైన ఎమ్మెల్ వసంతకుమారి గారి మధుర గాత్రంలో, బేహాగ్ రాగంలో పాశురం, శ్రీరంగం గారి గొంతులో ఖరహరప్రియ రాగంలో సప్తపది, ఘంటసాలగారి భగవద్గీత శ్లోకాలు, ఈరోజు ప్రసారమైనంతసేపూ. .కదలకుండా కూర్చుని, ఆ జ్ఞాపకాల్లో తేలిపోయా...మాకంది వచ్చిన అదృష్టం, వృత్తీ ప్రవృత్తీ ఒకటే అవటం. అదెదో, కష్టంగా కాక, ఇష్టంగా ఆడుతూ పాడుతూ ఉద్యోగం చేయటం - ఇలాంటి తీయని జ్ఞపకాలు మీలాంటి ఆత్మీయ స్నేహ బృందంతో పంచుకోగలగటం, యేమానందము భూమీతలమున- కదూ?

...........................

Friday, 8 January 2016


                                       గాజుల గలగలలు 
         గుడిపాటవ్వ ఇంటి వీధి అరుగులు నా స్మృతుల్లో ఇంతగా తిష్ట వేసుకుని వున్నాయంటే, నాకూ అత్యంత ఆశ్చర్యంగానే  ఉంది సుమండీ! నిద్రలో ఠక్కున గుర్తొచ్చి, అరె..మమ్మల్నెలా  మరిచీపోయావ్ అని ఇటీవల నన్ను నిలదీసిన యీ కబుర్లు మీకోసం..
       పెద్దక్కయ్యలు కరుణాదేవి, తరులత (ఆమెకు పెళ్ళైన తరువత అత్తగారింట్లొ లలిత అని పేరు మార్చుకున్నారు. ఐన మాకామె ఇప్పటికీ తరులతక్కయ్యే) ఇద్దరి పెళ్ళిల్లూ రెందు మూడు నెలల తేడాతో అయ్యాయని చెప్పానుగా ఇదివరకే(1960లో) నాకప్పుడు యేడేళ్ళు. వాళ్ళిద్దరూ, తరచుగా పుట్టింటికి వచ్చినప్పుడు, ఇల్లంతా పండుగ వాతావరణం. వాళ్ళను పుట్టింట్లో, దింపేందుకు,తిరిగి తీసుకుపోయేందుకు అప్పుడప్పుడు అల్లుళ్ళూ వచేవాళ్ళు. మా అయ్యగారికి యెప్పుడూ యే తేడా కూడా పట్టేదేకాదు. అమ్మదే హడావిడి అంతా! ఆడ పిల్లలకు, చీరెసారెలూ, అల్లుళ్ళకు మర్యాదలూ..ఇంట్లో మ అయ్యగారి కాఫీలూ  (అయ్య యెప్పుడూ  ఒకటిన్నర గ్లాస్ తాగేవారు. రుచి చక్కగా వుండవలె! పొడీ వాటి నాణ్యత గమనించే పనంతా అమ్మదే)  వుపహారాలూ, బీడీలూ, ఆయన బట్టలు సరిగా వున్నాయా లేదా- అన్నిటితోపాటూ, అల్లుళ్ళకూ, కూతుర్లకూ పెట్టుపోతల బాధ్యతా  అమ్మదే! డబ్బు కొరత వుండనే వుంది. అమ్మొ! యెలా నెట్టుకు వచ్చేదో పాపం కదా అనిపిస్తుంది. ఈ హడావుడి ఇలా కొనసాగుటుంటే, మధ్యలో ఒక నాడు, గాజులోయమ్మా అని గాజుల మలారాలన్నీ  పెద్ద మూటగా సర్దుకుని, నెత్తిన పెట్టుకుని  గాజుల లక్షమ్మ వచ్చేసేది. ఆమె  వచ్చిందంటే, ఇక ఇంట్లో సందడే సందది..పెళ్ళైన అక్కయ్యలతో పాటూ, మా మూడో అక్కయ్య తులజాదేవీ, నేనూ కూడా పోటీ పడేవాళ్ళం. రంగు రంగుల గాజులు, రకరకాలా డిజైన్లతో  ఉన్నవి అట్ట గొట్టాలకు అమర్చినవి, లక్షుమ్మ జాగ్రత్తగా ఆ మూటలోంచీ తీసిపెట్టెది ఆలస్యం, అంతా ఆమె చుట్టూ మూగే వాళ్ళం. నెను అందరికంటే చిన్నదాన్ని కదా! నాకు మరీ ఆత్రం. నా చిట్టి చిట్టి చేతులకు సరిపడే గాజులు తక్కువే వుండేవి. అక్కయ్యలతైతే బోలెడు రకాలు..నేనెప్పుడు పెరిగి పెద్దవుతానా, వాళ్ళు వేసుకునే లాంటి గాజులు నేనూ యెప్పుడు వేసుకుంటానా, అని ఒకటే తపన! అక్కయ్యలైతే, అది కాదనీ, ఇది కాదనీ, లక్షమ్మను నానా తిప్పలూ పెట్టి, చేతుల  నిండుగానూ, ఇంకా  దాచుకుని మళ్ళీ వేసుకోవడానికి కూడా గాజులు సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. మాకా చాన్స్ లేదు. 
 అప్పుడు బుడ్డమూతి పెట్టుకుని యేడ్చినా, తరువాత సర్దుకుపోక తప్పేది కాదు మరి! ఇంట్లో ఇలాంటి గాజుల పండగలెన్ని  చూశానో! ఇప్పుడు, షాపుల్లొనూ, అప్పుడప్పుడూ వీధి లో బండిపై  గాజులు  పెట్టుకుని వచ్చేవాళ్ళ అరుపులూ,గాజుల మలారాలూ రంగులీనే కాంతులూ, అపటికంటే యెన్నో కొత్త డిజైన్ల గాజులూ,ఆర్థిక సౌకర్యమూ  యెన్నెన్నో వున్నా - ఆనాటి ఆకర్షణా,దండిగా గాజులు వేసుకోవాలన్న తపనా ,   అప్పటి సంతోషమూ లేవు. . మనసునిండా ఆనాటి గాజుల  చప్పుళ్ళే ఇప్పటికీ ముచ్చట గొలుపుతుంటాయి-యీ నాటి అనుకూలాలను ప్రశ్నిస్తూ, వెక్కిరిస్తూ కూడా! (యీ గాజుల మలారాల మురిపాలు మీకు నచ్చాయో  లేదో- తెలిసేదెలాగబ్బా? 

                                                      9-1-16