Thursday, 7 January 2016




         ఈ రోజు పొద్దున్నే అనుకోకుండా టీ టీ డీ శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ లో  '108 వైష్ణవ దివ్య దేశాలు'  కార్యక్రమం చూశాను. దానిలోని 'శీర్షక గీతం' నేను రాసిందే! సోదరి, స్నేహలతామురళి సంగీత దర్శకత్వంలో నిత్య సంతోషినీ, నిహాల్ పాడారు. దాదాపు నలుగేళ్ళ క్రితం చేసినది.పేర్లొచ్చే భాగాన్ని వాళ్ళు వదిలేసి, ప్రసారం చేస్తున్నారు. అది వేరే సంగతి.నా తృప్తి నాది కదా!
 దానిలో ఒక వైష్ణవ దివ్యదేశం కథలో, లక్ష్మీదేవీ, భూదేవీ, నీళాదేవి- ముగ్గురికీ,తమలో  యెవరు గొప్పంటే, యెవరు గొప్ప అని  వాదన  వచ్చింది., లక్ష్మీదేవికి కోపం వచ్చి,అలిగి, భూలోకంలో, తీవ్రంగా అష్టాక్షరీ జపం చేస్తూకూర్చుందటా! ఇక, మునులూ, ఋషులూ- అంతా అమ్మవారి దగ్గరికి పరుగులు పెట్టారు. చివరాఖరికి, ఆ నారాయణుడు సైతం, ఆమె వద్దకు చేరుకుని, ఆమె కోపం పోగొట్టి, నెనూ నీతో ఇక్కడే కొలువైతానని మాటిచ్చి, ఆమెతోపాటూ ఆ క్షేత్రంలో వెలిశాడు. ఇంతకూ, లక్ష్మీదేవంటే మాటలా మజాకానా? అనిపిస్తుంది కదూ!
 శ్రీలక్ష్మి నీలీలలూ..చిత్రమైతోచునమ్మా..అని పాపం మన తెలుగింటి స్త్రీలు బుద్ధిగా పాడుకుంటారు కద! చిత్ర చిత్రమైన ఆ లీలలు- నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తాయి కదా! అందరికీ అనుభవంలోకొచ్చే సంగతులే ఇవన్నీ!
....................
   టీ టీ డీ చానల్ తరువాత తమిళ్ చానళ్ళలో వస్తున్న
మార్గళి ఉత్సవాలను చూస్తున్నా అప్పుడప్పుడూ! నిజంగా, సంగీతాన్ని 'శిశుర్వేత్తి పశుర్వేత్తి 'అని యే మహానుభావుడూ లేదా మహానుభావురాలు అన్నారో కానీ, అక్షర సత్యం. అసలీ సంగీతానుభవం,  సంగీతాసాస్వాదన  అన్న సుగుణం నుంచి మన  ఆంధ్రులు క్షణ క్షణానికీ జెట్ స్పీడ్లో దూరమైపోతున్నారెందుకో! తమిళుల సంగీతారాధన ముందు మనం యెక్కడున్నామో అనిపిస్తుంది.
         అక్కడి తమిళులంతా, యెంతటి ఆత్రుతతో, యీ మార్గళి సంగీతోత్సవాలలో పాల్గొంటారో మా ఆకాశవాణి నిలయ విద్వాంసుల మాటల్లో వినాలి.  యీ రోజుల్లో, ఆఫీసులలోనూ కాస్తంత వెసులుబాటుంటుందట! ఉద్యోగులకుకూడా సంగీత కచ్చేరీలు వెళ్ళెందుకు కాగితాలకందని అనుమతులూ  ఉంటాయట! ఇక ఇళ్ళల్లొ ఉండేవాళ్ళైతే, పొద్దున్న, యేదో కాస్త తినీ, మళ్ళీ యేదో కాస్త కట్టుకునీ, సంగీత సభలకు 'చలో జాయేంగే'  అంటూ బయలుదేరతారట! బయటే దొరికే  పొంగల్, ఇడ్లీ వడా, సాంబార్ వంటివాటితో తృప్తి పడతారట! అన్నిటికంటే సంగీతామృతం యెటూ ఉందిగదా అని వాళ్ళ ధైర్యం!   తాంబూలం పెట్టె సదా సర్వదా చిన్న చేతి  సంచీలో తప్పనీసరి!
      ప్రతీ సభలోనూ పాల్గొంటున్న విద్వాంసుల వివరాలు ముందే సేకరించి పెట్టుకుంటారు కాబట్టి, ఆయా సమయాలనుబట్టి, యే సమయంలో యే సభకు వెళ్ళాలి అని ముందే టైం టేబుల్ రెడీ  చేసుకుంటారు వాళ్ళు.  ఆయా వేళల్లో,  ఆయా సభలకు వెళ్ళి, ఆయా విద్వంసుల సంగీత పాటవాలను  విశ్లేషించుకుంటారన్నమాట! సాయంత్ర వేళల  కచ్చేరీలు పేరొందిన  విద్వాంసులకే దక్కేది.  ఆ సమయంలో కచ్చేరీ చేసేందుకు, వర్ధమాన సంగీత విద్వాంసులు తహతహలాడిపోతుంటారట!  అక్కడి ఆడియన్స్  తలలూగాయంటే ఇక ప్రపంచమంతా త్వరలోనే తమ కచ్చేరీలకు తల వూస్తుందనే  వాళ్ళ లెఖ్ఖ!మా ఆకాశవాణి కళాకారులూ యీ సంగీత ఋతువులో చెన్నైలో యేదైనా పేరొందిన వేదికపై, మాంచి ప్రైం టైం లో వాలిపోవాలని (కచ్చేరీ చేయాలని) తెగ తాపత్రయ పడిపోవటం... దక్కితే  సాక్షత్తూ అక్షయ కలశం చేతికందినట్టే వాళ్ళ ఆనందం..లెకపోతే, మళ్ళీ వచ్చే సీజన్ లొనైనా ప్రయత్నించాలనుకుని అసంతృప్తితో సరిపెట్టుకోవటం!  
...............
ఈ సంగతిక్కడ కట్ చేస్తే, యీ రోజు, విజయ్ టీ వీ లో ఇద్దరు సంగీత గాయకులు  ముత్తుస్వామి దీక్షితర్ గారి 'హిరణ్మయీం లక్ష్మీం' గానం చెస్తున్నారు.ఆ రాగ స్వభావాన్నీ,  అందులో చేయగల ప్రయోగాలనూ, వయోలిన్ పై మాత్రమే  పలికించగల నైపుణ్యాన్ని గొంతులో పలికించటం- అబ్బా! నిజంగా అద్భుతహ! (మన 'శివశంకరీ పాట' లో ఘంటసాల మాష్టారు చివర స్వరాలను, త్వరిత గతిలో పాడుతుంటే, ఒంట్లో గగుర్పాటు కలుగుతుంది కదా! సరిగ్గా అలాంటిదే నాకూ యీ గాయకులద్వారా  యీ కృతి వింటుంటే కలిగింది.) 
     అహా! లలిత రాగం..  ముత్తుస్వామి దీక్షితార్ వ్రాసిన ' హిరణ్మయీం  లక్ష్మీం ' అన్న లలిత రాగం లోని కీర్తన నాకు మహా ఇష్టం. లలిత రాగం లోని జీవ స్వరాలైన స, రి, గ, మ, స్వరాలు, పదే పదే   శృతి పక్వంగా ఉచ్చరిస్తుంటే కన్నీళ్ళు ఆగనే ఆగవు సుమా! ,కడుపులోని కల్మషమంతా తన్నుకుని కన్నీళ్ళ  ద్వారా బై టికి వచ్చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది!  యీ రాగం వింటుంటే, యేదో మానసిక శోధన! చిన్నప్పటినుంచీ, నేను  చేసిన తప్పిదాలూ, మా అమ్మా, అయ్యా మనసును నొప్పించిన నాటి దృశ్యాలూ, నా మూర్ఖత్వమూ, నాడు నాలోలేని ఇంగితమూ, నేడు కనుమరుగైపోయిన వాళ్ళిద్దరినీ క్షమించమని అడుగలేని అపరాధ భావమూ..ఇవన్నీ సుళ్ళు తిరుగుతూ..ఇదేకాబోలు జీవుని వేదన అనిపించేలా చేస్తుందీ రాగం నన్ను!
 ఈ మహాత్యం ముత్తుస్వామి వుపాసనదా, రాగానిదా లేక సాహిత్యానిదా.. వెరసి మూడింటిదీ అని    నా అభిప్రాయం.
......... 
   చివరాఖరున..కొసమెరుపు..టీ టీ డీ, విజయ్,లక్ష్మీదేవీ, లలిత రాగం...అబ్బబ్బ.. ఇన్నిటినీ ఒక సూత్రంతో యెలా బంధించానో చూశారా! దీన్నే అంటారా stream of consciousness అనీ?  


 అప్పట్లో, మా అమ్మా, అయ్యా మాటల్లో, తరచుగా వినిపించే పదం 'ఇంగిత జ్ఞానం'.  'వాడికామాత్రం  ఇంగిత జ్ఞానముండొద్దూ?'    'మనిషనేవాడికి ఇంగిత జ్ఞానముండవలె గదా!'   అన్న వాక్యాల ప్రయోగాలలో,  యీ ఇంగిత జ్ఞానం  అన్నది,    విచక్షణ అన్న అర్థంలో  వాళ్ళిద్దరూ వాడేవాళ్ళు. మానవ  జన్మ కొన్ని లక్షల జన్మల తరువాత  వచ్చే అపురూపమైన అవకాశమనీ, అదృష్టమనీ, జంతువులకు లేని యీ ఇంగిత జ్ఞానం మనిషికే వుంటుందనీ, దాన్ని అలవరచుకోవటం అవసరమనీ, అయ్య యెన్నో మార్లు తన రామాయణ ప్రవచనల్లో చెబుతూవుండేవారు.  మహా మహా వాళ్ళకే, యీ జ్ఞనాన్ని అలవరచుకోవటమూ, జీవితాంతమూ దీన్ని ఆచరించటమూ - అసాధ్యమని మన పురాణలూ, నీతి కథలూ ఘోషిస్తూవున్నాయి.. అసలిప్పటి రోజుల్లో ఐతే, యీ పదానికి విలువే లేదనిపిస్తుంది.  నా అభిప్రాయంలో, మీరూ, నేనూ- వెరసి మనమంతా  దీన్నుంచీ మినహాయింపేమాత్రమూ  కాదు.   (మీరు పూర్తిగా నా అభిప్రాయంతో యీకీభవించకున్నా ఫరవాలేదు. .మీకా హక్కుంది. నా అభిప్రాయమూ నాదే  కదా మరి!)   కాకపోతే, జీవితంలో యీ ఇంగిత జ్ఞానాన్ని అమలు పరచే పర్సెంటేజ్  లో యెక్కువ-తక్కువలు వారివారి దృష్టికోణం మీద ఆధారపడి వుంటాయనవచ్చు.
ఇంతకూ, ఇంగితం మరియు ఇంగితజ్ఞానం అన్న తెలుగు పదం ఇప్పట్లో వాడుకలో వుందా లేదా మరి చెప్పాలి  మీరు... 
శబ్దార్థ  కోశంలో ఇంగితం అన్న పదానికిచ్చిన వివరణ యీ క్రిందిది...
ఇంగితము
ఆకూతము, ఆకూతి, ఆశయము, ఇంగము, ఇంగితము, ఉద్దేశము, కా(న్పు)(నుపు), ఛందము, డెందము, తలపు, తాత్పర్యము, భావము, మతము, మనసు, సంకల్పము.
 అభిప్రాయము.
"ఇంగితము తెలియక ఇతరులతో మాటలాడకు."
 ముఖమందలి వికారము, లోపలి భావమును తెలుపు చేష్ట.
 (మా అమ్మా, అయ్యా యీ పదాన్ని, వివేకం, విచక్షణాజ్ఞానం అనే అర్థంలోనే వాడేవారు మరి..)







 ఆత్మీయ స్నేహ బృందానికి, కొద్ది రొజుల క్రితం, మా ఇంటివద్ద మోదుగ పూలలా కనిపించే యెర్రటి పూవులగురించిన నా పోష్ట్ చూసిన కొందరు ఆత్మీయులు, మరి యీ యెర్రటి పూవులనేమంటారబ్బా? అన్న ప్రశ్న వేశారు. నాకూ ఆసక్తి మొదలైంది. బుర్రలో ఒక ఆలోచన ప్రవేశిస్తే..ఇక అది బుర్రను తొలిచేస్తూ వుంటుంది..,   దాన్ని గురించి కాస్తయినా తెలుసుకోకపోతే, నిద్ర పట్టిచావదు మరి! అలా...శోధించగా, ధించగా...గా..ఇదిగో యీ వివరాలు తెలుసుకోగలిగాను. ఆ వివరాలివి...
స్పాథోడియా  తులిప్ అన్న వృక్ష శాస్త్ర నామధేయం కలిగిన యీ చెట్టూ, అసలు మనదేశానికి  19వ శతాబ్దం చివర్లో ప్రవేశించిందట! ఈ తులిప్ చెట్లలో, చాలా రకలున్నా, యీ యెర్రటి వాటికే యెక్కువ ఆదరణ లభించిందట!






 స్పాథోడియా  తులిప్ అన్న వృక్ష శాస్త్ర నామధేయం కలిగిన యీ చెట్టు,  అసలు మనదేశానికి 19వ శతాబ్దం చివర్లో ప్రవేశించిందట! ఈ తులిప్ చెట్లలో, చాలా రకలున్నా, యీ యెర్రటి వాటికే యెక్కువ ఆదరణ లభించిందట! ఆఫ్రికా దేశం నుంచీ ఇక్కడికి ప్రవేశించిన యీ చెట్టు, శ్రీలంక, మలేషియా, ఫిలిపీన్స్, మెక్సికో ఇంకా  అక్కడక్కడా అమెరికా లోనూ  ప్రీతిపాత్రమైందట! చక్కటి నీడా, అందమైన పూలూ...యెంత బాగుంటుందో! యెక్కువ యెత్తు పెరగదు..అక్టోబర్ నవంబర్  డెసెంబర్లలో గుత్తులు గుత్తులుగా పూలొస్తాయి. గుల్మొహర్ పూవులను మనమంతా మనం అగ్నిపూలు అంటుంటాము  కదా! వీటిని కూడా అగ్నిపూలనే పిలుస్తారట! యీ పువ్వుల మొగ్గలతో  పిల్లలు బాగా ఆడుకుంటరట! కారణం మీకు నేను చెప్పినట్టు, మొగ్గను చిదిమి తోటి పిల్లలపై చల్లుతూ, ఆడుకుంటారు వాళ్ళు...ఇదండీ, నేను మా ఇంటిదగ్గరున్న యీ యెర్రటి పూల చెట్టుగురించి సేకరించిన కాస్త సమాచారం ..హమ్మయ్య! కాస్తంత రిలీఫ్ ఇప్పుడు నాకు! 

Wednesday, 6 January 2016




యేవి తల్లీ నిరుడు  విరిసిన స్మృతి  లతాంతములు..   2  ?
   అరుగులపై జ్ఞాపకాల పరుగులలో  కొన్ని అప్పుడప్పుడూ తళుక్కుమని మెరిసి మాయమైపోతూ వుంటాయి.  అలాంటివాటిలో ఇదీ ఒకటి..అవధరించండి మరి..
   నేనిప్పటికీ వుస్మానియా  విశ్వ విద్యాలయ గ్రంధాలయానికి వెళ్తూనే వుంటాను.యేదో ఒక రెఫరెన్స్ మిష మీద!  గ్రంధాలయానికి తార్నాకా నుండీ వెళ్తుంటే, అక్కడొక చోట, చక్కటి బుట్టబొమ్మల్లాంటివి యెప్పుడూ అమ్ముతూ వుంటారు. అక్కడ కాసేపు, నా బైక్ ను ఆపి,  వాటిని మురిపెంగా కాసేపు చూసి మళ్ళీ బయలుదేరుతుంటాను. యెందుకంటారా? ఇదిగో...ఇందుకు...
     నా చిన్నప్పుడు, మా స్నేహితుల ఇళ్ళల్లో యెక్కడో గుడ్డతో చేసిన బొమ్మలను చూశాన్నేను. మెత్తగా, పూసల కళ్ళూ, నల్లటిదారంతో చేసిన వెంట్రుకలూ,చక్కటి దుస్తులు వేసిన ఆ ఆడా మగా బొమ్మలు నాకూ కావాలనిపించేది. గుడ్డలతో బొమ్మలు కుట్టమని 
మా అమ్మనడిగితే,  టైలర్ దగ్గరికి వెళ్ళి  గుడ్డ ముక్కలు తీసుకు రమ్మని చెప్పింది. అప్పటినుండీ, నా కష్టాలు మొదలు.
     మా ఇల్లు దాటితే,  ఒక చిన్న వంతెన (బుగ్గొంక పాయ ఒకటలా వెళ్తుండేదప్పట్లో! అది దాటగానే, కుడివైపుకో  మట్టి రోడ్డు 0డేది. వీధి మొదట్లో,  ఒక పేద్ద కట్టెల అంగడీ, ఆ తరువాత, ఒక గుర్రాలకు మాలిష్ చేసే వ్యాపారి స్థలం,గుర్రానికి మాలిష్ చేసే ప్రదేశంలోనే, యెద్దులకు నాడాలు  వేసే దృశ్యాలూ,  ఆ తరువాత ఇళ్ళూ.... కట్టెల అంగడి ఆవరణలో, చక్కెర  పళ్ళచెట్టుండేది. ఇదేదో కొత్తగా వుందే అనుకుంటున్నారు కదూ..!    ఆ చెట్టైతే నాకు బాగా జ్ఞాపకమే  ..దాని పూలెలా వుంటాయో చూడలేదుకానీ, చెట్టులో చిన్న గుత్తులుగుత్తులుగా, యెర్రటి పళ్ళు చాలాసార్లు చూసెదాన్ని..అవి  బాగా తీయగా  వుండేవేమో మరి-యెప్పుడూ దానిపై పిట్టలు తెగ సందడి చేస్తూ వుండేవి! అ యెర్రటి పళ్ళను చూస్తూ, నోరూరుతుంటే, నేను టైలర్ దగ్గరికి వెళ్ళాలన్న  సంగతే మర్చిపోయేదాన్ని మరి! యేదో, అప్పుడప్పుడూ, చాలా తక్కువసార్లు-అదాటుగా కిందపడిన వాటిని, ఆత్రంగా చేతిలోకి తీసుకుని,  పావడ మడతల్తో తుడిచి, రుచి చూసినట్టు గుర్తు..(అన్నట్టు, ఆ గుబురు చెట్టుపైన దయ్యం వుందనీ, రాత్రిపూట - యేడు దాటితే-ఆ దయ్యం అక్కడె తిష్ట వేస్తుందనీ, అందుకని చీకట్లో అటువైపే వెళ్ళొద్దనీ మా అమ్మె చెప్పిందొకసారి! అమ్మబాబోయ్  కదా మరీ!!)  అందని ద్రాక్షపళ్ళు పుల్లన అనుకుంటూ, యీసురోమని  టైలర్ దగ్గరికి వెళ్ళేదాన్ని..
 పండుగలకని  మా అమ్మ అతని దగ్గర మా అన్నయ్య (అరవింద్) నిక్కర్లూ, షర్టులూ, మా  అయ్యగారికి  జుబ్బాలూ అవీ కుట్టటానికి ఇచ్చేది. రవికెలూ, నాకు పావడాలూ  లాంటివి తనే చేత్తో  కుట్టెసేది- పండుగ నాటికి దుసురు పోగుతో (త్వరగా పని జరిగేందుకు, దూర దూరంగా కుట్టే కుట్టది..రాయలసీమ పదమేననుకుంటా! తక్కిన ప్రాంతాలలో వాడుకలో వుందోలేదో మరి..)  పని సరిపెట్టి, మళ్ళీ తీరికగా, గట్టి కుట్టు వేసేది - రవికెలకూ, పావడాలకూ! ..(అన్నట్టు, మా అమ్మ కొత్త చీరెలూ, అవీ వేసుకోవటం యెక్కువగా చూసిన గుర్తులే లేవు. ప్రతి పండుగకూ కూడా బట్టలు కుట్టించే వాడుక కూడా పెద్దగా వుండేదికాదు-మా ఇంట్లో!ఆర్థిక పరిస్థితి అలాంటిదప్పుడు  మరి! యేనాడూ డిమాండ్ చేయటమూ లేదు మేమెప్పుడూ) పని ఇచ్చేది తక్కువ కాబట్టేనేమో, ఆ టైలర్,  యెన్నిసార్లో నన్ను అలా  తిప్పించుకున్నా, తనకు పనికిరాని గుడ్డముక్కలు మాత్రం ఒక పట్టాన  ఇచ్చేవాడు కాదు..ఇచ్చినా, యేదో ఒకటో అరో!  నాకేమో ఆ గుడ్డబొమ్మలెలాగైనా  అమ్మ కుడితే, మనసారా  తాకి, చూసుకోవాలన్న పిచ్చి కోరిక! యెన్ని వందలసార్లు ఆ టైలర్ దగ్గరికి తిరిగి వుంటానో గుర్తు లేదు, నా కోరిక తీరిన మధురానంద  వీచికలూ గుర్తులేవు కానీ, ఆ  చక్కెర పళ్ళచెట్టూ, గుర్రానికి మాలిష్ చేసే ప్రదేశంలోనే, యెద్దులకు నాడలు వేసే దృశ్యాలూ, వాటి అరుపులూ.,,అవిచూస్తూ నేనక్కడే  చాలాసేపు నిలిచిపోయిన క్షణాలే ..ఇప్పటికీ, బాల్యంలోకి  పరుగులు తీయించే ఇంద్రధనుస్సులు...(ఇంతకూ...మా దుసురు పోగూ, గట్టి కుట్టూ..పదాలు మీకు నచ్చాయా లేదా...)  ...

Sunday, 3 January 2016










 

యేవి తల్లీ నిరుడు విరిసిన స్మృతి లతాంతములు...
అరుగులనుంచీ మనసు కిందికి దిగనే దిగనంటూంది..యేమిచేయటం?
     ఇప్పుడు మా ఇంట్లో కనకాంబరాలు బాగా పూస్తున్నయి. ఆ సున్నితమైన తేలికైన పువ్వులను చూస్తుంటే, మనసు గతంలోకి ఒకటే పరుగులు..
.   చిన్నప్పుడు, నా సుదీర్ఘ కేశరాసిగురించి (ఇప్పుడది గత వైభవమేలెండి) ఇదివరకే చెప్పానుకదా! నాకు చిన్నప్పుడవంటే తెగ ఇష్టం. యెన్ని పూలు పెట్టుకున్నా, బరువే వుండదు. పైగా, ఒకపట్టన వాడిపోవూ, నలిగిపోవుకూడా కదా! వీధిలోకి కనకంబరాలు వస్తే చాలు..మా అమ్మ నాకోసం రెండు మూడు తులాలు (మ రాయలసీమలో అప్పట్లో కనకంబరాలు అలాగే అమ్మేవారు. తులమంటే, 100గ్రాములేమో అప్పట్లో) కొని, గుడిపాటి అవ్వ బాడుగ ఇంటి అరుగుపై కూర్చుని, శ్రద్ధగా మాలకట్టి, నా జడలో పెట్టేది. ఇక మనకు , అకాశమార్గంలో తేలిపోతున్నట్టే ఫీలింగ్! అంతేనా? మొగలిపూల జడ యెంతబగా వేసేదో మా అమ్మ నాకు! మొగలి పూల సీజన్లో, పొద్దున్నే మొగలి పువ్వు కొనటం..మొగలి రేకులను సరైన ఆకారంలో కత్తిరించుకోవటం, ఘట్టిగా (బిర్రుగా) వేసిన నా జడను ఆ మొగలి రేకు ఒక్కొక్కటీ వాటి కొలతల ప్రకారం (జడ మొదట్లో పెద్ద ముక్కలూ, రాను రానూ చిన్న ముక్కలూ) అమర్చి సూదితో కుట్టటం. మధ్య మధ్యలో ఆ సూది యెప్పుడైనా నా మెడకు కాస్తంత తగిలినా, నేను ఆరున్నొక్క రాగమందుకోవటాలూ, నన్ను బుజ్జగించి, జడ పూర్తయ్యేదాక నన్ను కూర్చోబెట్టేందుకు మా ప్రయత్నాలూ..ఇలా మొత్తానికి మధ్యాహ్నం యే మూడుకో మొదలైన ఆ జడ పూర్తయెసరికి, సాయంత్రం 5 గంటలయ్యేది.
మొగలిపూల జడ పూర్తైన తరువాత, జడ స్నేహితులకు చూపించుకుని, ఆడీ, పాడీ, ఇంటికి చేరి, అన్నం తిన్న తరువాత, ఆ జడ గుచ్చుకోకుండా, కిందికి జారవిడిచి, పడుకోవటం యెంత కష్టమో కదా! కష్టే ఫలీ అన్నట్టు, మరుసటిరోజు, స్కూల్కు కూడా, ఆ జడతోనే వెళ్ళి, అక్కడి స్నేహితుల మెప్పు పొందటంలో మజాయే
 వేరనిపించేది సుమా! 


అన్నట్టు, అ అరుగులమీదే, మ మూడో అక్కయ్య తులజ, అమె స్నేహితురాండ్రు ఇందిరా, లలితా, కస్తూరీ (వీళ్ళందరిని నేను అక్కయ్యలనె పిలిచెదాన్ని మరి) కలిసి, రంగు రంగుల పూలతో చక్కగా మాలలు కట్టేవాళ్ళు. జాజి, మల్లే, కనకాంబరం, మరువం, దవనం- ఇలా యే సీజన్లో పూలతో అ మాలలు- భలేగా కట్టేవాళ్ళు. యెందుకంటే, మ అయ్యగరు అప్పట్లో, కృష్ణా చైతన్య ప్రభు భక్తులు. భజనలు భలే చెసేవాళ్ళింట్లో మిద్దెమీద! మ ఇంట్లో ఉన్న కృష్ణ చైతన్యా ప్రభువు పటానికి పూల మలలు అలంకరించి, అయ్య పాటలు పాడుతుంటే, మేమంతా బృంద గానం చేసేవాళ్ళం. అ పాటలు గుర్తులేవుకానీ, మ అయ్య కన్నుల్లో, అ పరవశ్యంలో, ఆనంద బాష్పలు రాలటం యెన్నో సార్లు చూసేదాన్ని కానీ నాకు అర్థమయ్యే వయసు కాదది! (పదేళ్ళుంటాయేమో-1963 ప్రాంతాలలో కదామరి))

హమ్మయ్య! ప్రస్తుతానికి, కడప మోక్షంపేటలోని, గుడిపాటవ్వ ఇంటి అరుగులపై నా జ్ఞాపకాల పరుగులనాపుతున్నాను..మీకు నచ్చితే మరికొన్ని! ఓకే?

Saturday, 2 January 2016


.   
       శ్రీమాన్ ధారా రామనాధ  శాస్త్రిగారు- అనతి  కాలంగా నాట్యావధనంలో,  చిర ప్రఖ్యాతి నందిన  ఆచార్యులు.   2013 డిసెంబర్లో ఒంగోలుకు  మా అయ్యగారి సభకోసం వెళ్ళినప్పుడు, వారి ఆశీస్సుల న0దుకోవటం, అద్రిష్టం. వారి స్వహస్తాలతో ఇలాంటి లేఖను కూడా అందుకోవటం- దానికి కొసరు మరి...మా అయ్యగారి పనులు ద్విగుణీకృతోత్సాహంతో  చేయటంలోని ఆంతర్యం-ఇలాంటి దీవెనలు అప్పుడప్పుడు అందుకోవటమే మరి!
...................